అతని శరీరం వొణికి పోసాగింది.
ప్రకృతి సిద్దంగా రాతి పలకల మధ్య ఏర్పడిన జాగాల నించి చెట్టు కూకటి వ్రేళ్ళతో పెకిలించుకుని పడిపోతూ ఉండటాన్ని గమనించాడు అర్ధమానవుడు. అవితనమీద ఒరిగిపోకుండా ఉండగలందులకు నిలిచిన చోటునించి రవ్వంత ప్రక్కకుపరుగు తీశాడు. అతడు సంపూర్ణమైన వ్యక్తిత్వాన్ని పొందినవాడే అయినా ముఖ్యంగా మూడు విషయాలలో తెలివి పనిచేస్తోంది.
ఫిజోకి అర్ధమానవుని స్థితి ఏమిటో అర్ధమయింది.
అతనికి ప్రధమంగా ఆత్మరక్షణ తెలుసు. రెండవది ఆహరం సంపాదించుకోవటం తెలుసు. మూడవది విరోధుల్ని కని పెట్టడం కూడా నేర్పిన వాడతడు.
ప్రకృతి సిద్దాంతాలను అనుసరించి సృష్టిలో బలవంతమయిన జాతులు బ్రతుకుతాయి. బహుకాలం మనగలుగుతాయి. బలహీనమయిన జాతులు త్వరగా మనుగడను కోల్పోతాయి. లేదా బలవంతమయిన కోతులు వాటి మనుగడను ఆసాంతం చేస్తాయి.
ప్రకృతి శక్తులను తట్టుకోవటం, విరోధులనుంచి ఆత్మరక్షణ చేసుకోవటం, ఆహారాన్ని సంపాదించు కోవటం అనే అంశాల మీద జాతులు వృద్ధి అవుతాయి.
ఈవిద్యలలో ఆరితేరినవాడు మనిషి. అందునించే అనేకమయిన ఆధిపత్యం ఉందని నిరూపించుకుంటూ వస్తున్నాడు.
మనిషికి వుండే ఈ ఆధిపత్యం, ఆధిక్యత అనేవి జాతి పరమయిన సహజాతులు. అవి నాగరికులలో ఒకరీతిలో ఉంటాయి. అనాగరికులలో మరొక రూపంలో ఉంటాయి కాని వారికీ వీరికీ ఉండి తీరుతాయి.
అటువంటి మెళుకువనే అనాగరికుడయిన అర్ధమానవుడు ప్రదర్శించాడు. ఇంక అతని చేతిలో తన చావు అనివార్యం అని భావించి కళ్ళుగట్టిగా మూసేసుకున్నాడు నిస్సహాయుడైన ఫిజో.
అడవులలో మృగాల మధ్యఎంతో అనుభవం గడించైనా అతడు ఈ మానవమృగం ముందునిస్సహాయుడై తలఒగ్గి మరణాన్ని స్మరిస్తూ ఉండిపోయినాడు.
లేచేందుకు, పరుగుతీసేందుకయినా శక్తిలేదు.
వృక్షాలు కూలిపోయినాయి. అదృష్ట వశాత్తూ ఫిజో తల క్రిందులు కాలేదు. ఎలా కొమ్మలమీద ఉండి ఉయ్యాల ఊగుతున్నాడో అలాగే నేల మీదికి వచ్చి పడ్డాడు. అయినా కొమ్మలు నేలను తాకలేదు. అతని శరీరంమీద క్రొత్తగాయాలేవీ తగల లేదు.
వృక్షాలు విరిగిపడిన తరువాత అర్ధమానవుడు వాటిపై నుంచి చూపు మరల్చుకోలేదు. మరికొద్ది క్షణాలకే తాను అన్వేషించే మానవుడు ఆకొమ్మల మీద ఉన్న సంగతి అతనికి తెలిసిపోయింది.
మరుక్షణం వింటి నించి దూసుకువచ్చిన బాణంలా ఫిజోని సమీపించాడతడు. తిరిగి అతడిని రెండు చేతుల మీద పైకి ఎత్తేశాడు.
మరొక అర నిమిషం తరువాత అతడు గిరగిర త్రిప్పి తనను నేలకు కొట్టేస్తాడు. కాళ్ళు చేతులు విరుగుతాయో! తల బ్రద్దలు అవుతుందో!
ఏమవుతుందో తెలియదు ప్రాణంపోతే మంచిదే అలా కాక ఎముకల నుగ్గు నుగ్గు అయి కొనఊపిరితో బ్రతికి ఉంటే ఈ చలిలో, దిక్కూ మొక్కూ లేని ఈ చోటున తన బంధు జనులకు వందలాది కిలోమీటర్ల దూరాన అటుచావూ ఇటు బ్రతుకూ కాని నరకాన్ని ఎలా భరించాలి. ఇవి తుది క్షణాలు.
యింత శ్రమించి ప్రాణాలను అర్పించేందుకు సిద్దపడి కూడా మాలతిని చూడలేక పోయినాడు తను. అదే దురదృష్టంతో కెప్టెన్ మాలతి ఏమయిందో? తనలాగే........?
అర్ధమానవుడు రాక్షస బలంతో అతనిని చేతులమీద మీద ఎత్తిగిరగిరా త్రిప్పుతున్నాడు. ఆ వేగానికి రక్త ప్రసారం ఆగి పోయినట్లు అన్పించింది.
ఆలోచనలు కట్టుబడినాయి.
మరికొద్దిక్షణాలలో మృత్యువును కౌగిలించుకునేందుకు సంసిద్ధుడయినాడు ఫిజో. ఆసమయంలో ఆలోయలోని గుహ లన్నీ ప్రతిధ్వనించేలా, గిరిశిఖరాలు అదరిపడి విరిగిపడేలాంటి ఓ కేక విన్పించింది.
ఆ కేకతో తిరుగుతున్న వాడల్లా ఆగిపోయినాడు అర్ధమానవుడు. కనుల ఎదుట అతని ఆరాధనామూర్తి అయిన మాలతి ప్రత్యక్షమయింది. ఆమె ముఖం చాల ఉద్విగ్నంగా ఉంది. రెండు చేతులూ ఎత్తికేక పట్టిందామె. కొండలు అదిరిపడినాయి. కోనలు ప్రతిధ్వనించాయి.
దూరంగా ఉన్న గిరి శిఖరాలను తాకిన అనేక తాలూకు ప్రతి ధ్వనులు వరుసగా యింకా వొస్తూనే ఉన్నాయి.
అర్ధమానవుడికి కెప్టెన్ మాలతి ముఖము ఏమిటో అర్ధమయింది. ఆమె పరుగు పరుగున తన వైపుగా వస్తోంది. తన ఆరాధనామూర్తి అయిన ఆమె అభీష్టానికి వ్యతిరేకంగా మరొక్క పనిని అతడు చేయలేదు.
కాని చేతిలో చిక్కినశత్రువుని వొదులుకోవటం అతని ప్రకృతికి, నైజానికి విరుద్ధ మనిపించింది. విరోధులమీద యుద్దాన్ని ప్రకటించి పోరాడటం సాహస లక్షణం. అది పుష్కలంగా ఉన్న ప్రకృతి పుత్రుడు అతడు.
బలహీనమయిన విరోధిని క్షమించి వొదిలేయటం ఉన్నత మానవ సంస్కారం. కానిచేతికి చిక్కిన శత్రుప్రాణిని వొదిలేయటం ఆటవిక ధర్మం కాదు.
విరోధిని చంపే అవకాశం వచ్చినప్పుడు ఉత్సాహం యినుమడించటమనేది ప్రకృతి లక్షణమే! అటువంటి తన ఉత్సాహానికి అడ్డునిలిచినవారు ఎవరైనా సరే మరొకరు అయితే మాత్రం అతడు క్షమించి ఉండేవాడు కాదు.
కాని ఆ వచ్చే మూర్తి తని హృదయాన్ని శాసించగల దేవత:
అందునించి నిలిచిపోయినాడు అర్ధమానవుడు. ఆమె అభిప్రాయమేమిటో కూడా అతనికి స్పష్టంగా అర్ధమయింది. ఈ లోగా ఆమె మరింత చేరువ అయింది.
తన ఆరాధ్య దేవత అభిప్రాయాన్ని దాటిపోగల శక్తి ఆ ప్రకృతి పుత్రునికి లేదు.
అలాగని అతనితో ప్రకోపించిన ఆటవిక న్యాయం చప్పగా చల్లార లేదు. శక్తి అంతా నీరుకారిపోలేదు. ఉవ్వెత్తున కెరటంలా లేచిన ఉత్సాహం విరిగిపడిపోలేదు.
