Previous Page Next Page 
సౌజన్యసాహితి పేజి 28

           

                                       ఆంతర్యం
                
                                                                       రచన: వడ్లమన్నాటి లక్ష్మీప్రసన్న
    చేతిలో కాఫీ కప్పుతో  డ్రాయింగ్ రూమ్ లోకి అడుగుపెడుతున్న సుజాత ఆదృశ్యం చూసి నివ్వెర పోయింది. తనతో కబుర్లు చెప్పుకుందామని వచ్చిన ఎదురింటి వాసంతి - బలాత్కారం చేస్తున్న తన భర్త కబంధ హస్తాల్లోంచి తప్పించు కోటానికి శాయశక్తులా పెనుగు లాడుతోంది. భర్తంటే ఎంతో అసహ్య మేసింది సుజాతకి! ఇంకా ఉపేక్షిస్తే స్నేహితురాలి శీలానికే ముప్పు.
     'ఏమండీ! అంటూ ఓగావుకేక పెట్టింది కోపంతో ఊగిపోతూ. ఆ వణుకుకి చేతిలోని కాఫీ కప్పు జారి కిందపడి ముక్కలయింది. కాఫీ నేల పాలయింది.  ఉలిక్కిపడ్డ సుజాత భర్త చటుక్కున వాసంతిని వదిలేశాడు.
     'ఛీ! నీ మొగుడు ఇలాటి పక్కారౌడీ అని తెలిస్తే పొరపాటున కూడా మీయింటికి వచ్చేదాన్ని కాదు."
    కళ్లనిండా అసహ్యం కురిపిస్తూ విసురుగా వెళ్లిపోయింది వాసంతి.
     ఇంత జరిగినా, కనీసం సిగ్గయినా లేకుండా తనవేపు గుచ్చి గుచ్చి చూస్తున్న భర్తని కసితీరా నోటికొచ్చినట్టు తిట్టాలనిపించింది సుజాతకి. కానీ ఓపట్టాన గొంతు పెగిలి రాలేదు.
     ఈ మధ్య భర్త చేసిన అసభ్యపు పనులన్నీ వరసగా గుర్తు రాసాగినయ్ - ఆమెకి.
     చిన్పప్పుడు తనతో చదువుకున్న సీతాపతి తనని చూద్దామని ఇంటికొస్తే.... అతన్ని సభ్యత లేకుండా నానా మాటలని పంపించేశాడు. చిన్న బుచ్చుకున్న ముఖంతో సీతాపతి తనవేపదోలా చూసి, వెళ్లిపోతూంటే ఎంతో బాధ కలిగింది తనకి.


     నలభై అయిదేళ్ళు దాటిన నాగయ్య మావయ్య మిట్టమధ్యాహ్నం తన యింటికి భోజనాని కొస్తే.... ఈ వూళ్ళో హోటళ్ళు చాలావున్నాయి.... అసలు మీరొచ్చింది భోజనానికా ... లేక మేనకోడలితో ముచ్చట్లాడటానికా... అని వ్యంగ్యంగా అని వెళ్లగొట్టాడు. "నీసంసారం ఇంత సంబరంగా వుందా? తల్లీ!" అంటూ వాపోయాడు మావయ్య. వెళ్లిపోతూ.
     అలాగే తెలిసినవాళ్ళు ఇంకా ఇద్దరు ముగ్గురొస్తే.... వాళ్ళని నానా దుర్బాషలాడి ఇంట్లోకి అడుగు పెట్టకుండా చేశాడు.
     ఇక ఆడవాళ్ళ విషయంలో ఈయన పరిస్థితి మరీ విపరీతంగా వుంది.
    కాలేజీలో చదివే కామాక్షమ్మగారమ్మాయి తనతో కబుర్ల కోసం వస్తే ఆ అమ్మాయి బుగ్గలు రెండూ నలిపి వదిలి పెట్టాడు. 'యూకంట్రీబ్రూట్!'అని నానా తిట్లు తిట్టి వెళ్లింది కమల.
     పై బజారు పార్వతమ్మగారి కోడలు పద్మజ వస్తే.... ఇల్లు చూపిస్తోంది తను ఓరోజు. హఠాత్తుగా తమ వెనుకగా వచ్చి ఆమెకి చక్కిలి గింతలు పెట్టాడాయన. పద్మజ ఉలిక్కిపడి ఈయన్ని చూసి కంగుతింది.
     "నీకేం పోయేకాలం! నాకన్న ఎంతో అందమైన నీ పెళ్ళాం వుండగా! అని ఛీత్కరించి వెళ్లిపోయింది. తన ముఖంలో కత్తి వాటుకి నెత్తురు చుక్కలేదు.
     ఇంకా ఇద్దరు ముగ్గురు ఆడవాళ్లువస్తే ఇలాంటి పిచ్చి పనులే చేశాడాయన.
     'నీ మంచితనం చూసి వదిలి పెడుతున్నాం సుజాతా? లేకపోతే చెప్పు తీసుకునేవాళ్లం! లేదా మా మగవాళ్లతో దేహశుద్ది చేయించేవాళ్లం! మీ ఆయన్ని  అదుపులో పెట్టుకో. జాగ్రత్త!' అని, హెచ్చరించి వెళ్లారు.
     ఇవ్వాళ వాసంతిని దాదాపు సినిమాల్లో లాగ పచ్చిగా  రేపు చేయబోయాడు తనభర్త. ఒకవేళ  ఆమె ఆదారుణానికి గురయితే.... ఎలాంటి విష పరిణామాలు జరిగేవి?!
    ఏమైనా తనిక ఇలాంటివి సహించకూడదు. ప్రాధేయ పూర్వకంగా తను చేసుకున్న విన్నపాలన్నీ దారుణంగా వ్యర్దమయ్యాయి. తను బతిమాలినకొద్దీ ఆయన పేట్రేగిపోతున్నాడు తప్ప ఫలితం శూన్యం. లాభంలేదు ఇక తను విజృంభించాలి.
     'ఏమండీ?' బలాన్నంతా కూడదీసుకుని గట్టిగా అరిచింది.
     'ఊర్కే అరవకు! ఆయాస మొస్తుంది! ఏమిటో చెప్పు! వికటంగా నవ్వుతున్నాడు వేణు.
     'మీకసలు బుద్ది జ్ఞానమంటూ వుందా? వుంటే ఇలాంటి పనులేనా చేసేది?'
    'నోర్ముయ్! నువ్వు భార్యవన్న  సంగతి మరిచిపోకు. నోటికొచ్చినట్టు పేలకు.'
    'నోటికొచ్చినట్టు పేలేది... వళ్లు పొగరెక్కి ప్రవర్తించేది నేను కాదు.'
    అంటే నేననేగా నువ్వనేది? గర్జించాడు.
    'కాదా??' ఈసడింపుగా అంది.
     "ఏమన్నావ్" పిచ్చి కోపంతో ఊగిపోయాడు వేణు. ఆవేశంగా మీదిమీదికి వచ్చాడు.
     కొంపతీసి కొట్టటానికి కాదు గదా -? ఆ వూహకి వణికి పోయింది... సుజాత.
     ఒక్కసారిగా ఆగిపోయిన వేణు - సుజాత జడపుచ్చుకుని ఒక్క గుంజు గుంజాడు. ఆమె అందమైన ముఖాన్ని బలంగా తన అరచేతుల్లో బంధించాడు.
     కర్కశంగా అన్నాడు.
     "ఇంటికొచ్చిన మగాళ్లని తిడతాను. కొడతాను. చంపుతాను. ఆడవాళ్ళతో సరసాలాడుతాను. లేదాసయ్యాట లాడుతాను. సరాగాలాడుతాను నేను నీకు మొగుణ్ణి! ఈ యింటికి యజమానిని. నన్ను కాదంటానికి... వారించటానికి నువ్వెవరివి? ఆఫ్ ట్రాల్ పెళ్లాం పక్షివి! నోరు మూసుకుని పడి వుండు!
    బలంగా విదిలించుకుంది సుజాత.
     "ఛీ! మీరిలాంటి తప్పుడు పనులు చేస్తే చూస్తూ సహించి ఊరుకోటానికి నేను పాతకాలపు సీతనో, సావిత్రినో, కాదు. నేను ఈ నాటి ఆడదాన్ని! సుజాతని!'
     'అయితే ఏం చేస్తానంటావ్?
    అతని కళ్ళలో ఎర్రజీరలు కనిపించాయి.
     'నా శాయశక్తులా ప్రతిఘటిస్తాను.'
    'నేను నీ మాట ససేమిరా వినను. కొంచెం కూడా మారను. అప్పుడేం చేస్తావ్?' హేళనగా వెటకారంగా అన్నాడు.
     'మీకు విడాకులిస్తాను, దృఢంగా అంది సుజాత.
     ఒక్కసారిగా మాన్పడిపోయాడు వేణు. ముఖం పాలిపోయింది. అయినా కొన్ని క్షణాల్లోనే తేరుకొని 'ఇవ్వవే! విడాకు లివ్వు! విడాకులు... విడాకులు!' తనలో తను గొణుక్కుంటూ అక్కడినుంచి బెడ్ రూంలోకి వెళ్లిపోయాడు, వేణు.
     రాత్రి తొమ్మిది గంటల వరకు ఆ యింట్లో మౌనం భయంకరంగా రాజ్యమేలింది. కడుపులో ఆకలి కరకర లాడుతుంది సుజాతకి - తనని ఎంతో అపురూపంగా చూసుకునే భర్తకి.... రాత్రిళ్లు తనని ఆనంద డోలికల్లో వూగించే భర్తకి.... తనని చూడటానికి వచ్చిన వాళ్లమీద ఎందుకలాంటి విరుద్దభావాలు? ఏమిటీయన విపరీత మనస్తత్వం? ఏభర్తా ...ఇంటి కొచ్చిన అతిధులతో ఇలా ప్రవర్తించడే....?!
     పాపం ఆయనకీ తనలానే ఆకలి మండుతూ వుండి వుంటుంది. పట్టుదలకోసం బింకంగా పడుకుని వుంటారు అనుకుని భోజనానికి రమ్మని పిలవటం కోసం బెడ్ రూం లోకి వెళ్ళింది సుజాత.
     వేణు మాంచి నిద్రలో వున్నాడు అరే! అతని పక్కన ఆ డైరీ ఏమిటి..... ఇంతవరకూ తను చూడనే లేదే...?! దాన్నందుకుని గబగబా పేజీలు తిప్పింది సుజాత. ఆతృతగా చదివేసింది కాసేపటిలో దాని సారాంశం ఇది.
     ఇంటి కొచ్చిన  మగవాళ్ళ కల్లబొల్లి కబుర్లకి లోబడి వారి మోహపాశాల్లో చిక్కుకుని తన బతుకుని నాశనం చేసుకుంది వేణు పెద్దమ్మ కూతురు రాధ.
     అంతులేని అసూయతో మొగుడికి చాడీలు చెప్పి వేణు స్నేహితురాలు దీప - జీవితాన్ని బుగ్గిపాలు చేశారు అమ్మ లక్కలు. భర్త విడిచి పెట్టాడామెను. చివరిలో వేణు ఇలా రాసుకున్నాడు. 'అందుచేత భార్యాభర్తల మధుర జీవితం కలకాలం కళకళలాడుతూ వుండాలంటే... మరో మగపురుగుని  కానీ.... మరో ఆడపక్షిని కానీ ఇంటి గుమ్మం ఎక్కనీయకూడదు. ఈ సూత్రం ప్రాతిపదికమీదనే ఇంటి కొచ్చిన ఆడమగ,  అతిధుల్ని అనేక రకాల అవమానించాను. దీనికి కారణం నా అందాల సుజాతని నేను అమితంగా ప్రేమించటమే! మితిమీరి ఆరాధించటమే!
    చదవటం ముగించిన సుజాతకి భర్తమీద ప్రేమ పొంగి పొరలింది. తనంటే ఆయనకు ఎంత గాఢప్రేమో! మూఢప్రేమో అర్దమయింది. మంచంమీదికి ఒక్క ఎగురు ఎగిరి వేణు బుగ్గలమీద ముద్దులు కురిపించింది. 'మీ మనసిప్పుడు పూర్తిగా అర్దమయ్యింది కనుక, మీ ప్రేమను  పూర్తిగా దక్కించుకొంటాను. విడాకుల ప్రసక్తేలేదు. మన వారి మాయల్లో పడకుండా... ఆడవాళ్ళ దుష్పప్రచారాల్లో పడకుండా నన్ను నేను రక్షించు కుంటాను. అందు కవసరమైన విధంగానే మసులు కుంటాను. మెసులు కుంటాను. ఇకనుంచీ మీకు అతిధులు నవమానించే శ్రమ కల్గించను. మీకిక చెడ్డ పేరు రానివ్వను' అనుకుంది సుజాత.
    గబుక్కున మెలకువ వచ్చింది వేణుకి.
     ఆమెను బలంగా హత్తుకుని బేలగా అన్నాడు 'సుజీ! నాకు విడాకులు ఇవ్వద్దు సుజీ!
                                                  *    *    *    *    *
     'మీ డైరీ చూశానుసార్" మనస్పూర్తిగా అతని వొడిలోకి ఒదిగి పోయింది  సుజాత.
     'డైరీ చూచినందుకు శిక్షే మిటోతెల్సా' అంటూ కౌగిలిబిగించాడు వేణు.
                                          *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS