గబగబా నడిచి వెళ్ళిపోతున్న ఆమె వైపు- అదే నడక, అదే జడ- అదే-
"లీలా..!" గట్టిగా అరిచాడు.
- ఆ చీకట్లో, ఆ పెద్ద పార్కులో ఎవరికి వినిపించింది?
- చీకట్లో ఎటో వెళ్ళిపోయింది ఆ మనిషి!
రాజీవ్ లేచాడు......దగ్గరలో ఫోను దాకా నడిచాడు..
"హలో....నేనే!"
"అంకుల్....నేను! ఆంటీ, అంకుల్ లేరు- షాపింగ్ వెళ్ళారు"
"ఎవరున్నారూ?"
"........"
"చెన్నమ్మ వుందా?"
"లేదు - రెండురోజుల నుంచి జ్వరం"
రాజీవ్ కి సరిగ్గా వినిపించడంలేదు.
"హలో - ఎవరు మాట్లాడుతోంది?"
"నేను- సతీష్ ని!"
"లేదా పాప?"
"బోడీ - ఇప్పుడే నిద్రపోయింది"
రాజీవ్ ఫోన్ పెట్టేశాడు.... అంత ఇంట్లో సతీష్- బోడీ! -బోడీ ఎవరో..... -ఓ.... మమత! పిచ్చి పట్టినట్లనిపించింది. గబగబా ఇంటికొచ్చేశాడు.
జానకి, మాధవరావు క్లబ్బునుంచి రాత్రి పదకొండు గంటలకి ఇల్లు చేరారు.
"బోడీ- చెన్నమ్మ రాలేదా..?" అంది జానకి.
"జ్వరమని ఫోన్ చేసింది మీరు వెళ్ళగానే!" అంది.
"ఇంకెవరైనా ఫోన్ చేశారా?"
"లేదమ్మా..?" అంది. సతీష్ అప్పటికి వెళ్ళిపోయాడు.
"ఎందుకో... రాజీవ్ ఫోన్ చేశాడేమో- అనిపించిందండీ!" అంది జానకి భర్తతో.
"నెలరోజులు కాలేదు వచ్చి- మళ్ళీ వస్తాడా- మళ్ళీ రెండు నెలలవరకైనా రాడు. మొత్తానికి మంచి పని చేశాం- బోడిని ఇంటికి తెచ్చుకుని! చూడు... ఎంత హాయిగా వుందో- మన బిక్కీని చూసుకుంటుంది. ఫోన్ కాల్స్ చూసుకుంటుంది- ఇవాళ చెన్నమ్మ రాకపోతే పనులన్నీ చేసుకుంది కదా!" అంది జానకి ఆవులించి.
* * *
ఆ రాత్రి పదిదాకా చూసాడు ఆశ్రమంలో అంతా.... లీల ఇంకా రాలేదేమో అనుకుంటూ!
"ఎక్కడికెళ్ళిందో తెలియదు. ఈ మాట చెప్పాలి, చెప్పాకుండా ఎక్కడికీ వెళ్ళవద్దని, మనమిప్పుడు ఎంత కంగారుపడి చస్తున్నాం" అంది తిరుపతమ్మ.
"దాన్ని దాని భర్త దగ్గరకి పంపేయాలి - వయసులో వున్న దాన్ని "ఏదో నసిగాడు చంద్రయ్య.
"మొగుడిని వదిలి ఇక్కడ కూచోటమేమిటీ- ఆ తులసమ్మే దీన్ని బాగా ప్రోత్సహించింది" అంది తిరుపతమ్మ... అక్కడున్న వాళ్ళెవరూ కాదనలేదు.
రాత్రి పదకొండయింది.. పన్నెండయింది- ఏదీ, "ఏం చేద్దాం మరి!" అంది తిరుపతమ్మ.
"ఎక్కడికి పోతుందీ, అదే వస్తుంది..." పాత స్నేహాలు గుర్తొచ్చి వెకిలిగా నవ్వాడు చంద్రయ్య.
కానీ, ఆ పిల్ల ఆశ్రమానికి తెల్లారీనా రాలేదు..... అందరికీ కంగారే.
"పోనీ.... పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇద్దామా?" అన్నారొకరు.
పేపర్లో ఫోటో వేయిస్తే సరి!" అన్నారింకొకరు.
చంద్రయ్య మాట్లాడలేదు... ఏం చేయాలో అతనికీ తోచలేదు. కానీ, లీల భర్త దగ్గరికి వెళ్లుంటుందాని మనసులో అనిపించింది. కానీ, ఎక్కడున్నాడో... ఏమిటో తెలియకుండా ఎలా వెడుతుందీ- అనుకున్నాడు. 'ఆశ్రమంలో అమ్మాయి కనిపించలేదంటే ఆశ్రమం పరువు పోదా మరి!... అనుకుని ఏమి చేయకుండా ఊరుకున్నాడు. అదే వస్తుంది, రాకెక్కడికి పోతుందీ' అనుకున్నాడు.
చెన్నమ్మ ఎవరితో మాట్లాడకుండా తిన్నగా వంటింట్లో కెళ్ళిపోయింది. బోడి గదులు తుడిచింది. సతీష్ గబగబా లోపలకొచ్చాడు.
"ఆంటీ, ఇదిగో మీ కేసెట్!" అంటూ జానకికి కేసెట్ ఇచ్చేసాడు.
"సాయంత్రం వెళ్ళిపోతున్నా, కాలేజీ తెరిచారు" అన్నాడు బోడివైపు చూస్తూ.
"మళ్ళీ... ఎప్పుడొస్తావూ?" అంది తుడుస్తోన్న బట్ట బకెట్లో పడేస్తూ.
"మళ్ళీ హాలిడేస్ కి!" అటూ ఇటూ చూసి జేబులో వున్న చాక్లెట్ బోడి చేతిలో పెట్టాడు.
చెన్నమ్మ దబ్బున పాలగిన్నె కింద జార్చేసింది.
బోడి చేతిలోంచి చాక్లెట్ కింద పడింది.
సతీష్ తీసి బోడి చెయ్యి గట్టిగా నొక్కి, చేతిలో పెట్టి నవ్వాడు. గబగబా లోపలకెళ్ళి దాచుకుంది దాన్ని బోడి.
సతీష్ వెళ్ళిపోతున్న వైపు చూస్తూ నుంచున్న బోడీ వీపుపై దెబ్బపడింది.
"ఆ గది ముందు చూడు-ఎలా తుడిచావో! అసలు దుమ్ము పోయిందా, మళ్ళీ మొత్తం తుడు!" అంది జానకి సోఫాలో కాళ్ళు జాపుకుని పుస్తకం తిరగేస్తూ.
చెన్నమ్మ కాఫీ డికాషన్ దొడ్లో ఓ మూల వలకపోసేసింది.
బోడి- ఇంట్లో అందరూ ఏదో పనిలోవుండగా ఒక్కసారి పౌడరు రాసుకుందా మనుకుంది. సతీష్ ఇచ్చిన చిన్న పౌడరు డబ్బా మూత తీసింది. ఆరోజు సతీష్ తమాషాగా కూడా పోసేయటం గుర్తొచ్చింది.
అంతలోనే చెన్నమ్మ చెప్పిన మాట గుర్తొచ్చి భయమేసింది సుబ్బికి.
"ఇలాగే స్నేహంగా వుంటే ఎప్పుడో నీ బతుకుని కాటేస్తారు. సతీష్ లాంటి కుర్రాళ్ళతో నీలాటి చిన్నపిల్లలు చనువుగా వుండకూడదు" అంది చెన్నమ్మ ఓసారి.
"మరోసారి ఆ పిల్లాడు రాణీ... కాళ్ళు విరగ్గొడతా!" అంది కోపంగా.
"ఇంకోసారి ఆ అబ్బాయితో నువ్వు మాట్లాడితే నీ విషయం అయ్యగారికి చెప్తానంది. ఓసారి చెన్నమ్మ తన చెంపమీద కొట్టింది- చెన్నమ్మ తనకి తల్లి లాటిదే! - అసలు తన తల్లి ఎవరో, ఎలా వుంటుందో, వుందో-లేదో కూడా తనకి తెలియదు. ఆరోజు వచ్చిన అంకులే మీ నాన్న!.... అంటుంది చెన్నమ్మ.
-ఏమిటో ... ఏమీ అర్ధంకాక ఎంతో బెంగగా, దిగులుగా వుంటోంది సుబ్బికి ఈమధ్య. పైగా... తనకి వేసిన గౌను మళ్ళీ ఎందుకు అమ్మగారు దాచేసిందో కూడా ఎంత ఆలోచించినా తెలియలేదు.
రాత్రి వరండాలో ఓ మూల చాపమీద నిద్రపోతోంది సుబ్బి. లైట్లు పోయాయి. అమ్మగారు లేరు, అయ్యగారు అప్పుడే వచ్చారు. నిద్రపోతున్న సుబ్బిని గట్టిగా వెనకనుంచి కౌగిలించుకున్నాడెవరో!
ఉలిక్కిపడి లేచింది. "అరవకు" అంటూ సుబ్బి బుగ్గల్ని, పెదాలని ముద్దు పెట్టుకున్నాడు, కదలనీయకుండా కౌగిలి బిగించాడు.... సుబ్బి గట్టిగా అరవబోయింది.
అంతలో....లైట్లొచ్చాయి!
గబగబా వెళ్ళపోయాడు సుబ్బి బుగ్గ కొరికిన - కారు డ్రైవర్!! సుబ్బి భయంతో గజగజలాడిపోయింది. అమ్మగారికో, అయ్యగారికో చెప్తే! ఏమో... తననే కొడతారేమో!
సుబ్బి ఒళ్ళంతా చెమటలు, భయం! - లేవాలంటే భయం- డ్రైవరు వెళ్ళిపోయాడో లేదో తెలియదు -మళ్ళీ లైట్లు పోతే! భయంగా లేచి కూచుంది. ముందు గదిలో లైటు వరండా మూలకి కొద్దిగా పడుతోంది.
"అయ్య వచ్చేసారు, డ్రైవరు వెళ్ళాడు, ఇంకా గేటు తాళమెయ్యవేమే బోడీ!" అంది జానకి.
"డ్రైవరు వెళ్ళిపోయాడా?"
"ఆ లైటు రాగానే వెళ్ళిపోయారు"
సుబ్బి గుండె చిక్కబట్టుకుని, గేటు తాళం వేసి లోపలకొచ్చింది.
ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా... అని చూస్తూ అటు ఇటు ఒత్తిగిల్లుతూ రాత్రంతా మెలకువగానే గడిపింది సుబ్బి. తెల్లవారుతుంటే నిద్రపట్టింది- బాగా పొద్దెక్కిపోయింది లేచేసరికి.
చెన్నమ్మ వీధి తుడిచి ముగ్గుపెట్టింది.
'బోడీ లేవలేదా?' అన్నాడు వాకింగ్ కెళ్ళి వస్తూ మాధవరావు.
చెన్నమ్మ మాట్లాడలేదు.
సుబ్బి లేచి గబగబా దాని పనులు అది చేసుకుంటోంది. చెన్నమ్మ ముఖం ముడుచుకుని పనిచేసుకుంటోంది.
ఒంటిగంట అయింది... చెన్నమ్మ వంటింటి గుమ్మంలో నిద్రపోయింది. సుబ్బికి ఏమీ తోచటంలేదు. తను వెళ్ళిపోవాలి ఈ ఇంట్లోంచి... చాలా భయంగా వుంది. ఎప్పుడు తనకి ఎలాటి ఆపద వస్తుందోననే భయం! పైగా... ఎవరూ తన గురించి పట్టించుకోరు. ఎవరూ తనని ప్రేమగా చూడరు. చెన్నమ్మే తనని ప్రేమగా చూస్తుంది.
సుబ్బి వంటింటి గుమ్మంలో నిద్రపోతున్న చెన్నమ్మని లేపింది... 'ఒక్కసారి లే!' అంది ఏడుస్తూ.
చెన్నమ్మ, సుబ్బి మేడ మెట్లపై కూచుని చాలాసేపు మాట్లాడుకున్నారు. చెన్నమ్మ సుబ్బిని తన ఒళ్ళో పడుకోబెట్టుకుంది.
"ఏడవకు, భయపడకు, నేనున్నాగా, మంచి ఉపాయం ఆలోచిస్తా!" అంది దాని వీపు నిమిరి... చెన్నమ్మ కళ్ళొత్తుకుంది రహస్యంగా.
అప్పటికే కేకలేస్తోంది జానకి- "ఎక్కడికిపోయారే..." అంటూ!
సుబ్బి గబుక్కున బాత్ రూంలోకి దూరింది. చెన్నమ్మ వీధిలోంచి వస్తున్నట్టు ముందుగుమ్మంలో లోపలకొస్తూ- "అరటిపండ్లొచ్చాయి....పిలుద్దామనుకుని వెళ్ళేలోపలే వెళ్ళిపోయాడు" అంటూ వంటింట్లో కెళ్ళిపోయింది. సుబ్బి బాత్ రూమునుంచి వచ్చి ముఖం కడుక్కుంది. ఎందుకో... మనసులో చాలా సంతోషంగా వుంది. చెన్నమ్మ తన తల్లిలాటిదేవిటీ, తల్లే! - అందుకే తన మేలు కోరింది.
