వాళ్ళిద్దరూ చాలా సహజంగా మామా, కోడళ్ళు లాగా మాట్లాడుకుంటున్నారు తాము నటిస్తున్నామన్న సంగతి ఎదుటివాళ్ళకి తెలియకుండా ఇరువురూ చాలా జాగ్రత్త వహిస్తున్నారు.
అంత జాగ్రత్త వహించినా...?
పులిలాంటి లోకేశ్వరరావు జిత్తులు ఎత్తులు విషయానికి వస్తే నక్కలాంటివాడు అయినా, శీతల్ లేడికూన లాంటి దాన్ని కనిపెట్టలేకపోయాడు. శీతల్ నటుస్తున్నదన్న విషయాన్ని, వాసనని పసిగట్టలేక పోయాడు.
శీతల్ మాత్రం ప్రప్రథమంలోనే దగ్గరలో వున్న క్రూర జంతువు వాసనని పసిగట్టింది.
"హఠాత్తుగా పెళ్ళి ఆగిపోయి నేను మాయం అయాను కదా! ఆ తర్వాత అక్కడ ఏం జరిగిందన్నది వివరంగా నాకు కావాలి అంకుల్!" అంది శీతల్.
"అలాగే, నీ కోరిక తీరుస్తాను" అన్నాడు లోకేశ్వరరావు.
16
"రంజిత్ ఎవరో మీరు తెలుసుకోవాలి."
"అలాగే బాస్! వాడు ఎవడు, ఎక్కడ వుంటాడు వివరాలు ఇవ్వండి" ఆ గదిలో వున్న ముగ్గురు ఒకేసారి అడిగారు.
"రంజిత్ గురించి నేను చాలానే తెలుసుకున్నాను వాడివల్ల ప్రమాదం లేదు. నాకు కావాల్సింది అది గాదు మనకి తెలియంది ఇంకేమైనా వుండొచ్చు. డీప్ గా వెళ్ళి చూసిరండి. చూసి రమ్మంటే కాల్చిరావడం కాదు విషయ సేకరణ మాత్రమే చేసిరండి. ఆ తర్వాత చేయవలసింది నేను చూసుకుంటాను" అంటూ లోకేశ్వరరావు వివరించాడు. రంజిత్ అడ్రస్ ఇచ్చాడు.
వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోయారు.
లోకేశ్వరరావు రివాల్వింగ్ చైర్ లో వెనక్కి వాలి కళ్ళు మూసుకొని కొద్దిసేపు ఆలోచిస్తూ వుండిపోయాడు.
"ఎంతసేపూ ఈ గదుల్లో తిరగడం మహా బోర్ గా వుంది అంకుల్! ఎలాగో అలా నన్ను బైట తిప్పండి. లేకపోతే ఏ ఊరైనా దూరంగా తీసుకువెళ్ళండి. అక్కడ స్వేచ్చగా వుండొచ్చు. బుక్సు మాత్రం ఎంతసేపని చదవను. బుక్సు చదవడం, టి.వి. చూడడం....కళ్ళుమంటలు పరమబోర్. మాట్లాడడానికి మీరు తప్ప ఎవరూ లేరు ఆడవాళ్ళు లేరు సరే, నా ఈడు అబ్బాయిలు కూడా లేరు సరదాగా కబుర్లు చెప్పుకుందామంటే మీ నౌకర్లు అంతా ఎలా వున్నారో తెలుసా? తెలుగు సినిమాల్లో విలన్లలా వున్నారు. పోనీ వాళ్ళతో నైనా మాట్లాడుదామంటే ఒకళ్ళకీ సరిగా మాట్లాడడం రాదు"
శీతల్ రోజూ అనే మాటలు ఇవి.
శీతల్ యథార్ధంగా అమాయకంగా అలా అడుగుతున్నదా? లేక నాటకమా?
శీతల్ ని ఒకటికి రెండుసార్లు బైటికి తీసుకువెళ్ళాలి.
శీతల్ ని చూసీ చూడనట్టుగా వదిలేసి చాటుగా ఆమె చర్యలని కనిపెట్టాలి.
ఎస్. ముందీ పని చేయడం ముఖ్యం ఎల్లుండే కుందన్ వచ్చేది. కుందన్ వచ్చేసరికి తన పరీక్ష ముగియాలి.
కుందన్ గురించి తలచుకోంగానే లోకేశ్వరరావు పెదవుల మీద చిరునవ్వు చిందింది! మళ్ళీ అంతలోనే ఏదో గుర్తుకురాగా ముఖం సీరియస్ గా మారిపోయింది.
లోకేశ్వరరావు ఆలోచన చాలించి కుర్చీలోంచి పైకి లేచాడు శీతల్ దగ్గరకు బైలుదేరాడు.
లోకేశ్వరరావు వెళ్ళేసరికి శీతల్ సీరియస్ గా ఏదో నవల చదువుతున్నది.
"శీతల్!" లోకేశ్వరరావు గుమ్మం దగ్గరే వుండి పిలిచాడు.
"ఓ...అంకుల్ మీరా!...." అంటూ శీతల్ లేచి కూర్చుంది.
లోకేశ్వరరావు లోపలికి వస్తూ అడిగాడు "ఏంటి చదువుతున్నావ్?"
"సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ నవల. పేరు 'మనిషి కాటు' పాముకి కోరల్లోనే విషం వుంటుందిట. మనిషికి అలా కాదుట, నిలువెల్లా విషమేట. మనిషి పగ పట్టినా, మనిషి కాటు వేసినా దానికిహ తిరుగులేదుట."
శీతల్ చెప్పింది విని 'బాగుంది' అంటూ వచ్చి అక్కడే వున్న కుర్చీలో కూర్చున్నాడు లోకేశ్వరరావు.
"అంకుల్!"
"ఊ!"
"నే అడిగింది ఏం చేశారు?"
"ఏమిటిది?"
"లాభం లేదు అంకుల్! మీకు బోలెడు మతి మరుపు వచ్చేసింది. నేను మా ఇంటి విషయం..."
"ఆ గుర్తుకొచ్చింది. ఇంకా నీవేమి చెప్పొద్దు. సరే చెపుతాను విను" లోకేశ్వరరావు నవ్వుతూ అన్నాడు.
"నీవు రాసిన లెటర్స్ మీ మమ్మీకి అందాయి. మీ మమ్మీ అంటే నా చెల్లెలు ఇందూయే కదా! ఇందూ చాలా సంతోషించిందట. నీ లెటర్ ని పదే పదే చూసి పెట్టుకుందిట. నా శీతూ ఎక్కడో అక్కడ క్షేమం గా వుంది. అది చాలు అందిట. మీ డాడీ మాత్రం 'మన పరువు మర్యాద తీసేసింది, శీతూ' అంటూనే నిప్పు తొక్కిన కోతిలా ఎగిరిపడే వాడుట. ఇదంతా మీ అవివేకమే అని ఇందూ అరవటం, ఆ తర్వాత ఇరువురూ చల్లబడి నీ గురించి మాట్లాడుకోటం చేస్తున్నారుట మీ డాడీ నిన్ను వెతికే ప్రయత్నంలో వున్నారుట" లోకేశ్వరరావు చాలా సహజంగా చెప్పాడు.
"అమ్మయ్య యిప్పుడు నా మనసు హాయిగా చల్ల చల్లగా వుంది" అంటూ సంతోషం వ్యక్తం చేసింది శీతల్.
