Previous Page Next Page 
మళ్ళీ వచ్చిన వసంతం పేజి 28

   

      రామానికి ఈ మాటలేవీ పెద్దగా పట్టలేదు. గాయత్రి విషయం చెప్పదేమిటి - ఎలా వుందో, ఎంతమంది పిల్లలో ఏవీ తెలియవు - "అమ్మా గాయత్రి బాగుందా"
   
    "దాని బాగు నా బాగు ఒకటేలే'
   
    'అంటే'
   
    'అదే - దాని దురదృష్టందానిది. ఒక కొడుకు. ఏడాది వెళ్ళింది దాని భర్త యాక్సిడెంట్స్ లో పోయాడు.
   
    రామానికి ఒక్కసారి గుండెపట్టుకున్నట్లయింది అయ్యోపాపం!!
   
    పాపం, ఎలా బతుకుతోందీ! అయ్యోపాపం రామం మనసు విలవిల్లాడిపోయింది. బతికినంతకాలం వైధవ్యంతో అలాగడపాలసిందేనా - ఇక గాయత్రి జీవితంలో వసంతం రాదా - భగవంతుడు కొందరికి ఎందుకన్యాయం చేస్తాడో" - రామం కళ్ళముందు గాయత్రి బాల్యం గుర్తొచ్చింది - ఆనాటి పెద్దపూలజడ గుర్తొచ్చింది. గాయత్రి ఇప్పుడేలావుందో ఎవరయినా పెళ్ళిచేసుకుంటే ఆ అమ్మాయిని!!-
   
    'అమ్మా గాయత్రికి మళ్ళీ పెళ్ళి చేయాలని ప్రయత్నం చేయలేదా కృష్ణమూర్తి మేష్టారుకానీ, వాళ్ళ బావలు కానీ.
   
    'ఎందుకు చేయలేదూ - కానీ పిల్లాడున్న దాన్ని మళ్ళీ పెళ్ళి చేసుకుందుకు ఏమగాడు ముందుకొస్తాడో చెప్పు - అయినా ఒకటి రెండు సంబంధాలు చూసారు. పిల్లవాణ్ణి తాతగారు దగ్గర వుంచు కొనేటట్లయితే గాయత్రిని పెళ్ళి చేసుకుందుకు ఇష్టపడ్డారు.
   
    'మరింకేం చేసుకోవచ్చుగా'
   
    'ఇంకానయం - ఏ తల్లి అయినా పిల్లని వొదిన మళ్ళీ పెళ్ళి చేసుకుంటుందా - అదేమాట గాయత్రి అందిట పిల్లవాడు తనతో వుండేందుకు ఇష్టపడితేనే పెళ్ళిచేసుకుంటానందిట - ఇవన్నీ ఈ మధ్య మేష్టారు వచ్చినపుడు చెప్పిన కబుర్లే' - యశోదమ్మ వంటిల్లు సద్ది వచ్చింది.
   
    కొడుకు విడాకుల విషయం చాలా బాధగా వుంది. ఆవిడకి లక్షణంగా పెళ్ళిచేసుకున్నాక, పిల్లలతో సంసారం ముచ్చటగావుండక ఈ గొడవ ఏమిటో - రామం కడుపున ఓకాయకాస్తే చూసి ఆనందిద్దామని మాత్రమే బతుకుతోంది యశోదమ్మ అసలు ఆ ఆశ తీరుతుందా - ఒకసారి విడాకులు పొందాక, తన కొడుక్కుమాత్రం పిల్లనెవరిస్తారూ - వాడి జీవితమూ అలా వంటరిగా సాగిపోతుందేమో !! - ఏమైనా తనేం చేయలేదుగా - యశోదమ్మ ఒక కునుకుతీస్తోంది.
   
    రామం, కృష్ణమూర్తిగారింటికి బయలుదేరాడు. ఇల్లు దగ్గరవుతుంటే గుండె దడదడ కొట్టుకుంది - గాయత్రి అలా చూడ్డానికి మనసొప్పటంలేదు - వెనక్కితిరిగి వెళ్ళిపోతే!! తను వచ్చిందే గాయత్రి ని చూడ్డంకోసం - రామం గబగబా నడిచాడు.
   
    మేష్టారి పెద్ద కూతురు ఇల్లది - చాలా ఆధునికంగా బాగా కట్టినట్టు తెలుస్తోంది చూడగానే రామం మెట్లమీద ఒక్క నిముషం నిలబడి, కాలింగ్ బెల్ నొక్కాడు.
   
    పనిపిల్ల తలుపు తీసింది 'గాయత్రి లేదా' అన్నాడు వెంటనే గాయత్రి గారు విశాఖపట్నం వెళ్ళారండి - రేపు వస్తారు' అంది పనిపిల్ల.
   
    'మేష్టారున్నారా'
   
    'ఆ - కూచోండి'-
   
    రామం సోఫాలోకూచుని గోడలకేసి చూస్తున్నాడు. కృష్ణమూర్తి మాష్టారు కళ్ళజోడు సరిచేసుకుంటూ వచ్చారు.
   
    'బావున్నారా మేష్టారూ'
   
    'ఆ ఏమిటి విశేషాలు - ఈ మధ్య ఇటురాలేదనుకుంటాను' అన్నారు. 'అవునండి - ఏమిటో కుదరలేదు - అమ్మకి కాస్త పనులలో సాయం చేద్దామని పదిహేనురోజులు సెలవుపెట్టి వచ్చాను 'రామం అటు ఇటు చూస్తున్నాడు. ఐదునిముషాలు నిశ్శబ్దం - భరించరానంత నిశ్శబ్దం.
       
    "విన్నవా గాయత్రి విషయం - దురదృష్టం" - మేష్టారిగొంతు సవరించుకున్నారు.
   
    'ఆ - అదే చాలా బాధగా వుంది - పాపం చిన్నవయసులో"-
   
    "భగవంతుడు దానివిధి అలా రాసాడు - మా నాయనమ్మ చెప్పేది పిల్లల్నికంటాంగాని, వాళ్ళ రాతల్ని కంటామా అని అలాగ" - మేష్టారు ఇక మాట్లాడలేదు.
   
    'మళ్ళీ పెళ్ళి గురించి ఆలోచించటం లేదా మేష్టారూ' నెమ్మదిగా అన్నాడు రామం.
   
    'పెళ్ళి - ఆలోచిస్తున్నాను - కానీ పేచీ ఎక్కడంటే పిల్లాడితోనే - పిల్లాడిని మా దగ్గరుంచుకుంటే దాన్ని పెళ్ళి చేసుకుందుకు ఒకతను ఇష్టపడ్డాడు - కానీ ఇది అందుకు ఒప్పుకోటంలేదు - అంతేకాకుండా తల్లి బిడ్డల్ని వేరు చేసే పాపం నాకెందుకని నేను అంగీకరించలేదు - జరగనీ - నేను బతికున్నంతకాలం దానికి ఏలోటూ రానీయను - తర్వాత దాని అదృష్టం ఎలా జరగాలో" - రామం వైపు చూసారు మేష్టారు. రామం తలొంచుకుని ఏదో ఆలోచనలో పడ్డాడు.
   
    'నాలుగు రోజులు కొంత మార్పుగా వుంటుందని మా అమ్మాయి రమ్మంటే విశాఖపట్నం వెళ్ళింది - రేపు వచ్చేస్తుంది. అదీ పిల్లాడూ ఇంట్లోలేకపోతే నాకే తోచటం లేదు - వాడు, ఆ పసివాడు మహా అల్లరిచేస్తూ ఇంట్లో తిరుగుతుంటే మాకు కాలక్షేపం" - అంతలో లోపలనుంచి కాఫీ తెచ్చింది పనిపిల్ల. రామం, మేష్టారు కాఫీ తాగారు.
   
    'వస్తాను మేష్టారు - రేపు వస్తాను' రామం మేష్టారి దగ్గర సెలవు తీసుకుని బయలుదేరాడు. నడుస్తున్నాడు. రంగురంగుల ఆలోచనలు 'నీకూ నీవారు లేరు నాకూ నావారు లేరు - ఛల్ మోహనరంగా కూనిరాగం గుండెగొంతులో కొట్లాడింది. గాయత్రి అలానే వుందో - లావయిందో - చిక్కిపోయిందో - ఇక ఆ పసివాడే లోకమని మాతృత్వంలో మునిగిపోయిందో - చూస్తాడుగారేపు.
   
    ఆ రాత్రి అంతా నిద్ర పట్టలేదు రామానికి గాయత్రి అలా వంటరిగా జీవించటానికి వీల్లేదు. తను ఏదైనా సహాయం చేయాలి. పేపరులోవేసి వితంతువు, ఒక పిల్లాడున్నాడు, వయసు ఇరవై ఆరు అనివేసి, భార్య పోయినవారయినా, విడాకులు పొందినవారయినా కావాలని వేస్తే ఎలా వుంటుందీ? - కానీ ఇలాంటి ప్రకటనలకి, బాక్సు నెంబరిచ్చినా మేష్టారు ఒప్పుకోవద్దూ....ముక్కుమొఖం తెలియని వాళ్ళు వచ్చి చేసుకుంటామని అమ్మాయిని మరే విధంగానైనా వేధిస్తే - ఇది కుదరదు - ఈ గాయత్రిని ఏదైనా ఉద్యోగంలో పెడితే -ఏం చెస్తుందీ, పదోతరగతి కూడా పాసు కాలేదు.
   
    గాయత్రికి యిల్లు దిద్దుకోటం వస్తుందికాని ఉద్యోగం చేసుకోటం వస్తుందనుకోను - మరి ఈ సమస్యకు పరిష్కారమేమిటి - మేష్టారు చెప్పినట్టు ఆయన బతికున్నంతవరకు సరేఫరవాలేదు - తరువాత? రామం అటు ఇటు ఒత్తిడిల్లాడుతెల తెల వారుతోంది. అప్పుడే యశోదమ్మ లేవటం, కాఫీ కాచటం, స్నానం చేసి పూజ చేసుకోటం కూడా అయిపోయింది. ఇప్పుడే లేచి ఏం చేయాలి అనుకుంటూ కళ్ళు మూసుకుని పడుకున్నాడు రామం.
       
    ఈ సమస్యకి తను పరిష్కారం చూపిస్తే ఏం - మంచం మీద నుంచి లేచి కూచున్నాడు. కిటికీలోంచి బయటకి చూసాడు. అప్పుడే సూర్యోదయమవుతోంది. మామిడి చెట్టుపైన రకరకాల పక్షులు రామం అలా కిటికీ దగ్గర నిలబడి చాల సేపు బయటకి చూసాడు. పాలు పోయటానికొచ్చింది రంగమ్మ దాంతో నాలుగేళ్ళ పిల్లాడొకడు, చంకలో ఏడాది పిల్ల - మనుమలు !! - రంగమ్మకున్న భాగ్యం అమ్మకి లేక పోయిందే! - శారద మీద ఒక్కసారిగా అసహ్యమేసింది రామానికి - ఈ మధ్య రామం శారద ఆలోచనలు మనసులో రానీయటం లేదు. కొందరాడవాళ్ళు ఆడవాళ్ళుకారు. ఏదో పొరబాటున ఆడవాళ్ళుగా పుడతారు - అంటే, ఆడతనపు వైభోగం వాళ్ళు కాలరాసుకుంటారు - శారదా అంతే, లేకపోతే తనకి ఈనాటికి ఆడపిల్ల, బంగారు తల్లి, కన్నతల్లి, చిట్టితల్లి వుండేదికాదు !! - శారదా, నీ ఖర్మనీది - నేను మళ్ళీ పెళ్ళిచేసుకుంటా - పిల్లల్ని కంటా - నా సంసారం పచ్చగా పిల్లాపాపలతో కలకల్లాడుతూ వుండాల్సింది - నీ ఒక్కదాని వలన నా బతుకంతా నాశనం చేసుకుంటానా - ఈకేసు త్వరగా పూర్తి అయిపోతే, - అయిపోతే వెంటనే పెళ్ళి చేసుకుంటాను - ఎవరినీ - అంతరాత్మవెంటనే ప్రశ్నించింది. లలితనా, కాదు గాయత్రి. ఔను రామం ఒక్కసారి పైకి నవ్వేశాడు తన మనసు బయట పడిపోయినందుకు ఇవన్నీ తన వెర్రి వెర్రి ఆలోచనలు - గాయత్రి ఇష్టపడుతుందా - కృష్ణమూర్తిగారి ఉద్దేశం అమ్మాయికి తిరిగి పెళ్ళి చేయాలని - కానీ గాయత్రి ఉద్దేశం తెలుసుకొన్నారోలేదో!-


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS