వాళ్ళతో వచ్చిన బాబీ ముందు రూంలో పడుకున్నాడు.
"ఏమిటి నిర్లిప్తా! ఆలోచిస్తున్నావ్?" అన్నాడు నిఖిల్ ఆమెవేపు తిరిగి ఆమె అధరాల్ని చూపుడు వ్రేలితో స్పృశిస్తూ.
ఆమె నెమ్మదిగా ఒక వంపు తిరిగి- నిఖిల్ జుత్తులోనికి తన రెండు చేతులు పోనిచ్చి, గుండె వద్దకు చేర్చుకుంది.
నిఖిల్ కు ఆమె ప్రవర్తనల్లో మరింత ఇష్టపడేది అదొక్కటి. ప్రొద్దటినించీ సాయంత్రం వరకూ ఒక్క పొద్దుతా, మడితా, శుచీ శుభ్రతతా పూజలు పునస్కారాలంటూ దగ్గరికి రానివ్వని వ్యక్తి__రాత్రి కాగానే చేసే అల్లరి. తృప్తిగా నవ్వుకున్నాడు. ఏ భర్తయినా ఇంకేం కోరుకుంటాడు.
అతని వేళ్ళు నిర్లిప్త శరీరాన్ని ఎక్కడెక్కడో తడుముతున్నాయి.
"ఏమండీ!"
ఆమె గుండెల మధ్య తలదూర్చిన అతనికది విన్పించి తలెత్తి కళ్ళల్లోకి చూశాడు.
"సుగాత్రి వాళ్లకు బాబు పుట్టబోతున్నాడట!" అంది అతన్ని మళ్ళీ గుండెలపై ఆన్చుతూ.
"సుగాత్రి చెప్పిందా?"
"అవును! ఆమెకూ వాళ్ళ శరత్ చెప్పాడట, అసలు విషయమేదో చెప్పలేదు కాని, మొత్తానికి ఎలాగో వాళ్ళింటికి ఒక ముద్దుల బాబు రాబోతున్నాడు." ఆమె మాటల్లో అయ్యో! మనకే లేకుండా పోయారు అన్న బాధ ధ్వనిస్తోంది.
నిఖిల్ ఆమె చుబుకం మీద ముద్దుపెట్టి మవునంగా వుండిపోయాడు.
ఇన్నాళ్ళూ రెండు కుటుంబాలలో ఎవరికీ పిల్లలేక_ఆ బాధను ఒకరినొకరు అర్ధం చేసుకొని ప్రవర్తించారు. పిల్లలు లేకున్నా పిల్లలై ప్రవర్తించి దాంపత్యాలని సమంగా పంచుకున్నారు. కాని ఇప్పుడు సుగాత్రి వాళ్ళింట్లోకి పిల్లాడు వస్తే! నిర్లిప్త ఇంకా మానసికంగా కుమిలిపోతుంది.
ఈర్ష్యతో, కుళ్ళుతో కాదు.
అసూయతో అంతకన్నా కాదు.
తమ దాంపత్యానికి ఒకడు లేకపోయాడని....! పిల్లవాడి పోషణలో పడి సుగాత్రి, నిర్లిప్తను ఏ కొద్దిగా అలక్ష్యం చేసినట్లు కనపడినా, మాటలు తగ్గించినా నిర్లిప్త మరింత వేదనకు గురవుతుంది. కొంతలో కొంతైనా బాబీ ఈ ఇంటికి వస్తునప్పటి నుంచి, బాబీనే ప్రేమగా తన బాబులాగే చూసుకుంటూంది. ఇప్పటికీ ఆవేదనను మరిపించడానికి, రోజు తనెన్ని జోకులేసి నవ్వించాలని ప్రయత్నించినా నవ్వలేకపోయింది. ఆ పొడి పొడి నవ్వులు తన కోసం నవ్వక తప్పటంలేదు. ఇంత అందమైన నిర్లిప్తకు పాప పుట్టినా....ప్రపంచంలోని అందాలన్నీ అరువుతెచ్చుకున్నట్టు జన్మించేదేమో?
"ఏమండీ...ఈరోజు పేపర్ చదివారా?"
"చదివాను ప్రొద్దున్నే. ఏం?"
"మగపిల్లవాన్ని కననందుకు భార్యను హత్యచేసిన భర్త గురించి చదివారా?"
"చదివాను నిర్లిప్తా. రియల్లీ పిటీ...
"మరే పిల్లల్ని కనని నన్ను మీరెందుకు ముక్కలు ముక్కలుగా..."
ఆమె మాట పూర్తి కాకుండానే అతని అధరాలతో ఆమె అధరాల్ని మూసాడు. ఆమెలో వేడి నిట్టూర్పుతో ఒక కన్నీటి చుక్క జరజరా జారిచెవి గుంటలో పడింది.
నిఖిల్ చూపించే అనురాగానికి మైనం ముద్దలా కరిగిపోయిందామె.
"ఏమండీ! మనకింకా పిల్లలు పుట్టే యోగమేలేదా?"
ఆ మాటకు ఉలిక్కిపడ్డాడు అతను. ఆమె క్షణం పాటు అతని ఉలికిపాటును గుడ్డివెలుతురులోనైనా గమనించి వుంటే అర్ధమయ్యేది. అతనిలో కూడా ఏదో లోపముందన్న వేదనని....దాస్తున్నాడన్న విషయాన్ని.
కాని ఆమె కళ్ళు అరమోడ్పులు చేసి ఆర్తిగా, ఆప్యాయతగా తన గుండె చప్పుళ్ళు విన్పించేంతటి గాఢంగా హత్తుకుంటూంది.
"ఏమండీ! డి, అండ్ సి అంటే ఏమిటి?" అడిగింది.
అవునూ! ఇంతకుముందు తనూ ఎక్కడో చదివాడు. పెళ్ళయిన రెండేళ్ళ తర్వాత పిల్లలు కలగరని తెలిసి, పిల్లలు కలుగుతున్నారన్న ఆశతో పుస్తకాలు.... డాక్టర్లు... దేవుళ్ళు... బాబాలు...ఎక్కడ చదివాడు? డి అండ్ సి మెథడ్ గురించి.
మొత్తానికి ఏదో పుస్తకంలో....ఏమిటది?
చాలా ఖర్చుతో కూడిందే ఏమై వుంటుందది??
అతనికి ఆ పద్దతేదో లీలగా గుర్తొచ్చింది. అదే చెప్పాలని ప్రయత్నించాడు. గుర్తుచేసుకుంటున్నట్టుగా.
"భర్తలో వీర్యకణాలు అత్యధిక శాతంలో ప్రోడక్ట్ అయివుండాలి శుక్రకణాలతో జరిగే ప్రక్రియ...??? .... ఎలాంటి ఎలిజిబుల్ కపుల్స్ వయసైనా నలభైకి మించకుండా...??.... రెండు వైపులా ట్యూబ్స్ బ్లాక్ అయి ఏదయినా ఒకవైపు, ఒవరీ సరిగ్గా పనిచేయాలి. వేల ఖర్చు....మద్రాసు లోనే....???
నిఖిల్ కు గుర్తొచ్చిందల్లా చెప్పాడు. అసంపూర్తిగా....అస్పష్టంగా....
"మన దగ్గరున్న డబ్బంతా దారాదత్తం పోసైనా..." ఆమె గొణుగుతోంది.
"అంతటి తాహతు మనకు లేదు నిర్లిప్తా వేలకు వేలు ఖర్చయ్యే పద్దతి. డబ్బున్న వాళ్ళకే అనువైన పద్దతి. లక్షాధికార్లు వేలు పెట్టగలరు. కాని మనం వేలాధికార్లం కూడా కాదు. వందలతో ఏది సాధించగలం?" భార్య మనసు కష్టపెట్టటం ఇష్టంలేకపోయినా, అసలు విషయం చెప్పాడు అతను. ఆమె కళ్ళలో ఆవిర్లు తిరుగుతుంటే....అతన్ని మరింత పెనవేసుకుంది.
"డాక్టర్లనూ, ఫీజులూ, దేవుళ్ళకు నైవేద్యాలు పెట్టిపెట్టి అలసిపోయాం. మన దురదృష్టం తప్ప మన తప్పేముంది చెప్పు" అనునయంగా అన్నాడు అతను.
కొరడాతో చెల్లున కొట్టినట్లయింది ఆమెకు. పశ్చాత్తాపపడుతూ 'తప్పంతా నాలోనే వుంది. ఆ తప్పునే ఇన్నాళ్ళుగా దాచి పెడుతున్నాను. లోపం అంతా నాలోనే ఉంది. ఆ లోపాన్నే పూజల్తో మభ్యపెట్టి మిమ్మల్ని మోసపుచ్చుతున్నాను. నాకు పిల్లలు పుట్టరని తెలిసీ, మిమ్మల్ని ప్రశ్నలతో వేధించి నన్ను నేను కాపాడుకుంటున్నాను. నన్ను క్షమించు ప్రియతమా. నా గుండెల్లోని అనురాగాన్ని చూస్తున్నావ్ గాని...కడుపులోని మాతృప్రేగుకు పడ్డ ముడులను నువ్వు చూడటం లేదు. నువ్వు చూడకూడదు కూడా.
