Previous Page Next Page 
మట్టి మనిషి పేజి 27


    సాంబయ్యను కిందా మీదా పెట్టి ముఫ్ఫైనుంచి పాతికవేలకు దించా! డబ్బు కోసం వెళ్ళి సంతనచేసుకొని ఇంతకుముందే వచ్చాను. మనం అనుకున్నపని అనుకున్నట్టు జరక్కపోతే నాకు నిద్రపట్టదు. మీరు ఊ అంటే ముహూర్తం పెట్టుకోవచ్చు." నొసటి చిరుచెమటలు తుడుచుకొని ఊపిరి పీల్చుకొన్నాడు కనకయ్య.
    బలరామయ్య హృదయంలో కనకయ్య మంచిచోటే ఏర్పరచుకొన్నాడు ఎంత అభిమానం కనకయ్యకు? అయినవాళ్ళల్లో ఒక్కడైనా ఈమాత్రం ముందుకొచ్చాడా?
    "కనకయ్యా! పాతికవేల కట్నం ఇచ్చి ఆ వెంకటపతికే మన అమ్మాయిని ఇవ్వడం ఎందుకు? ఆ మాత్రం...."
    బలరామయ్య మాటను తుంచి అన్నాడు కనకయ్య----"బలరామయ్యగారూ, ఇంకా వెనకా ముందు చూడొద్దు. డబ్బెక్కడికి పోతుంది? నలుగురు పంచుకొనే సంసారమా ఏమన్నానా? అదంతా మన అమ్మాయిది కాదూ? వెంకటపతి మీ అల్లుడుకాడా?"
    బలరామయ్య కనకయ్య చెప్పిందంతా ఒప్పుకొన్నాడు. అంతకంటే తను వేరే చెయ్యగలిగిందేమీ లేదనే వాస్తవంకూడా బలరామయ్య నిర్ణయానికి దోహదాన్ని ఇచ్చింది.
    "మిగతా కొరవా, పెళ్ళిఖర్చులూ కలిపితే ఇంకా ఎంతలేదన్నా --కావాలిగా?" సందేహాన్ని తెలియజేశాడు బలరామయ్య.
    "అదీ ఏర్పాటు చేస్తాగా?" ధీమాగా అన్నాడు కనకయ్య.
    బలరామయ్య మనసు కుదుటపడింది. లేచి నిలబడ్డాడు. ఆప్తుడైన కనకయ్యను మాటల్లో ఎలా అభినందించాలో తెలియక కృతజ్ఞతాభావంతో చూశాడు.
    కనకయ్య బలరామయ్యను ఇంటిదాకా సాగనంపాడు. సాంబయ్య ఇంటికి వెళ్ళాడు. వరండాలో నిలబడే సాంబయ్యను కేకవేశాడు. ఆ కేకలో "ఈసారి నిన్ను వదల్ను, నీ అంతు తేల్చుకోకుండా ఇవ్వాళ వెళ్ళేది లేదు!" అన్న భావం స్ఫురించింది.
    
                          *    *    *
    
    పెళ్ళి యింకా వారంరోజులే వుంది. కనకయ్య ఇరవైవేల రూపాయలు తెచ్చి బలరామయ్య ముందు పెట్టి చెప్పాడు - "ఈ డబ్బు మా అబ్బాయి మామగార్ధి! ఆయన మనిషిని నమ్మేరకం గాదు. ఇంత డబ్బు ఏ హామీ లేకుండా ఇవ్వటానికి గుణుస్తున్నాడు."
    "కావాలంటే మనపొలం హామీ పెడ్దాం" అన్నాడు బలరామయ్య.
    "తాకట్టుకింద వున్న పొలాన్ని ఎవరు హామీగా ఒప్పుకుంటారు?" అన్నాడు కనకయ్య.
    "మరేం చేద్దాం?" బలరామయ్య ఆలోచనలోపడి అన్నాడు.
    "అమ్మాయికి మూడుముళ్ళు పడ్డాక ఆ పొలం అమ్మి అప్పులు తీర్చి ఒడ్డున పడటం మంచిది - నన్నడిగితే!" కనకయ్య బలరామయ్య ముఖంలోకి చూశాడు.
    "అదే మంచిదేమో! లేకపోతే యీ వడ్డీలూ, అప్పూ - పైగా ఈ ముఫ్ఫై వేలూ ఎలా తీర్చటం?" బలరామయ్య మూలిగాడు.
    "మెల్లగా అంటారేం? ఎకరం అయిదువేలు పడ్తుంది. తొంభయ్ వేలుదాకా వస్తుంది. అప్పులు తీరగా పదో, ఇరవయ్యో మీ చేతిలో వుంటుంది. అమ్మాయి పెళ్ళయి కాపరానికి వెళ్తే మీకేం బాదరబందీ ఉండదు. మీ భార్యాభర్తలు కృష్ణా రామా అంటూ నిశ్చింతగా కాలం గడపొచ్చు."
    "అంతే కనకయ్యా, అంతే!" భవిష్యత్తులో ప్రశాంత జీవితాన్ని వూహించుకొంటూ అన్నాడు బలరామయ్య.
    "మరి మీ వియ్యంకుడి కేం చెబుదాం? అంతవరకూ ఏదో ఒకటి చూపించాలిగా - ఆయన సంతృప్తి కోసమయినా?"
    బలరామయ్యకు ఏమీ తోచక ఒట్టి చేతులాడిస్తూ "ఇంకా ఏముందయ్యా నా దగ్గిర హామీ పెట్టటానికి?" అన్నాడు.
    'ప్చ్! ఉన్నదేదయినా పెట్టాల్సిందేగా?" మేడ దూలాల కేసి తలతిప్పి కిటికీ రంగు అద్దాలలోనుంచి బయటకు చూశాడు కనకయ్య.
    "కనకయ్యా! ఈ మేడ తాకట్టు పెట్టమంటావా - మీ వియ్యంకుడికి?"
    "బలరామయ్యగారూ! మీ బాధ నాకు తెలుసు. హామీ పేరుకే! అంతగా ఆయనకు తాకట్టు పెట్టటం మీ కిష్టం లేకపోతే నా పేరుమీద చేయండి. మనలోనే ఉండిపోతుంది! మా వియ్యంకుడికి చెప్పి ఒప్పిస్తాను. సరేనా? శుభకార్యం తలపెట్టాక తప్పేదేముంది?"
    "సరే! నోటు రాయించు. అంతా పోయాక ఇది వుండి నన్ను ఉద్దరిస్తుందా?" బలరామయ్య వరండా స్తంభాల కేసి చూస్తూ నిండార్లాయి అన్నాడు.
    
                            11
    
    సాంబయ్య పెళ్ళిపనులు జోరుగా చేయించసాగాడు. శుభలేఖలు అచ్చువేయించటానికి కనకయ్యతో బస్తీకి వెళ్ళాడు. చౌకరకం కార్డులు వదిలేసి, ఒక్కొక్కటి  అర్ధరూపాయిపైగా ఉన్నవాటిని సాంబయ్య ఎన్నుకోవటం చూసిన కనకయ్య తనకళ్ళను తనే నమ్మలేకపోయాడు. ఐదువేలకు పైగా పెళ్ళిసంబరాలు కొన్నాడు సాంబయ్య. గడ్డిపరక పోనీయని సాంబయ్య - ఎంగిలి చేత్తో కాకిని తోలని సాంబయ్య చేస్తున్న ఖర్చు కళ్ళారచూస్తున్న కనకయ్య "ఈ సాంబయ్య ఆ సాంబయ్య కాదు" అనుకొన్నాడు.
    సాంబయ్య శుభలేఖలు ఊరంతా పంచాడు. శుభలేఖలు  అందుకొన్న వాళ్ళు దిమ్మెరపోయారు. వాళ్ళు కనీ వినినంతవరకు అంత పెద్ద ఎత్తున శుభలేఖలు వేయించటం ఎరగరు. ఒక్కొక్కటి చిన్నసైజు చాటంత ఉంది. పైన రంగులూ, కవరుమీద కూడా లతలూ వగైరా నగిషీ పనితో శుభలేఖలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఏ జమీందార్ల ఇళ్ళల్లోనో పెళ్ళిళ్ళయినప్పుడు మాత్రమే అలాంటివి వేయిస్తారని పెద్దలు చెప్పారు.
    సాంబయ్య ఇంటి ముందునుంచి మెరకవీధిదాకా ఒకే పందిరి వేయించాడు. పందిరికి కాగితంపూలూ, చెమికీలూ కుట్టించడానికి బస్తీ నుంచి మనుషుల్ని పిలిపించాడు. నలభై మోతలెట్లూ, బ్యాండుమేళమూ ముందే మాట్లాడి పెట్టాడు. పెళ్ళి మూడురోజులు ఉందనగా వంటవాళ్ళను పిలిపించి లడ్లూ, అరిశలూ చేయించాడు.
    చుట్టుపక్కల పది వూళ్ళదాకా సాంబయ్య ఇంట్లో పెళ్ళి గురించి చెప్పుకోసాగారు. బలరామయ్య పెళ్ళి ఆయన తండ్రి వీరభద్రయ్యగారు చేయించిన తీరు ఆ వూళ్ళో జ్ఞాపకం వున్నవాళ్ళు ఈనాటికీ చెప్పుకొంటారు. వాళ్ళు యీనాడు సాంబయ్య చేయిస్తున్న ఏర్పాట్లుచూసి విస్తుపోయారు. కనకయ్యకు మొలమీద బట్ట నిలవడంలేదు. పెళ్ళి హడావిడిలో తలమునకలై తిరుగుతున్నాడు. ఉత్తరాది నుంచి వచ్చిన సాంబయ్య బంధువులకు సాంబయ్య ఇంద్రలోకం సృష్టించినట్టనిపించింది.
    సాంబయ్య వెంకటపతిని పెళ్ళికొడుకును చేయించాడు. అడిగట్లో వున్న ఇల్లయినా పెళ్ళికొడుకు కార్లోనే తరలివెళ్ళాలని సాంబయ్య పట్టుపట్టాడు. గంటల మీద కనకయ్య బస్తీ నుంచి కారు తెప్పించాడు. రెండు గుర్రాలుకూడా తెప్పించాడు సాంబయ్య. జమీందార్ల ఇళ్ళలో జరిగేలాంటి ఆర్భాటంతో పెళ్ళికొడుకుని తీసుకొని తరలివచ్చాడు బలరామయ్య ఇంటికి సాంబయ్య.
    పెళ్ళిపందిరి జనంతో కిటకిటలాడిపోతూంది. ముందు 'రాము' అని భీష్మించుకొన్నవాళ్ళంతా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పెళ్ళిపందిట్లోకి వస్తున్నారు. ఆ రోజు వూరంతా పెళ్ళి సంబరంలో మునిగిపోయింది.
    సూత్రధారణ సమయం దగ్గిర పడుతుండగా పౌరోహితులు అక్షింతలు పంచారు. వెంకటపతి మంగళసూత్రం పట్టుకొని లేచాడు.
    ఖద్దరుసిల్కు లాల్చీ, పొందూరుధోవతి కట్టి వంకెకర్ర చేతపట్టుకొని పెళ్ళి మండపానికి అంతదూరంలో నిలబడివున్న సాంబయ్యకు వళ్ళు పులకరించిపోయింది...
    "వూరుబోయిన వెంకయ్య మనవడా-షావుకారు వీరభద్రయ్యగారి మనమరాలి పుస్తి కట్టు. అలగావాళ్ళు కుర్రాడా - భూస్వామి బలరామయ్య కూతురు మాంగల్యం కట్టు! పాలేరు సాంబయ్య కొడుకా - షావుకారు బలరామయ్య కూతురు మెళ్ళో తాళి కట్టరా!" - సాంబయ్య హృదయంలో గూడుకట్టుకొన్న కసీ, అవమానం కట్టలు తెంచుకొంది. సాంబయ్య రక్తం ఉద్వేగంతో కట్టలు తెంచుకొంది.
    "వాయించండర్రా భజంత్రీలు!" సాంబయ్య కంఠమే నగారాలా మోగింది.
    భజంత్రీలు ఒక్క ఊపున అందుకున్నారు. చెవులు చిల్లులుపడేంతగా మేళాలు వినిపిస్తుండగా, తారస్థాయిన పౌరోహితుడు మంత్రాలు చదువుతుండగా వెంకటపతి వరూధిని మెడలో తాళి కట్టాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS