Previous Page Next Page 
శతదినోత్సవం పేజి 28

 

    భవ్య నవ్విందో, లేక అలవాటుగా ఆమె పెదవులు విచ్చుకున్నాయో కాని, కిన్నెరకు మండిపోయింది.


    తల తిప్పుకుని వెళ్ళిపోయినా బాగుండేది, కాని, కిన్నెర దృష్టిలో అలా వెళ్ళిపోవటం ఓటమి.


    అలాంటిది చాలా సిద్దాంతాలున్న కిన్నెర పనికట్టుకుని మరీ భవ్య ముందుకు నడిచింది. "గుడి కొచ్చావా?"


    "కిన్నెర గొంతులో ఎగతాళిని పట్టించుకోలేదు భవ్య. "నువ్వు సినిమాకి వచ్చావా?"


    "ఎక్కడి నుంచి వస్తున్నది కనిపించడం లెదూ?"

    "నే నెక్కడికి వచ్చింది నీకూ కనిపించాలిగా!"


    మొన్నెప్పుడో వాల్ పోస్టర్స్ వేయించి తనను, రాఘవను అవమానించిన భోజరాజు కూతురితో మాట్లాడుతున్నా నన్న అహం కిన్నేరను దారుణంగా రెచ్చగోడుతుంటే అంది "మాటల్లో వాడి పెరిగింది."


    "నే నెప్పుడు అంతే!"


    "ఎప్పుడూ కాదులే.......బహుశా పెళ్ళయ్యాక పెరిగి ఉంటుంది."


    "పెళ్ళయ్యాక పెరిగేది అదికాదు."


    "మరి అదా?" మాట తూలింది కిన్నెర.


    "భవ్య అహం దెబ్బ తిన్నది కూడా ఇక్కడే- "నీకూ పెరుగుతుంది కిన్నెరా!"


    "కావాలనుకుంటేనే!"


    "ఏం......నువ్వు తల్లివి కావా?"


    "అవుతాను కాని, నీ అంత తొందరగా కాదు."


    "ముందు నేనూ ఇలానే అనుకునేదాన్ని."


    "అయినా అదుపు చేసుకోలేకపోయావు."


    "అహం తప్ప అందులో మాధుర్యం నీకేం తెలుసు?"


    పకాల్న నవ్వింది కిన్నెర-- "అందులో అంటే గర్భవతి కావడంలోనా?


    "అలా మొహం పెట్టకు. పెళ్లికోసం వెంపర్లాడుతూ గుట్టలు, పుట్టలు పట్టుకు తిరిగావుగా."


    ""భవ్యా!"


    "ఏం.....నిజం కాదా?"


    "నేను మాములు ఆడపిల్లను కాను."


    "కాకపోతే వంద మందిని కాదన్నా దానివి ఇతని వెంటేందుకు పడ్డావు?"


    కిన్నెర నిగ్రహించుకోలేకపోయింది---"నేనేం వెంట పడలేదు."


    "పోనీ వెంట తిప్పుకున్నావు."

    
    "అవును"


    "దాన్ని మొగుడి కోసం తపించిపోవడమే అంటారు"


    "కావాలంటే ఈ క్షణంలో సైతం ఈ పెళ్ళి కాదనగలను!"


    "ఆ పాపం నా కెందుకు?"


    "భవ్యా!"


    "ఏం.....నువ్వు కాని, మీ అయ్యా కాని తొందరపడి రెండ్రోజుల్లో పెళ్లి నిశ్చయం చేసింది ఇందుకే కదూ!"


    "కాదు!"


    "ఇప్పటికే నీకు నెల తప్పినందుకా?"


    "భవ్యా!"


    "అరవకు. అంతా అలాగే అనుకుంటున్నారు."


    "ఎవరేం అనుకుంటే నాకేం?"


    "కరెక్టే......పెళ్ళంటు జరిగాక మూసుకుపోతుందిగా?"


    "ఏమిటి?"


    "ఇప్పటికే నీకు నెల తప్పిన విషయం."


    కిన్నెర అహం సింహంలా జూలు దులుపుకుంది. సివంగిలా పైన బడాలన్నా ఆవేశం.


    "మీ నాన్న చెప్పాడా?" ప్రభంజనంలా ఓ అడుగు ముందుకు వేసింది.


    "ఎవరు చెబితేనేం.....అది నిజం కాదా?"


    "కాదని నిరూపించుకుంటే ఏం చేస్తావ్?"


    "సాటి ఆడపిల్లగా సంతోషిస్తాను."


    భవ్య మాట మరల్చడం లేదు. తొందరపడి మాట తూలి తప్పు చేశానని బాధపడటం లేదు. ఇంకా తన ఆలోచనల్ని సమర్ధించుకుంటుంది.

 

    "అయినా ఈ విషయానికి ఎందుకంత రగిలిపోతావ్ కిన్నెరా? ఇప్పుడు కాకపోయినా, పెళ్ళయ్యాకైనా నెల తప్పటం తప్పదుగా?"


    "మాట మార్చకు భవ్యా! నేను ఇప్పటికే నెల తప్పా నన్నావు. ఇప్పుడు ఎలాగూ నెల తప్పక తప్పదంటున్నావు!" కిన్నెర ఆవేశం ఇంకా ఉదృతమౌతుంది.


    "నువ్వనేదేమిటి?" అడిగింది భావ్య సీరియస్ గా.


    "నువ్వన్న మాట ఉపసంహరించుకో!"


    "అసంభవం!"


    "నేనేమిటో తెలియక మాట తూలేవు. మర్యాదగా మాట మరల్చుకో."


    "కుదరదు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS