Previous Page Next Page 
స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్ పేజి 29

       "అమాయకులైన స్టూవర్ట్ పురం దొంగల్ని రిలీజ్ చేయడం నా ఉద్దేశం కానీ, నాయుడిని అరెస్టు చేయడం కాదు."    
    "ఇదంతా మేమెందుకు నమ్మాలి?"    
    "రామాచారి మరణ వాంగ్మూలంలో ఇదంతా వుంది."    
    "రామాచారి మరణ వాంగ్మూలం యిచ్చేటప్పుడు పక్కన మేజిస్ట్రేట్ ని వుంచుకోవాలని నీకు తెలీదా?"    
    "మేజిస్ట్రేట్ దగ్గరికి నేను వెళ్ళాను. కారు వుంటే కాని రాను అన్నాడు. "ఈ లోపులో రామాచారి పరిస్థితి విషమించింది. అక్కడికి వెళ్ళవలసి వచ్చింది."    
    "రామాచారి సంతకం ఇదేనని నమ్మకం ఏమిటి?"    
    గాఢమైన నిశ్శబ్దంలో ఒక్కసారి పెద్ద విస్ఫోటనం జరిగినట్టు ఆ ప్రశ్న ఇటుక మీద ఇటుక పేర్చి కట్టిన భవంతి అకస్మాత్తుగా కూలిపోయినట్టు- శ్మశాన నిశ్శబ్దం ప్రయోగించిన బ్రహ్మాస్త్రం ప్రత్యర్ధిని కూల్చేస్తుందన్న విషయం ముందే తెలుసునన్నట్టు వీరదాసు పెదవుల మీద చిరునవ్వు. కొంచెం సేపు అందరి మధ్యా నిశ్శబ్దం. తరువాత హోం మినిష్టర్ అన్నాడు. "నువ్వు చెప్పేవేమీ నమ్మశక్యంగా లేవు మిస్టర్ రాణా. గుళ్ళో నగలు డూప్లికేట్ అన్నావ్. ఒరిజినల్ నగలు ఎమ్మెల్యే దగ్గిర దొరికినవన్నావు. కానీ ఎమ్మెల్యేని అరెస్టు చేయలేదన్నావు. రామాచారి వాంగ్మూలం మీద సంతకం ధృవీకరింపబడలేదు. పైగా నువ్వు మీ స్టూవర్ట్ పురం బంధువుల్ని రిలీజ్ చేసిన విధానం కూడా సహేతుకంగా లేదు. వారిని ఒక నేరం మీద అరెస్టు చేసినప్పుడు వత్శువులు దొరికిన కారణంగా వారిని రిలీజ్ చెయ్యడం అనేది ఒక పోలీసాఫీసర్ చెయ్యవలసిన పనికాదు. వీరదాస్ లాంటి వ్యక్తిని నువ్వు కేవలం వ్యక్తిగత కక్షలతో లాకప్ లో వుంచావు. కేవలం అతనిని లాకప్ లో హింసించడం కోసమే వారంకన్నా ఎక్కువరోజులు నీ అధీనంలో వుంచుకోవడానికి అనుమతి తీసుకున్నావు."    
    "అబద్దం" అన్నాడు రాణా. "వీరదాసు ఈ ఊరికీ, ఈ రాష్ట్రానికీ పేరుమోసిన గూండా అతడిని వదిలేస్తే సాక్ష్యాలని తారుమారు చెయ్యగల సమర్ధుడు. అదే కారణం అంతేకానీ అతడి మీదనాకు వ్యక్తిగత కక్ష ఎందుకు?"    
    తనని గూండా అన్నందుకు వీరదాసు ఫీలయినట్టు కనిపించలేదు. సన్నగా నవ్వుతూ "నీ తండ్రి టెంపుల్ గార్డుని ఎందుకు చంపాడో నాకు తెలుసు కాబట్టి" మధ్యలో ఆపి, "నీ తండ్రి ఉరికంబం ఎక్కడానికి కారణం నేను కాబట్టి" అన్నాడు.    
________________________________________________________________________________
    * మేజిస్ట్రేట్ రాననడం యదార్ధ సంఘటన.
_______________________________________________________________________________  

    "టెంపుల్ గార్డుని చంపింది నువ్వు - నా తండ్రి కాదు."    
    "అసలు కారణం నీకు తెలీదు."    
    పత్రికా విలేఖరులు వ్రాసుకుంటున్నారు.    
    "ఏమిటి మరి అసలు కారణం?" రాణా అడిగాడు.    
    వీరదాసు ఓరగా విలేఖరులవైపు చూశాడు. అమాయకమైన కుందేలు వేటగాడికి సరీగ్గా గురి కుదిరినప్పుడు బాణం వదిలే ముందు వచ్చే విషపు చిరునవ్వు అతడి పెదవుల మీద కదలాడుతూండగా, మరోమారు విలేఖరులవైపు చూసి "నీ తల్లికీ టెంపుల్ గార్డుకీ సంబంధం వుంది కాబట్టి" అన్నాడు.    
    భూమి అంచులకు వింటి తాడు కట్టి, ఆకాశం వరకూ సంధించి లాగి వదిలితే, శోకానుభూత్య నిరిశ తటిచ్చకితా ఉద్రిక్త క్షణంలో పగిలిన గుండె చరన్మౌఢ్య క్రూరమృగాల సంకులారణ్యంలో దిక్కుతోచని స్థితి.    
    "అబద్దం" అరుపుకి భూమి కంపించింది. చలనం ఆపి సముద్రం శోకించింది.    
    వీరదాసు తాపీగా అన్నాడు. "అబద్దం అని నువ్వంటావు నిజమని నేనంటాను. రామాచారి మరణ వాంగ్మూలం నిజమని నువ్వంటావు. అబద్దమని నేననంటాను-" నవ్వేడు. "కానీ నా మాటలు నిజమని ప్రజలు నమ్ముతారు. ఎందుకంటే.....ఎందుకంటే దొంగల భార్యలకి తమ భర్తలు జైల్లో వున్నప్పుడు వ్యభిచరించటం, అక్రమ సంబంధం పెట్టుకోవడం అలవాటే గనుక....."    
    రాణా పరుగెత్తాడు. వారిద్దరిమధ్యా దూరం కేవలం నాలుగు గజాలే. అయినా సరే, లేచి బుల్లెట్ లా పరుగెత్తాడు. ఒక ఝంఝామారుతంలా వెళ్ళి అదే ఊపులో వీరదాసుని కుర్చీలోంచి పైకెత్తి విసిరికొట్టాడు. లాకప్ చువ్వలకు తగిలి అతడి తల టప్ మని చప్పుడైంది. ఇంకొకరైతే ఆ క్షణమే మరణించేవారే. వీరదాసు కాబట్టి నిలదొక్కుకున్నాడు. అయితే అతడు లేచే ప్రయత్నం చేయలేదు. సాధించవలసింది సాధించినట్టు అలాగే వుండిపోయాడు. పెదవులమీద చిరునవ్వు కూడా అలాగే వుంది. హోం మినిష్టర్ బాడీగార్డులు వెళ్ళి రాణాని వెనక్కి లాగి పట్టుకున్నారు. రాణా రొప్పుతున్నాడు. అతడి మొహం జేగురు రంగుకి మారివుంది. అతడి మనసు మీద ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ కొట్టాడు వీరదాసు. సరీగ్గా ఈ సమయం కోసమే. ఈ అవకాశం కోసమే ఇన్నాళ్ళూ లాకప్ చీకటి గదిలో తన నేరాన్ని వప్పుకుని వున్నట్టు నవ్వుతున్నాడు.    
    "పత్రికా విలేఖరులు చూస్తూ వుండగా, ఒక హోం మినిష్టర్ ముందు లాకప్ లో వ్యక్తిని కొట్టడం క్షమించరాని నేరం నీ తల బిరుసుతనాన్ని, ఖైదీలపట్ల నీకున్న చులకనభావాన్ని అది సూచిస్తుంది" అన్నాడు హోం మినిష్టర్. "....నీ తండ్రి ఒక స్టూవర్ట్ పురం దొంగ. నీ సహచరులందరూ దొంగలు. వాళ్ళు దేవాలయంలో నగలు దొంగతనం చేశారు. ఆ నేరం విషయంలో వారు అరెస్టు అయ్యారు. ఇక నీకు దారిలేక, నగలు తిరిగి దొరికినట్టు నటించి మీ వాళ్ళని వదిలిపెట్టావ్."    
    ఆగి, తిరిగి అన్నాడు. "రామాచారి మరణ వాంగ్మూలానికి సాక్షులెవరూ లేరు. మేజిస్ట్రేట్ రానన్నాడని నీవంటున్నావు. దాని మీద ఆయన నీపై పరువునష్టం దావా వెయ్యొచ్చు. కేవలం వీరదాసుని ఆన్ పాపులర్ చెయ్యడానికే నువ్వు అరెస్టు చేశావని ఈ విధంగా తేటతెల్లమవుతూంది. ఆయన్ని మరింత ఇరుకులో పెట్టడానికే ఎం.పి.గారి కూతుర్ని కిడ్నాప్ చేసి, వీరదాస్ కీ టెర్రరిస్టులకీ సంబంధం వుందన్నట్టు అపోహ కల్గించావు. ఈ కారణాల వల్ల నిన్ను సస్పెండ్ చేస్తున్నాము. నీ మీద మేజిస్ట్రేట్ పరువు నష్టం దావా వేస్తున్నారు. మా అందరిముందూ చెయ్యి చేసుకున్నందుకు వీరదాసు నీ మీద క్రిమినల్ కంప్లెయింట్ ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదు. యూ ఆర్ సస్పెండెడ్ హియర్ అండ్ నౌ ఇట్ సెల్ఫ్ క్షమాపణలతో వీరదాసుని రిలీజ్ చెయ్యడానికి ఉత్తర్వులు యిస్తున్నాను." ఒక చేత్తో రాణాకీ, మరోచేత్తో వీరదాసుకీ ఆర్డర్లు ఇచ్చాడు హోం మినిష్టర్.    
    బయటికీ విషయం తెలిసినట్టయింది. "వీరదాస్ కీ జై" అని ఎవరో అరిచారు. లోపలికి ఒక రౌడీ నిలువెత్తు దండ తీసుకొచ్చి వేశాడు వీరదాసుకి. నలుగురూ అతన్ని చేతులమీద బయటకు తీసుకెళ్ళారు. లారీలమీద ఊరేగింపు ప్రారంభమైంది.    
    బయట చీకటి పడుతుంది. పోలీస్ స్టేషన్ లో మరీ చీకటిగా వుంది. రాణా ఒక్కడే కూర్చుని వున్నాడు.    
    దూరం నుంచి ఎవరో బాగా తాగేసి పాడుతున్నారు.    
    "జోరుసే బార్ సే- కోణంగి రేవు సే-
    తహగేసి తోస్తే- నవ మునకేసే-
    జోరుసే బార్ సే - కోణంగి రేవు సే-
    తాగేసి తోస్తే -నావ మునకేసే-"    
                                                   15    
    ఆమె అలానే చాలాసేపు కూర్చుండి పోయింది. ఆమె ముందు టేప్ రికార్డర్ వుంది.    
    కామిని పెద్ద దేశభక్తురాలేమీ కాదు. దేశంకోసం ప్రాణాలు అర్పించాలన్నంత త్యాగగుణం కూడా ఆమెకి లేదు. కానీ టేప్ రికార్డర్ లో విషయాలు ఆమెని కదిలించి వేశాయి.    
    మనుషుల్లో స్వార్ధం గురించి ఆమెకు తెలిసినంతగా మరెవరికీ తెలియకపోయి వుండవచ్చు అనడంలో అతిశయోక్తి ఏమీలేదు. సాధారణంగా స్వార్ధం గురించి పురుషుడికన్నా స్త్రీకి ఎక్కువ బాగా తెలుస్తుంది. అందమైన స్త్రీకైతే మరింత. పబ్లిక్ ఫిగర్ కైతే ఇక చెప్పనవసరం లేదు.    
    స్త్రీలు పబ్లిక్ ఫిగర్స్ గా వెలగేది ముఖ్యంగా రెండు రంగాల్లోనే సినిమాల్లోనూ,రాజకీయాల్లోనూ ..... సినిమాల్లో స్త్రీ మీద 'వత్తిడి' ఎక్కువగా వుంటుందని చాలామంది భ్రమిస్తారు. మొదట్లో కొంతకాలం వరకూ అది వుంటే వుండవచ్చునేమో కానీ, ఒకసారి ఆమె తన టాలెంట్ నిరూపించుకున్నాక ఎవరికీ లొంగివుండనవసరం లేదు. అప్పటికే ఆమె ఆ అవసరానికి అలవాటు పడితే అదివేరు సంగతి.    
    రాజకీయాలు అలాకాదు. పైకి తెలియని పెద్ద ఊబి అది. అందులో పైకి రావాలంటే టాలెంట్, తెలివితేటలు, చదువు అవసరం లేదు. పబ్లిక్ రిలేషన్స్, లౌక్యం తెలిసుంటే చాలు. వీటన్నిటికన్నా ముఖ్యంగా అధిష్టానవర్గం నుంచి ఆశీస్సులు పలుకుబడి కావాలి. స్త్రీకి ఇవన్నీ ఎలా వస్తాయి?    
    కామినికి రాజకీయాలు, సినిమారంగం-రెండింటిలోనూ ప్రవేశం వుంది. అందుకే మనిషి స్వార్ధం గురించి ఆమెకు తెలిసినంతగా మరెవరికీ తెలియదేమో ఆమె సినిమా రంగంకన్నా రాజకీయాల్నే ఎక్కువ ద్వేషించింది. అందం వున్న స్త్రీలు సినిమాల్లో చేరి చెడిపోతే చెడిపోవచ్చు గాక, కానీ రాజకీయాల్లో అందం వడిలిపోయిన ఎందరో స్త్రీలు తమ పైవాళ్ళ ప్రాపకం కోసం మరెందరో స్త్రీలని 'తార్చటం' ఆమె కళ్ళారా చూసింది. ఉద్యోగాల కోసం వచ్చేవాళ్ళు, బదిలీలు కావల్సినవాళ్ళు అప్పుడే రాజకీయాల్లో చేరినవాళ్ళు, ఉబుసుపోని హై సొసైటీ లేడీసూ, వీళ్ళనుంచి వాళ్ళకి పరిచయాలు, కొత్త గుర్తింపులు....వ్యభిచార గృహపు వ్యవహారకర్తల్లా కొందరు స్త్రీలు రాజకీయాల్లో తయారవడం చూసింది. ఎంతోమంది మంత్రులు, ఊహించని దానికన్నా ఎక్కువ 'లేకి'గా ప్రవర్తించడం ఆమెకు తెలుసు. ఆమెకోసం ఎందరో రాయబారాలు తీసుకొచ్చారు. ఈ రాయబారాలు తెచ్చేదీ మళ్ళీ స్త్రీలే కావడం విశేషం. అలా అని ఈ స్త్రీలు బ్రోకర్లు కారు. ఉన్నత పదవుల్లో వున్నవారు, పార్టీ టిక్కెట్టు కోసం ఆశిస్తున్నవాళ్ళు, పార్టీ నియమించే పదవుల కోసం ఆశపడుతున్నవాళ్ళు.    
    సినిమాలకి ఎల్లో జర్నలిజం వున్నట్టు రాజకీయాలకీ వుండి వుంటే ఎంతమంది హీన జీవిత సత్యాలు బయటపడి వుండేవో.

    అలాంటి కామిని - ఇప్పుడు తన జీవితపు అత్యంత దుర్భరమైన షాక్ ని అనుభవిస్తున్న స్టేజీలో వుంది. కొన్ని గంటల క్రితమే అరవింద్ చౌరసియా ఆమెని ఈ విషయం అడిగాడు. ఆమెకు మొదట్లో అర్ధంకాలేదు. తన భర్త చీఫ్ మినిష్టర్ అవబోతున్నాడన్నది ఆమెకు తెలిసిన విషయమే. ఆ ప్రయత్నం ఆమె చేసింది కూడా ఇప్పుడు చౌరసియా ఆమె ముందు ఈ ప్రపోజల్ పెట్టాడు. అప్పటికామె టేప్ రికార్డర్ వినలేదు. ఆమె కతడు చెపుతున్నది అర్ధంకాలేదు.     
    "నీ భర్త ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తరువాత నువ్వేం చేయబోతున్నావ్?" అని అడిగాడు.    
    ఆమె నవ్వి "ఏం చేస్తాను? ముఖ్యమంత్రి భార్య నవుతాను" అంది.    
    "సినిమాల్లో నటించవా?"    
    "హోం మినిష్టర్ భార్యగా నటించలేదా? అలాగే కొనసాగిస్తాను."    
    "నీ భర్తవల్ల రాష్ట్రం బాగుపడుతుందా?"    
    ఆమె నవ్వుతూనే "ఏ ముఖ్యమంత్రి వల్ల అది బాగుపడుతుంది కనుక?" అంది.    
    "నువ్వు తల్చుకుంటే కొన్ని విప్లవాత్మక మార్పులు తీసుకురావొచ్చు. అది నీ వల్లే సాధ్యమవుతుంది."    
    "ఏ రకమైన మార్పులు?"    
    "ఉదాహరణకి- దేశం నుంచి రాష్ట్రాన్ని విడగొట్టడం-"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS