ఆవిడ పాపం, ఏం చెయ్యగలదు? మనిషి తినవలసిన ఆహారప్రమాణా లావిడకి తెలియవు. ఆమాటకువస్తే ఇవాళ_ ఇది జరిగిన మూడు పుష్కరాల అనంతరం _ చదువుకున్న వాళ్ళలో ఆహారశాస్రం తాలుకూ ప్రాధమిక విషయాలు తెలిసినవాళ్ళెంతమంది. ఉన్నారు? ఈ యీ కూరలు తినాలని సీతమ్మ గారికి ఒక వేళ తెలిసినా ఏమీ ప్రయోజనంలేదు. ఎందుకంటే ఒక్కోరుతువులో ఒక్కోకూర మండిపోతుంది. ఏకాలం ఏది చౌకగా దొరికితే ఆ కాలంలో ఆ కూర కొనవలసిందే, అసలు కూరలు కొనటమంటేనే ఆవిడకు భయమైపోయిందాయె. అందుచేత ఈ డబ్బులు తప్పేదారి లేదు.
సీతమ్మగారు పసంతా పూర్తిచేసుకుని దీపం తగ్గించి సుందరం మంచం పక్కనే పిల్లను పెట్టుకుని పడు కోవటానికి వచ్చింది. ఆవిడ నడుము వాల్చబోతూ సుందరానికేసి చూసేటప్పటికి వాడు, ఎప్పుడు నిద్రలేచాడో, కళ్ళు పెద్దవి చేసుకుని ఇంటి కప్పుకేసి చూస్తున్నాడు.
"లేచావుట్రా?" అన్నది తల్లి.
సుందరం తల పక్కకుతిప్పి "నాకు జరం పోయింది. నేను పరీక్షకు వెళ్ళాలి" అన్నాడు.
సీతమ్మగుండె గుబుక్కుమన్నది. మొహంమీద చెయ్యివేస్తె కాలిపోతున్నది. పిల్లాడికి సందించిందేమో అనుకుని గాభరాపడింది.
"జ్వరం ఉంది, నాన్నా! అర్దరాత్రిపూట పరీక్షేమిట్రా?" అన్న దావిడ.
"అమ్మా, నేనూ__ పరీక్షకి పోకపోతే__ తప్పిపోనూ?" అన్నాడు సుందరం.
"ఏం తప్పవులే . ఇవి అసలు పరీక్షలు కాపుగా?"
మళ్ళీ కాస్సేపుండి, అమ్మా, జ్వరంతో పరీక్షకు పోగూడదా?" అన్నాడు.
"జ్వరంతో పడుకున్నవాడిని ఎట్లా పోతావురా? ఎట్లాకూచుని రాస్తావు?"
"రేపు జ్వరంపోదూ?"
"పోతుందిలే. జ్వరంపోతే నువ్వు చక్కగా పరీక్షకు పోదువుగాని."
సుందరం మళ్ళీ కళ్ళుమూసుకున్నాడు. వాడు వొళ్ళు తెలిసే మాట్లాడుతున్నాడని సీతమ్మగారు తృప్తిపడింది.
కాని ఆ జ్వరం మూడు లంఖణాలతో గాని నయంకాలేదు. పరీక్షకు పోలేనందుకు సుందరం ఏడిచి రాగాలుపెట్టాడు. వెయ్యి చెప్పినా వినకుండా మంచంలోనుంచి లేచి బడికి బయల్దేరటానికి ప్రయత్నించాడు. ఆఖరుకు ఆదినారాయణగారువచ్చి, "అబ్బాయి, నువ్వు పరీక్షకు పోకపోయినాపాసవుతావని మీ మేష్టరు చెప్పాడు" అని ధైర్యం చెబితేగాని సుందరం పడుకోలేదు.
వాడి జ్వరం జారినరోజునే శీతాకాలపు శలవలు ఆరంభమైనాయి.
౧౧
చిన్నపిల్లలు స్వతస్సిద్దంగా వేదాంతులు. ఎట్టి సిద్దాంతాలూ ఎరగని నిర్లిప్తమైన మనస్సులతో, వాళ్ళు జీవితంలోని మంచి చెడ్డలనూ, కష్టసుఖాలనూ తమ అనుభవంగా చేసుకుంటారు. కనుకనే వాళ్ళకు జీవితంనుంచి పెద్దవాళ్ళు పొందలేని ఆనందం లభిస్తుంది.
సుందరం మనస్సు రోజురోజుకూ కొత్తవికాసం పొందుతున్నది. జీవితంలో రోజూ కనిపించేవాటిలోనే కొత్త ఆనందం కనిపించటంకాక, కొత్త అనుభవాలుకూడా ఎన్నో కలిగేవి. రోజూ బడికిపోవటం, పీరియడ్లు జరగటం, మేష్టర్లు మారటం, పాఠాలు జరగటం, సాయింత్రంపూట ప్లే గ్రౌండ్ లో ఆటలూ, స్నేహితులిళ్ళకు వెళ్లటం, కొత్తకుర్రాళ్ళతో స్నేహితాలు చేసుకోవటం, ఇంటికి రావటం, తల్లివెంట ఉండి ఆవిడచేసే ఇంటిపనులన్నీ చూడటం, ఆవిడ పాడుకునే పాటలు వినటం మొదలైనవి నిత్యకర్మ. ఇవిగాక కొన్ని అపూర్వమైన సంఘటనలు కూడా ఉండేవి.
సుందరం నాలుగో క్లాసులోకి ప్రవేశించిన ఏడు 'మహమ్మారి' వచ్చింది. జనం హడలిపోయినారు. జాతర్లూ, కొలుపులూ చేశారు. మారెమ్మనుగురించి తన తల్లితో అమ్మలక్కలు చెప్పుకునే భయంకరమైన విషయాలు సుందరం విన్నాడు. ఎవరి కన్నా మశూచికంపోసి చావటానికి సిద్దంగాఉంటే మారెమ్మకల్లో కనిపిస్తుందట! ఏదో తింటున్నట్టు దవడలు ఆడిస్తుందట. లేదా ఫలానివాళ్ళని తినేస్తున్నానని చెబుతుందిట. ఈ కధలన్నీ విన్నమీదట సుందరానికి మారెమ్మకల్లో కనిపిస్తుందేమోనన్న భయంకొద్దీ చాలారోజులు నిద్రకూడా పట్టేదికాదు.
ఆయేడే యుద్ధం అయిపోయింది. యుద్ధం అయిపోయిన సంగతి సుందరానికి విచిత్రంగా తెలిసింది. ఉదయానే వాడు వీధి వాకిట్లోకివచ్చి నిలబడి ఉండగా అతని సహాధ్యాయి నాగేశ్వర్ర్రావు తన తండ్రివెంట వీధినపోతూ సుందరాన్ని చూసి ఆగాడు.
"అరే, సుందరం ఇవాళ బడిలేదు. శలవు!" అన్నాడు నాగేశ్వరరావు,
"ఏం?" అన్నాడు సుందరం.
"నీకు తెలీదా? యుద్దంలో మనవాళ్ళు గెలిచారు. జర్మనీవాళ్ళు ఓడి పోయినారు."
"నిజంగా శలవేనా ?" అన్నాడు సుందరం. నాగేశ్వర్రావు మాట నమ్మి బడికిపోకుండా మానేసి పాఠాలు పోగొట్టుకోవటం ఇష్టంలేక.
"అబద్దం చెబుతానుట్రా? నువుకూడా రా. తాలూకాఫీసుకు పోదాం. రాజూరాణీ పటాలుపెట్టి ఊరేగుతారు. మా నాన్న తాలూకాఫీసులో పని చేస్తాడు గదూ? అక్కడికే పోతున్నాం."
"ఉండు వస్తా. మా అమ్మతో చెప్పనీ" అంటూ సుందరం లోపలకి పరిగెత్తి "అమ్మా, అమ్మా! మనవాళ్ళు యుద్దంలో గెలిచారు. నే నిప్పుడే వస్తా" అంటూ వచ్చి నాగేశ్వరరావును కలుసుకున్నాడు. ఈలోగా నాగేశ్వార్రావు తండ్రి చాలాదూరం వెళ్ళిపోయినాడు.
