Previous Page Next Page 
చీకటి పొద్దున వెలుగురేఖ పేజి 27


    "సుజాతా, వూరికి వెళ్తానంటున్నావ్" హఠాత్తుగా అంది కల్యాణి. "వారం రోజులు నీవు లేకుండా నేనెలా గడపాలో అర్ధంగావడం లేదు. అన్నట్టు పోనీ, నీవు వెళ్ళటం యెందుకు? మీ నాన్నగారినీ, అమ్మగారినీ యిక్కడకు రమ్మనకూడదా!"
    "అమ్మనీ, నాన్నని రమ్మననా? ఇక్కడికా? ఎక్కడుంటారు" ఆశ్చర్యంగా అడిగింది సుజాత.
    "ఎక్కడుండడం యేమిటీ, ఇక్కడే వుంటారు నాలుగు రోజులు. నిన్ను చూసి వెడతారు. అలా అయితే నీవు వెళ్ళనూ అక్కరలేదు, నా కిబ్బందీ వుండదు."
    "మీ కనవసరంగా యిబ్బందీ, ఖర్చూ, వాళ్ళకీ...." నసిగింది సుజాత.
    "ఏం యిబ్బంది లేదు. ఖర్చుకు నేనేం భయపడను. నాలుగు రోజులు వాళ్ళుంటే నా భాగ్యం తరగదు, అసలింతవరకు యీ ఆలోచన యెందుకు రాలేదా అనుకుంటున్నాను. తప్పకుండా రమ్మని రాయి. ఊరు కూడా చూస్తారు. ఇవాళే వాళ్ళు రావడానికి మనీ ఆర్డరు చెయ్యి..." అంది కల్యాణి.
    సుజాత తల వూపింది.
    
                                              17
    
    సూర్యనారాయణ దంపతులు వచ్చి నాలుగురోజులుండి సుజాతని చూసి వెళ్ళారు. కూతురు ఉద్యోగం ఉద్యోగంలాగె అనిపించలేదు వారికి ఏదో పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళిన అమ్మాయి తన కాపురం దిద్దుకొంటున్నట్టు, ఆమెని చూడడానికి వచ్చినట్టు అనిపించింది. సుజాతకి ఆ యింట్లో వున్న స్వతంత్రం, ఆమెకి ఆ యింటివారిచ్చే గౌరవ మర్యాదలు అన్నీ చూచి పొంగిపోయారు, అదృష్టంవల్ల అలాంటి ఉద్యోగం దొరికిందని సంబరపడిపోయారు. కల్యాణిని సంతోషంతో, కృతజ్ఞతతో పదేపదే పొగిడారు. కల్యాణి కారిచ్చి వాళ్ళకి ఊరంతా చూపించింది.
    వెళ్ళే రోజున సూర్యనారాయణగారు ఆమె ఆదరానికి కృతజ్ఞతలు చెపుతూ, సుజాత పెళ్ళి విషయం యెత్తి ఆమె సహాయం అర్ధించారు.
    సుజాతకి పెళ్ళవగానే ముందు కల్యాణికి తట్టిన విషయం సుజాత లేకుండా తనెలా గడుపుకోడం అన్నది! వారం రోజులు సుజాత లేకుండా గడుపుకోలే నని తల్లితండ్రులని పిలిపించ గల్గింది కానీ, పెళ్ళికాని అమ్మాయికి పెళ్ళి చెయ్యద్దని చెప్పలేదు గదా! పెళ్ళికాకుండా సుజాత యెప్పుడూ అలాగే తనింట్లో పని చేస్తూండిపోవాలని కోరుకోడమూ సమంజసంగాదు గదా! ఎప్పుడో అప్పుడు సుజాతకి పెళ్ళి అవుతుంది. వెళ్ళిపోతుంది. ఆ పరిణామం తను యివాళ, రేపయినా యెదుర్కోక తప్పదు అనిపించి బెంగ కలిగింది కల్యాణికి. తన స్వార్ధం కోసం పెళ్ళీపెటాకులు లేకుండా సుజాత వుండాలని మనసులో కూడా కోరుకోలేదు తను! అంత స్వార్ధపరురాలు కాలేదు! మహా అయితే సుజాత పెళ్ళి అయి వెళ్ళే లోపల యింకో అమ్మాయిని కుదిర్చి, అన్నీ అప్పచెప్పి, నేర్పి వెళ్ళమనాలి! ఆ అమ్మాయి సుజాత అంత మంచిది కావాలని యెక్కడుంది? మళ్ళీ తన అవస్థలు మొదలు గాబోలు! ఆలోచిస్తున్న కళ్యాణికి నవ్వువచ్చింది. మనిషి తనకి యెదురయ్యే యే ఆనందంలో నయినా స్వార్ధాన్నే వెదుక్కుంటాడు. సుజాతకి పెళ్ళి అవాలన్న అందమయిన ఆలోచనని.....తనకి సహాయపడే మనిషి వుండదన్న స్వార్ధం జయించింది. ఆలోచనలలోంచి తేరుకొని "సంబంధాలేమయినా చూస్తున్నారా" అన్నది.
    "ఏవో రెండు మూడు సంబంధాలు చూస్తున్నాను. ఒకబ్బాయి ఎలక్ ట్రిసిటీ డిపార్టుమెంటులో సూపర్ వైజరు, మరో అబ్బాయి బ్యాంకులో గుమాస్తా....."
    "అబ్బేబ్బె......అవేం సంబంధాలు చూస్తూ చూస్తూ సుజాత లాంటి అమ్మాయిని అంత తక్కువ జీతగాళ్ళకి యిస్తారా. సుజాత చక్కని పిల్ల, బి.ఏ.చదివింది" అంది కల్యాణి.
    "ఇంతకంటే గొప్ప సంబంధాలు నే నెక్కడ తేగలనమ్మా, గొప్ప సంబంధాలు కావాలంటే, పిల్ల నచ్చినా కట్నాలు పొయ్యాలి తల్లీ" అన్నాడు సూర్యనారాయణగారు అదోలా నవ్వి- "మా లాంటి సంసారాలలో ఆడపిల్ల సమస్య అయి కూర్చుందమ్మా ఇటు పెళ్ళి కాలేదని చదివించడం, తీరా చదివించాక అంతకంటే చదివిన వాడిని తేలేక పోవడం. చదివించాం ఊరికే వుందని - ఉద్యోగం చేయించుదాం అంటే ఆ ఉద్యోగం దొరక్క పోవడం ఇలా వున్నాయి మా బ్రతుకులు...." నిట్టూర్చాడు ఆయన.
    నిజమే, సుజాతకే అంత గొప్ప పెళ్ళికొడుకులని తేగల తాహతు వుంటే తన దగ్గిరకి ఉద్యోగానికి యెందుకు పంపిస్తారు. పాపం సుజాత లాంటి ఆడపిల్లలు యీ నాటి మధ్య తరగతి సంసారుల ఇండ్లలో ఇంటికి కనీసం ఒకరన్నా వుంటారు! కట్నాలు పోసే తాహతులేక పెళ్ళిళ్ళు కాకుండా వుండిపోతున్న ఆడపిల్ల లెందరో! సుజాత కూడా వాళ్ళలో ఒకర్తే! తను యేం చెయ్యగలదు? మహా చేస్తే తన దగ్గిర పని చేసినందుకు యే వెయ్యో, రెండు వేలో సర్దగలదు అంతకంటే తనేం చెయ్యగలదు! ఈ సమస్య డబ్బుకి సంబంధించినది కాదు. వ్యక్తుల సంస్కారానికి సంబంధించింది. సంఘంలో పెద్దల మనసులు మారాలి. అంతే!
    "వీలయినంత మంచి సంబంధం చూడండి. కాస్త యే నాలుగైదు వందలన్నా తెచ్చుకొనేవాడు కాకపోతే యీ రోజుల్లో బ్రతకడం కష్టం, నేనూ చూస్తూంటాను.....ఎవరన్నా మంచి అబ్బాయి దొరుకుతాడేమో ప్రయత్నిస్తూంటాను..... డబ్బు గురించి ఆలోచించకండి" అన్నది కల్యాణి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS