ఆ అమ్మాయి రమ కూతురని రుజువు చెయ్యమన్నాడు మూర్తి. శ్రీనివాసరావు మాట అతను నమ్మలేదు.
విశ్వనాధన్ ని ఏమో అడగాలనీ, ఏదో చెయ్యాలనీ ఉడికిపోతూన్న రామకృష్ణ రండి నాన్నా మనందరం విశ్వనాధన్ ఇంటికి వెళ్దాం అక్కడ ఆమె తాలూకు పుట్టుపూర్వోత్తరాలు గెలుస్తాయి అన్నాడు.
వాడింటికా కోపంగా పళ్ళు కొరికాడు శ్రీనివాసరావు.
అవును, వాన్నీసారి పోలీసుల కప్పగించి......అంటూన్న రామకృష్ణ.
ఏమండీ.... అన్న రాధ గొంతు విని అటు చూశాడు.
ఆరు సంవత్సరాలు నేనెంతో గారంగా పెరిగాను వారింట్లో, వారి సొమ్ము తిని నా శరీరం పెరిగింది. మీరూ నాన్నా కూడా ..... అతని మీది కేతగవులూ తేవద్దు.
రాధా......అసహనంగా అరిచాడు రామకృష్ణ.
అవును అంతే.....ఏమన్నా అడగండి....నా తాలూకు సామాన్లు మా అమ్మ ఎవరో మీరు తెలుసుకోవచ్చు. అంతే కాని వారి కుటుంబాని కెలాటి చికాకులూ తేవద్దు...... నా మీద ఒట్టు అంటూ చివాలున్ వెనుదిరిగి వెళ్ళిపోయింది రాధ.
* * *
డ్రాయింగ్ రూమ్ లో పేపరు చూస్తూ కూర్చున్న విశ్వనాధన్ స్ప్రింగ్ డోర్ తలుపు తెరుచుకో గానే అటుచూసి, పెదవులపై కృత్రిమపు నవ్వు పులుముకుంటూ, హాల్లో రామకృష్ణా గుడ్ మార్నింగ్ అంటూ లేచి నిల్చుని చెయ్యిముందుకు చాచాడు.
అతనివైపు కసిగా చూస్తూ, రాధ, రాదని పిలు ఓసారి విశ్వనాధన్ అన్నాడు రామకృష్ణ.
ప్చ్.....రాధా....... రాధ ఎవరితోనో లేచి పోయిందని చాలా రోజులక్రితమే ఉత్తరం వ్రాశానే...
ఏనుగుపై లంఘించే సింహంలా ముందుకు దూకి విశ్వనాధన్ కాలర్ చేత్తో పట్టుకొని చెళ్ళు చెళ్ళున చెంపలపై కొట్ట్టాడు రామకృష్ణ......రాధ లేచిపోయిందా రాస్కెల్ అంటూ.
చెయ్యెత్తబోయిన విశ్వనాధన్ చేతులు గట్టిగా నొక్కిపట్టుకుని ఛీ.....దుర్మార్గుడా మీ తండ్రి కడుపున చెడబుట్టావ్. నోరెత్తావో.... పోలీసు రిపోర్టిచ్చి నీ పరువు తీస్తాను. మామయ్యా ఇలారా గట్టిగా పిల్చాడు.
శ్రీనివాసరావుని చూసిన విశ్వనాధన్ ఏదో గుర్తొచ్చి బెంబేలెత్తిపోతున్నాడు. రామకృష్ణ చేతిలోఉన్న అతనిచేతులు చిన్నగా కంపిస్తున్నాయ్.
అతని కూతుర్ని అతనికి పదివేల రూపాయలకు అమ్మావ్. అవునా......రాధని- నేను పెళ్ళి చేసుకున్న నా భార్యని హోటలు గదికి పడుపు గత్తెగా. కొట్టి పంపించావు అవునా.
అబద్ధం రాధ నీ భార్య కాదు. అతని కూతురు కాదు అరిచాడు విశ్వనాధన్.
నోర్ముయ్. నోరెత్తావో పోలీసుల్ని పిలుస్తాను. రాధ తాలూకు సామాన్లేమున్నాయో అన్నీ తెప్పించిక్కడికే....పదివేలు. మామయ్య ఇచ్చిన పదివేలు ఇచ్చెయ్ మర్యాదగా. భయంకరంగా ఉన్నాడు రామకృష్ణ.
శ్రీనివాసరావు, మూర్తి, రంగనాధం, శ్రీనివాసరావు మిత్రులు ఆ పట్నంలోనే వుంటూన్న నలుగురు పెద్దలూ వరుసగా ప్రవేశించారా గదిలో.
అందర్నీ చూసి కంగారుగా ఇక దబాయిస్తే లాభం లేదనుకున్న విశ్వనాధన్. గుట్టు చప్పుడు కాకుండా రాధ తాలూకు సామాన్లూ, పదివేల రూపాయలూ ఇచ్చేశాడు.
* * *
తనూ రమా కలసి బ్రతికిన నాటి సంసారంలో కొన్ని సామానులు చూసిన శ్రీనివాసరావు హృదయం ద్రవించింది, కన్నులు చెమ్మగిల్లాయి.
శ్రీనూ అదేమిటలా?......ప్రశ్నించాడు మూర్తి ఏమీలేదు. నేనొక రాక్షసుణ్ణి రాధ రమ కూతురు అవునో కాదో ఆ పెట్టెల్లో ఎక్కడో రమ వ్రాసుకున్న డైరీ లున్నాయట చదువు. మేమిద్దరం తీయించుకున్న ఫోటోలున్నాయట చూడు.. అన్నాడు శ్రీనివాసరావు నిష్టూరంగా.
క్షమించు అందరిలానే నేనూ అనమానపడ్డాను. కానీ.....అంటూ ఆగాడు మూర్తి.
ఇంకేమిటి? వాళ్ళు రిజిష్టరు మ్రాఎజ్ చేసుకున్నట్లు తెల్సుకున్నావుగా. మన వేడుక ఎందుకు మానెయ్యాలి? వాడొక్కడే కొడుకు మీకు-ఒక్కర్తే ఆడపిల్ల నాకు నా ఆస్తిలో సంగోరు రాధకిచ్చి ఘనంగా పెళ్ళి చేస్తాను.
ఎందుకు మామయ్యా అడ్డు తగిలాడు రామకృష్ణ.
కొడుకువైపు చిరాగ్గా చూస్తూ అన్ని టిలో నువ్వు జోక్యం పెట్టుకోకు. అవతల నిశ్చయ మైన సంబంధం తప్పించుకోవాలి అన్నాడు మూర్తి.
ఒరే కని పెంచినందుకు ఒక్క మాటన్నా మీ నాన్న మాటవినరా. నవ్వాడు శ్రీనివాసరావు.
రిజిష్టర్డు మ్యారేజ్ అంటే పెళ్ళి అయినట్టు కాదనీ శాస్త్రోక్తంగా పెళ్ళి జరిపించాలనీ పట్టుపట్టారు జానకమ్మా రంగనాధం రామకృష్ణ తాత రామకృష్ణగారూను.
ముభావంగా ఉండిపోయిన కామేశ్వరి కాళ్ళకు నమస్కరిస్తూన్న పెళ్ళి కొడుకు రామకృష్ణ. ఎందుకమ్మా అంతకోపం! నీ తమ్ముడి కూతుర్నేగా పెళ్ళి చేసుకున్నాను అంటూ నవ్వాడు.
బాగుంది నా కెందుకు రా కోపం! ఈ జరిగినదీ జరుగుతూన్నదీ ఏమిటో అర్ధం చేసుకోలేక చస్తున్నాను. అంటూ వంగి తనకు నమస్కరిస్తూన్న రాదను లేవనెత్తి తమ్ముడు నిందమోపి వదిలేసిన రమ కూతురు అని మనస్సుకి తట్టగానే ఆ స్త్రీ హృదయం ద్రవించి కనులు చెమ్మగిల్లాయి. రాదను దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా తల నిమిరింది కామేశ్వరి.
తర్వాత ఆ పెళ్ళివారికి నాన్న నిశ్చయం చేసిన పెల్లివారికేం చెప్పుకున్నారు? నవ్వుతూ అడిగాడు రామకృష్ణ శ్రీనివాసరావుని.
నీ ఇష్టం తెలుసుకోకుండా ఏ సంబంధం నిశ్చయం చెయ్యకని నేను చెబితే. నా కూతుర్ని నువ్వెక్కడ చేసుకుంటానని వప్పుకుంటావో అని. నాకు తెలియకుండానే ఆ సంబంధం నిశ్చయం చేసుకున్నారు. అస్సలు మీరెప్పుడో రిజిష్టర్ మ్యారేజ్ చేసుకుని భార్యా భర్త అయిపోయారని కాని. లేకపోతే అస్సలు రాదను నీకిచ్చే వాణ్ణి కాను. మీ అమ్మానాన్నా ఉద్దేశ్యం తెల్సుకున్నాక నువ్వు కోరినా రాధ నివ్వకూడదనుకున్నాను.
ఆ వాళ్ళు మీ నాన్నా ఆ పెద్ధమనుష్యులు వెళితే నానా అల్లరీ పెట్టారట. నిశ్చయం అయ్యాక వదిలేస్తే మా పరువుతక్కువ అని పేచీ పెట్టారట. మీ నాన్న పెళ్ళికూతురు తండ్రి కాళ్ళుపట్టుకు ఏడ్చాడట క్షమించమని. అని నవ్వి రాధ ఎన్ని సార్లో. రామకృష్ణ అని నాతో చెప్పేది, ఏవో మాటల్లో అంటే వాసూరావ్ స్నేహితుడు అని మాత్రమే చెప్పేది.
అవును. నేను చెప్పవద్దని ప్రమాణం చేయించానులే మా పెళ్ళిసంగతి. అలా అలా పాకి మావాళ్ళ చెవినపడితే నానా కంగారునూ. నేను వచ్చేకే తెలియబర్చాలని అన్నాడు రామ కృష్ణ అతని మాటకి అడ్డువస్తూ.
తానిక్కడికి వచ్చిన తర్వాత జరిగిన సంగతులన్నీ వ్రాస్తూ, బాసూ నువ్వు నిండుమనస్సుతో మా పెళ్ళి చేశావ్. రాధ ఎందుకు పతనమవుతుంది? నేనెందుకు మోసపోతాను? ఎందుకు విడిపోతాం చెప్పు! నీ రాక కెదురుచూస్తాను. రాధ నీకు నమస్కారములని వ్రాయమన్నది అని వాసూరావ్ కి ఉత్తరం వ్రాశాడు రామకృష్ణ.
..........సమాప్తం..........
