అతడికి ఉమ తారసపడడం చాలా అరుదు. ఎప్పుడయినా మరీ అవసరం వచ్చినప్పుడు దాసూ కోసం వెళ్ళేవాడు. కప్పుకుని కనిపించేది అమె.
ఒక్కోసారి దాసూ కోసం అక్కడ కూర్చునేవాడు. అలాంటప్పుడు అమె ప్రవర్తన వింతగా వుండేది.
దాసు ఇల్లు ఊరు మొదట్లోనే కొద్దిదూరంలో వుండేది. అందువల్ల ఆ వీధిపందిట్లో ఎవరున్నా పెద్దగా తెలియదు. అదీగాక ఆ పందిట్లో ముందుగా ఓ ఒడ్ల బుట్ట వుండేది.. దాన్ని పారెయ్యడానికి మనసొప్పక దాసు దానిని అలాగే వుంచాడు. ట్రాక్టర్ కు సంబంధించిన మడకలు, చెక్కలాంటి సామాగ్రి కూడా వుండేది. అందువల్ల ఇంటిముందున్న తన్నెమీద కూర్చున్నా వీధిన వెళ్ళే వాళ్ళకు తెలియదు.
ఉదయం నిద్రలేస్తూనే దాసు యేటికి వెళ్ళేవాడు. స్నానంతోపాటు అన్నీ ముగించుకొచ్చేవాడు.
ఎప్పుడైనా వాడొచ్చేవరకు తిన్నెమీద కూర్చుని వెయిట్ చేసేవాడు గోపాల్రావు. అప్పుడు ఉమతో మాట్లాడక తప్పేది కాదు.
అమెకు ఇరవై ఎనిమిదేళ్ళుంటాయి.
ఎర్రటి నేలలో ఎదిగిన పసుపుకొమ్మలా వుండేది. ఎందుకో తెలీదు గానీ అమెను చూస్తూనే టమేటాల బుట్ట గుర్తొచ్చేది ఆయనకి.
అమెలో ఒక విషయం మరీనచ్చింది గోపాల్రావుకి. తన భార్య గుర్తించడానికి నిరాకరించిన తన యవ్వనాన్ని అమె గుర్తించేది.
"అయ్యగార్లా బలంగా వుండాలి. పద్దీసలిచింది తింటే అలా వస్తావా? అయ్యగార్ని చూడు.... నీకంటే చిన్నగా కన్పిస్తున్నారు. పండ్లూ, కూరగాయలూ బాగా తినాలి. ఇదిగో ఆ సద్దికూట్లోకి బీన్స్ తాళింపువేసుకో....." ఇలా మాట్లాడేది ఉమ.
మాటలేకాదు, ప్రవర్తన కూడా అంతే.
అయన్ని చూసినప్పుడు తెగ సిగ్గుపడేది. కనిపించగానే భయం భయంగా పక్కకి తప్పుకునేది. అతి గౌరవంగా మాట్లాడేది. మాటి మాటికి పైట సర్దుకునేది.
"మీలా పైలాపచ్చీసులా- దసరా బుల్లోడిలా సరదాగా వుండడం మాకు కుదురుతుందా?"
"మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడు యింకా పెళ్ళి కాలేదనుకున్నా"
ఇలా మాట్లాడేది. భార్య "ముసలయ్యా" అన్నప్పుడు ఎలా బాధ పడేవాడో, అమె తనను "యువకుడు" అన్న ఆర్దంలో మాట్లాడుతున్నప్పుడు అలా ఖుషీ అయిపోయేవాడు. అందుకే అమె దగ్గిరికి వెళ్ళాలని అనుకునేవాడుగానీ వీలయ్యేదికాదు. ఏదో బలమైన కారణం వుంటే తప్ప అమె ఇంటికి వెళ్ళలేడు. అదీగాక అమె కూడా కష్టమైన పనులకు కాదు గాని వ్యవసాయ పనులకు వెళ్ళేది. అందువల్ల అమె కనపడడం బహు అరుదు.
తనను పూర్తిమగాడిలా ఫీలవుతూ తనముందు సిగ్గుపడుతూ, మాటిమాటికి పైట సర్దుకుంటూ, వీలైనప్పుడు తనను పొగుడుతూ తనలో ఆత్మవిశ్వాసాన్ని కల్పిస్తూ, తనలోని మగతనాన్ని రగిలిస్తూ ప్రవర్తించే ఉమ అలాంటి సమయంలో గుర్తుకురావడం అసహజమేమీ కాదు.
గోపాల్రావు గ్లాసు పూర్తిచేసి, మరొకటి నింపుకుంటున్నాడు. చీకట్లు మరింత బిరుసెక్కాయి.
బస్టాప్ లలో జనం పల్చబడ్డారు. సినిమా థియేటర్ లోపల ఏదో జరిగిపోతున్నట్లు స్టంట్ సౌండ్లు, ఏడుపులూ, హాహాకారాలు విన్పిస్తున్నాయి.
అతను ఆ గ్లాసు కూడా పూర్తిచేశాడు.
పైట సర్దుకుంటూ తనకు క్రీగంట చూస్తున్న ఉమే కళ్ళముందు కన్పిస్తోంది.
అతను సిగరెట్ వెలిగించాడు.
ధైర్యం ఎంత కన్పిడెన్స్ ను కలిగిస్తుందో, ఎంత బావుంటుందో అతను మొదటిసారి అనుభవిస్తున్నాడు. తనను తన భార్య కాంచనమాల ఇక ఎక్కలేడని తెలిసిన లోతైన లోయలోకి తోసిపారేస్తే, తనను ఉమ పైటజార్చి పైకి లాగుతున్నట్టు అన్పించింది.
అతను వాటినే అటూ ఇటూ తిప్పుకుంటున్నాడు.
తొమ్మిదైంది టైమ్.
"ఇక లాభంలేదు! విషం పడకపోతే మైండ్ పనిచేయదు" అంటూ మెకానిక్ బండికిందనుంచి పైకి లేచాడు. కరెంటుబల్బు పట్టుకున్న పిల్లాడు కూడా దాన్ని అఫ్ చేసి ఊపిరి వదిలాడు.
"ఇప్పుడయ్యేట్టులేదు. మీరెళ్ళండి...నేను వుండి తీసుకొస్తాను" దాసు గోపాల్రావు దగ్గిరికి వచ్చి చెప్పాడు.
"ఇప్పట్లో కాదా?" అడిగాడు గోపాల్రావు.
"కాదండి! మరో రెండు గంటలు పడుతుంది" మెకానిక్ ప్లాస్టిక్ గ్లాసును ముందు పెట్టుకుంటూ చెప్పాడు.
"సరేలే! మరి నేను వెళతాను" గోపాల్రావు లేచాడు.
"ఉండండి! చిన్నమాట" దాసు చెప్పకూడదో, చెప్పచ్చో అన్నట్టు భయంగా చూశాడు.
"ఏమిట్రా చెప్పు?" అతను వాడి భయాన్ని కనిపెట్టి మృదువుగా అడిగాడు.
"ఏం లేదండి! ఈరోజు బాగా లేటవుతుంది కదా ఇంట్లో చెప్పాలి. ఎవరైనా కనిపిస్తే అలా చెప్పి పంపండి"
వాడు తల గోక్కుంటూ చెప్పాడు.
"అలానేలేరా! దానికేం వుంది" అతను స్కూటర్ స్టార్ట్ చేయబోయాడు.
"ఒక్కమాట" మళ్ళీ దాసు పరిగెత్తుకుంటూ వచ్చి " దీన్ని కూడా ఇచ్చెయ్యమనండి. శ్రీకాళహస్తి ప్రసాదం. పులుసన్నం- టెంకాయ....." అన్నాడు ఓ చిన్న ప్యాకెట్ నిస్తూ.
"అలానేలేరా"
" అతను బయల్దేరాడు. హైవేలోకి తిరిగేముందు ఓ ప్యాకెట్టు సిగరెట్లు కొనుక్కుని తిరిగి బండెక్కాడు.
బీరు పనిచేస్తోంది. మెదడును ధైర్యంలో ముంచి లేవదీసినట్లు ఏదో తమాషాగా వుంది.. సమస్యల్ని చూసి వెరవని ఆ కిక్ బావుందతనికి.
కాంచనమాలగాని, అమె తనని తక్కువచేసి మాట్లాడడంగాని గుర్తుకురావడంలేదు. ఊర్లోకి మలుపు తిరిగాడు.
అంజనేయుని దేవాలయం దగ్గర ముగ్గురు నలుగురు తీరిగ్గా భోజనాలు చేస్తున్నారు. పక్కనున్న ఇళ్ళల్లో అప్పుడే ముసుగుతన్నినట్లు ఎలాంటి అలికిడి లేదు.
అతను నింపాదిగా పోనిస్తున్నాడు.
లేబర్ కాలనీ దగ్గరున్న ఓ కుక్క వెంటపడి, తరువాత మానుకుంది.
అతను ఊర్లోకి ప్రవేశించాడు. మొదటే దాసు ఇల్లు. కాబట్టి. దాని కెదురుగా అపాడు.
విషయం చెప్పి పంపడానికి ఎవరైనా వస్తారేమోనని చూశాడు. కానీ ఎవరూ రాలేదు.
అటూ ఇటూ చూస్తూ నిలబడ్డాడు.
ముందున్న బాక్స్ నుంచి దాసు యిచ్చిన పొట్లం తీశాడు.
