వీర్రాజు ఒప్పుకున్నాడు. కిన్నెర, రాఘవల పెళ్లి రెండు రోజుల్లో జరిపించటానికి నిర్ణయం తీసుకున్నాడు.
పెద్ద పెద్ద వాళ్ళను రప్పించటం కన్నా పేద ప్రజల్లో గౌరవాన్ని దక్కించుకోవడం ప్రస్తుత కర్తవ్యం అన్న ఆలోచనతో ఏర్పాట్లు ప్రారంభించాడు వెంటనే.
నవ్వుకున్నాడు రాయుడు. తన మాటని నిలబెట్టుకున్నాడు. భోజరాజుకు యిచ్చిన మాట ప్రకారం పెళ్ళి ఏడో రోజున జరక్కుండా చూశాడు.
అతడి ఆలోచనలకు నేపద్యంలా దూరంగా రాముడి కోవెల ముందు జే గంటలు వినిపిస్తున్నాయి.
* * * *
"ఏమిటి.....రెండు రోజుల్లోనే పెళ్లి జరిపిస్తున్నాడా?" గావు కేకలా అరిచాడు భోజరాజు. "ఎందుకిలాంటి నిర్ణయం తీసుకున్నాడు?"
రాయుడుకు తెలుసు. భోజరాజు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా డిల్లీ విడిచి రాలేడు. అందుకే సాయంకాలం అయిదు గంటలకల్లా అనకాపల్లి టెలిఫోన్ ఎక్స్ చెంజ్ కి వచ్చి పనిగట్టుకుని డిల్లీ ఏ.పి. గెస్ట్ హౌస్ కి ఫోన్ చేసి మరీ చెప్పాడు.
"అర్ధంకావడం లేదు భోజరాజుగారూ! మీ కిచ్చిన మాట ప్రకారం ఏడో రోజు పెళ్లి జరక్కుండా చూడాలనుకున్నాను. ఆ రోజు కన్నా మరో పది రోజుల్లో మంచి ముహూర్తం వుందని చెప్పి, పన్నెండో తేదిన పెళ్లి జరిపిస్తే మామకు గండమని మహా గట్టిగా నమ్మించాను. కానీ, మీరు ఉళ్ళోకి అడుగు పెట్టేసరికి ఓ షాక్ యిస్తానన్నాడు. ఇదిగో యిలాంటి నిర్ణయం తీసుకున్నాడు."
భోజరాజు నిస్సహాయ స్థితిలో ఏం చేయాలో తేలిక నలిగిపోతున్నాడని తెలుసు.
"అక్కడ ప్రభుత్వం పరిస్థితేమిటి భోజరాజుగారూ?"
"నీ బొంద?" అరిచాడాయన. "నేను ఎక్కువ బాధపడుతున్నది మన ఊరి పరిస్థితి గురించి రాయుడు! నేను వచ్చేదాకా పెళ్లి కాకుండా ఆపించే అవకాశం లేదా?"
"కష్టం భోజరాజుగారూ! ఈ వారంలోగా దేశంలో ఎలాంటి పెళ్లిళ్లు జరిపినా శిక్షార్హులౌతారని మీరు ఓ అర్దినెన్స్ పాస్ చేయిస్తే తప్ప వీర్రాజుగారు ఆగేట్టు లేరు."
"మరేదన్నా చెప్పు రాయుడు! చెప్పి వాడిని ఒప్పించు."
"కష్టం సార్! ఎందుకంటే అది నా పరిమితికి మించిన పని కాబట్టి! మీకు మాటిచ్చాను, ఏడో రోజున పెళ్లి ఆపించాను, కాని, ఇప్పుడు జరిగే ఈ పెళ్ళిని ఆపించాలి అంటే మీరే అర్జెంట్ గా రావాలి."
"కుదరదు రాయుడు! కుదరదంటే కుదరదు" భోజరాజు రొప్పు స్పష్టంగా వినిపిస్తుంది. "అయినా పెళ్ళి కాగానే సంబరం కాదుగా?"
ఆ మాట భోజరాజు ఎందుకన్నా కాని, ప్రస్తుతానికి తన మీద ఒత్తిడి యిక తీసుకురాకుండా తనను తాను కాపాడుకున్న రాయుడు, "మంచి మాటన్నారు. మరి ఫోన్ పెట్టేస్తున్నాను" అన్నాడు ఫోన్ క్రెడిల్ చేశాడు.
ఓ బాధ్యత తీరిపోయింది. ఇప్పుడు తను మాములుగా ఇద్దరు ప్రత్యర్ధులకూ అత్మియుడే.
ఇక్కడ రాయుడు ఇలా మాట్లాడుతున్న సమయానికి.....
అనకాపల్లి నూకాలమ్మ గుడిలోంచి కిన్నెర బయటికి వచ్చింది. నిజానికి కిన్నెరకు గుడులకు, గోపురాలకు వెళ్ళే అలవాటు లేదు. మంగ వెళ్ళమని ప్రోత్సహించింది.
ఒకవేళ దేవుడే కరుణించి ఉండకపోతే ఆ రోజు రాఘవ బ్రతికివాడు కాదు. ఎందుకో అది నిజమనిపించింది.
ప్రపంచంలో చాలా సంఘటనలు యధాలాపంగా జరిగేవే అని ఇంతకాలము కిన్నెర కూడా నమ్మేది కాని, రాఘవ పరిచయం మొదలుకుని పెళ్ళి దాకా సాగిపోవడమన్నది దైనికమే అనిపించింది.
బహుశా తను చూసిన వ్యక్తుల్లో రాఘవ కన్నా అందగాళ్ళు ఉన్నారేమో కూడా. కాని, ఎవరూ ఆకట్టుకోలేకపోయారు.
పెళ్ళి చూపుల్లో రాఘవకన్నా తెలివైన యువకులు వచ్చి ఉండొచ్చు కాని, రాఘవ అంత తెలివైన వ్యక్తిగా ఒక్కరూ కనిపించలేదు.
పెళ్లన్నది స్వర్గంలో నిర్ణీతమైయ్యేది అని అప్పుడనిపించింది. అందుచేత స్వర్గం దేవుడికి సంబందించిందైనప్పుడు ఓసారి అమ్మవార్ని దర్శిస్తేనేం- అని హటాత్తుగా మనసు ప్రోత్సహిస్తే ఉన్న పళాన బయలుదేరి ఇటు వచ్చింది.
మరి కొన్ని రోజుల్లో తను రాఘవ భార్య కాబోతుంది.
రోజు లెక్కడ, గంటలేగా?
తనను పెళ్ళి కూతుర్ని చేశాక బయటికి కదిలే అవకాశ ముండదు . పెళ్ళయ్యాక రాఘవతో తప్ప ఇక తనకు ప్రపంచ ముండదు అతన్ని విడిచి ఎలా ఉండగలదని?
ప్రబంధాల్లో కవులు వర్ణించే ఒడ్డు, పొడవు, అల్లరిగా, నవ్వే కళ్ళు- అంతా తన సొత్తుగా మారిపోతున్నాయి కదూ!
ఆలోచిస్తూ గుడి ముఖద్వారం దాటుతున్న కిన్నెర అప్పుడు చూసింది - ఆవరణలో కారు దిగుతున్న భవ్యను.
చేతిలో పూల సజ్జతో భవ్య కూడా కిన్నేరను చూసింది. అంతే కాకతాళియంగా.
భవ్య మొహమే అలా ఉంటుందో, లేక భవ్య ఎప్పుడూ ప్రసన్నంగా ఉంటుందో కాని, అందమైన భవ్య ముఖానికి ఆ ప్రసన్నత మరింత అందాన్నిస్తున్నట్టనిపించి కిన్నెర చాలా అసూయపడింది.
ఆ మాట కొస్తే భవ్య కన్నా కిన్నేరే అందమైనది.
కిన్నెర మోహంలో అహం మైనస్ అయిపోతే మిస్ అంధ్రా మాత్రమే కాదు, మిస్ ఇండియా అంత సౌందర్యం సొంతం చేసుకున్న ఆడపిల్లలా ఉంటుంది.
