Previous Page Next Page 
ఏటి ఒడ్డున నీటిపూలు పేజి 27

 

    రిక్షా మీద ఇంటికి రాగానే, కూతుళ్ళ కోసం ఎదురు చూస్తున్న శాంతమ్మతో, "అమ్మా, నువ్వు పడుకో. మేం వడ్డించుకు తింటాం" అని చెప్పి తల్లిని బలవంతం మీద పడుకునేటట్టు చేసింది చారుమతి.
    తల్లి లోపలికి వెళ్ళిపోయాక, "మాలతీ, నువ్వు వడ్డించుకు తిను. నేను భగవతి వచ్చాక తింటాను" అంది.
    అరగంట గడిచాక భగవతి వచ్చింది. చీర మార్చుకుని వంటింట్లోకి అడుగు పెట్టబోతున్న చెల్లెలిని చూసి,
    "ఇలా రా, భగవతీ!" అంటూ దాబామీదికి దారితీసింది చారుమతి.
    "ఎందుకూ?" అంటూ వెనకే వెళ్ళింది చెల్లెలు.
    "ఎక్కడికి వెళ్ళావు?" చారుమతి మెల్లిగా అడిగింది.    
    "సినిమాకి."
    "ఎవరితో?"
    "సీతా, నేనూ వెళ్ళాం."
    "సీతతో వెళ్ళావా? ఇంకా ఎవరైనా వచ్చారా?"
    "ఇంక ఎవరూ రాలేదు." భగవతి మాట పూర్తి చెయ్యకుండానే కోపంతో చారుమతి చెయ్యి చాచి రెండు చెంపలమీద కొట్టింది. ఆగకుండా కొడుతున్న అక్కని చూసి బిత్తరపోయి, రోషంగా ఏడుస్తూ, "ఎందుకు కొడతావు?" అంది భగవతి.
    "ఎందుకా? వెధవ పనులు చేస్తున్నందుకు, అడ్డమైనవాళ్ళతోను సినిమాలకి వెళ్ళుతున్నందుకు నీమీద ప్రతి మగవాడినీ చెయ్యి వెయ్యనిస్తున్నందుకు. ఇంకా చెప్పాలా?" చారుమతి కళ్ళలోకూడా నీళ్ళు తిరిగాయి.
    "అడ్డమైనవాళ్ళతోను నేను వెళ్ళలేదు. అతను సీతావాళ్ళ అన్నయ్య."
    "సీతావాళ్ళ అన్నయ్యకు, నీకు ఏం సంబంధం? అతనితో సినిమాకి వెళ్ళవలసిన అవసరం ఏమిటి నీకు?"
    "అతనితో వెళ్ళితే తప్పేమిటి? మీరు నన్ను సినిమాలకి తీసుకువెళ్ళరు. మీకే కోరికలు ఉండవు. మంచిబట్టలు కావాలని, సినిమాలు చూడాలని, దూర దూర దేశాలు వెళ్ళాలని-ఏ ఒక్క కోరికా లేదు మీకు. మీరు మామూలు మనుషులు కారు, సన్యాసులు" అంది భగవతి.    
    చెల్లెలి ధైర్యం చూసి తెల్లబోయింది చారుమతి.
    "అవునే, మాకు కోరికలు లేవు. మేం మనుష్యులం కాదు. కోరికలు తీరనప్పుడు, తీర్చుకునే స్తోమతు లేనప్పుడు కోరికలు పెంచుకునే అర్హత లేదు. నువ్వు అలాంటి కోరికలు పెంచుకోవడం అవివేకం. చివరికి జీవితంలో దెబ్బ తిని కుమిలిపోతావు!" అంది చారుమతి.
    'చిన్నపిల్ల అయిన భగవతిని సరిదిద్దాలి! చెడ్డ ప్రభావానికి లోనైనా చెల్లెలిని పెడతోవ పట్టకుండా చూడాలి, ప్రతి మగవాడినీ నమ్మకూడదని చెప్పాలి.' చారుమతి తహతహలాడింది.

 

                                       
    "భగవతీ, ఇక్కడ కూర్చో, నీతో నేను సావకాశంగా మాట్లాడాలి" అని చెల్లెలిని కూర్చోపెట్టింది. అందరు మగవాళ్ళని ఎందుకు నమ్మకూడదో, ఆడది దగ్గిరగా వెళితే ఏ ప్రమాదం సంభవిస్తుందో, శీలం పోయిన ఆడదాని బ్రతుకు సంఘంలో ఎలా ఉంటుందో అన్ని చెప్పింది. అమాయికంగా నమ్మిన రాధాకృష్ణ తనని రైల్లో ఏం చెయ్యబోయాడో వివరించి చెప్పింది.
    భగవతి అన్ని విని మౌనంగా కూర్చుంది. చెల్లెలికి తను చెప్పినవి ఎంతవరకు తలకెక్కాయో అని చూస్తూ కూర్చుంది చారుమతి.
    "నా కీ జీవితం నచ్చదక్కా! ఎన్నాళ్ళు ఈ బ్రతుకు? లోకంలో ఎన్నో అందమైన సుఖాలు ఉన్నాయి. కాని మనకి ఇష్టమైన బట్ట కొనుక్కోడానికి, పుష్టిగా తినడానికి కూడా కరువే. నేను ఈ జీవితంతో సరిపెట్టుకోలేకుండా ఉన్నాను. ముందేమైనా ఆశ ఉందా అంటే అదీలేదు. నాకు మీరు పెళ్ళి చెయ్యగలరనే ఆశ లేదు. నీకు, మాలతక్కకి పెళ్ళిళ్ళు కావాలి. పోనీ, పెళ్ళి చేసినా మనఅంతస్తులో ఉన్న గుమాస్తాకో, మాస్టారికో ఇచ్చి చేస్తారు. చాలీచాలని జీతము, తీరని కోరికలు. ప్రతిదానికీ కరువు! అందని వాటికోసం ఆశపడుతూ జీవించడం! ఇదే కదూ?"
    ఇలాంటి మాటలు చెప్పగలిగే చెల్లెలు ఇంకా చిన్న పిల్ల అని అనుకోవడం తన తెలివితక్కువ అనుకుంది చారుమతి.
    ప్రతి సుఖాన్ని డబ్బు దృష్టితో చూసే చెల్లెలికి జవాబు చెప్పలేకపోయింది చారుమతి. చెల్లెలి మాటలన్ని నిజమే తనకి, చెల్లెలికి ఒకటే తేడా. తను మనస్సులో అనుకుంటుంది, భగవతి పైకి చెబుతుంది. ఇద్దరి ఆశలు, కోరికలు ఒకేరకమైనవి. ఎటొచ్చీ తన ఎక్కడి కక్కడ విధికి లొంగిపోతూ, జీవితంతో రాజీపడుతూ సమాధానానికి వస్తుంది. భగవతి జీవితానికి ఎదురు నిలిచి పోరాడాలని చూస్తూంది.
    పైన మేఘాలు కమ్ముతున్నాయి. వర్షం వచ్చేటట్టు ఉంది.
    "భగవతీ, నామీద నీకు విశ్వాసం గాని, ప్రేమగాని ఉందా?" అంది చారుమతి.
    "అలా ఎందుకు అడుగుతావు, అక్కా? నువ్వంటే ఎంతో ఇష్టం నాకు" అంది భగవతి.
    "నీకు మంచిసంబంధం తెచ్చి పెళ్ళిచేస్తాం, భగవతీ. నువ్వుమాత్రం డబ్బు తీర్చే సుఖాలకోసం మన కుటుంబానికి అప్రతిష్ఠ తెచ్చే పనులు చెయ్యకు. చిన్న చెల్లెలి వైన నీ సుఖమే మాకు కావలసింది. మా శాయశక్తులా ప్రయత్నిస్తాం. నువ్వీరోజునించీ సీత ఇంటికి వెళ్ళనని మాట ఇవ్వు" అంది చారుమతి, చెల్లెలి చేతిని తన చేతిలోకి తీసుకుంటూ.
    "నేనేం చెడ్డపనులు చెయ్యనక్కా. చెయ్యలేదు ఇప్పటిదాకా సీత నా స్నేహితురాలు వాళ్ళ ఇంటికి వెళ్ళకపోతే నాకు తోచదు" అంది భగవతి.
    భగవతి ఇంకా మూఢీగా మాట్లాడటం చూసి విసుక్కుంది చారుమతి. పైన సన్నగా చినుకులు ప్రారంభమయ్యాయి. వెంటనే డాబా దిగకపోతే ఇద్దరూ తడిసిపోతారు.
    "నువ్వు నా మాట వినాలి, భగవతీ నువ్వు సీత ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు" అంటూ చెల్లెలి చెయ్యి పట్టుకుని గబగబా డాబా దిగింది చారుమతి.
    అందరూ ఉద్యోగస్థులయ్యారు. డబ్బు ఇబ్బందులు తగ్గాయి. కుటుంబ భారం తన తలమీదనించి దిగింది అని మూడు నెలలక్రిందటే సంతోషించింది చారుమతి. ఇప్పుడు భగవతి పెళ్ళి అనే పెద్ద బరువు రెట్టింపుది తలమీద పడింది.
    ఆ నెలనించి తన జీతం అంతా బాంకులో వేయసాగింది చారుమతి. శంకరానికి ఉత్తరం రాసింది - పెళ్ళిళ్ళకి కావాలి డబ్బు దాచమంటూ.
    శాంతమ్మ మళ్ళీ వంటకి, కూరలకి తడుములాడుకుంది. "డబ్బు కటకట అయిపోయిందమ్మా" అంటూ వంటింట్లో సణుగుకుంటున్న తల్లిని చూసి చారుమతి విసురుగా అంది:
    "కూతుళ్ళకి ఇంక పెళ్ళి చెయ్యవా, అమ్మా? తెచ్చుకున్నదంతా ఖర్చు చేసుకుంటే పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి? అందరూ భానక్క అంత అదృష్టవంతులు ఉంటారా? కానీ ఖర్చులేకుండా బావగారు వచ్చారు."
    దానితో శాంతమ్మ నోరు కట్టుబడిపోయింది.
    చారుమతి ఒక రోజు భానుమతి ఒంటరిగా ఉండడం చూసి భగవతి పెళ్ళి విషయం కదిపింది.
    "అమ్మతో చెబితే లాభం లేదక్కా. నీకు, మాలతికి పెళ్ళికానిదే చిన్నదానికి భగవతికి పెళ్ళేమిటని అంటుంది. అందుకనే నీతో చెబుతున్నాను. భగవతికి మంచి సంబంధం చూసి తొందరలో మనం పెళ్ళి చేసెయ్యాలి."
    "నీ కష్టం, సంపాదనా అంతా మన కుటుంబానికే ధారపోసేస్తున్నావ్, చారూ" అంది భానుమతి చెల్లెలిని ప్రేమతోనూ, తపనతోనూ చూస్తూ.
    "నేనేం చేశానక్కా!... దానికేంగాని, ముందు పెళ్ళివిషయం చెప్పు. సంబంధం ఎలా చూడడం?"
    "శారదత్తయ్య కొడుకు గోపాల్ కి భగవతిని అడిగితే ఎలా ఉంటుంది? భగవతికికూడా అతనంటే ఇష్టమే అనుకుంటాను. నువ్వు సీతా వాళ్ళ ఇంటికి వెళ్ళవద్దన్న దగ్గిరనించీ అది రోజూ శారదత్త ఇంట్లోనే గడుపుతూంది. గోపాల్ ని 'బావా, బావా' అని పిలుస్తూ కూడా కూడా తిరుగుతూంది."
    "కాని భగవతికి గోపాల్ ని చేసుకోడం ఇష్టం ఉండదేమో! దానివన్నీ పెద్ద ఆశలు" అంది చారుమతి.
    "గోపాల్ చాలా మంచివాడు. అతనితో భగవతి తప్పక సుఖపడుతుంది" అంది భానుమతి.
    "నిజమే. గోపాల్ కి అయితే మనం కట్నం ఇవ్వాలన్న బాధ ఉండదు. నువ్వు వెళ్ళి శారదత్తయ్యతో మాట్లాడి వస్తావా?" అంది చారుమతి.
    భానుమతి "సరే" అంది.
    మరునాడు ఉదయం శారదమ్మ ఇంటికి బయలుదేరబోతున్న భగవతిని ఇంటిదగ్గిర తల్లికి సాయంగా ఉండమని చెప్పి, భానుమతి బయలుదేరింది.
    బియ్యం బాగుచేస్తున్న శారదమ్మ భానుమతిని చూస్తూనే, "రా రా, భానూ" అంటూ ఆప్యాయంగా. లోపలికి తీసుకువెళ్ళి కూర్చోపెట్టింది. ఒక పెద్ద ఇంట్లో రెండు గదులు అద్దెకి తీసుకున్నాడు గోపాల్. ఇంటిముందర చిన్న వరండా ఉంది. ముందుగదిలో ఒక టేబిల్, ఒక కుర్చీ, ఒక మంచం, రెండు ట్రంకు పెట్టెలు ఉన్నాయి. అల్మైరాలో పుస్తకాలు, బట్టలు చక్కగా సర్దిపెట్టి ఉన్నాయి.
    రెండోగది వంటిల్లు వంటగిన్నెలు, పప్పులడబ్బాలు, సీసాలు అన్నీ శుభ్రంగా పెట్టుకుంది శారదమ్మ.
    అత్తపక్కనే తనూ బియ్యం ఏరుతూ కూర్చుంది భానుమతి.
    "నువ్విక్కడ ఎందుకమ్మా? ఆ మంచంమీద కూర్చో. నేను ఏరేస్తాను" అంది శారదమ్మ. అయినా భానుమతి అక్కడినించి లేవలేదు. ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ ఇట్టే ఏరేశారు బియ్యం.
    "కాఫీ పెట్టి ఇస్తానుండు" అంటూ శారదమ్మ వంటింట్లోకి వెళ్ళి, కుంపట్లో బొగ్గులు వేసి నిప్పు రాజేసింది.
    "అత్తా, నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడదా మని వచ్చాను" అంది భానుమతి, పీట వాల్చుకుని శారదమ్మకి ఎదురుగా కూర్చుంటూ.
    'ఏమిటీ?' అన్నట్లు తల ఎత్తి కుతూహలంగా చూసింది శారదమ్మ.
    "మా చెల్లెళ్ళ పెళ్ళి విషయం మాట్లాడదామని వచ్చాను. ముగ్గురు పెళ్ళికి ఎదిగి ఉన్నారు. చారు పెద్దదనుకో. కాని మాలతీ, భగవతీ ఇద్దరూ మన గోపాల్ కి ఈడు అవుతారు. ఒకరిని నీ కోడలిగా చేసుకుంటే మాకు చాలా సంతోషం" అంది భానుమతి మెల్లిగా.
    "ఈ మాట చెప్పడానికి ఇంత పస్తాయిస్తావేమిటే? మీ నాన్న సహాయం చేసి ఉండకపోతే బాబు చదువుకుని ఇంత పైకి వచ్చేవాడా? మేం ఈమాత్రంగా ఉండటానికి కారణం మీ నాన్న చలవ, తరవాత చారుమతి చలవ. చిన్నపిల్లయినా చారుది గొప్పబుద్ది" అంది శారదమ్మ, పచ్చిమిరపకాయలు, అల్లం తరుగుతూ.
    "అవన్నీ ఇప్పుడెందుకు, అత్తా? ఏం చేస్తున్నావ్?" అంటూ భానుమతి అత్త చేతిలోంచి కత్తిపీట లాక్కోబోయింది. కాని శారదమ్మ నవ్వుతూ బలవంతంగా కత్తిపీట తీసుకుంది.
    భానుమతి ఎదురుగానే రవ్వతో ఉప్మా చేసి, ప్లేటు నిండా పెట్టి ముందు పెట్టింది.
    "నేను ఎలాగా ఒక పిల్లని మా బాబుకి చేసుకోవాలని ముందరనించి అనుకుంటున్నాను. తెలిసిన పిల్లని చేసుకుంటే, ఏ ఇబ్బందీ ఉండదు. ఒకటే ఆలోచిస్తున్నాను. బాబు ఇంకా చిన్నవాడు; వయస్సు తక్కువ" అంది శారదమ్మ, కాఫీకి నీళ్ళు పెడుతూ.
    "వయస్సు కేమి ఉంది, అత్తా! పోనీ, ముందర నిశ్చయం చేసుకుంటే రెండేళ్ళు పోయాక పెళ్ళి చెయ్యవచ్చును" అంది భానుమతి, అత్త ఇంత తొందరగా అంగీకారం తెలిసినందుకు సంతోషిస్తూ.
    "అలాగే నిర్ణయం చేసుకుందాం. నాకు మాలతిని చేసుకోవాలని ఉంది. బాబుకి కూడా మాలతి అంటే ఇష్టం అనుకుంటాను."
    శారదమ్మ మాటలు వింటూనే తెల్లబోయింది భానుమతి. భగవతి కోసం రావటమేమిటి? మాలతికి సంబంధం కుదరటమేమిటి? భానుమతికి ఏం మాట్లాడాలో తెలియలేదు.
    "నీ ఇష్టం, అత్తా ఏ పిల్ల నచ్చితే దాన్నే చేసుకోండి" అని చెప్పి, కాఫీ తాగి, కాస్సేపు కూర్చుని ఇంటి ముఖం పట్టింది.
    సాయంత్రం చారుమతి రాగానే డాబాపైకి తీసుకువెళ్ళి అన్ని విషయాలు చెప్పింది భానుమతి. చారుమతి కూడా ఆశ్చర్యపోయింది.
    "ఇప్పుడు ఏం చెయ్యడం?" అంది భానుమతి.
    "నువ్వు భగవతిని చేసుకోమని అడిగి ఉండవలిసింది" అంది చెల్లెలు.
    ఇద్దరూ ఆ విషయమే ఆలోచిస్తూ కూర్చున్నారు. చివరికి చారుమతే అంది, "ముందు నేను భగవతిని అడుగుతాను,"
    భానుమతి అంగీకారం తెలిసింది.
    సంధ్య పడుతూ ఉండగా భగవతిని తీసుకొని వేణు గోపాలస్వామి ఆలయానికి వెళ్ళింది చారుమతి. ఆ ఆలయంకూడా వీళ్ళ ఇంటినించి ఎక్కువ దూరంలో లేదు. నడిచి వెళ్ళిపోవచ్చును.
    "నీకు గోపాల్ ని పెళ్ళిచేసుకోవడం ఇష్టమేనా?" చారుమతి మాటిగా సంభాషణ ప్రారంభించింది.
    భగవతి ఆశ్చర్యపోయింది.
    "ఇప్పుడు ఎందుకిలా అడుగుతున్నావ్?" అంద్.
    "ఏమీలేదు. నీ అభిప్రాయం తెలుసుకుందామని" అంది చారుమతి.
    "ఏం! బావ నన్న చేసుకుంటానన్నాడా?" భగవతి తిరిగి అక్కని ప్రశ్నించింది.
    "నేను అడిగేది నీ అభిప్రాయం."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS