Previous Page Next Page 
వెన్నెల వాకిళ్ళు పేజి 29

 

    ఆ అరుపులకు గిరిజ నవ్వుకుంటూ బయటకు వచ్చి "పదండి నీళ్ళు తోదతాను" అంది.

    "అలాగే వీపు కూడా తోము తల్లీ" అంది జయంతి కిసుక్కున నవ్వి.

    జయంతి మాటలకు దాక్షాయణి, శివపార్వతి పెద్దగా నవ్వేశారు.
                                    *    *    *    *

    "పిన్ని! మనం సినిమాకెళ్ళి చాలా రోజులైంది కదా" అంది జయంతి.

    "అవునే మల్లీశ్వరి వచ్చిందటగా!" అంది శివపార్వతి.

    "అమ్మో! నీకు తెలిసిపోయిందా, ఎవరు చెప్పారు?" అంది జయంతి ఆశ్చర్యంగా.

    "వెంకటేశం చేప్పాడ్లె, వాడు చూశాడట. అమ్మగారూ భానుమతి పాటలు బ్రహ్మండంగా వున్నాయండి అంటూ తన్మయత్వంతో చెప్పాడు" అంది శివపార్వతి.

    "మరి మనం ఎప్పుడు వెళ్దాం? అందరం కలిసి వెళదామా, మనిద్దరమే వెళ్దామా?" అంది జయంతి ఆమె పక్కనే కూర్చుని, ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ.

    "అందరం వెళదాం" అంది శివపార్వతి.

    "అందరితో పెట్టుకుంటే ఆ సినిమా వెళ్ళిపోతుంది పిన్ని! ముందు మనిద్దరం గప్ చిప్ గా మ్యాట్ని ఆటకు వెళ్లోద్దాం. తరువాత అందరితో పాటు వీలైతే మళ్ళి వెళదాం" అంది ఉత్సాహంగా.

    "నీకెన్ని తెలివితేటలే...." అంటూ నెత్తిమీద మొట్టికాయ వేసింది పార్వతి.

    "అబ్బ! ఇంత మంచి ఉపాయం చెపితే మొట్టికాయ వేస్తావెంటి పిన్ని?" అంది జయంతి.

    "ఏంటే ఆ ఉపాయం?" అంటూ వచ్చింది దాక్షాయణి.

    జయంతి ఖంగుతింది. చెప్పాలా వద్దా అన్నట్లు శివపార్వతి వేపు చూసింది.

    "ఏం లేదక్కా! ఏదో పిచ్చి వాగుడు వాగుతుంది" అంది పార్వతి.

    "అదెప్పుడు అంతేగా...అన్నట్లు చెప్పటం మర్చిపోయాను మల్లీశ్వరి సినిమా వచ్చిందంటే, అందరితోపాటు వెళ్ళటం కుదరకపోవచ్చుగానీ గప్ చిప్ గా మన ముగ్గురం వెళదామా?" అంది దాక్షాయణి.

    జయంతి, శివపార్వతి యిద్దరూ ఒకరి ముఖాలొకరు క్షణం సేపు చూసుకుని పగలబడి నవ్వారు.

    దాక్షాయణికి ఏమి అర్ధంకాలేదు. సినిమాకెళదామని చెపితే వాళ్ళెందుకు ఇంతగా నవ్వుతున్నారో తెలియక, అలాగే ఆశ్చర్యంగా చూస్తూ నిలబడింది.

    కొన్ని క్షణాల అనంతరం వాళ్ళు నవ్వాపి.......

    "ఏంటి పిన్ని! మల్లీశ్వరి సినిమా వచ్చిందా? ఎవరికి తెలియకుండా మన ముగ్గురమే వెళదామా?' అని జయంతి మళ్ళి రెట్టించి అడిగి, మళ్ళి పడిపడి నవ్వింది.

    "ఏయ్ జయంతి! ఇక వూరుకోను, అసలు విషయం చెప్పకుండా నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నారు మీరు...." అంది దాక్షాయణి సీరియస్ గా.
    శివపార్వతి అంతకుమునుపు వాళ్ళిద్దరూ చెప్పుకున్న విషయం దాక్షాయణికి చెప్పింది.

    దాక్షాయణిఆ మాటలు విని "ఏయ్ దొంగా! నన్ను తప్పించి, మీరు ఇద్దరూ వెళదామని ఆలోచిస్తారా? నిన్నూ...."అంటూ జయంతి వెంట పడింది. జయంతి నవ్వుకుంటూ పెరట్లోకి పరుగుతిసింది.

                                         14
    "గిరిజ పెళ్ళి సందర్భంగా ఆ నెల రోజులు మీరు తాగలేదు ఇప్పుడు మళ్ళి మొదలేశారు. ఈ వారంలో మీరు ఇది రెండోసారి తాగి రావటం" అంది శివపార్వతి ఏడుస్తూ.

    "అబ్బా ఊరుకోవే ఇప్పుడేమయిందని? ఏదో స్నేహితుల కోసంగాను" అన్నాడు సోమసుందరం.

    "అసలు మనింట్లో ఎవరికి లేని ఈ పాడలవాటు మీకు ఎలా అబ్బిందండి....? ఇంతవరకు ఈ విషయం ఎవరికి తెలిదు. తెలిస్తే ఇంకేమైనా ఉందా? బావగారికి తెలిస్తే ఎంత బాధపడతారు?" అంది శివపార్వతి.

    "ఎలా తెలుస్తుందే...నీ వాగుడు చూస్తుంటే ఈ రాత్రే అందరికి తెలిసిపోయేలా వుంది. పెద్దగా అరవకు....వింటారు" అన్నాడు సోమసుందరం మెల్లగా.

    "అంత భయం వున్నవారు ఎందుకు తాగుతున్నారు?" నిలదీసింది శివపార్వతి.

    "అది భయం కాదు....భక్తి...:" అన్నాడు నవ్వుతూ.

    "మీ పిండాకూడు కదూ...ఈసారి తాగోస్తే మాత్రం నేనే నేరుగా వెళ్ళి బావగారితో చెప్పేస్తాను...." అంది శివపార్వతి స్థిరంగా.

    "చంపేస్తాను అన్నాడు సుందరం.

    "చంపేయండి. పీడవిరగడవుతుంది. నేనొక్కదాన్నే నిశ్శబ్దంగా ఈ రంపపుకోత భరించలేను" అంది ఏడుస్తూ.

    "అబ్బా పారూ....ఊరుకోవే" అన్నాడు చికాగ్గా

    "అలా పిలవకండి. పారూ అట పారూ. ఈయనొక దేవదాసు....నేను పార్వతిని" అంది ముక్కు చీదుకుంటూ.

    "అరె నేనిన్నాళ్ళు ఆలోచించలేదే....నిజమే" అన్నాడు.

    "నేను దేవదాసుని, నువ్వు పారువి....మరి చంద్రముఖి....?" అన్నాడు నవ్వుతూ మత్తుగా.

    "ఆ ముఖానికి అదొక్కటే తక్కువ. ఏమో....ఇలా తాగి వస్తున్న వాడికి చంద్రముఖి కూడా వుందేమో! నేనొచ్చి చుస్తున్ననా?" అంది సీరియస్ గా.

    "అమ్మో....నేనేదో సరదాకి అన్నానే. నాకే చంద్రముఖి లేదు. నువ్వే నా చంద్రముఖివి .....చంద్రబింబానివి..." అన్నాడు ఆమె భుజం పైన చేయి వేస్తూ.

    చేతిని విసిరికొట్టింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS