దానికి తడబడకుండా అన్నాడు నరసింహం "నేనెలా వచ్చానో నేనెవర్నో యిప్పుడేమీ చెప్పే స్థితిలో లేను. కానయితే ఒక్కటే మాట చెప్పి వెళదామని వచ్చాను. అంటే మీ ఏకైన పుత్రిక-ముద్దుల కూతురు -మీ స్వప్న కన్న తల్లి పూర్ణా నర్సింగ్ హోంలో చావుబ్రతుకుల్లో ఉంది.
మీరు తల్లీ కూతుళ్ళూ, ఆ తల్లీకూతుళ్ళూ ఆఖరసారయినా ముఖాలు చూసుకునే అవకాశం కల్పించాలనే వచ్చాను. అది పూర్ణా నర్సింగ్ హోంలో హార్టు ఎటాక్ వచ్చి స్పృహలేని స్థితిలో ఉంది.
ఆపైన మీ యిష్టం."
ఎంతో నిరాశకిలోనై యిక జీవితంలో మరేమీ దక్కదనుకునే స్థితిలో ఆ విషయం కాస్తా చెప్పి చివాలున వెళ్ళిపోయాడు నరసింహం.
అతను చెపుతూఉంటే, చెప్పి వెళుతూ ఉంటే అతని వేషాన్ని వైఖరిని చూస్తూ అప్రతిభులై పోయారిద్దరూ.
ముందుగా కృష్ణవేణమ్మగారే షాక్ నుంచి తేరుకున్నారు.
చప్పున ఫోన్ వద్దకి వెళ్ళి డైరక్టరీ చూసి ఫోన్ తిప్పేరు.
"హలో!"
"హలో! నేను కృష్ణవేణమ్మని మాటాడుతున్నాను. అవును, ఆ కృష్ణవేణమ్మనే, నమస్తే! మీ నర్సింగ్ హోంలో ఎవరయినా లేడీ పేషెంట్ హార్టు ఎటాక్ వచ్చి చేరారా?" చెక్కు చెదరకుండా ప్రశ్నించింది.
"అవునండీ!" అవతల నించి సమాధానం వచ్చింది.
"పేరు?"
చెప్పాడు డాక్టర్ కృష్ణ.
"ఇప్పుడెలా వుంది?"
"అయాం సారీ! ప్రాణంపోయి అరగంటైంది. ఆమె తాలూకు వ్యక్తి ఎడ్మిట్ చేసి వెళ్ళేడు. ఇంతకీ ఆమె మీకేం కావాలి?"
"అయ్యో!" చప్పున ఫోన్ వదిలేసికూలబడిపోయింది కృష్ణవేణమ్మగారు. ఇన్నేళ్ళుగా పంతాలతో పట్టింపులతో రాయిగా మారిపోయిన ఆమె గుండె ద్రవించింది. నిలకడ తప్పింది... ఆమె కళ్ళు సజలాలవుతున్నాయి. పెదాలు అదురుతున్నాయి. మనిషంతా కంపించి పోతోంది.
వెంకట్రామయ్య కంతా ఆశ్చర్యంగా వింతగా వుంది.
20
"అవునమ్మాయి గారూ! ఈ తోట మీ తాతయ్య గారే దగ్గరుండి నాటించారు. మీ నాన్నగారు అప్పుడు లేరు. మీ అమ్మగారూ, మీ మామయ్యగారూ కొన్ని మొక్కలు నాటేరు. మీరూ, మీమామయ్య గారబ్బాయీ రెండు మొక్కలు నాటేరు. ఇవిగో! ఈ రెండే ఆ మొక్కలు ఈ మాధవీ లత తీగ నేను రెంటికీ అల్లేను. అప్పుడు అంటూ మామిడి తోటలా వుండే మీ కుటుంబం మీ అమ్మమ్మ గారితో మీ నాన్నగారు పంతాలకి వెళ్ళి వేరు పడటం వల్ల విడిపోయింది. మీ నాన్నగారూ, అమ్మగారూ ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు.
మీ మామయ్యగారు పోయారు. దాంతో ఆకుటుంబం చెల్లాచెదురై పోయింది. మీ అత్తయ్య ఒక్కతే ఇక్కడ వుంటుంది. ఆమె కొడుకూ, కూతురూ పట్నం వెళ్ళిపోయారు. ఆ అమ్మాయికి ఏదో పెద్ద జబ్బే వచ్చింది అన్నారంతా!
అయినా చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అన్నారు. అయన మీ అమ్మమ్మగారిని చాలా బాధపెట్టేరు. తల్లీకొడుకులు వేరు పడిపోయారు. అసలింతకీ చెప్పనేలేదు. ఆయన ఆమె సొంత కొడుకు కాదు. మీ అమ్మమ్మగారి మామగార్లు ముగ్గురు. పెద్దాయనాకి మగపిల్లలు లేరు. మీ అమ్మమ్మగారి భర్తా, ఆయన బావగారూ, పెద్దాయన కూతురూ అంతే ఆ కుటుంబానికి సంతానం.
అంచేత బావగారి కొడుకుని దత్తత తీసుకుంది. మీ అమ్మగారు చాలా గారంగా పెరిగేరు. ఆమె తన యిష్టా రాజ్యంగా పెరిగింది. అది మీ మామయ్యగారు సహించలేకపోయారు. దాంతో మీ అమ్మమ్మగారితో విడిపోయారు. పెద్దాయన కూతురు కొడుకే ఈ ఊరి కరణంగా వున్నారు. ఇంకో దూరపు బంధువే అక్కడ మీ యింట్లో అజమాయిషీగా లెక్కా డొక్కా చూస్తూ వున్నారు.
మీ ముత్తాతగారు ఈ తోటకి ఎలమావితోట అని పేరు పెట్టుకున్నారు. ఆయనకి ఈ తోట అంటే ఎంతో ప్రేమ. దీన్ని ప్రాణప్రదంగా చూచుకునేవారు. మేం ఈ తోటకి వంశపారంపర్యంగా కావలి వుంటున్నాము. మాకు యీ తోటమాలి తనం అంటే యిష్టం! ప్రాణంతో సమానం."
తోటమాలి శివయ్య చెప్పిందంతా శ్రద్దగా విన్నారంతా.
వాళ్ళందరికీ యేదో సినిమా కథ వింటున్నట్టుగా వుంది.
స్వప్న మనసులో ఎన్నో ఆలోచనలు.
"ఈ కుటుంబం వెనుక ఎంత చరిత్ర వుంది?" తన తల్లిదండ్రులు ఇంకా బ్రతికే వున్నారా? అమ్మమ్మకి దత్తు కొడుకు వున్నాడా? ఆయన సంతతి ఎవరో? తన తండ్రి ఎక్కడున్నాడో? తల్లి ఎలా వుందో?
ఆమె ఎలా వుంటుందో!
అమ్మమ్మవాళ్ళిద్దరూ తన మూడే ఏటే పుష్కరా లకి వెళ్ళి గోదావరిలో మునిగిపోయారని చెప్పింది.
ఎందుకలా చెప్పింది? ఒక్కగా నొక్క కూతురంటే ఆమెకి ఇష్టంలేదా? ప్రాణప్రదంగా పెంచుకున్న కూతురు ఆ కూతురి కోసం దత్తత తీసుకున్న కొడుకునే దూరం చేసుకుంది. మరి ఆమెనీ ఎందుకు దూరం చేసుకుంది.
