మొత్తం నీకు గుర్తున్న పేర్లన్నీ రాసేయ్ అని అనాలని వున్నా నిగ్రహించుకుంది.
రెండు నిమిషాలు దాటి కాలం సెకనులుగా ప్రవహిస్తున్నా ఎవరికీ పట్టడం లేదు.
చివరికతను ఆమె ఒడిలో తలవాల్చుకున్నాడు. ఆమె వడిలోని వేడి అతన్ని వెచ్చగా కమ్ముకుంటోంది.
అతని చేతులు ఎక్కడెక్కడో కదులుతున్నాయి. ఆమె శరీరం వణుకుతున్నట్టు అతనికి తెలుస్తోంది.
అతను మరింతగా రెచ్చగొట్టడానికి తన ముఖాన్ని ఆమె ఒడిలోకి వత్తుతున్నాడు. కోరిక ఒంటినంతా రగుల్చుతోంది.
అతను మరింత ముందుకు దూసుకుపోవడానికి సర్దుకుంటూ వుండగా ఆమె కలలోంచి మేల్కొన్నట్టు తుళ్ళిపడింది. శరీరాన్ని బలవంతంగా లాక్కున్నంత పనిచేసి దూరంగా జరిగింది.
"ఇంత జరిగాక కూడా చెబుతున్నాను. చివరి ముచ్చట తీర్చేది పెళ్ళయ్యాకే" అంది కిలకిలా నవ్వుతూ.
అతను దెబ్బతిన్నట్టు అతని ముఖమే చెబుతోంది. శరీరంలోని రక్తాన్నంతా తోడేసినట్టు పాలిపోయాడు.
ఆమె తన చివరి మాటలు అంటూ వుండగా జితేంద్ర అటు పక్కగా పోతున్నాడు.
మధ్యాహ్నం భోజనాలయ్యాక పక్కనే వున్న తోపులోకి వెళ్ళడం అతనికి అలవాటు. ఏ మామిడి చెట్టుకిందో కొంతసేపు పడుకుని తిరిగి పనిలోకి వంగుతాడు.
ఆ గొంతు సబితదిగా అతను పసిగట్టాడు.
అయితే అదంతా తనకు సంబంధించిన విషయం కాదన్నట్టు ఆగకుండా తోపులోకి నడిచాడు.
లోపలికి అడుగుపెట్టాడో లేదో ఎవరో వున్నట్టు మాటలు, నవ్వుల శబ్దాలు వినిపించాయి. ఈవేళప్పుడు ఎవరబ్బా అనుకుంటూ లోపలికి నడిచాడు.
ఎవరో స్త్రీ అటు తిరిగి వుంది. ఆమె తల పైకెత్తి చూస్తోంది. అంటే చెట్టుపైన ఎవరో వున్నారన్న మాట. అతని పాదాల కింద ఎండుటాకులు పడి నలుగుతున్నాయి.
ఆ శబ్దాలకు అటు తిరిగి వున్న ఆమె యిటు తిరిగింది.
షాక్ కొట్టినట్టు అతను ఆగిపోయాడు.
ఆమె లిఖిత.
ఆ మామిడి తోపు దేవుడి మాన్యానికి చెందింది. అందులో వచ్చే ఫలసాయాన్ని దేవాలయానికి ఖర్చు పెడతారు. మామిడి చెట్లతో పాటు నేరేడు చెట్లు కూడా వున్నాయి. అవి విరగకాస్తాయి.
వూర్లో జనం.... ముఖ్యంగా స్త్రీలు అప్పుడప్పుడూ ఆ తోపులోకి వచ్చి నేరేడు పండ్లు కోసుకుని వెళుతుంటారు.
ఆరోజు మధ్యాహ్నం లిఖిత ఇంట్లో వున్నప్పుడు వనజ వచ్చింది. ఆమెది రెండిళ్ళ కవతల. పోస్ట్ మాస్టర్ కూతురు. పెళ్ళయింది. చుట్టం చూపుగా పుట్టింటికి వచ్చింది. పెళ్ళికాక ముందు ఆమె నేరేడు పండ్ల కోసం ఆతోటకు తెగ వచ్చేది. వెనుకటి అలవాటు మానుకోలేక లిఖితను, తన కింకో స్నేహితురాలైన సుధనూ లాక్కొచ్చింది.
ఇంట్లో బోర్ గా వుండి పిలుస్తూనే లిఖిత బయల్దేరి వచ్చింది. తీరా ఇక్కడికి వచ్చాక జితేంద్ర కనిపించడంతో ఒక్క క్షణం కాళ్ళూ చేతులు ఆడక బొమ్మలా నిలబడిపోయింది.
"మీరా!" అన్నాడు అతను దగ్గరికి వచ్చి.
ఆమె ఏమీ బదులివ్వకుండా అలానే నిలబడి వుంది.
"నిజంగా ఈరోజు నాకు సుదినం లేకపోతే మీరిలా కనిపిస్తారా" అతని కళ్ళల్లో ఆశ్చర్యం, ఆనందం రెండూ పెనవేసుకు పోవడం వల్ల వింత కళ వచ్చింది.
"ఏమిటిలా వచ్చారు?"
నేరేడు చెట్టుకేసి కళ్ళు తిప్పింది.
"నేరేడు పళ్ళకోసమా? మీకిష్టమా?"
అవునంటే తెల్లవారేసరికల్లా కృష్ణుడు పారిజాత వృక్షాన్ని పెకలించుకువచ్చి పెరట్లో నాటినట్టు అతనూ నేరేడు చెట్టుని తన ఇంటి ఆవరణలో నాటుతాడనిపించి "ఏదో సరదాగా స్నేహితురాళ్ళతో వచ్చాను" అంది ఒక్కో మాటను వెతికి పట్టుకొచ్చి వాక్యం కింద పేర్చినట్టు.
ఆమె బయటికి నవ్వడానికి ప్రయత్నిస్తున్నా లోపల మాత్రం కంగారుగా వుంది. లక్షరూపాయల పందెంలో గెలిచాక ఇప్పుడే కనిపించడం. మరి ఏం ఇమ్మని అడుగుతాడో అన్న ఆందోళన గుండెల్ని వూపుతోంది.
అంతలో చెట్టుమీదున్న వనజ కిందికి దిగింది.
"సుధా ఎక్కడ?" అనిఒ అడిగింది వస్తూనే.
"అవతల ఓ పెద్ద నేరేడు చెట్టు వుందటగా అక్కడ పండ్లు రాలుంటాయని ఏరుకోవడానికి వెళ్ళింది"
"అయితే నేనూ అటు వెళ్లొస్తాను" వనజ లిఖితతో చెప్పి వెళ్ళిపోయింది.
వాళ్ళిద్దరూ మిగిలారు.
"రండి అలా చెట్టుకింద కూర్చుందాం"
అతను పిలవడంతో వెనకాలే మంత్రించినట్టు వెళ్ళింది.
ఇద్దరూ ఓ మామిడి చెట్టుకింద కూర్చున్నారు.
"నాకు గున్నమామిడి చెట్టును చూడగానే మనుచరిత్రలోని ఓ పద్యం గుర్తొస్తుంది. "ఏలర ఈ చలంబుడిగి ఏలర బాల రసాల...." అన్న పద్యం. ఈ పద్యానికి రెండు అర్ధాలున్నాయిట. బయటికి కనిపించేది ఓ అర్ధం అయితే లోపల వుండేది మరొక అర్ధం అని విద్వాన్ చదివిన మా మిత్రుడొకడు ఓ వెన్నెల రాత్రి విడమరచి చెప్పాడు."
ఇతనికి ఇవన్నీ ఎలా తెలుసు? వరూధినీ, ప్రవరాఖ్యుడు గురించి బంగారం కొట్టు పెట్టుకుని రాత్రింబవళ్ళు నగలు అమ్ముకునేవాడికి ఎలా తెలుసు? తనతో ఏమీ చదువుకోలేదని అబద్దం చెప్పాడేమో కానీ....అబద్దాలు చెప్పే రకం కాదు. ప్రపంచం తెలియడానికి అకడమిక్ చదువులు చదవక్కర్లేదు.
"వరూధిని చెబుతుంది. రాత్రంతా మన్మథుడికి చిక్కి నీ చెంతకు వచ్చాను. ఇంకా ఈ చలనం లేకుండా వూరక కూర్చోకు. నన్ను ఏలుకో అంటుంది ప్రవరాఖ్యుడితో ఈ పద్యంలో, ఆమె ఒక్కరాత్రి బాధపడే అంత నిస్సిగ్గుగా తన కోరికనంతా చెప్పుకుంది. మరి నాలాంటివాడు..... కొన్ని వందల రాత్రులు పరితపించినా ఒక్కమాట మాట్లాడడానికి నోరు పెగలదు"
ఆమె చివుక్కున తలెత్తి అతనివైపు చూసింది. అతని ముఖంలో ప్రేమ, ఆరాధన తప్ప మరో భావం లేదు. దాంతో కోపాన్ని నిగ్రహించుకుంది.
ఇంతకీ ఏం కావాలి ఇతనికి? తనతో సెక్సా? లేక వుత్త స్నేహమా? లేకుంటే ఆరాధనా? ఏదీ ఖచ్చితంగా బయట పెట్టడం లేదు.
