తొమ్మిదిగంటలయింది - రామం స్నానం చేయటం, ఇడ్లీ కాఫీ సేవించటం అయింది. గాయత్రి ఈ పాటికి ఎప్పుడో వచ్చి వుంటుంది. చెప్పులు తొడుక్కుని బయటకి నడిచాడు రామం.
ఇంట్లో బయలుదేరినపుడున్న ఉత్సాహం మేష్టారిల్లు చేరుతుంటే తగ్గిపోయింది రామానికి. ఊపిరిబిగపట్టుకొని ఇంట్లో అడుగుపెట్టాడు. ముందు గదిలో చిన్నబాబు బొమ్మలతో ఆడుకుంటున్నాడు తెల్లగావున్నాడు. రింగురింగుల జుట్టు - ఎర్రటి పెదాలు - వీడు గాయత్రికొడుకా - నల్లగావుంటుంది కదా గాయత్రి - అయితేనేం భర్త తెల్లని వాడేమో -
రామాన్ని చూసాడు ఆపసివాడు ఒక్కనిముషం - వెంటనే పెద్దగా ఏడ్చాడు. రామానికి భయమేసింది ఎందుకేడుస్తున్నాడో - అంతలోనే తల్లి పరిగెత్తి వచ్చింది. కొత్తవాళ్ళని చూస్తే ఏడుస్తాడు అంటూ గబుక్కున ఎత్తుకుంది. తల్లి భుజమెక్కి నవ్వుతున్నాడు పసివాడు - అప్పటి వరకూ ఎవరో కొత్త వాళ్ళు నాన్నకోసం వచ్చారనుకున్న జానకి రామాన్ని గుర్తించి ముఖందించుకుంది.
'అబ్బాయా' - రామం ఏదో మాట్లాడాలికదా, అన్నాడు.
'ఊ' అంది పవిట నిండుగా కప్పుకుంటూ గాయత్రి అలాగే వుంది. పెద్ద మార్పేమీ లేదు - ముఖాన చిన్నస్తిక్కరు బొట్టుకూడా వుంది. మెడలో సన్నని బంగారపు గొలుసుకూడా వుంది. జడ అలాగే వుంది. నిజానికి చిన్నప్పుడు కన్నా ఇప్పుడే బాగుంది. పిల్లవాడి నెత్తుకుని నిలబడే వుంది.
'కూర్చో' అన్నాడు రామం.
'ఇప్పుడే వస్తాను; లోపలకెళ్ళింది రామం అక్కడున్న పేపరు తిరగేస్తుంటే కృష్ణమూర్తిగారు వచ్చారు గదిలోకి.
'ఇంకా వుంటావా రామం, ఈ ఊర్లో' -
'ఆ ... నిజానికి వెళ్ళిపోదామనే వుంది - సెలవు పెట్టాకదా అని ఆలోచిస్తున్నానంతే - ఇక్కడ ఏమీ పనిలేదు - ఊరికే కాలంగడవటం కష్టం' - అన్నాడు రామం. రామం, గదిలోవున్న కర్టెన్ వైపు చూస్తున్నాడు. గాయత్రి మళ్ళీరాదేం - ఎన్నో మాట్లాడాలనుకున్నాడు - ఎలా, అంతలోనే గాయత్రి కాఫీకప్పుతో అక్కడికొచ్చింది. కృష్ణమూర్తిగారు కాసేపు అక్కడ కూచుని వెళ్ళిపోయారు.
రామం, గాయత్రి, ఇద్దరి మధ్య భయంకరమైన నిశ్శబ్దం" గాయత్రీ - ఎలా కాలక్షేపం చేస్తున్నావ్ -
ఏమిటో అర్ధం లేని ప్రశ్న అని రామానికీ అనిపించింది.
'ఇలానే - వీడితో' అంది గాయత్రి ఒళ్ళో పిల్లాడి తలముడ్డు పెట్టుకుంటూ పెళ్ళిచేసుకోవా తిరిగి అని అడిగితే బాగుండదు. అడక్కపోతే ఆమె మనసులో ఏముందో తెలియదు - తను వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పుడొస్తాడో - తెలుసుకోవాలని చాల ఆసక్తిగావుంది రామానికి ఎలా ప్రారంభించాలో తెలియటం లేదు.
"నీ విషయం నాన్నగారు చెప్పారు - అలా ఎందుకు జరిగిందో" - గాయత్రి అనేసరికి రామానైకి ఆశ్చర్యమేసింది. గాయత్రి తన విషయాలలో శ్రద్దకనబరుస్తోందా ఇంకా తనవైవాహిక జీవితం విఫలమైందని తెలిసివిచారిస్తోందా -
"కొందరికి విధి జీవితాల్ని బలిచేస్తే, కొందరు తమ చేతులతో తామే నాశనం చేసుకుంటారు కదూ అదే అనిపిస్తుంది నాకు - కాకపోతే ఆ అమ్మాయే విడాకులకి కోర్టుకి పోవటమేమిటి " - గాయత్రి హాయిగా ధైర్యంగా మాట్లాడేస్తోంటే, రామానికి కొండంత బలం వచ్చింది.
"ఆ - ఏం చెప్పను గాయత్రీ కేవలం ఆ అమ్మాయి అహంకారంతో జీవితాన్ని కాలరాసుకుంటోంది - రాజీ మార్గానికి ఎంతో ప్రయత్నం చేశాను. ఇద్దరం కలసి మాట్లాడుకుందాం ఒక్కసారి - మళ్ళీ ఆలోచించమని బతిమాలాను - 'రామం ఎటో చూస్తున్నాడు. అనవసరమైన విషయం ప్రస్తావించానని గాయత్రి అనుకుంది ఆ క్షణం.
'ఇలా వంటరిగానే వుండి పోతావా'
"ఎందుకుండిపోతానూ బహుశా శారద మరో పెళ్ళి చేసుకుంటుంది నేను చేసుకుంటాను' --
"మరో పెళ్ళి చేసుకుంటావా' రెట్టించింది గాయత్రి.
"ఆ - మరి జీవితమంతా ఒంటరిగా ఇలా బతుకుతానా - నాకేం ఖర్మ" రామం మాటలు వింటోంది గాయత్రి.
భార్య వదిలేసిన రామం మళ్ళీ పెళ్ళి చేసుకుంటాడు!
భర్తలేని తను మళ్ళీ ఎందుకు పెళ్ళి చేసుకోవద్దూ!
ఈ పిల్లాడిని తాతగారి దగ్గర వదిలేస్తే తనను పెళ్ళాడటానికి సిద్దంగా వున్న నేవీ ఆఫీసరు గుర్తొచ్చాడు గాయత్రికి ఈ పిల్లాడు తనకు దూరమవుతాడా - గాయత్రి అప్రయత్నంగా పసివాణ్ణి గుండెలకి హత్తుకుంది 'నా కన్న తండ్రిని నేను వదులుకొను - పెళ్ళి వద్దు గిళ్ళి వద్దు -కదూ నాన్న' పిల్లాడిని ముద్దు పెట్టుకుంది. బయటకెళ్ళిన రామం రాలేదక్కడకనుకుంది - రామం అక్కడే వున్న విషయం గమనించక -
'నేను వెళ్లొస్తాను మరి" - రామం లేచాడు.
"మళ్ళీరా ఒకసారి - నేనూ వస్తాను బాబుని తీసుకుని అత్తయ్యగారు బావున్నారా అంది లేస్తూ.
'ఆ' అన్నాడు రామం చెప్పులకు తొడుక్కుంటూ.
ఆ రాత్రే రామం హైదరాబాదు వెళ్ళిపోయాడు.
* * *
12
లలిత దగ్గర నుంచి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చునని బయలుదేరి వచ్చాడు వేంకటేశు లోపలకి రాగానే గుర్తుపట్టింది లలిత. శారద అన్నయ్య వేంకటేశుని.
'అన్నయ్యా, రండి లోపలికి' అంది వేంకటేశుతో.
'శారద అన్నయ్య నాన్నగారూ - లలిత కుర్చీ వేసింది వేంకటేశు కూర్చున్నాడు.
"అదేమిటి ఈ అమ్మాయికి పెళ్ళికాలేదాయింకా' అనుకుంటూ లలిత వంక శ్రద్దగా చూసాడు.
'నాన్నగారూ బాగున్నారా నాయనా. ఏం బాగుంటారులే - పెద్ద తనం మా అందరిదీ ఒకటే సమస్య - ఇంకా మీ నాయన అదృష్ట వంతుడే - కొడుకువి నువ్వు చూస్తున్నావు. నాకొడుకులు ఏడాది కోసారి. అదీ తల్లి తద్దినానికొచ్చి వెడతారు. పిల్లమీద నా బతుకు ఆధారం. ఏమిటో - వెంకట్రామయ్యగారు ఇలా అతిగా మాట్లాడటం ఈ మధ్య చాలా ఎక్కువాయినా, లలితకి చిరాగ్గా వుంది.
'ఏమిటి నాన్నా మన గొడవ ఎప్పుడూ వుండేదేగా అయినా వేంకటేశు ఏం చేస్తాడూ. ఊరుకోండి కాసేపు. లోపల కెళ్ళి పడుకోండి" అంది లలిత మొహమాటపడుతూ.
