రెండు మూడుక్షణాలపాటు ఎటూ కదలలేదు కామాక్షి.
తర్వాత నెమ్మదిగా సృజన ఉన్నవైపు తలతిప్పింది. అతి మెల్లిగా తెరుచుకున్నాయి ఆమె కనురెప్పలు.
తక్షణం అక్కడి లైటు తాలూకు ఒక్కొక్క కాంతి కిరణం. ఒక్కొక్క సూదిలా మారి వెలుతురుచూడడం అలవాటుతప్పిపోయిన తనకళ్ళలో దిగబడుతున్నట్లు బాధ కలిగింది ఆమెకి.
వెంటనే కళ్ళు మూసేసుకుంది కామాక్షి. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ కొద్దిగా తెరిచింది కనురెప్పలు. నెమ్మదిగా దృష్టి సృజన మీదకేంద్రీకరించ గలిగింది.
"కామాక్షి! ఆకలేస్తోందా కామాక్షీ! ఇవి తింటావా" అంది సృజన ఆదుర్దాగా.
శారీరక బాధా, ఆకలీ, దప్పికా అవేవి తెలియని స్థితికి వచ్చేసిన కామాక్షి, సృజన మాటలు అర్ధంకానట్లు శూన్యంగా చూసింది.
"జీడిపప్పుపాకం తింటావా కామాక్షి!"
చాలాబాగుంది! పోనీ మామిడిపండు?
ఈసారి నిస్సత్తువగా తలపంకించింది కామాక్షి.
కొద్దిగా జీడిపప్పు పాకం ముక్కను తెంపి, ఆ అమ్మాయి నోటికి అందించింది సృజన.
దానిని నమలకుండామింగేసింది కామాక్షి. కొరకబోయిదగ్గొచ్చింది.
ఆమె ఛాతీమీద మృదువుగా రాస్తూ, మరికొన్ని మంచినీళ్ళుతాగించింది సృజన.
దగ్గుతగ్గాక, ఓపిక తెచ్చుకుని కూర్చోబోయింది కామాక్షి.
వెంటనే, వర్ణింప నలవి కానిబాధతో హృదయం విచారకమైన మూలుగు వెలువడించి ఆమె గొంతులో నుంచి.
"య్ మ్ మ్ మ్మా!"
ఆమూలుగు వినగానే గుండెలు అలసిపోయాయి సృజనకి. ఏదో గుర్తువచ్చి అప్రయత్నంగా కామాక్షి పాదాలవైపు చూసింది.
కామాక్షి రెండు పాదాలకీ రెండు బొటనవేళ్ళూ లేవు! ఆ గాయాలు ఇంకా మానలేదు. లేచి కూర్చోవడంలో దుర్భరమైన నొప్పి కలిగికళ్ళెంబడి గిర్రున నీళ్ళు తిరిగాయి కామాక్షికి.
తన పమిట కొంగుతో ఆ అమ్మాయికళ్ళు వత్తి, "తినుకామాక్షీ!" అంది సృజన. అప్పుడు మొదటిసారిగా గమనించింది కామాక్షి. తన ఎదుట ఉన్న తినుబండారాలపళ్లాన్ని, ఆమె కళ్ళు ఆశ్చర్యంతో విప్పారాయి. తనకళ్ళ ఎదుట కనబడుతోందినిజమో, లేక అహల్యతాలూకు రాక్షస మాయో నిశ్చయించుకోలేనట్లు కాసేపు సందిగ్ధంగా చూసింది.
అదిమాయకాదనీ, నిజమేననీ నమ్మకం కుదిరాక, హఠాత్తుగా, రెండు చేతులూముందుజాపి, ఆత్రంగా ఆ పళ్లాన్ని అందుకుంది కామాక్షి.
"ఇవాళ అన్నం తినలేదా" అంది సృజన సానుభూతిగా.
"ఇవాళా? ఇవాళేమిటి? చాలారోజుల్నుంచి తిన్లేదు" అంది కామాక్షి సున్ని ఉండనునోట్లో కుక్కుకుంటూ.
"ఏమిటీ! చాలా రోజుల్నుంచీనా? ఏమీ తిన్లేదా?"
వెంటనే ఏమీ జవాబు చెప్పలేదు కామాక్షి. సున్ని ఉండని మింగేశాక కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోయింది. తర్వాత, ఆమె పెదిమలు వశంలోలేనట్లు గజగజవణికాయి.
"ఒక్కసారి మాత్రం.....తిన్నాను....ఒకసారి నాకు వాంతి అయితే.... ఆకలికి తట్టుకోలేక మళ్ళీ దాన్నే...." ఇంక చెప్పలేక వెక్కిళ్ళు పెడుతూ పెద్దగా ఏడవడం మొదలెట్టింది కామాక్షి.
ఆమాటలు వినగానే వికారమూ, భయమూ రెండు పెనవేసుకుని సృజన కడుపులో పేగులు మెలిపడేటట్లు చేశాయి.
కొంచెంతేరుకున్నాక ఓదార్పుగా కామాక్షి వెన్ను నిమిరింది సృజన.
"తిను కామాక్షి!"
అప్పుడు కనబడింది సృజనకి,
కామాక్షి చేతిమీద పొడిచిఉన్న పచ్చబొట్టు!
'అహల్య' అని వంకరటింకర అక్షరాలు ఆకుపచ్చగా కనబడుతున్నాయి!
తమపశువులు తప్పిపోకుండా పల్లెటూళ్ళలో కొంతమంది వాటిమీద వేయించిన అచ్చు అది! అది చూడగానే గుండె నీరయిపోయింది సృజనకి-----
జీడిపప్పు పాకం నోట్లో పెట్టుకోబోతూ ఆగింది కామాక్షి. అనుమానంగా సృజనవైపు చూసింది.
"ఇవన్నీ నీకెక్కడివి సృజనా?"
"అలా?" అని ఆగి, "అవి...అవి....నా కోసం ఉంచినవి" అంది సృజన తడుముకుంటున్నట్లు.
ఆశ్చర్యంగా చూసింది కామాక్షి.
"నీకు రోజు ఇన్నేసి పెడతారా?"
అపరాధిలా తలదించుకుంది సృజన "అవును".
"ఎందుకు?"
సృజనకి ఏం సమాధానం చెప్పాలో తోచలేదు. మాట్లాడకుండా ఉండిపోయింది.
"అదృష్టవంతురాలివి సృజనా!" అంది కామాక్షి కొంచెం అసూయగా.
కామాక్షి అలా అనగానే చెప్పలేనంత దిగులు కలిగింది సృజనకి. అతి దారుణమైన స్థితిలో ఉన్న తననిచూసి ఇదే అదృష్టం అనుకుంటోందంటే ఇంకా కామాక్షి పరిస్థితి ఎంతదారుణంగా ఉండి ఉండాలో ఊహించుకోవచ్చు!
కష్టంలో ఉన్న తోటి మనిషికి సహాయం చెయ్యాలని ఉన్నా, చెయ్యలేనప్పుడు కలిగే నిస్పృహకలిగింది సృజనకి---
"సారీ కామాక్షీ!" అంది గిల్టీగా.
జవాబుగా ముక్కుచీది కళ్ళు తుడుచుకుంది కామాక్షి.
అప్పుడు హఠాత్తుగా సృజనకి గుర్తువచ్చింది---తాము ఉన్నది ఎంత ప్రమాదకరమైన పరిస్థితో?
కామాక్షిని అతి క్రూరంగా శిక్షించదలుచుకుంది అహల్య. అందుకే తిండి పెట్టకుండా చీకటి కొట్లోపెట్టి ఉంచింది.
అలాంటి కామాక్షికోసం తను ఖరీదయిన తినుబండారాలు---అహల్య తనకోసం ప్రత్యేకంగా చేయించినవి---తెచ్చి ఇచ్చింది.
కామాక్షి ఇవి తినేలోగా అహల్య వచ్చేస్తే?
భయంతో సృజన మెడమీద నూగుగా ఉన్న రోమాలు లేచి నిలబడ్డాయి.
అప్పుడు ఇంకో విషయం కూడా స్ఫురించింది సృజనకి.
అసలు అహల్య ఏదీ? ఎక్కడికెళ్ళింది?
ఇంట్లో ఒక్క పురుగూ లేకుండా ఏమయిపోయారు వీళ్ళందరూ? ఎందుకింత నిర్జీవంగా ఉంది ఇల్లు?
