"ఆ మూడు ముళ్ళు పడలేదుగా? సమయం ఎలా మించిపోయిందంటున్నావు?"
"అవతల పిల్లని పెళ్ళిపీటల మీదికి తీసుకుపోవడానికి వస్తున్నారు. ఇప్పుడు నువ్వేం చేయగలవురా?"
"ఈ పెళ్ళి ఆపుచేసి సంధ్యని మనతో తీసికెళ్ళిపోదాం."
"తీసికెళ్ళి ఏం చేయాలని?"
"అదేమిటమ్మా? మనం ఏం చేయలేకపోవడం ఏమిటి? ఇంతకంటే మంచి జీవితమే ఇవ్వగలం గాని, చెడుని ఇవ్వంగా?"
సంధ్య రెండు ప్లేట్లలో కజ్జికాయలూ, మురుకులూ, లడ్లూ తీసుకువచ్చింది. మళ్ళీ వెళ్ళి మంచినీళ్ళు తెచ్చింది. "తీసుకో అత్తా! అరుణ్, కూర్చో."
"ఈ మర్యాదలకేం గాని, నా ప్రశ్నకు జవాబు చెప్పావుకాదు." అన్నాడు అరుణ్, టిఫిన్ తీసుకొనే ప్రయత్నం చేయకుండా.
"నాకీ పెళ్ళి ఇష్టంలేదు. నిజమే! కాని ఏ ఆధారం చూచుకొని ఈ పెళ్ళి తిరస్కరించను?"
"ఆధారం నేను చూపిస్తాను."
"ఆధారమంటే ఎలాంటి ఆధారం?"
"నీ కాళ్ళమీద మువ్వు బ్రతకగల ఆధారం."
"నా కాళ్ళ మీద నేను బ్రతికితే అయిపోతుందా జీవితం? ఇక్కడ బ్రతకలేనా నా కాళ్ళమీద నేను? ఏ పొలంపనికి వెళ్ళినా మూడో నాలుగో రూపాయలు తెచ్చుకోగలను. శేరో రెండు శేర్లో గింజలు తెచ్చుకోగలను. ఈ ఒక్క పొట్టకు తిండి సంపాదించుకోవడం కష్టమైన పనికాదు. ఆడపిల్లకు తిండికంటే బట్టకంటే ముఖ్యంగా కావలసింది రక్షణ. అది మీరివ్వగలరంటే నేను మీతో వస్తాను, ఈ పెళ్ళి నాకక్కరలేదని చెప్పేసి."
"ఒక ఆడపిల్లకు రక్షణ కల్పించలేకపోతే నేనేం మగాడిని?" ఆమె మాటను సవాల్ గా తీసుకొన్నట్టుగా దర్పంగా అన్నాడు అరుణ్. "నీ దృష్టిలో ఆధారమంటే మగడనే అర్ధమె ఉంటే నీకు తగిన వరుణ్ణి వెదికి పెళ్ళి చేస్తాను. సరేనా?"
"ఎంతో సహృదయతతో నువ్వందిస్తానన్న సహాయం అందుకోకపోవడం తెలివి తక్కువే అనిపిస్తూంది. కాని, పాపం నర్సమ్మత్త! ఎన్నో ఆశలు నామీద పెట్టుకొంది. పీటలమీది పెళ్ళి నా చేజేతులా చెడగొట్టుకుపోతే నర్సమ్మత్తేకాదు, భగవంతుడు కూడా నన్ను క్షమించడనుకొంటాను."
"ఓ ఏడాదో రెండేళ్ళో సాకిన నర్సమ్మకోసం నిండు నూరేళ్ల జీవితం బలిపెట్టుకొంటావా? ఏది సరైనదో నువ్వే ఆలోచించుకో! ఆ మృగాన్ని చూడడానికి మాకే ఇంత కంపరంగా ఉందే? భర్తగా నువ్వెలా భరిస్తావు? ఎలా భరించగలననుకొన్నావు?"
"కళ్ళు మూసేసుకొని." అంటూ నవ్వింది సంధ్య. "నన్నేం చేయమంటావో నువ్వు చెప్పు, అత్తా! ఎవరూ దిక్కులేని స్థితిలో, ఏ వెలుగూ కనిపించని స్థితిలో కళ్ళు మూసేసుకొని అతడితో కాపురంచేస్తే పోతుందిలే అని మనసు రాయి చేసుకొన్నాను. కాని, నా చిన్ననాటి స్నేహితుడు ఇవాళ ఇంతవాడై హఠాత్తుగా నా ముందు నిలిచాడు ఒక వెలుగు రేఖలా! ఈ రేఖని ఆధారం చేసుకొని ఈ చీకటి బ్రతుకునుండి పారిపోదామన్న స్వార్థం నన్ను పట్టుకొంది. ఇది మంచిదా? చెడ్డదా?"
జానకమ్మ మనసులో ఏ కపటం లేకుండా మనస్ఫూర్తిగా అంది. "అటుచూస్తే మృగం లాంటి మనిషితో పెళ్ళి. ఇటుచూస్తే పీటలమీది పెళ్ళి కాలదన్నుకోవడం. నేను ఎటూ చెప్పలేకుండా ఉన్నాను, సంధ్యా."
"అత్తా! నువ్వు అత్తకాదు, అమ్మే అనుకొంటాను. మా అమ్మే ఈ సమయంలో ఉంటే ఏ సలహా ఇచ్చేదో, నువ్వూ అదే సలహా ఇవ్వు అత్తా, ఒక అమ్మ మనసుతో - అత్త మనసుతోకాదు. చిన్నప్పుడు అమ్మ కోపంవచ్చి కొడితే నువ్వొచ్చి అమ్మని త్రోసేసి నన్ను గుండెలో చేర్చుకొని ఓదార్చే అప్పటి మనసుతో సలహా ఇవ్వు, అత్తా!"
సంధ్య తెలివిగా, మెత్తమెత్తగా తనకు సంకెళ్ళు వేస్తున్నట్టుగా అనిపించింది జానకమ్మకు. సంధ్య తల్లే ఇక్కడ ప్రత్యక్షమైతే ఏ సలహా ఇస్తుంది? ఆ మృగాన్ని కట్టుకొని కాపురం చేయమని ఏ తల్లీ సలహా ఇవ్వదు కదా?
"సరే, సంధ్యా. ఈ పెళ్ళి తప్పించి నిన్ను తీసుకువెళ్ళడానికి అరుణ్ కు తోడుగా నేనూ నిలబడతాను. కాని, నీ జీవితంలో ఈ క్షణం నుండి ఏం ప్రాప్తిస్తుందో ఖచ్చితంగా హామీ ఇవ్వలేను! గొప్ప ఆశలు కల్పించలేను. ఇక రావడం రాకపోవడం నువ్వు ఆలోచించుకో!" అని చెప్పింది జానకమ్మ.
"గొప్ప ఆశలు నాకేం లేవు! ఇప్పుడు కలుగనూ లేదు. నేను కోరుకొనేది మామూలు ఆడపిల్లకోరుకొనే....."
