మాకూ ఉన్నాయ్ ఎలక్షన్స్!
రాఘవరావు ధుమధుమలాడ్తూ హాల్లో అటూ ఇటూ తిరుగుతున్నాడు.అతని భార్య మంగతాయారు,కొడుకు వీరంజనేయులూ బిక్క మొహాలు వేసుకుని ఆయన్ని చూస్తున్నారు.
"ఛీ... ఛీ... నువ్వసలు నాకు కొడుకువేనా?... నా కడుపున చెడబుట్టావురా!..."అటూ ఇటూ తిరుగుతూనే ఆవేశంగా అన్నాడు రాఘవ రావు.
వీరాంజనేయులు సిగ్గుతో చితికిపోతూ తలవొంచుకున్నాడు.మంగతాయారు గుడ్లునీరు కుక్కుకుని పవిటకొంగు నోట్లో దోపుకుంది.
"ఒక్కొక్కప్పుడు నాకు అనిపిస్తుంటుంది.వాడు నిజంగానే నాకే పుట్టాడా అని!"చిర్రుబుర్రులాడ్తూ అన్నాడు రాఘవరావు.
"హేవండీ..."బాధగా అరిచింది మంగతాయారు."మీరు నన్నే అనుమానిస్తున్నారా?... హా... భగవంతుడా... నన్ను నీలో చేర్చేస్కో తండ్రీ... వా..."
"అమ్మా... నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్లకే... నన్నుకూడా నీ వెంట తీస్కేళ్లిపోవే... అలా అని భగవంతుడికి చెప్పవే..."కళ్లనీళ్లు పెట్టుకుంటూ అన్నాడు వీరాంజనేయులు.
"మీరిద్దరూ ఇంక నోళ్లు ముయ్యండి... నాకు పిచ్చెక్కిపోతుంది..."
"వా..."తన ఏడుపు ఆపలేదు మంగతాయారు.
రాఘవరావు గబగబా వెళ్లి మంగతాయారు నోటిని అరచేత్తో నొక్కి "నిన్ను నేనేమి అనుమానించడంలేదు... సరేనా?... బుద్ధి గడ్డితిని అలా అన్నాను... ఆ సన్నాసిగాడు ముమ్మాటికి నా కొడుకే"అన్నాడు.ఆ తరువాత ఆమె నోటిమీది నుండి చెయ్యి తీసేసాడు.
"సరేగానీ వీడు ఏం తప్పు చేశాడనండీ ఇందాకట్నుండీ అలా విరుచుకు పడ్తున్నారు?"శాంతంగా అడిగింది మంగతాయారు కళ్లొత్తుకుంటూ.
"ఇందాక బజారెళ్లానా?... పని చూసుకుని ఇంటికి వీడి కాలేజీ మీదుగానే వస్తున్నాను.ఎలాగూ కాలేజీ వదిలే టైమైపోయిందికదా ఇద్దరం కలిసి ఇంటికి వచ్చేయచ్చుకదా అని కాలేజీలోకి వెళ్లి వీడి గురించి అడిగితే ఎవరూ తెలీదని అన్నారు.వీడిపేరు వింటూనే ఫక్కున నవ్వి వీరాంజనేయుళా?వీరాంజనేయులు ఇక్కడెందుకుంటాడు? రామాయణంలో ఉంటాడుగానీ... అన్నారు.అసలు వీరాంజనేయులు అనే స్టూడెంట్ ఒకడు వాళ్ల కాలేజీలో ఉన్నాడని ఒక్కడికీ తెలియదు.పోనీ లెక్చరర్లని అడుగుదాం తెలుస్తుందిలే అని ఒక లెక్చరర్ ని ఆపి అడిగాను.అతను వీరాంజనేయులా?... వాడెవడు?అన్నాడు నన్ను ఎగాదిగా చూస్తూ... నేను బిక్కమొహం వేశాను.ఇంతలో వీడే దేభ్యం మొహం వేస్కుని అటువచ్చాడు... ఇద్దరం కలసి ఇంటికి వచ్చాం..."చిరచిరలాడ్తూ చెప్పాడు.
"వీడిగురించి వాళ్లు చెప్పకపోతే వాళ్లను తిట్టాలిగానీ... పాపం వీడిని తిడ్తారేం?...అంది మంగతాయారు కొడుకు తల నిముర్తూ.
"ఊ... చూడుమారి?..." గారాలుపోతూ అన్నాడు వీరాంజనేయులు.
"తిట్టానంటే తిట్టనూ మరి?వీడంత అనామకుడిలా అక్కడున్నాడంటే అది వీడి తప్పే... నాకెంత పరపతి వుందో తెలుసుకదా?... ఈ కాలనీలో... పక్క కాలనీలో... ఆ పక్క కాలనీలో ఎవరికి నా పేరు చెప్పినా నా అడ్రసుతో సహా చెప్తారు...అలాంటి గుర్తింపువుండాలి!" అన్నాడు.
"మీ అంత వయసు వచ్చాక వాడికీ వస్తుందిలెండి గుర్తింపు..."అంది మంగతాయారు.
"ఏడిచావ్... నేను చిన్నప్పుడు కాలేజీలో చదివేప్పుడు కూడా నాకు చచ్చేంత గుర్తింపుఉండేది.కాలేజీలో స్టూడెంట్స్ ని, లెక్చరర్స్ ని, ప్రిన్సిపాల్ ని, ల్యాబ్ అసిస్టెంట్స్ ని, ప్యూన్లని ఎవర్ని అడిగినా నా గురించి చెప్పేశారు"
"అవునుమరి ఎందుకు చెప్పరూ?... కాలేజీలో మీరు అమ్మాయిల వెనకపడి రౌడీ వెధవలా పిచ్చిచేష్టలు చేసేవారటగా?... చాలాసార్లు మిమ్మల్ని లాడ్జింగుల్లో
పోలీసులు పట్టుకుని చితక్కొట్టారటగా? మరి అలాంటి పన్లుచేస్తే అందరూ ఎందుకు గుర్తుపట్టరూ?" దీర్ఘాలు తీస్తూ అంది మంగతాయారు.
"ఈ విషయాన్నీ నీకెవరు చెప్పారు?" ఆశ్చర్యపోతూ అడిగాడు రాఘవరావు.
"మీ అమ్మగారు"చెప్పింది అంది మంగతాయారు.
రాఘవరావు సిగ్గుపడ్డాడు.
"సర్లె... సర్లె... ఆ విషయాలన్నీ ఎందుగ్గానీ... నాకు గుర్తింపంటూ వుందికదా?... నాకింత పరపతీ,పేరూ వుండి వీడు అనామకుడిలా వుంటే ఏం బాగుంటుంది చెప్పు?"
"మరి నన్నేం చెయ్యమంటారూ?" అడిగాడు వీరాంజనేయులు.
రాఘవరావు కొన్ని క్షణాలుపాటు ఆలోచించి అడిగాడు."మీ కాలేజీలో స్టూడెంట్స్ యూనియన్ వుందా?"
"ఉంది..."
"దానికి ప్రెసిడెంటో,సెక్రట్రీనో కాడానికి ఎలక్షను వుంటాయిగా?"
"వుంటాయ్... ఈ సంవత్సరం ఎలక్షన్లు మరో మూడు వారాల్లో వున్నాయ్.నామినేషన్లు ఒక వారంలోగా వేయాలి!"
"ఈసారి ఎలక్షన్లలో నువ్వుకూడా నిలబడు... నువ్వూ ఏ ప్రెసిడెంటో సెక్రట్రీనో అవుతే ఆ విధంగా కాలేజీలో ఒక గుర్తింపువస్తుంది. నా ప్రిస్టేజి కాపాడిన వాడివౌతావ్..."అన్నాడు రాఘవరావు.
వీరాంజనేయులు సరేనన్నట్లు తల ఊపాడు.
రెండు రోజుల తర్వాత వీరాంజనేయులు తండ్రి ఎదురుగా నిల్చుని తల వొంచుకుని కాలి బొటనవేలుతో నేలమీద రాశాడు.
"మరేమో... నేనేమో... కాలేజీ ఎలక్షన్సులోనిల్చున్నా... సెక్రట్రీ పదవికోసం..." చెప్పాడు వీరాంజనేయులు.
ఆ మాట వింటూనే రాఘవరావు సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు."నా పేరు నిలబెడ్తున్నావురా..."అన్నాడు ఆనందభాష్పాలు రాలుస్తూ.
