ప్రయివేట్ గ్యాస్ కనెక్షన్ తీసుకుంది ప్రనూష పెళ్ళికి చదివింపులలో వచ్చిన డబ్బుతో, ఉద్యోగం వెతుక్కుంది.
ప్రనూష తల్లిదండ్రులకు గానీ, శ్రీచరణ్ బామ్మకుగానీ ఈ విషయం తెలియదు.
ఒకే ఇంట్లో మానసిక, శారీరక సంబంధం లేని భార్యాభర్తలు వాళ్ళిద్దరూ.
మాంగల్యం తంతునేనా మమజీవన హేతునా....వర్ధిల్లు గాక.
సప్తపదీ విరాజిల్లుగాక....
అగ్నిసాక్షి నివ్వెరపోవు గాక...
ఆలోచనల్లోనుంచి ఇద్దరూ బయటపడ్డారు. అప్పుడే వాళ్ళ గడువులో రెండు నెలలు దాటిపోయాయి.
అయినా ఇద్దరూ తమ తమ వేర్వేరు దారుల్లో వెళ్ళడానికి ప్రయత్నిస్తూనే వున్నారు.
ప్రనూష ఆఫీసుకు వెళ్ళేసరికి, అంతా నిశ్శబ్దంగా వుంది. ఎవరి పని వాళ్ళు బుద్దిగా చేసుకుంటున్నారు.
కామాక్షి దగ్గరికి వెళ్ళి విషయం ఆరా తీసింది.
వెంటనే కామాక్షికి బదులు ప్రసూనాంబ ప్రనూష "డౌట్ ని క్లియర్ చేసింది.
"కొత్త మేనేజర్ ప్రభాత్ గారు వస్తున్నారట. ఏ క్షణమైనా రావచ్చు కదా...అందుకే... ఈ సైలెన్స్, ఈ డిసిప్లేనూ..."
నవ్వుకుంది ప్రనూష, కొత్తగా వచ్చే ఆ మేనేజర్ ఎలాంటి వాడో.... ముసలివాడా? యంగ్ స్టారా? స్టాఫ్ ని ఎక్స్ ఫ్లయిట్ చేస్తాడా?
రకరకాల ఆలోచనలతో ఉండిపోయింది. సరిగ్గా అప్పుడే...
"గుడ్ మాణింగ్ ఎవ్విరిబడీ..." అంటూ వినిపించింది.
స్టాఫ్ అంతా తలలెత్తారు. "అయామ్ ప్రభాత్. ఈ ఆఫీసుకు కొత్తగా వచ్చిన మేనేజర్ ని..." అందరూ సీట్లో నుంచి లేవబోయారు.
"నో.....నో....నో.... నాకీ మర్యాదలూ, మన్ననలూ, భయపడ్డాలూ నచ్చవు.....మీకు తెలుసా.....నేను వర్క్ హాలిక్ ని....పని చేయించడంలోనే ఆనందాన్ని అనుభవిస్తాను. కష్టపడ్డంలో సంతృప్తిని ఫీలవుతాను. మేనేజర్ అంటే వుండాల్సింది భయం కాదు...అభిమానం భక్తి కాదు. ఆత్మీయత....దటీజ్ మై స్టయిల్." గుక్క తిప్పుకోకుండా మాట్లాడి అందరి వంకా చూశాడు.
అందరూ అలాగే చూస్తుండిపోయారు.
ముఫ్ఫయ్యేళ్ళుంటాయి. ఎత్తు, ఎత్తుకు తగ్గ లావు ఉన్నాడు. సన్నటి గడ్డం, అతనికి అందంగా అమరింది. ఫుల్ హాండ్స్ చొక్కా వేసుకున్నాడు. కళ్ళకు అద్దాలు....మనిషిలో నీట్ నెస్...సూట్ తో అందంగా వున్నాడు.
"బావున్నాడు కదే...సైడ్ యాంగిల్లో పృథ్వీలా వున్నాడు" అంది కామాక్షి లోగొంతుకతో పక్కనే వున్న ప్రనూషతో.
ష్..." అంది ప్రనూష.
"ఏంటి అలా స్టాచ్యూలా వున్నారు. మీరు పరిచయం చేసుకోరా.....?" అంటూ స్టాఫ్ దగ్గరికి వచ్చాడు. ఒక్కొక్కరూ పరిచయం చేసుకుంటున్నారు.
ప్రసూనాంబ చేయి చాచి "అయామ్ ప్రసూనాంబ' అంది.
వెంటనే చేతులు జోడించి "నమస్తే" అన్నాడు.
ప్రనూష అడ్మయిరింగ్ గా చూస్తోంది. "ఎంత సంస్కారం" అనుకుంది మనసులోనే.
ప్రనూష తనని తాను పరిచయం చేసుకుంది. తలెత్తి కూడా మాట్లాళ్ళేదు ప్రనూషవైపు.
చిర్నవ్వుతో విష్ చేసి ఛాంబర్ లోకి వెళ్ళాడు.
"వాహ్....వాటే ఛార్మింగ్" అంది కామాక్షి.
"ఇలాంటి శాల్తీ నాకు పదిహేనేళ్ళ క్రితం "దొరికివుంటేనా?" అంది ప్రసూనాంబ.
"ష్....అలాంటి మాటలు మాట్లాడొద్దు..." అంది ప్రనూష.
"ఏంటీ.....నువ్వుగానీ లైనేస్తున్నావా?" అంది ప్రసూనాంబ.
"ఛ.... ఛ..." అంది.
ఆ తర్వాత ఎవరి పనుల్లో వారు పడిపోయారు.
ప్రభాత్ ఒక్కొక్కర్నీ లోపలికి పిలిచాడు. అందరూ లోపలికి వెళ్ళి హాపీగా తిరిగొస్తున్నారు. చక్కగా మాట్లాడి పంపిస్తున్నాడు.
ప్రనూషని పిలిచాడు.
ప్రనూష బిడియంగా వెళ్ళింది.
"కూచోండి" అన్నాడు ప్రనూష వైపు చూడకుండానే. కూచుంది ప్రనూష.
"రిజిష్టర్ చూశాను. మీరు రోజూ లేట్ గా వస్తారనుకుంటాను" అన్నాడు.
వెంటనే ఏం చెప్పాలో తోచలేదు ప్రనూషకు.
"ఆల్ రైట్....ఆల్ రైట్....మీరెంత లేటు వచ్చారూ, ఎందుకు లేటుగా వచ్చారు? లాంటి ప్రశ్నలు వేయను. అసలు రేపట్నుంచి ఈ రిజిష్టర్ నా టేబుల్ దగ్గర ఉండదు. మీ సెక్షన్లోనే వుంటుంది. ఎప్పుడు ఏ టైమ్ లో వచ్చినా అభ్యంతరం లేదు."
ఆశ్చర్యంగా చూసింది ప్రనూష.
వ్యంగ్యంగా అంటున్నాడేమోనన్న అనుమానం కలిగింది. బట్..." అంటూ ఆగాడు. అతడేం చెబుతాడా అన్నట్టు చూసింది.
"వర్క్ మాత్రం సిన్సియర్ గా చేయాలి. మీరు మీ పనిలో ఎచీవ్ మెంట్ చూపిస్తే చాలు...అదొక్కటే నాక్కావాల్సింది" అన్నాడు.
"హమ్మయ్య...." అంటూ ఊపిరి పీల్చుకుంది.
"మీకే ప్రాబ్లెం ఉన్నా.... నాకు చెప్పొచ్చు. ఐమీన్ అఫీషియల్ గా మీకు ఇబ్బంది ఎదురైనా ఈ కంపెనీ మేనేజర్ గా అది సాల్వ్ చేయడం నా బాధ్యత" అన్నాడు.
"థాంక్యూ సర్....!! అంది.
ప్రభాత్ ఆమె వైపు ఓ క్షణం చూసి.... తల తిప్పుకున్నాడు. అతికష్టంమీద.
"ఇంకా మన కంపెనీ ప్రమోట్ చేసే ప్రోడక్ట్ ఇంప్రూవ్ చేయడానికి పనికొచ్చే సలహాలు కూడా ఇవ్వొచ్చు. ఇక్కడ మేనేజర్ సబార్దినేట్ ఫీలింగ్స్ వద్దు. అందరమూ..ఒకే కంపెనీలో పని చేస్తున్నాము.....మనం చేస్తున్న పనిని ప్రేమించాలి. ఆ పనిని ప్రేమించే వాళ్ళని ప్రేమించాలి. అది నా ఫిలాసఫీ..." అన్నాడు.
ఒక్క క్షణం అర్ధమై, అర్ధమవ్వనట్టు చూసింది.
"సారీ....మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసానా?" అన్నాడు.
"నో.నో..సర్ అంది.
"ఓ.కె ఎనీవే.....మీ కోపరేషన్ నాక్కావాలి. అలాగే నానుంచి పూర్తి సహకారం మీకుంటుంది" అన్నాడు.
అలాగే సర్ అంటూ లేచింది.
హావ్ ఏ గుడ్ డే....మిస్ అంటూ ఆగాడు చిన్న కలవరపాటు.
వెంటనే అంది. "మిస్.... మిస్ ప్రనూష"
ఆ క్షణం తనెంత తప్పు చేస్తోందో తెలియకుండానే!
ఆరోజు రాత్రి ప్రనూషకు నిద్ర రాలేదు.
