Previous Page Next Page 
వెన్నెల వాకిళ్ళు పేజి 28

 

    సురేంద్ర చాలా సేపు మాట్లాడకుండా నిశ్శబ్దంగా వున్నాడు.

    పక్షులన్నీ కిలకిల రావాలతో గూళ్ళకు చేరుకుంటున్నాయి.

    సూర్యభగవానుడు పడమటి కొండల్లోకి జారిపోతున్నాడు.

    ఆకాశమంతా ఎర్రగా వుంది సురేంద్ర ముఖంలా.

    సురేంద్ర వాచి చూసుకున్నాడు. అరుగంటలవుతోంది.

    "సరే గిరిజ ఓ పనిచేద్దాం" అన్నాడు సురేంద్ర.

    ఏంటది అన్నట్లు చూసింది గిరిజ.

    "ఏమి లేదు, మనిద్దరం వేరే కాపురం పెడదాం. ఆ కుటుంబం నుండి విడిపోదాం....దూరంగా వేరే ఇల్లు చూసుకుని అక్కడ మనిద్దరమే ఒంటరిగా హాయిగా వుందాం" అన్నాడు సీరియస్ గా.

    "అదెలా సాధ్యం?" అంది గిరిజ ఆశ్చర్యంగా.

    "అదెలా సాధ్యంకాదో, జయంతి నాతో చనువుగా వుండకుండా ఉండటం కూడా సాధ్యం కాదు" అన్నాడు.

    "ఓహో! అదంత కష్టమైన పనా?" అంది గిరిజ.

    "నేను ఆ పిల్లతో మాట్లాడకుండా గంభీరంగా వుండగలను తనే మన దగ్గరకొచ్చి చనువుగా మాట్లాడుతుంటే నువ్వెలా అడ్డుకోగలవ్?" అన్నాడు సురేంద్ర బాధగా.

    "ఎందుకు చెప్పలేం? నేనే చెపుతాను. బావకు పెళ్ళయింది ముందులాగా నువ్వు బావతో చనువుగా వుండకూడదని చెపుతాను" అంది సీరియస్ గా.

    "అది ఎంత చెండాలంగా వుంటుందో నీకు తెలుసా? జయంతి కాదు, మన ఇంటిల్లిపాది బాధపడతారు. నిన్ను అందరూ వెలేస్తారు. తెలీదేమో జయంతంటే మన కుటుంబంలో అందరికి ఎంతో ప్రేమ అన్నాడు సురేంద్ర.

    "నీక్కూడానా?" అంది సీరియస్ గా.

    "అబ్బా! ప్రేమ లేకుండా ఎలా వుంటుంది? ప్రేమంటే నువ్వనుకునే ప్రేమ కాదు. తండ్రి కూతుళ్ళ మధ్య వుండేది. అన్నా చెల్లెళ్ళ మధ్య వుండేది. అలాంటి ప్రేమే నాకు జయంతి పైన ఉంది" అన్నాడు సురేంద్ర సీరియస్ గా.

    "నన్ను నమ్మమంటావా?" అంది.

    "నమ్మకపోతే నీ ఖర్మ. నేనేం చేయలేను" అన్నాడు.

    "కానీ గిరిజ నేను జయంతితో చనువుగా వుండను కానీ....నువ్వు మాత్రం ఆపని చేయకు. దయచేసి జయంతితో అలా చెప్పకు. అలా చెప్పిన మరుక్షణం మనం ఆ ఇంటిలో ఉండటం నరకప్రాయమే అవుతుంది. దయచేసి నన్ను అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించు...." అన్నాడు సురేంద్ర.

    గిరిజ నిశ్శబ్దంగా కూర్చుంది.

    కొన్ని క్షణాల అనంతరం అన్నాడు సురేంద్ర.

    "పద చీకటి పడుతుంది."
                                       *    *    *    *

    "హాయ్ చిన్నపిన్ని! కొత్త దంపతులోస్తున్నారు" అంది జయంతి.

    సురేంద్ర గిరిజ వీధి గుమ్మం తలుపు తీసుకుని లోపలికి వచ్చారు.

    "ఏంటమ్మా గిరిజా! పొద్దుపోయేవరకు వున్నారే? ఇంతసేపు ఎక్కడున్నారు?" అడిగింది శివపార్వతి.

    "కొత్తదంపతులు పొద్దెరగరు పిన్ని! ఆ విషయం వేరే చెప్పాలా? అంది జయంతి.

    సురేంద్ర ఇబ్బందిగా నవ్వాడు. గిరిజ మాత్రం ఏభావం వ్యక్త పరచకుండా లోపలికి వెళ్ళిపోయింది.

    "అమ్మా! స్నానానికి నీళ్ళు పెట్టు" కేకేశాడు సురేంద్ర.

    "అదేంట్రా నీకు పెళ్ళి చేసిందేందుకు? నీ పెళ్ళాం వుండగా నన్ను నీళ్ళు పెట్టమంటావెంటి? నీకు యింకా పాత అలవాట్లు పోలేడులాగుంది" అంది భ్రమరాంబ.

    ఆ మాటలకు శివపార్వతి, జయంతి ఇద్దరూ పెద్దగా నవ్వారు.

    "పెళ్ళాం చేత పనులు చేయించటం బావ కిష్టంలేదనుకుంటా అత్తయ్య, నేను పెడతాలే....రా బావా! వీపు కూడా రుద్దాలా?" అంది జయంతి.

    "వద్దు...వద్దు" అంటూ భయంగా అరిచాడు సురేంద్ర.

    "అదేంటబ్బాయ్ అంతగా అరిచావ్....జయంతి ఇప్పుడేమంది నీళ్ళు తోడతానంది అంతేగా?!" అంది శివపార్వతి.

    "దడుచుకుని చచ్చాంకదా బావా! ఎందుకంత కంగారుపడ్డావు అంది జయంతి ఆశ్చర్యం నుంచి తేరుకుని.

    "అయ్యో మీరు దేవతలు. జయంతి మీకు అర్ధంకాదు నా బాధ నాకు తెలుసు నీ మనసులో ఏ కల్మషం లేదు....కానీ ఇక్కడో వ్యక్తిలో అనుమానం బీజం పడింది, దానిని పెంచే ప్రయత్నమే చేస్తున్నావు నువ్వు. నీకు ఎలా చెపితే నా బాధ అర్ధమవుతుంది?" అమనసులోనే అనుకున్నాడు సురేంద్ర.

    ఏ విషయం చెప్పకుండా, అలాగే చేష్టలుడికినట్లు నిలబడ్డ సురేంద్ర ని చూసి అంది జయంతి.

    "చిన్నపిన్ని! పెళ్ళయిన తరువాత బావలో ఏదో మార్పు కనిపిస్తుంది. ఏంటో పిచ్చి చూపులు చూస్తున్నాడు" అంది జయంతి భయం నటిస్తూ.

    "ఎంటే జయంతి! మీ బావను ఆటలు పట్టిస్తున్నావ్!" అంటూ వచ్చింది దాక్షాయణి అక్కడకు.

    "ఏంలేదు పెద్దపిన్ని! బావకు ఏదో అయింది.....ఉండి ..ఉండి పెద్ద కేకలేస్తున్నాడు" అంది జయంతి నవ్వుతూ.

    "మీ మాటలకేం గానీ, వాడు స్నానం చేయాలట. గిరిజ ఎక్కడ దానికి చెప్పండి నీళ్ళు తోడమని" అంటూ కేకేసింది భ్రమరాంబ.

    "అమ్మా గిరిజాగారు! ఓసారి బయటకు రండి. మీ మొగుడుగారికి నీళ్ళు తోడండి. అన్ని పనులు ఇక నువ్వే దగ్గరుండి చేసుకోవాలి. పెళ్ళానివికదా, మాకు యిక అ హక్కు లేదు...." అంది జయంతి పెద్దగా అరుస్తూ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS