'మీరు బీచ్ లో నన్నెందుకు కోప్పడ్డారు? మీతో నేనసలు మాట్లాడను. మీ దగ్గర అంతకన్నా పడుకోను' అంది బెట్టుసరి చేస్తూ కళ్యాణి.
'అబ్బబ్బ! ఆ గొడవలన్నీ యిప్పుడేందుకు చెప్పు? అప్పుడేదో కోపంలో అన్నాను. తప్పయింది లే! మళ్ళీ మనం వాదన పెట్టుకున్నామంటే పిల్లలు లేస్తారు.' అన్నాడు బ్రతిమాలె ధోరణి లో.
"అబ్బబ్బ! ఏం మనిషి బాబూ! నిద్ర కాస్తా చెడగొట్టేసెడు' అని తనకే మాత్రం యిష్టం లేనట్టు లేచి అతని వెంట వెళ్ళింది కళ్యాణి.
తెల్లవారేక ఉదయమే మహాబలి పురం వెళ్ళే బస్సులో కూర్చున్నారు కాంతారావు కుటుంబం. ఆరోజు ఉదయం ఆకాశం మేఘామృత మై ఉండటం వల్ల బస్సు ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. పిల్లలు కూడా కేరింతలు కొడుతూ తమ ఆనందాన్ని వ్యక్త పరుస్తుంటే బస్సులో కూర్చున్న మిగతా వాళ్ళంతా వాళ్ళని చిరు నవ్వుతో పరికిస్తున్నారు. ఆ బస్సులో ఉన్నవాళ్ళందరూ కూడా వాళ్ళలాగే టూరిస్ట్ లే! అయితే ఏ ఒకరిద్దరో తప్ప ఎవరూ పిల్లలను వెంట తీసుకు రాలేదు. ఆ టూరిస్ట్ లలో కొత్తగా పెళ్ళయి, హనీమూన్ లో ఉన్నట్లు కనపడుతున్న నాలుగు జంటలు. తమలాగే యిద్దరు ముగ్గురు పిల్లలున్నా వాళ్ళను యింటి వద్ద వదిలేసి ప్రేమ యాత్ర సాగిస్తున్న జంటలు మూడు, పిల్లలందరికీ పెళ్ళిళ్ళు చేసేసి తీరికగా హనీమూన్ జరుపుకుంటున్న వృద్దుల జంటలు రెండూ ఉన్నాయ్.
వాళ్ళంతా మద్రాసు నుండి, ఊటీ వరకు ప్రయాణం చెయ్యాలని తమలానే ప్లాను వేసుకు వచ్చినట్లు తెలిసింది. మహాబలి పిరం దగ్గర బస్సు దిగగానే ఎవరికి వారు విడిపోయి రాతిలో పొదగబడిన శిల్ప సంపదను చూడటానికి బయల్దేరారు.'
'ఈ ప్రదేశాలన్నీ వివరంగా చెప్తాను రండి.' అంటూ ఒక గైడ్ తమ దగ్గరకు వచ్చేసరికి. 'ఆ వివరాలన్నీ మేము ' బాలరాజు కధ' సినిమాలో చూసేం లేవోయ్! నువ్వేం చెప్పనక్కర్లేదు' అంది కళ్యాణి.
ఆమె వేసిన జోక్ కి కాంతారావే కాక గైడ్ కూడా నవ్వేసరికి కళ్యాణి కి తన సమయస్పూర్తి మీద, సెన్సాఫ్ హ్యూమర్ మీద తనకే ఎంతో నమ్మకం కలిగి గర్వపడింది.
పిల్లలిద్దరిని వదిలేసి నడవమని, ఆలుమగ లిద్దరూ ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని నిలబడ్డారు. గైడు కొద్ది నిమిషాల పాటు 'ఇద్దరు పిల్లలు పుట్టినా వాళ్ళిద్దరూ ఎంత ప్రేమగా ఉన్నారు! అలాటి అదృష్టం అందరికీ ఉండొద్దూ! ' అనుకున్నాడు నిట్టురుస్తూ. అతని భార్య యిటీవలనే నలుగురు పిల్లలనీ అతనిని వదిలేసి రౌడీ రంగడి తో లేచిపోయింది.
ఒకే శిలతో చెక్కబడిన పంచ పాండవుల విగ్రహాలను, ఏనుగునూ మొదలైన విగ్రహలన్నీటిని చూస్తుంటే హటాత్తుగా యీ మహా బలిపురాన్ని కట్టించింది ఎవరా? అన్న ప్రశ్న కలిగింది కళ్యాణి కి. 'ఇంతకీ దీనిని కట్టించింది నరసింహ వర్మా మహేంద్ర వర్మా?" అని అడిగింది భర్తను.
ఆ విషయం కాంతారావు కి కూడా చప్పున గుర్తుకు రాలేదు. కాని ఆ విషయం పైకి చెప్పేందుకు మనసొప్పక 'ఇప్పుడే అంటివి కదా గైడు తో -- 'బాలరాజు కధలోనే ' వివరాలన్నీ తెలుసుకున్నానని' అన్నాడు దెప్పి పోడుస్తున్నట్లుగా.
'అసలు నరసింహ వర్మ మహేంద్ర వర్మ కొడుకా, లేక మహేంద్ర వర్మే నరసింహ వర్మ కొడుకా ? అర్ధం కావటం లేదు నాకు!' తల పట్టుకోంది కళ్యాణి.
ఆమె అలా అనేసరికి కాంతారావు కి కూడా అనుమానం వేసింది. ఐనా అడ, మగలో ఏదో ఒకటి నిజం కాకపోతుందా అన్న ధోరణి లో 'మహేంద్ర వర్మ కొడుకే నరసింహ వర్మ .' అన్నాడు కొంచెం సందేహిస్తూనే.
అతను సందేహించటం గమనించిన కళ్యాణి 'కాదు నరసింహవర్మ కొడుకే మహేంద్ర వర్మ' అంది గట్టిగా.
'కావచ్చు' అన్నమాట కాంతారావు కంఠం లోనే ఆగిపోయింది 'పోనీ గైడ్ నడిగి తమ తగాదా తీర్చుకుందామా' అంటే ఆ చుట్టూ పక్కల ఎక్కడా కనపడనే లేదు గైడు.
'ఏం లాభం? ఎమ్మే ప్యాసయ్యారు . ఆమాత్రం తెలియదు.' అంది మూతి విరుస్తూ కళ్యాణి.
'నేను ఎమ్మే పాసయినా నువ్వు బియ్యే తప్పినా హిస్టరీ ని మనం చదివింది యిద్దరమూ ఎస్సెల్సీలోనే. ఆ పరీక్షలయిన మర్నాడే చదువుకున్న చరిత్రంతా మర్చిపోయేం. ఇప్పుడు యిద్దరు పిల్లలను కన్నాక యింకా ఏం గుర్తుండి చస్తుంది!' అన్నాడు యిసుకలో కూలబడుతూ కాంతారావు.
కళ్యాణి కూడా చేసేదేం లేక అతని పక్కనే కూలబడింది . 'నరసింహారావు కొడుకు మహేంద్ర వర్మా, లేక మహేంద్ర వర్మ కొడుకు నరసింహ వర్మ?" అన్న ప్రశ్నను గురించే తీవ్రంగా ఆలోచిస్తూ.
తరువాత లైట్ హౌస్ దగ్గరకు వెళ్ళి కొంతదూరం ఎక్కి యిక నడవ లేనంటూ క్రిందికి దిగి వచ్చేసింది కళ్యాణి. కొబ్బరి బొండాలు కొనుక్కుని నీళ్ళు తాగేడు. పాపను వో పూసల దండ కొన్నది కళ్యాణి.
సముద్రపు వొడ్డున ఉన్న బండరాళ్ల పక్కనే కాసేపు నడచి ఆ వాతారవరణానికి ముగ్ధుడైన కాంతారావు 'ఐడియా!' అంటూ యీల వేశాడు కాంతారావు.
'ఏమిటా ఐడియా అంటూ' ముందుకు నడుస్తూ వెనక్కి తిరిగి భర్త వంక ప్రశ్నార్ధకంగా చూసింది కళ్యాణి.
'వారేవా! వండ్రపుల్ ఫోజు! జస్ట్ వన్ మినిట్! అలాగే కదలకుండా నిలబడు.' అంటూ కెమెరా ను 'క్లిక్' మనిపించేడు కాంతారావు.
అతను దగ్గరకు వచ్చేక 'ఏమిటా ఐడియా , చెప్పనే లేదు' అంది కళ్యాణి .
'ఇవ్వాళ రాత్రికి మనిద్దరం ఒంటరిగా అంటే పిల్లలు వెంట లేకుండా యిక్కడకు వద్దాం అన్నాడు.
'ఎందుకు?'
'ఎందుకేమిటి నీ మొహం! ఒక్కసారి ఈ చుట్టూ ఉన్న వాతావరణాన్ని చూడు. ఎంత బ్యూటీ ఉందో యిక్కడ. ఇదే వాతావరణాన్ని ఒకసారి వెన్నెలలో ఊహించుకో! వో! ఎంత గొప్ప సౌందర్యమో! ఆ ప్రకృతి సౌందర్యం లో ఒక భాగమైన ఈ సౌందర్య దేవతతో కొంత టైము గడపాలని ఈ భక్తుడి విన్నపం. దేవి అనుగ్రహించినట్లేనా?' అన్నాడు.
కళ్యాణి మనసు. చలించి పోయింది. 'కాంతం! నువ్వెంత మంచి వాడివి!' అన్నది అతని చేతిని తన చేతిలోకి తీసుకుని.
'పోన్లే! ఆలస్యంగా నైనా నా మంచితనాన్ని గ్రహించేవు థాంక్స్!' అన్నాడు నిష్టూరంగా ముఖం పెట్టి.
'ఇప్పుడు కాదు ఎప్పుడో గ్రహించెను. నీ మంచి తనాన్ని నిర్మలమైన ప్రేమను చూసే కదా నిన్ను చేసుకుంది.' అన్నది అర్ద్రమైన కంఠంతో.
ఆమె అలాగనగానే కాంతారావు కూడా వెంటనే సీరియస్ గా అయిపోయి, ఆమె చేతిని మృదువుగా నొక్కేడు.
'నవ్వు నన్ను చేసుకో లేదమ్మాయ్! నేనే నీ మెళ్ళో తాళి కట్టి పెళ్ళి చేసుకున్నాను. నిన్ను నాదాన్ని చేసుకున్నాను.' అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ. ఆ నాలుగు కళ్ళూ కొద్ది నిమిషాలపాటు నిశ్చలమైన ప్రేమతో వెలిగి వెంటనే దృష్టులను మరల్చుకున్నాయ్.
కాంతారావు వాళ్ళు బస చేసింది బీచ్ కి దగ్గరలో ఉన్న ఒక చిన్న హోటల్లో ఆ హోటలు ఏమంత గొప్పగా లేకపోయినా బీచ్ లో దగ్గరలో ఉండాలని అదే తీసుకున్నాడు కాంతారావు. పగలు భోజనం చేసి విశ్రమించేరు. సాయంత్రం హోటలు రూము ముందు బాల్కానీ లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే పిల్లలిద్దరూ అలసిపోయేలా ఆదుకున్నారు.
రాత్రి ఏడున్నర అయేసరికి అంతా భోజనాలు చేసేరు. ఎనిమిదింటికల్లా పిల్లలిద్దరూ గాడనిద్రలో మునిగి పోయేరు. వాళ్ళు నిద్రపోగానే పక్క మీద నుండి లేచి, యివతలకు వచ్చింది కళ్యాణి. తెల్లటి చీరా, తెల్ల జాకెట్టు , మెడలో ముత్యాలహారం , బుజాల మీదకు బరువుగా వేలాడుతున్న మల్లె చెండు, పిల్లల పక్కనే కాసేపు పడుకోవటం వల్ల ఆమె తల కొద్దిగా చెరిగింది. బట్టలు కొంచెం నలిగి ఉన్నాయ్.
అప్పుడే కాంతారావు హోటల్లో ఉండే ఒక కుర్రాడిని వెంట పెట్టుకుని వచ్చేడు. వస్తూనే రూము ముందు వెన్నెల వెలుగులో నిల్చున్న కళ్యాణి చూస్తూ 'ఎంత అందంగా ఉంది!' అనుకున్నాడు. కాని పక్కనే కుర్రవాడు ఉండటం వల్ల ఆ మాటను పైకి అనలేదు.
కళ్యాణి కేమిటో భయంగా ఆందోళన గా ఉంది పిల్లలని విడిచి వెళ్ళాలంటే. మరో వంక భర్తతో కలిసి యిలాటి సమయంలో ఒంటరిగా ఆ రాతి గుట్ట దగ్గర సముద్రం ఎదుట కూర్చోవాలన్న కోరిక కూడా ఆమెలో తీవ్రంగానే ఉంది.
'పిల్లలు నిద్రపోతున్నారు చూస్తుండు. మేమిప్పుడే అరగంట లో వచ్చేస్తాం. పిల్లలు మంచి నిద్రలో ఉన్నారు. ఇప్పట్లో అయితే లెవరు. ఒకవేళ లేస్తే చిచ్చి కొట్టు వెంటనే నిద్రపోతారు.' అని ఐదో సారి కాంతారావు కుర్రవాడితో చెప్పటం.
ఆ పిల్లవాడు కూడా 'అలాగే సార్ . మీకేం భయం లేదు.' అని ఐదో సారి అతనికి భరోసా యిచ్చి అక్కడే ఉన్న స్టూలు మీద కూర్చుని ఇంక మీరు వెళ్ళి త్వరగా రండి.' అన్నాడు. కళ్యాణి , కాంతారావు వెళ్ళగానే తను అరగంట కూర్చునేందుకు గాను లభించిన రూపాయి నోటు జేబులో ఉన్నదా లేదా అని పదో సారి తడిమి చూసుకున్నాడు.
కాంతారావు కళ్యాణి నడుం చుట్టూ చెయ్యి, వేసి , ఆమెను మెల్లగా నడిపించు కుంటూ తాము నిర్దేశించు కున్న ప్రదేశానికి తీసుకు పోయేడు.
చుట్టుపక్కల ఎక్కడా జనసంచారం లేదు. ఎత్తుగా ఉన్న రాళ్ళ గుట్ట ఎన్నాళ్ళ నుండో ఒంటరిగా ప్రోషిత భార్త్రుకలా నిర్జీవంగా నిలబడి ఉంది. ఉండుండి సముద్రకేరటాలు వచ్చి, ఆ గుట్టను తాకి వెనక్కి పోతున్నాయ్. అలా ఎన్నో సంవత్సరాల తరబడిగా ఆ కెరటాలు స్పృశిస్తున్నా ఏమాత్రం కదలిక లేకుండా నిశ్చలంగా నిలబడి ఉంది ఆ రాతి గుట్ట. దాని దగ్గర ఆ యువ దంపతులిద్దరూ ఇసుకలో కూర్చున్నారు. భర్త స్పర్శతో పులకరించి పోతోంది ఆమె శరీరం. భర్త కౌగిలింతల వల్ల ఆమెను వో పక్క మోహావేశం ఆవరించుకుంటున్నా . మరో వంక మనసులో పిల్లలను వదిలి వచ్చేమే అన్న ఆరాటం కూడా పీడించ సాగింది.
ఇటు భర్త ప్రేమకుసంతోషించాలో , పిల్లల కోసం పరితపించాలో తెలియక ఉక్కిరిబిక్కిరవుతూ నిస్సత్తువగా యిసుకలో వాలిపోయి పడుకుంది కళ్యాణి.
కాంతారావు ఆమె మీదకు వాలెడు. కళ్యాణి రెండు కళ్ళూ గట్టిగా మూసుకుంది.
హటాత్తుగా 'హే! అన్న కర్ణ కఠోరమైన కంఠస్వరం వినిపించి, భార్యభార్త లిద్దరూ చటుక్కున లేచి కూర్చున్నారు. తమ కెదురుగా యమ కింకరుల్లా నిలబడిన రెండు నల్లని పెద్ద పెద్ద ఆకారాలను చూస్తూనే తాము "తెలుగు సినిమా యేమీ చూట్టం లేదు కదా!' అనుకుంది కళ్యాణి.
సినిమా ల్లోని విలన్ లలా కనిపించే మనిషులు వాస్తవిక జీవితంలో ఉండటం సంభవమే మోనని ఆమెకు జీవితంలో ఎప్పుడూ స్పురించనేలేదు.
అందువల్ల అది కలో, నిజమో తేలియని అయోమయావస్థలో కొన్ని క్షణాల పాటు కూర్చుండి పోయింది కళ్యాణి వెంటనే తేరుకుని కాంతారావు లేచి నిల్చున్నాడు.
