10
చేతిబిడ్డ మూలుగుతూ, మురికి పేలికల మధ్య పడుకుంది. బిడ్డ, బిడ్డలా లేక కోతి పిల్లలా ఉంది. చీపురుపుల్లలాంటి చేతులూ, కాళ్ళూ, పెద్ద కడుపు, లివర్ జబ్బును తెలియజేస్తున్నాయి.
క్షణక్షణానికి వూపిరి పీల్చటం కష్టమైపోతోంది, బిడ్డకు. వూపిరి పీల్చటానికి ప్రయత్నించి గిలగిలా తన్నుకోసాగింది బిడ్డ. వూపిరి గొంతులోనే నిలిచి, గొరగొర శబ్దం వినిపించింది. బిడ్డ కళ్ళు తేలవేయటం చూసి రాచమ్మ "అయ్యో బిడ్డా" అని, గుండె బాదుకొని ఏడ్వసాగింది. బోరడు మట్టుకు, సంసార వ్యామోహం లేని విరాగిలా, రాతిబొమ్మలా; కూర్చున్నాడు.
మీర బిడ్డకోసం ఏడుస్తున్న తల్లివేపు చూసింది. ఎనమండుగురు పిల్లల తల్లి రాచమ్మ. రసం పీల్చిన చెరుకులా ఉంది. ముడతలు పడిన మొహం, దుమ్ము కొట్టుకున్న తల, కాంతిలేని లోతుకు పోయిన కళ్ళు, క్పశమైన శరీరం......
బోరడివేపు చూసింది, మీర. దృఢకాయుడని చెప్పలేకపోయినా, రాచమ్మలాగ కృశించి లేడతను. ఊపిరాడుతున్న శవంలా ఉన్న, రాచమ్మ మీద ఇంకా ప్రతీకారం తీసుకుంటున్న అతడిని చూసి ఒళ్ళు మండింది మీరకు.
కాని, ..... కాని అతనికి మాత్రం జీవితంలో ఏం సుఖముంది గనుక! ఉదయం నుండి సాయంత్రం దాకా వళ్ళు విరిగేలా చాకిరీచేసి వస్తే, ఇంట్లో ఏవిధమైన సంతోషమూ లేదుకదా? అలసివచ్చి నతనికి వుల్లాసాన్నిచ్చే మొహాలు లేవు. విశ్రాంతి కోసం ఇంటికొచ్చి నతనికి, ఈ పెళ్ళాం బిడ్డల వేపు చూస్తే మరింత బాధే తప్ప వేరే లేదు కదా? భార్యనుండి పొందే సుఖం తప్ప, మరో సుఖం లేదతనికి! ఆ ఒక్క సుఖంలో తన జీవితపు దుఃఖాన్నంతా మరవటానికి ప్రయత్నిస్తా డతను.
మీర బిడ్డ, చిన్ని చేతిని, తన చేతిలోకి తీసుకుంది. బంగారు గాజులతో నిండిన మీర చేతిలో, ఆ పిల్ల చీపురుపుల్లలాంటి చెయ్యి విచిత్రంగా కనిపిస్తోంది.
తను డాక్టరయి ఉంటే? ఎదురుగా తను ఉన్నా, చుట్టూ ఉన్న ఇంతమందిని సాక్ష్యంగా ఉంచుకొని ఆ బిడ్డ ప్రాణం పైకి ఎగిరిపోతూ ఉంటే, అందరూ చూస్తూ వూరికే కూర్చున్నారు. డాక్టరవాలని పలువరించిన మీర ఆ బిడ్డను శూన్య దృష్టితో చూస్తూ కూర్చుంది. ఆమె కళ్ళల్లో నీరు నిండాయి. ఆబిడ్డ అనుభవిస్తూన్న బాధకన్నా, తన నిస్సహాయ పరిస్థితి, ఆమెను ఎక్కువగా బాధపెట్టింది. తను మానవురాలిగా పుట్టి, తెలివి, తీక్షణబుద్ధి కలిగిఉండి, ఆశావాది అయి కూడా ప్రయోజనం లేకపోయింది. గాడిద పొదుగులోని పాల లాగ, ఆమె తెలివంతా ఎందుకూ పనికిరాకుండా పోయింది. తన కళ్ళ ముందే ఒక ప్రాణం ఎగిరిపోతోన్న స్థితి సంభవించినా, తను ఏమీ చేయలేక ఉండిపోవలసి వచ్చింది. ఇంతకన్న ఘోర శిక్ష మరేం కావాలి?
బిడ్ద చెయ్యి మీర చేతిలో ఉండగానే, ఆఖరి శ్వాస తీసింది, బిడ్డ. రాచమ్మ ఏడుపు తారస్థాయి నందుకుంది మీర చేతిలోని బిడ్డ చెయ్యి క్రమముగా చల్లబడసాగింది. ఎంతసేపు అలా కూర్చుందో ఆమెకే తెలియదు. శాము ఆమె భుజం తట్టి "మీరా" అన్నాడు.
"ఏమిటి?"
"పద, ఇంటికి వెడదాం."
మీర బిడ్డ చేతిని దాని రొమ్ము మీ దుంచి, పైకి లేచింది.
ఈ సంఘటనవల్ల మీర మనసులోని కోర్కెమళ్ళీ పెల్లుబికింది. ఇల్లు, వాకిలి, భర్త అందరిని వదిలి డాక్టరవాల్న కోర్కె ఆమె హృదయాన్ని వ్యాపించింది. కాని, మీర కారాగృహంలోని ఖైదీ. నేలకు కొట్టబడిన రబ్బరు బంతిలా పైకి లేస్తున్న తన తీవ్ర వాంఛను, లోలోపలే అణచటానికి ప్రయత్నం చేసింది, మీర.
గౌరీ పండుగ దగ్గర కొస్తోంది. పెళ్ళయిన తొలి ఏడాది గనుక మీరను తప్పక పండుగకు మైసూరికి పంపాలని ఉత్తరం రాశారు. కృష్ణయ్యగారు.
(మైసూరులో భాద్రపద శుద్ధ తదియ, అనగా విఘ్నేశ్వరుని పూజకు ముందు రోజునే స్వర గౌరీవ్రతం చేసుకుంటారు. తెలుగునాట సంక్రాంతి పండుగకు ఆడపిల్లలు పుట్టింటికి వచ్సినట్టుగానే, కన్నడిగుల, ఆడపిల్లలు, గౌరమ్మ పండుగకు పుట్టింటికి వెడుతారు. అందులోనూ ముఖ్యంగా, పెళ్ళయిన ఏడాదికి, తల్లి కూతురు చేత గౌరీపూజ చేయించి, వాయనములు ఇప్పిస్తుంది. ఇది కన్నడిగుల ఆచారము.)
ఊరికి వెళ్ళాలని ఎంతో ఉత్సాహంతో ఉంది, మీర. కాని శాము ఒప్పుకోలేదు. దాంతో భార్యా భర్తల మధ్య చిన్న ఘర్షణ జరిగింది.
"పండుగ అనగానే వచ్చేస్తానంది."
"వీల్లేదు. పుట్టింటికి వెళ్ళాక, వచ్చేమాట వాయిదా పడొచ్చు. నే నది భరించలేను. పండగ ఎక్కడ చేస్తేనేం?"
"అలా చేయను. నన్ను నమ్మండి. పండగ అనగానే వచ్చేస్తాను."
"వీల్లేదంటే వీల్లేదు. నిన్ను వదిలి ఒక్కరోజు కూడ ఉండలేను, నేను." ఖచ్చితంగా చెప్పేశాడు.
ఇది ప్రేమో, స్వార్ధమో అర్ధంగాలేదు, మీరకు. చేదుమాత్రము తేనె పూసి తినిపించి నట్టు, తన స్వార్ధ సాధనకోసం, ప్రేమ పేరుతో శాము తనను, ఇష్టప్రకారమే నడిపించుకోవటం చూసి జుగుప్స కలిగింది, మీరకు. ఇంత చిన్న కోర్కెను నిరాకరించటంతో, ఆమె మనసు అతడి పట్ల విముఖత చెందింది.
ఆఖరికి శాము ఇష్టప్రకారం పల్లెలోనో గౌరి పూజ చేసుకుంది మీర. కూతురు రాదన్న విషయం తెలుసుకున్న కృష్ణయ్యగారు, అక్కడికే మంగళ ద్రవ్యాలు పంపారు. కోపంతోనూ, ఉదాసీనతతోనూ గౌరీపూజ రోజున మీర ఒక్క నగకూడా పెట్టుకోకుండా మామూలు పట్టుచీరతో పూజకు కూర్చోబోతుండగా చూసి శాముకు ఆశ్చర్యం వేసింది. అతనికి తన తల్లి గౌరీపూజ చేసినప్పటి దృశ్యం గుర్తు కొచ్చింది. ఒంటినిండా నగలతో అలంకరించుకొని, చెంపలకు పసుపు రాసుకుని, నుదుటిలో పెద్ద అడ్డబొట్టు పెట్టుకొని, కళ్ళకు కాటుక, తలనిండా పూలు పెట్టుకొని, పూజకు బయలుదేరితే సాక్షాత్ గౌరీదేవిలా ఉండేది. ఈరోజు తల్లి వైభవాణికి విరుద్ధంగా, ఉన్న మీర తీరు అతఃడిని చకితుడిని చేసింది. వెండి గిన్నెలోకి పసుపు కుంకుమ నింపుతున్న మీరను,
"మీరా ఏమిటిది? ఈ చీరతోనే పూజ చేస్తావా?" అనడిగాడు.
"వూఁ ....."
"పెట్టెనిండా అన్ని చీరలుండగా ...."
"గౌరిపూజకు కావలసినది, భక్తి, చీరలు కాదు."
"నిజమె. కాని, భక్తితోపాటు శ్ర్దద్ద కూడా ఉండాలి. అమ్మ ధర్మావరపు చీరల నిండుదనం, ఈ నీ చీరల కొస్తాయా?"
"మీ అమ్మగారి ఇరవై మూరల చీరల బరువు నేను మోయలేను........ అదికాక, సగం చీరంతా కొంగుతో నిండిపోయింది. అలాటి చీరలు నాకు నచ్చవు."
"అయితే ఆ చీరలన్నీ ఏంచెయ్యాలంటావు?"
"అన్ని కత్తిరించి, ఆరు గజాలవిగా మారిస్తే కట్టుకోవచ్చు."
"అసంభవం! ఆ చీరలన్నీ అలాగే మసికొట్టి పోయినా సరే. అమ్మ చీరలు కత్తిరించటానికి మాత్రం ఒప్పుకోను నేను."
"సరే, ఒద్దు."
"చీరలు వద్దు సరె, నగలకేమయ్యాయి?"
"ఆ పూర్వకాలపు నగలు ఎవరు వేసుకుంటారు? వాటిని చెడిపించి, మామిడిపిందెల గొలుసు, నెక్లెసు. మిరియాల గాజులు చేయిస్తే వేసుకోవచ్చు."
ఈసారి వళ్ళు మండింది శాముకు. తనను రెచ్చగొట్టడానికి మీర ఇలా మాట్లాడుతోందని తెలుసుకున్నాడు.
"బంగారం పెట్టెలో ఉంటే మురిగిపోదులే! కాని, నేను బ్రతికి ఉన్నంతకాలం, వాటిని చెరిపించటానికి ఒప్పుకోను." అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
మీర వ్యంగ్యంగా నవ్వి, తను చేస్తున్న పనిలో నిమగ్నురాలయింది. తన మాటను లక్ష్యపెట్టకుండా 'అమ్మ' అని చనిపోయిన తల్లినే తల్చుకొనే శాము పట్ల ఆమె హృదయం కఠినమయింది.
* * *
శాము పొలం దగ్గర, తలకోతుండు చుట్టుకుని, ధోవతి పైకి మడిచికట్టి బురదలో నడుస్తూ పనిచేస్తున్న రైతులకు సలహా లిస్తున్నాడు.
"కాలువ ఇంకాస్త వెడల్పుగా ఉండాలి, కదుట్రా తిమ్మా. నీరు ఆ కొసదాకా పారాలి."
హఠాత్తుగా, దూరంలో ఎవరో వస్తూన్నట్టు కనపడింది, శాముకు. "ఎవరా?" అని చెయ్యి కంటికి అడ్డంగా పెట్టుకొని చూశాడు. చీర చెంగు గాలికి రెపరెప లాడుతోంది. ఇలాంటి సమయంలో మీర అక్కడికి వస్తుందన్న వూహే లేదతనికి. కాని వస్తున్నది మీరేనన్ తెల్లటివాయిల్ చీర ఖచ్చితపరుస్తోంది. ఆమె దగ్గరకు రాగానే, ఎండకు ఎర్రగా కందిపోయిన ఆమె మొహాన్ని చూసి జాలి కలిగింది శాముకు. అంతదూరం గబగబా నడిచిరావటంవల్ల ఆయాసంతో రొప్పుతున్నా మొహంలో ఉల్లాసమూ, ఉత్సాహమూ కొట్టొ'చ్చినట్టు కనిపిస్తున్నాయ్. ఆ సమయంలో మీర మరింత అందంగా కనిపించింది. శాము కళ్ళకు. దగ్గరకు లాక్కోవాలనుకున్నాడు కాని, చుట్టూ ఉన్న మనుష్యులని చూసి, తన కోర్కెను మనసులోనే దాచుకున్నాడు.
"ఏమిటి, దేవిగారు ఇంతదూరం దయచేసేరు?"
"నా ఫ్రెండ్, నర్మద తెలుసుగా మీకు? ఆమెకు ఉత్తరం రాశాను, 'దసరాకు నువ్వూ, చంప, రాజు ఇక్కడికి రండి' అని. ఎల్లుండి వస్తారట. మీకు చెప్పి తనకు బదులు రాద్దామని వచ్చాను."
"ఎండలో ఎందుకొచ్చావు? అయిదింటికి నేనే వచ్చేవాడినిగా."
"పోస్టుకు టైమైపోతుందిగదా అని వచ్చాను. ఈరోజు ఉత్తరం రాస్తే రేపే అందుతుంది."
"రాసెయ్యలేకపోయవా?"
"మీతో చెప్పకుండానే?" అంటూ ఉత్సాహంగా వెనుతిరిగింది మీర. ఇంటికి రాగానే, నర్మదకు బదులు రాసింది.
రెండు రోజులు ఎలా గడిచిందో ఆమెకే తెలియదు. మూడవరోజు ఇల్లంతా శుభ్రంగా కడిగించింది. బీరువాలోని దుమ్ము దులిపి సమంగా సర్దింది.
నర్మదా వాళ్ళు ఉదయపు బండికే వస్తామని రాశారు. ఆరోజు మీర ఆరు గంటలకే లేచి, పూలుకోసి, దండ గుచ్చి, జడ వేసుకుంది. పూలమాల తలలో పెట్టుకుంది. తన కాలేజీ స్నేహితుల స్వాగతానికి ధర్మావరపు చీర అక్కర్లేదనిపించింది. ఆమెకు చాలా ఇష్టమైన జార్జెట్ చీర కట్టుకుంది. అంతలో బండివాడు, నింగడు, రామ లక్ష్మణులను బండికి కట్టి సిద్ధంగా నుంచున్నాడు. పొలంవేపు బయల్దేరుతున్న శామును చూసి, మీర.
