Previous Page Next Page 
మమత పేజి 27

 

    'కష్టపడి సంపాదిస్తున్నారు పాపం. ఒక్కొక్కసారి ఒక్కదాన్ని పరుపు మీద పడుకుని- ఎంత రాత్రయినా నిద్రరాక - కలవరిస్తాను. పలవరిస్తాను. పరుపు మీద నీళ్ళు జల్లుకుంటాను. వళ్ళు ఆవిరి వొస్తుంది. అకాలవ గట్టు మీద పాకలో మీరూ అలాగే బాధపడుతున్నారనిపిస్తుంది. ఏమండీ నిజం చెప్పండి - మీకూఅలాగే అనిపిస్తుందా? మంచి చీర కట్టుకుంటే- మీరు చూడటానికి వీల్లేకుండా ఎక్కడో వుంటారు. తెల్లవారటం ప్రొద్దుగూకటం . మొగుడు ఎదురు గుండా లేక నా బ్రతుకు ఎలా అనిపిస్తుందో , ఎదురుగుండా ఉండి భారతి బ్రతుకూ అలానే అనిపిస్తుంది. అదేం మొగుడండీ బాబూ అర్ధరాత్రి దాకా ఆ మున్సబుగారి అరుగుల మీద చీట్లాటల్ట.  ఎప్పుడో కోడి కూసే వేళకు దొంగలా కొంపకు చేరి నిద్రపోతాట్ట. బండరాయిలా , రోజూ చెప్పుకు ఏడుస్తుంది భారతి పాపం. చీట్లాటయ్యాక తెల్లవారు జాము కూడా ఏం చేస్తాడని అడగరేం.'
    'ఏం చేస్తాడూ?'
    'మెరక దిబ్బ మీదుంది లెండి వో ఖరోడా దొమ్మరిది. కాటుక పులుము కున్నట్లు కళ్ళ చుట్టూ మచ్చలూ చుట్ట కాలుస్తుంది మన్సుబు లా. ఆ మీసాల రాణి ఖర్మ కాలి - భారతమ్మ మొగుడి ప్రియురాలు. పేరు బుజ్జిలు లెండి. పగలు చూస్తె రాత్రి  కలలోకి వస్తుంది. మున్సుబు యిలాకా అని చెప్పుకునేవారు. వాడే తగిలించి వుంటాడు వీడికి దాన్ని. వాడోనిదమోహం.'
    'సిగరేటు' అన్నాడు స్వామి దిండు క్రింద తడుముకుంటూ.
    'ఈవిద్య ఎప్పుడు మొదలు పెట్టారూ?' అంది పావని. మొగుణ్ణి తోడ పాశం పెట్టి.
    'నువ్వే మొదలు పెట్టమన్నావుగా?'
    'చంపారు పొండి. నేను సిగరెట్లు తాగామన్నానా మిమ్మల్ని?'
    ముక్కు మీద వేలేసుకుని ఔరా! అంది పావని.
    'ఎంటి ఆశ్చర్య పోతున్నావ్?'
    'భారతమ్మ ఆ బుజ్జీలు దగ్గరకు మొగుణ్ణి పంపించడం ఎంత నిజమో, నేను మిమ్మల్ని సిగరెట్టూ తాగండి అందం అంత నిజం. మీ పిండి కట్లు చేరిపించి - పిలక తీయించి, క్రాపు పెట్టించి సూటు తోడిగించేసరికే - నా తాతలు దిగొచ్చారే . నే త్రాగామంటే మటుకు మీరు సిగరెట్టూ త్రాగుతారా? నలబడ్డాయండి పెదిమలు. నా పెదిమల కంటే ఎర్రగా వుండేవి'
    'ఏమిటా మోటురసం.'
    'ఏమో'
    'ఊపిరాడటంలా'
    'ఊ'
    'అరె'
    'ప్చ్'
    'ఉండు చెప్తా'
    'అమ్మో చచ్చాను బాబోయ్'
    అరచేత్తో అడ్డుకుంది నోటిని.
    'వెనుకటికి నాది కాకపొతే తాటిపెట్టేకు - దురదేకమన్నాట్ట. ఏం చిట్టీ! నువ్వే తెలివైన దానివను కుంటున్నావా? నీమాత్రం బలం నాకు లేదనుకుంటున్నావా? నిజానికి నువ్వు నాకు గురువ్వి.
    'మాష్టారు మీరు.'
    'ఇంకా పడుకో మళ్ళీ తెల్లవారు జాముకి బయలుదేరాలి లాకులకు.'
    'నిద్ర రావడం లేదండి.'
    'ఇవాళ ఎంతదూరం ప్రయాణం చేసి వచ్చానో తెలుసా?'
    ఆవులించి అటు తిరిగి పడుకున్నాడు స్వామి.
    'ఏమండీ'
    'ఏమిటి పావనీ'
    'ఆ ముసుగేమిటండి- యిటు తిరగండి.'
    'అబ్బబ్బ'
    'ఒక చిన్న కోరికండి.'
    'ఏమిటి?'
    'తీరుస్తారా?'
    'చెప్పు?'
    'రేపు పెందరాళే రండి. ఏలూరు వెళదాం. సినిమాకి. భారతి కూయా వస్తానంది.'
    'పానకంలో పుడకలా మనమధ్య ఆవిడ గారెందుకు.'
    'పాపం! ఎంతైనా స్నేహితురాలు కదుటండి. దానికి మొగుడున్నాడన్నా మాటేగాని ఒక్క ముద్దా ముచ్చటా? తోచక పిచ్చెక్కి చస్తుంది. రానీండి వెంట. మీ సొమ్మేం పోయింది. ఏమంటారు?'
    'వెళ్తే నూజివీడు వెళ్దాం నాలుగు మైళ్ళు ఎక్కువైనా అమ్మని కూడా చూసి రావచ్చు- రేపు చూద్దాం లే.
    'చూద్దాం కాదు. మీరు రేపు మధ్యాహ్ననానికే వచ్చేయాలి మరి.'
    'అలాగే'
    'మొన్నటి దాకా భారతి నన్ను చూసి జాలి పడేది. యిప్పుడు దాన్ని చూసి నేను జాలిపడాల్సి వస్తుంది. మొన్నేం జరిగిందో తెలుసా? అదేం క్రితం సారి -- పోరుబడ లేక భార్యను వెంటబెట్టుకు -- సినిమా కంటూ ఏలూరు బయలుదేరాట్ట. తీర హాలు దగ్గర కెళ్లాక ఒకే ఒక టికెట్టు కొని- నువ్వు చూసు సినిమా -- అట అయ్యే వేళకోస్తాను- అంటూ క్లబ్బుకు చిట్లాటకి పోయాట్ట. ఒక్కతే సినిమా హలో కూర్చుని కుళ్ళి కుళ్ళి ఏడ్చిందట. అదేం మొద్దండీ బాబు. అటువంటి పదార్ధాన్ని కట్టుకోవడం కంటే ఏ నాపరాయినో కట్టుకుంటే యింకా ఎక్కువ సుఖపడేది. కాకిముక్కుకు దొండ పండు కట్టినట్టు -- అంత దబ్బపండులా వుంటుందా భారతమ్మ -- మనిషిని చూస్తేనే చిరాకు పడ్తాడుటండీ. భారతమ్మ కాలి గోటికి సరిపోతుందా చెప్పండి ఆ దొమ్మరి ముండ బుజ్జీలు. ఆవిడగారి లో ఏం సౌభాగ్యం కనిపించిందో ఈమహనుభావుడికి. మొన్నటండి - 'దాన్ని సైకిలేక్కించుకొని కాలవ గట్టు మీద....'
    స్వామి నిద్రపోయాడు ఆదమరచి.
    భార్యకు యిచ్చిన మాట -- నిలబెట్టుకున్నాడు స్వామి. మర్నాడు స్వయంగా జీపు తోలుకుంటూ సినిమాకు బయలు దేరాడు. ఆనాడు మాట్లాడినంత చనువుగా అంతకు ముందెన్నడూ భారతి స్వామితో మాట్లాడలేదు. మున్సబు గారి అరుగుల ముందుగా జీపు పరిగెత్తు తున్నప్పుడు - భారతి భర్త భీమారావు ముక్కలు కలుపుతున్నవాడి తలెత్తి ఆగి చూశాడు ఒక క్షణం. స్వామికి ఏదో బెరుకు కనిపించింది ఒక్క క్షణం.
    'మీ అయన కూడా వస్తే బావుండేది భారతీ' అన్నాడు స్వామి.
    'సరి సరి - ఆ చిట్లాట వదిలి స్వర్గానికి రమ్మన్నా రాడాయన.'
    'మరీ అంత పిచ్చేమిటే బాబూ.'
    'పిచ్చ కాదు మాయరోగం.'
    'నీకు మరీ నోట్లో నాలిక లేదు లెద్దూ భారతి! అటువంటి వాడు నాకు దొరకాల్సింది ఆ మాయరోగం మేమిటో వదల గొట్టేదాన్ని దుమ్ము దులిపి.'
    'మొండి ఘటమే బాబూ! నీకేం తెలుసు అయన సంగతి.'
    'ఎంత మొండి ఘటమైనా మొగుణ్ణి లొంగదీయటానికి అనేక చిత్కాలున్నాయి' మచ్చిక చేసుకోవడం లో వుంది'
    'అన్ని చిట్కాలు ఉపయోగించా . ఆఖరుకు మున్నాళ్ళు అన్నం తినకుండా పడుకున్నా నా కడుపే కాలింది గాని అయన గారు ఆ మున్సుబు గారి అరుగుల్ని వదిలిరాలా'
    'విడాకు లిచ్చేస్తానాని బెదిరించలేక పోయావ్?'
    'నిక్షేపంగా యివ్వమంటాడు పీడా విరగడయిందను కుంటూ. ఈ బ్రతుకులిలా వెళ్ళ మరిపోవాల్సిందే. అందరికీ మాష్టారిలాంటి భర్త దొరకొద్దూ .'
    'మరీ అంత సాగిదేయ్యకేవ్ 'యిప్పటికే ఉబ్బిపోయారాయన దర్వాజా పట్టకుండా '
    'నువ్వే కావాలని ఉబ్బెస్తున్నావ్ అంతంత నెయ్యి పోస్తూ.'
    కారు ఎగిరిపడింది 'చంపారండి బాబోయ్' అంటూ స్వామి మీద పడింది పావని - పావని మీద పడింది. భారతి.
    'ఎంత మార్చావే తల్లీ మీ ఆయన్ను విమానంలా నడుకొచ్చారు కాదు.'
    ముందు సరాసరి తల్లిని చూడటానికి వెళ్ళాడు స్వామి.
    'ఆ సమయంలో సీతమ్మగారు అవధాని గారింట్లో వుంటుందని స్వామికి తెలుసు. జీపు యింటి ముందు ఆపి ' నువ్వురా పావనీ' అన్నాడు.
    'మీరు వెళ్ళి రండి సినిమా అయాక ఆవిడ యింటికి వస్తుంది కదా?' అంటూ తప్పుకుంది పావని. అవధాని గారింట్లో అత్తగారికున్న ప్రతిపత్తి పావనికి పూర్తిగా తెలుసు. కాని ప్రత్యక్షంగా చూడటానికి పావనికి మనస్కరించ లేదు. అందుకో భారతి ప్రక్కన వుండగా.
    'మీ అత్తగారు యింకా వంటలక్క గా రెక్కలువిరగొట్టుకోవలసిన అవసరమే ముందే పావనమ్మా. ఆవిడ కూడా పెద్దద్డై పోయింది గదా.' అంటూ అమ్మలక్కలు దెప్పి పొడుస్తున్న ధోరణి లో మాట్లాడినప్పుడల్లా అరికార్లో గంటు ముల్లు దిగినట్లనిపించేది.
    స్వామీ యింట్లో అడుగు పెట్టగానే అవధాని గారు కూడా అతన్ని ఎగాదిగా పరీక్షించి చూసి, చూసాక కళ్ళు చిట్లించి వాకిట్లో నిలబడ్డ జీపును చూసి, ఏదో ఘోరం జరిగిపోయి నక్షత్రాలు దారిపోయినట్లు ఎగిరిపడి 'కారులో వచ్చావా?' అని ప్రశ్నించి , అలాగే నోరు తెరుచుకుని సమాధానం కోసం నిరీక్షించారు.
    'ఔనండి!'
    అవధాని గారు క్రింద తన్నిన ఆవిరికి అన్నపుసిబ్బి లేచినట్లు నిలబడి, ఊడి పోతున్నగపంచా మరింత గట్టిగా బిగించి 'ఎవరేమిటి కారులో?' అన్నారు అలాగే దృష్టి కేంద్రీకరించి చూస్తూ.
    'మా అవిడండి.'
    'చెప్పావు కావేమయ్యా! పెద్దవాడి వయ్యావ్. కార్లేక్కి తిరుగుతున్నావు. పెళ్ళాన్ని వెంటేసుకుని. కళ్ళ ముందు పుట్టి పెరిగిన వాడివి గదా పెళ్ళాన్ని తీసుకొచ్చి - పెళ్ళి కాగానే -- చూపెడతాననుకున్నా -- ఔన్లె- లోపలికి రమ్మను.'    
    అతి బలవంతం మీద పావనిని వెంట బెట్టుకుని అవధాని గారింట్లో కి నడిచాడు స్వామి.
    'నాకు భయంగా ఉందే బాబూ! నువ్వూ కాస్త వెంటరా.'
    భారతి కూడా వెనక నడిచింది.
    సీతమ్మ గారు యింట్లో లేరు. 'ఎవరో మీ మామయ్యా కూతురట ఇక్కడే కాపరంలే. వంట్లో బాగుండలేదంటే చూసి రావడానికి వెళ్ళింది.' అంది అవధాని గారి భార్య. ఆ మామయ్య కూతురు శ్రీదేవి కాదు గదా? మరింకేవరున్నారు . యిక్కడి కెలా వచ్చింది. పెళ్ళి అయినట్లు తనకు తెలియదే! తలచుకుంటే జాలనిపించింది. పాపం! చిన్న వయసులో భర్త పోవడం-- వైధవ్యం - బాధలు-    
    'కాసిని మంచినీళ్ళు కావాలా బాబూ' అంది అవధాని గారి భార్య మరచెంబు పట్టుకొచ్చి. రెండుగ్లాసులు గటగట త్రాగేశాడు పరధ్యానం గానే. పావని మూతి ముడుచు కూర్చుని ' యింక పోదాం పదండి.' అని సైగ చేయడం మొదలెట్టింది . అవధాని గారి కూతురు - పెళ్ళి కాబోతున్న పిల్ల - మంగమ్మ - కిటికీ సందులోంచి కనిపించింది.
    'కాంట్రాక్టుల వ్యాపారం బాగా సాగుతున్నదన్నమాట' అన్నారు. అవధాని గారు జీపుకారునే చూస్తూ. 'విడింతవాడు కాగలడని కలగన్నానా -- మంగుల్నే యిచ్చే వాణ్ణి ' అనుకుంటూ.
    'రోజులు కలిసొస్తే అంతే లెండి. భైరవమూర్తి గారి తండ్రి మా నాన్నగారింట్లో నీళ్ళ కావిళ్ళు మోసి కొడుకుకు చదువు చెప్పించాడు. వీధి లాంతర్ల దగ్గర కూర్చొని "చిన్నపిల్లలకు ట్యూషనలు చెప్పుకు యిస్కూలు ఫీజు కట్టి- చివరకు  కలక్టరై పరగణా మొత్తాన్ని గడగడ లాడించాడు. రోజుల మహత్యం! మన అబ్బిగాడి చదువుకు యింత తగలేశాం. ఆ మోటారు సైకిలెక్కి తిరగడం తప్ప చదువు వంట పట్టింది.'    
    నిట్టూర్చాడు అవధాని గారు. రెప్పలార్పకుండా కిటికీ సందులోంచి స్వామి కేసి అలాగ చూస్తున్నది మంగులు.
    అవధాని గారు అదోరకంగా  దగ్గి అది అసూయో, ఆపేక్షా తెలియని పద్దతిలో 'చూడు స్వాములు! మా అరుగుల మీద చదువుకుని -- యింతటి వాడివి కావడం గొప్పేఅనుకో. ఎంత గోప్పయినా కన్న తల్లితండ్రులకు అన్నం పెట్టకుండా వాళ్ళని గాలికి వదిలి పెట్టమని లేదు గదా? ఎంత కష్టపడి చదివించింది మీ అమ్మ? అరమైలు దూరం గంగాళం లాంటి బిందెలతో హోటళ్ళ కు నీళ్ళు జారబోస్తూ ఉంటె - తోటి కుటుంబం తాలుకూ గదా అని నేనే యింట్లో వంటపనికి పెట్టుకుని- నీ చదువు కేమిటి ఆవిడ తిండి కేమిటి తోచిన సహాయం చేశాననుకో. కాని రెక్కలు విరగొట్టుకుందెవరు? ఆవిడ బరువు బాధ్యతలు నువ్వు వహించడం ధర్మమయ్యా ! నువ్వేమనుకున్నా సరే పెద్ద వాణ్ణి గనక - ఆవిడను చూస్తె గుండె బరుక్కు పోయి చేబురున్నా' అంటూ మొదలు పెట్టాడు. అయన ధోరణి చూస్తె అయిదారు గంటల వరకూ వదిలేటట్లు కనిపించటం లేదు.'
    పావని ఈ మాటలు వినలేక పదండి! సినిమా టైమయింది.' అంటూ లేచింది. భారతి అనుసరించింది. చివరకు స్వామి గూడా లేచి 'వస్తానండి ' అన్నాడు.
    'పాడు సినిమా కోసం పద్నాలుగు మైళ్ళు మేరేసుకొచ్చారా?' అంటూ ఆశ్చర్యపోతున్న అవధాని గారు , కారు కనుచూపు మేర దాటిపోయేవరకూ ముక్కు మీద వేలు తీసేయ్యనే లేదు.
    'అంత తాటాకు మంటలా మండి పోతుంది ఆ స్వామి గాడి పెళ్ళాం . అదేక్కడి కాపరం చేస్తుందండి. మీ వెర్రిగానీ - ' అంటూ దీర్ఘాలు తీసింది అవధానిగారి భార్య.
    మెట్లెక్కుతూ సినిమా హాల్లోకి నడుస్తున్నారు ముగ్గురు.
    సగం మెట్లు యెక్కిం తర్వాత మలుపు మూలలో గోడకు నిలువుటద్దం బిగించారు. చెప్పు మడతపడి వంగి పడబోయింది పావని. నడుం పట్టుకుని అడ్డుపడ్డాడు స్వామి. ముగ్గురూ వరసగా ఆ నిలువు టద్దంలో మెరిసారు. తనకేసి చూస్తూ కళ్ళు చిట్లించింది భారతి.
    పావని 'బ్రతికించారు. అందుకనే భరించేవాడు భర్త -- అని ఉత్పత్తి అర్ధం ఒకటికి పదిసార్లు చెప్పేవాడు - చెప్పేవాడు పరాంకుశం  మాష్టారు.'   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS