Previous Page Next Page 
సౌజన్యసాహితి పేజి 29

           

                                    'మారిన న్యాయం'
            

                                                              ---డాక్టర్ పి. వి. కె. రావ్.


     నిన్నటిరోజు సాయంత్రం లీలను జాన్సన్ తో చూసి నప్పటినుండి నాలో నాకే తెలియని ఘర్షణ. పర్యవసానంగా ఈరోజు లీలవుంటున్న రూమ్ కేసి బయలుదేరాను. నేను  వెళ్లేసరికి లీల ఒక్కటే కూర్చొని ఏదో నోట్సు వ్రాసుకుంటోంది. నా వునికి తెలియజేయడం కోసం మెల్లిగా దగ్గాను.
     'ఏమిటి బావా ఆదివారం కాకపోయినా మా రూమ్ పావనం చేశావ్' అంటూ కుర్చీ లాగింది,  కూర్చున్నాను.
     'కాఫీ తెస్తాను' అంది. ఆమె కాఫీ తెచ్చేవరకూ టీ పాయిమీద వున్న 'ఆన్ లుకర్' చూస్తూ కూర్చున్నాను.
     'నువ్వు కూడా  ఈ రూమ్ లోకి మారకూడదా బావా' అంది కప్పు చేతికిస్తూ.
     "నేనుండే రూమును నా ఆఫీసుకు దగ్గర నీ కాలేజీకి దూరం, నువ్వుండే ఈ గది నీకాలేజికి దగ్గర, నా ఆఫీసుకుదూరం అవునా." అన్నాను. తలూపింది. కాళీకప్పులు లోపల పెట్టి వచ్చి, నా ఎదురు కుర్చీలో కూర్చుంటూ అంది.
    'ఈరోజు ఆఫీసుకు సెలవా?'
    ఆదివారాలలోనూ,  సెలవు దినాలలోనూ లీలావాళ్ళ రూమ్ కు వస్తాను. లీల మా రెండవ మామయ్య ప్రభాకర రావు ఏకైక సంతానం. ఈ వూళ్లోనే వుమన్స్ కాలేజీలో బి. యస్సీ రెండో సంవత్సరం చదువుతోంది. నేనూ వుద్యోగ రీత్యా ఈ వూళ్లోనే వుండటం వలన సెలవురోజుల్లో లీల దగ్గరకొచ్చి మంచిచెడ్డలు విచారించే బాధ్యత నామీద వుంచాడు మామయ్య. ఆయనంటే నాకంతగా పడకపోయినా మా అమ్మకోసం తప్పలేదు.
     'నిన్నే ఆఫీసుకు శెలవా?' అడిగింది ఈసారి.
     'లేదు నేనే సెలవు పెట్టాను'
    "ఏం ఒంట్లో బాగులేదా" ఆత్రుతగా నుదుటిమీద చేయిపెట్టి అడిగింది. లీలా, నేను చిన్నప్పటి నుండీ చనువుగా తిరిగాం. సన్నగా, ఎర్రగా ఆకర్షణీయమైన పెద్ద కళ్ల లీలంటే నాకెంతో యిష్టం. ముఖ్యంగా నామీద ఆమెకున్న భావాలు, ఆమె కలుపుగోలుతనం నన్నామెపట్ల ఆకర్షితుణ్ణి చేశాయి.  అయితే మా రెండుకుటుంబాల మధ్య వున్న ఆర్దిక వ్యత్యాసాలు నన్ను బయటపడనీయ లేదు. అందువల్లనే నా ప్రేమను లీలముందుగానీ, మరొకరిముందు గానీ వ్యక్త పరిచే ప్రయత్నమెప్పుడూ చేయలేదు.
     'ఏమిటి బావా అంతలా ఆలోచిస్తున్నావ్? లీలే ప్రశ్నించింది, విషయాన్నెలా కదపాలో తెలియక
    "లీలా నిన్నో ప్రశ్న అడుగుతాను సూటిగా సమాధానం చెప్తావా?" అన్నాను.
     'అడుగుబావా నీ దగ్గర దాచేదేముంది'
    'నిన్న నీతో అప్సర హోటల్ కు వచ్చింది జాన్సన్ కదూ?'
    'అవును!' తలవంచి సమాధానం చెప్పలో టైపిస్టు తెలుసా' అన్నాను, అదే ఆఫీసులో నేను సెక్షన్ ఆఫీసరన్న అహం వుట్టిపడేలా.
     'తెలుసు బావా, కానీ మనసులకు హోదాలతోనూ అధికారాల తోనూ పనిలేదని నా అభిప్రాయం' ఆరిందాలా చెబుతోంది. లీలను చూస్తుంటే ఏం మాట్లాడాలో తెలియక మిగిలిపోయాను.
     'బావా నేనే నీకీ విషయం చెబుదామనుకొన్నాను. నీవే కదిపావు. మా నాన్నకుకూడా నీవే నచ్చచెప్పాలి' చేతులు పట్టుకొని అడుగుతోంది. సమస్య యిలా మలుపు తీసుకుంటుందనీ నేను ఈ చదరంగపు గడిలోకి వస్తాననీ వూహించలేదు.
     మామయ్యను నేను వొప్పించగలనా - సాధ్యమయ్యే పనేనా- అయినా లీలకోసం నేను రంగంలోకి రాకతప్పదు. ఆలోచనల్నుండి తేరుకొని, లీలకు చెప్పి, స్కూటర్ స్టార్ట్ చేసాను. లీలకూ నాకూ దూరం పెరుగుతోంది. రూమ్ చేరుకొన్న దగ్గరనుండీ గతం తాలూకు జ్ఞాపకాలు చుట్టేస్తున్నాయి.
                                     2
     నేను యస్సల్సీ పరీక్షలురాసి సెలవలకు మామయ్య వాళ్ళింటికి వెళ్లాను అలా ప్రతి శెలవల్లోనూ ఆ వూరు వెళ్లటం నాకలవాటే. మా పెద్దమామయ్య అత్తయ్యా యిద్దరూ కొద్ది తేడాతోనే  చనిపోవడంతో వాళ్లమ్మాయి సునీతకూడా  చిన్నమామయ్య వాళ్లింట్లోనే వుండేది. ఆమె ఆస్తినికూడా చిన్నమామయ్యే అజమాయిషీ చేసేవాడు. సునీత నాకన్నా  నాలుగైదేళ్లు పెద్దది. బి. ఏ. పరీక్షలు రాసి,  సెలవులకు తను కూడా వచ్చి వుంది. ఒకళ్ళ విషయంలో అనవసరంగా జోక్యం చేసుకొని సునీతంటే  నాకు చాలా గౌరవం. నేను అప్పుడప్పుడూ వదినవెంట గోదావరి వడ్డునవున్న పొలాలకేసి షికారు వెళుతుండేవాడిని. ఆమెకావాతావరణం అంటే చాలా యిష్టం.
     ఎర్రగా పండిన ఆకాశం, నీళ్లుతగ్గి యిసుకపాయలతో మెరిసే గోదావరి, బారులు తీర్చి ఎగిరిపోయే పిట్టలగోల, ఆ  కొద్ది నీళ్ళలో తెప్ప నడుపుతూ మావంకే చూసే ఆ వంకీల జుట్టు కుర్రాడు ఎప్పుడు చూసినా యింతకుమించి ఆ వాతావరణంలో ఎప్పుడుచూసినా పెద్దమార్పు తోచేదికాదు. మరి వదినెందుకు ఈ తీరుని యిష్టపడుతోందో నాకు తెలిసేది కాదు. యిదే విషయం అడిగానోసారి, మౌనంగా నవ్వింది సమాధానంగా -
     ఓసారి ఆమె చూస్తున్నవేపే  చూసాను పరీక్షగా ఆవలి ఒడ్డునుండి త్వర త్వరగా తెప్ప నడుపుకుంటూ వొస్తున్న వొంకీలజుట్టు కుర్రాడు కనిపించాడు.
     బిగిసిన కండరాలు, చేతికి తాయత్తు, పెద్దకళ్లు, సూదిముక్కు, పైకి మడచిన బిగుతుపాంటు, చామనఛాయ అదీ అతని రూపం. నేనతన్ని పరీక్షగా చూస్తున్నంతలోనే అతను మాదగ్గరగా వచ్చాడు. దోసిట్లోపూలు సునీతముందు పోశాడు.
     'నేను చాలా ఆలస్యంగా వచ్చాననుకుంటాను' నేరస్తునిలా అడిగాడు.
     'లేదబ్బా నేనే కొంచెం ముందుగా వచ్చాను సమాధానపరచింది వదిన - వెనక్కుతిరిగి చూసుకుంటూ వెళ్లిపోయాడా కుర్రాడు. అప్పటి నా వయస్సు ఆ పరిస్థితిని అంచనా వేయలేకపోయింది.
     ఈ సంఘటన జరిగిన పదిరోజుల తర్వాత మధ్యాహ్నం నిద్రలేచి చావిట్లోకి వచ్చేసరికి చిన్నమామయ్య అమ్మమ్మ మీద ఎగిరి పడుతున్నాడు. వదిన ఓమూలగా 'తలొంచుకొని నిలబడి వుంది.'
     'లక్షసార్లు చెప్పాను, స్కూలు చదువవగానే పెళ్లి చేస్తానంటే విన్నావా, తల్లిదండ్రులు లేనిపిల్ల ముచ్చట పడుతోందంటూ, మద్దతిచ్చి కాలేజీ చదువుకు పంపావు - చదువుతోపాటు అన్నీ వంట పట్టించుకొచ్చింది, ఛ!ఛ! చిందులు తొక్కు తున్నాడు.
    'మన యింటావంటా వున్నాయా ఈ ప్రేమలు, అయినా తెలీకడుగుతానే, సునీ. ఆ ముష్టి వెధవ తప్ప మనవాడెవడూ దొరకలేదటే నీకు?! సంజాయిషీ అడుగుతున్నాడు.
    'ప్రేమకు కులం, డబ్బుతో పనేమిటి చిన్నాన్నా! అయినా అన్నీ చూసి నిర్ణయించుకొనేది ప్రేమెట్లా అవుతుంది?' నిశ్సబ్దానికి నోరొచ్చినట్లుంది.
    'చూశావుటే అమ్మా! దాని తలపొగరు!ఇదేపని నా కూతురు చేసుంటే, రెండుముక్కలు చేసేవాణ్ణి" ఆవేశంతో వూగిపోతున్నాడు.
     'కులపెద్దగా నా పరువేం కావాలి? పంచాయితీ ప్రెసిడెంట్ గా నా గౌరవం ఏంకావాలి? ఛీ!ఛీ! రేపీవిషయం నలుగురు నోళ్లల్లోపడితే నా పిల్లకి పెళ్లవుతుందా? మనమీవీళ్లో తలెత్తుకు తిరగ్గలమా?"
     కాసేపటికి ఎర్రబడ్డ కళ్లతో మళ్లీ వదిన్ని అడిగాడు
    "నీ నిర్ణయం మార్చుకోవాలి, మరెప్పుడూ అటుకేసి వెళ్లకు" చాలా కఠినంగా వుందాగొంతు -
     'క్షమించండి చిన్నాన్నా!' లోపలికి వెళుతున్న వదిన కళ్లనిండా నీళ్లు - విసురుగా బయటకు వెళ్లాడు మామయ్య -
    తెల్లారి సునీత శవం గోదావరిలో దొరికింది. కాలుజారి చచ్చిపోయిందని లోకాన్నీ, ఆత్మహత్య చేసుకుందని ఇంట్లోవాళ్లని నమ్మించాడు మామయ్య.
     తనకోసం  వచ్చిన సునీతని మామయ్య తన మనుషులతో హత్య చేయించడం కళ్లారా చూసికూడా, తనేం చేయలేకపోయిన అశక్తతని అసహ్యించుకుంటూ  ఆ విషయాన్ని తెలియజేస్తూ తనూ ఆ గోదావరితల్లి వడిలో, శాశ్వతవిశ్రాంతి, తీసుకున్నాడు వంకీలజుత్తువాడుగూడా.
    ఆ తర్వాత ఎప్పుడూ నేనావూరు వెళ్లలేదు. ఆ భయంకరమైన ప్రేమ ముగింపుని భరించలేకపోయాను. అందుకే నాకు మామయ్యంటే భయమూ, అసహ్యమూ -
     ఆరేళ్ల తరువాత మళ్లీ లీల మరోచరిత్ర సృష్టించబోతోంది. ఈ కథెంత భయంకరంగా ముగుస్తుందో - ఆలోచనలు తినేస్తున్నాయి.
                                        3
     పోస్టాఫీసుకెళ్లి విషయాన్ని క్లుప్తంగా వ్రాసి ఆదుర్దా పడాల్సిందేమీ లేదని సలహాతో మామయ్యకి లెటర్ పోస్ట్ చేసి లీల రూమ్ కొచ్చాను. జాన్సన్ కూడా అక్కడేవున్నాడు. అతనితోకూడా మాట్లాడి లీలను మా అమ్మగారి దగ్గర దిగవిడిచి వచ్చాను, ముందు జాగ్రత్తకోసం.
     నే నూహించినట్టే మరుసటిరోజు  సాయంత్రానికల్లా చిన్నమామయ్య  వొచ్చాడు.  మనిషంతా ఆవేదనతో తడిసినట్లున్నాడు. కాస్త 'రిలాక్స్' కానిచ్చి విషయమంతా వివరంగా చెప్పాను.
     "నువ్వుండీ యిలా ఎందుకు జరగనిచ్చావు?" గంబీరంగా వుంది ప్రశ్న.
     "వాళ్లు నాకు చెప్పి ప్రేమించుకోలేదు! ప్రేమించు కొనే వాళ్లెవరూ అందరి అంగీకారాలు తీసుకొని ప్రేమకుపక్రమించరు." కాస్త వ్యంగ్యంగా సమాధానమిచ్చాను, భయంగానే -
     'ఇంతకీ ఏమంటుంది?'
     'ఏమనేదేముంది!కులం మీ దృష్టిలో తక్కువైనా, బుద్దిమంతుడు, నా కొలీగ్ చాలా మంచివాడు, సరైన ఎన్నికే చేసుకుంది"
    'నేను ప్రయత్నించినా'........ మాటలు మింగేశాడు.
     "లాభంలేదు" వెంటనే సమాధానమిచ్చాను. ఫలితం వూహించుకుంటూ -
     చాలాసేపు తీవ్రాలోచనలో మునిగిపోయాడు. ముడతలు చోటు చేసుకుంటున్న ఆ ముఖంలో భావాలు చదవలేక నిశ్శబ్దంలో మునిగి కూర్చున్నాను. ఓ నోట్లకట్టనా ముందుంచి -
     'నువ్వే ఓ రిజిష్టర్ పెళ్లోచేసి ఓ రెణ్ణాల్లాగి మనూరు పంపు. ఈలోగా అక్కడ పరిస్థితులు నేను చక్కబెట్టుకుంటాను' చేతులు పట్టుకొని చాలా దీనంగా నాకు పెద్దరికం అంటగడుతుంటే భయంకరమైన శబ్దంతో పేలుతుందనుకొన్న టపాకాయ, నిశ్శబ్దంగా కాలిపోయినట్లనిపించింది.
     "డబ్బు చాలదంటే యిదికూడా వుంచు" మరికొంత సొమ్ము చేతిలో పెట్టాడు.
     ఈ మామయ్యేనా సునీతని పరువుకోసం, కులంకోసం బలితీసుకున్నది. ఇది వయసు తెచ్చిన మార్పా లేక కన్నకూతురుగనుకనా, న్యాయానికి రూపుమారినది. ఏదేమైనా లీల భవిష్యత్తు ఆనంద ప్రాంగణంలోకి అడుగిడుతున్నందుకు సంతోషంతో గుండె నిండుతోంది. ఏదో లోకంనుండి సునీత ఆ వంకీలజుత్తు మనిషీ, వాళ్ల నాశీర్వదిస్తున్నట్టుగా నా కన్పించిందా క్షణంలో!
                                      *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS