Previous Page Next Page 
అందరూ దొంగలే పేజి 27

    కమీషనర్ లింగారావ్ రాంబాబు, చిన్నారావ్ లని పరామర్శించి వెళ్ళిపోయాడు. హాస్పిటల్  దగ్గర  టైట్  సెక్యూరిటీ ఏర్పాటు  చేయమని మిగతా అధికారులకు ఫోన్ లో ఆదేశాలు  జారీచేశాడు.


                                   *    *    *    *


    "ఆ...."

    బాధతో పెట్టిన  ఆ కేకతో  గజదొంగ  మంగులు డెన్ దద్దరిల్లిపోయింది.

    గజదొంగ మంగులు ఎవరినో టార్చర్  చేస్తుంటే  వాళ్ళు బాధతో అలా కేక పెట్టారనుకుంటే  అది  పొరబాటే!

    ఆ కేక  పెట్టింది  ఎవరోకాదు!

    స్వయంగా గజదొంగ మంగులే!

    ఇక డెన్ లో సీన్ కొస్తే....

    అప్పుడే అరడజను  మండే కొవ్వొత్తుల్ని  ఆర్పిన మంగులు చేయ్యికాలి, పిచ్చిగంతులు వేస్తూ చెయ్యి వూదుకోసాగాడు.

    "బాస్! ఈవేళ చెయ్యి  ఎందుకు  కాల్చుకున్నాడు?" అప్పుడే లోపలికి ఎంటర్  అయిన ఓ దొంగ  అడిగాడు.

    "ఎందుకంటే ఏం చెప్తాం-మాయదారి రోగం. న్యూస్ పేపర్లో రాంబాబు, చిన్నారావ్ లు  హాస్పిటల్ లో  కోలుకుంటుండగా  మనం ఎటాక్ చేసి వాళ్ళ బుర్రలు  బద్దలుకొట్టినట్టు రాశారు. ఈ విషయం రాంబాబు, చిన్నారావ్ లే పేపర్ వాళ్ళతో చెప్పారు...." సమాధానం చెప్పాడు మరో దొంగ.

    "అదేంటి? మనవాళ్ళకి  ఆ నర్సింగ్ హోమ్  వాళ్ళు  ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసి పంపించాక  మళ్ళీ బాస్ ఎవరికీ వాళ్ళని చంపే డ్యూటీ వెయ్యలేదు కదా!" అడిగాడు మొదటి దొంగ.

    "చూశావా! అందుకే మన బాస్ కి  కోపం వచ్చింది. ఎవరో ఎటాక్ చేస్తే ఆ రాంబాబు, చిన్నారావ్ లు మనమీద  తోసేస్తున్నారు. అందుకే వాళ్ళని చంపుతానని  ఇప్పుడు  కొవ్వొత్తులు  ఆర్పి  శపధం  చేసింది...." చెప్పాడు రెండో  దొంగ.

    "అనవసరంగా  చేతులు కాల్చుకోడం  కాకపోతే వాళ్ళని  చంపుతానని ఇదివరకే  చాలాసార్లు  శపధం చేశాడుకదా! మళ్ళీ ఇప్పుడు ప్రత్యేకంగా  చెయ్యడం ఎందుకూ?" అడిగాడు మొదటి దొంగ.

    రెండో దొంగ బుర్రకాయ్  పట్టుకున్నాడు.

    "అబ్బ....నువ్వు  నా మెదడు తినేస్తున్నావ్   కదరానాయనా...." అన్నాడు.

    డెన్  మధ్యలో  మంగులు  కాలిన చెయ్యి  ఊదుకుంటూ  ఇంకా చిందులు వేస్తూనే  వున్నాడు.

    మొదటి దొంగకి మరో సందేహం వచ్చింది.

    "అవునుగానీ....మనం ఎటాక్  చెయ్యకపోయినా, వాళ్ళు మనమే చేశామని న్యూస్ పేపర్  వాళ్ళకి  చెప్పారంటే మనకే మంచిదికదా....!" బుర్ర గోక్కుంటూ అడిగాడు మొదటి దొంగ.

    మొదటి దొంగ ప్రశ్న  అప్పుడే గెంతడం  ఆపిన మంగులు చెవిన పడింది.

    "ఏం....ఎందుకు మంచిది?" కౄరంగా  చూస్తూ వాడిని అడిగాడు.

    "ఎందుకేంటి బాస్! అది మనకి ఫ్రీ  పబ్లిసిటీ కాదా?" సంబరంగా అన్నాడు మొదటి దొంగ.

    గజదొంగ మంగులుకి తిక్కరేగి వాడి టెంకి మీద జెల్ల కాయ్ ఫాట్ మని కొట్టాడు.

    ఆ దెబ్బకి  వాడు నేలమీద  బోర్లా పడిపోయాడు.

    "ఫ్రీ  పబ్లిసిటీ  ఏంట్రా  తింగరి నాయాలా! అది మన చేతకానితనాన్ని చూపిస్తుంది. మనం ఎటాక్  చేసినవాళ్ళు బతికున్నారంటే అది మన ముఠాకి  ఎంత నామోషీ! ఈ ముఠా  నాయకుడిగా  నాకెంత అప్రదిష్ట?" హుంకరిస్తూ అన్నాడు గజదొంగ మంగులు.

    అంతలోనే  తనకి  చెయ్యి కాలిన  విషయం గుర్తొచ్చి "వామ్మో....ఉఫ్ ష్....ఓర్నాయనో.... ఉఫ్....ఉఫ్...." గోలెడ్తూ  చెయ్యి  వూదుకోసాగాడు.



                                  *    *    *    *


    పోలీస్  స్టేషన్ లో ఫోన్ మోగింది. ఇన్స్ పెక్టర్ అప్పారావు తను చదువుతున్న డిటెక్టివ్ నవల  విసుగ్గా ప్రక్కనపెట్టి రిసీవర్  తీశాడు.

    "ఒరేయ్....ఎవడ్రా  నేను డిటెక్టివ్  నవల చదువుతుంటే  డిస్టర్బ్ చేసిందీ?" అంటూ అరిచాడు అప్పారావు.

    "నేనే....పోలీస్ కమీషనర్ ని" అంది అవతలి గొంతు.

    ఇన్స్ పెక్టర్  అప్పారావు  వెంటనే కంగారుగా లేచినిలబడి  సెల్యూట్ కొట్టాడు.

    "సారీ సర్....ఎవడో  బేకార్  నాయాలు  ఫోన్ చేశాడేమో అనుకున్నాను."

    "ఊ....అయితే డ్యూటీ  టైంలో డిటెక్టివ్  నవలలు చదువుతున్నావన్నమాట" అడిగాడు కమీషనర్ లింగారావ్.

    "అంటే ఆ పుస్తకాలు  చదివితే  నా పెర్ ఫార్మెన్స్  ఇంప్రూవ్ చేస్కోవచ్చనీ, ఆ పుస్తకాల్లోని  డిటెక్టివ్ ల మాదిరి నేనుకూడా నేర  పరిశోధన  చెయ్యచ్చనీ...." అంటూ గొణిగాడు.

    "ఊ....సరే....సరే....నువ్వు వెంటనే  ఓసారి  రాంబాబు, చిన్నారావ్ లు వున్న నర్సింగ్ హోమ్ కి వెళ్ళి, అక్కడ వాళ్ళకి  సెక్యూరిటీ ఎలా వుందో  సూపర్ వైజ్  చెయ్యి."

    "అలాగే సార్!" అంటూ సెల్యూట్ కొట్టాడు ఇన్స్ పెక్టర్  అప్పారావ్.



                                                                          *    *    *    *


    జీపు డిప్పల్లో నర్సింగ్ హోం  ముందు ఆగింది. అందులోంచి ఇన్స్ పెక్టర్  అప్పారావు దిగాడు.

    అప్పారావు  యూనిఫాంలో  లేడు. మఫ్టీలో  వున్నాడు. బ్లాక్ ప్యాంట్ మీద స్కై బ్లూ షర్టు వేస్కున్నాడు.

    అతన్ని  చూడగానే నర్సింగ్ హోం  ముందు వున్న  కానిస్టేబుల్స్  సెల్యూట్  చేశారు.

    "సెక్యూరిటీ ఎలా వుంది?" ఇద్దర్నీ  అడిగాడు అప్పారావు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS