"అమ్మా! డబ్బింగ్ ఎప్పుడు పెడదాం" అని పిళ్ళైగారు నన్ను అడిగారు. "మీరిప్పుడు పెడతాం అన్నా మేం రడీ సార్! పోర్షన్ కూడా రాసి సిద్దంగా వుంచాన"ని చెప్పాను.
"వెరీగుడ్ - వెరీగుడ్ నాకు తెలుసమ్మా ఎలాగో నానా అవస్థలూ పడి అన్న టైం కి అన్నీ రాయించేసి సిద్దం చేస్తారానం"టూ వెళ్ళిపోయారు.
అందరం కూర్చొని, పిక్చర్లో ఆర్టిస్టుల పేర్లు ఒక పేపర్లో రాసి ఏ క్యారెక్టర్ కి ఎవరి వాయిస్ పెట్టాలన్న చర్చలో పడ్డాం.
ప్రొడ్యూసర్లు కొంతమందిని చెప్పారు. శ్రీశ్రీగారు నలుగుర్ని చెప్పారు. అందులో ఒక లేడీ కూడా వుంది.
నాకు ఎవరూ తెలీదు కనుక నోరు మూసుకున్నాను. "భానుమతిగారు ఆమె వాయిస్ కి ఆమె మాట్లాడతారని, పద్మిని వాయిస్ కి టి.జి కమల అని ముందే నిర్ధారణ అయిపోయింది. మిగిలిన క్యారెక్టర్ లకే చూసుకోవాల"ని చెప్పారు. అప్పుడు నేను కల్పించుకుని, "మెయిన్ మగవేషాలకి కూడా వాయిస్ లు ఫిక్స్ చెయ్యండి. ఎక్ స్ట్రాలకి చాలామంది కావాలి. ఆరుగురు మగవాళ్ళని, నలుగురు ఆడవాళ్ళని కూడా పిలిపించండి.
ఎవరికి ఏ క్యారెక్టర్ అని చెప్పవద్దు. 'అందరికీ ముందు పిక్చర్ చూపిద్దాం. తర్వాత ఒక రోజు టైం ఇచ్చి మూడవ రోజు అందర్నీ ఆఫీసుకి పిలిపిద్దాం. మాట్లాడి అగ్రిమెంట్ చేసి అడ్వాన్స్ లిద్దాం. ఆ తర్వాత డబ్బింగ్ కాల్ షీట్లు ఫిక్స్ చేద్దాం" - అన్నాను.
అందరికీ నా మాట నచ్చింది. శ్రీశ్రీగారి ముఖం చూశాను. ఆయన ఏమీ మాట్లాడలేదు.
"మీ ఉద్దేశం ఏమిటండీ" అనడిగాను.
"నువ్వు చెప్పింది బాగానే వుంది" అన్నారు.
"థాంక్స్" - అన్నాను.
"అయితే ఎప్పుడు ప్రొజక్షన్ వేద్దాం శ్రీశ్రీగారూ!" - అని ప్రొడ్యూసర్లు అడిగారు.
"మీ ఇష్టం" అన్నారు.
"ఏమమ్మా?" - అని నన్నడిగారు.
"రేపు భానుమతిగారి రికార్డింగ్ అయిపోతుంది. ఎల్లుండి ఏర్పాటు చెయ్యండ"న్నాను.
"వెరీగుడ్ మేడమ్! అలాగే చేద్దాం" అన్నారు.
భానుమతిగారి రికార్డింగ్ అనేసరికి నాకు భలే హుషారొచ్చింది. మొదటి నుండి నాకిష్టమైన ఆర్టిస్ట్ ఆమె. నా చిన్న తనంలో ఆమె నేవరయినా ఏదయినా అంటే వారితో పోట్లాడేదాన్ని.
వేరే పేపరు తీసుకుని, బాగా పెద్ద అక్షరాల్తో చక్కగా కార్బన్ పెట్టి భానుమతిగారు పాడే పాటని మాత్రం మూడు కాపీలు తీశాను.
ఒకటి భానుమతిగారికి, రెండవది శ్రీశ్రీగారికి, మూడవది నాకు ముందుగా రిహార్సల్స్ ఏమీ లేవు. ఒరిజనల్లో భానుమతిగారే పాడారు! తిన్నగా రికార్డింగ్ కే వచ్చేస్తానన్నారు.
మర్నాడు అందరూ ఏడు గంటలకే స్టూడియోకి వెళ్ళి కూర్చున్నారు. ఆర్కెస్ట్రా అంతా రిహార్సల్స్ చేసుకుని సిద్దంగా వున్నారు.
నేను, శ్రీశ్రీగారు తొమ్మిది గంటలకి వెళ్ళాం. భానుమతిగారు పదిగంటలకి వచ్చారు. వస్తూనే "అందరూ రడీయేనాని" అడిగారు.
నేను పాట పేపరు పట్టుకుని ముందుకు వెళ్ళాను. శ్రీశ్రీగారు ఇంజనీర్ రూమ్ లోనే కూర్చున్నారు.
భానుమతిగారికి నమస్కారం చేశాను. నిగర్వంగా, ఆప్యాయంగా ఆమె చక్కని చిరునవ్వుతో ప్రతి నమస్కారం చేశారు.
ఇంతలో - శ్రీశ్రీగారు థియేటర్ లోకి వచ్చారు.
"మిస్టర్ పిళ్ళై! ఈయనెవరు?... మీపేరేమిటి?" - అని శ్రీశ్రీగారిని అడిగారు భానుమతిగారు.
"సాహసవీరుడు"
అని జవాబిచ్చి, గట్టిగా దమ్ములాగుతూ బైటవరండాలో కుర్చీ వేయించుకుని కూర్చున్నారు.
భానుమతి నిర్ఘాంతపోయారు. నేను శ్రీశ్రీ గారిచ్చిన రిప్లయ్ కి గతుక్కుమన్నాను.
భానుమతిగారు ఏ మూడ్ లో వుండి అలా అడిగారో! లేకపోతే ఫిలిం ప్రపంచంలో మణిమకుటమైన ఆమెకు శ్రీశ్రీగారు తెలియకపోవడమేమిటి! నేను శ్రీశ్రీగారి దగ్గరకి వెళ్ళి "ఏమిటా సమాధానమండీ" అని అడిగాను.
"లేకపోతే ఏమిటి? నిజంగానే నా పేరేమిటో ఆవిడకు తెలీదా? నువ్వు వెళ్ళి నీ వని చూసుకోన్నారు.
భానుమతి గారు నన్ను పిలిచి, "అదేమిటి? ఆయన పేరు 'సాహసవీరుడు' అంటారేమిటి?" అనడిగారు.
"అవునండీ! ఈ పిక్చర్ కి తెలుగులో అదే పేరు. శ్రీశ్రీగారు పెట్టారు" - అన్నాను. ఆమె వెంటనే నాలిక్కరుచుకున్నారు.
"శ్రీశ్రీగారు త్రినేత్రున్నయినా లక్ష్యపెట్టే ఘటంకాదురా బాబూ' - అని అప్పుడనిపించింది.
* * *
ఎవరామె?
"నీ పేరేమిటమ్మాయి? ఎవరి దగ్గర పని చేస్తున్నావు?" అని భానుమతిగారు నన్నడిగారు.
"నేను శ్రీశ్రీగారి అసిస్టెంట్ నండీ, నా పేరు సరోజా" అన్నాను.
"దా. ఇలా కూర్చో" - అని ఆమె పక్కనే వున్న కుర్చీ చూపించారు. నేను కూర్చున్నాక "ఆ పాట ఒకసారి పూర్తిగా చదువమ్మాయన్నారు."
చదివాను. మధ్యలో ఆమె అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాను.
"ఒకసారి పిక్చర్ తో చూద్దామా?" అని.
సాంగ్ చూశాక ప్రొడ్యూసర్ని పిలిచి "మిస్టర్ పిళ్ళై! మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కడ?" అనడిగారు.
ఇబ్రహీం గారిని పిలిచి పరిచయం చేశారు.
"మిస్టర్ ఇబ్రహీం! టేక్ చేద్దామా" అనడిగారు.
ఆయన బిత్తరపోయారు. నేను మాత్రం చాలా గర్వించాను.
మూడు టేకులు చేశారు. మూడు టేకులూ బాగానేవున్నాయి. "నాకయితే సెకండ్ టేక్ వచ్చింది. తర్వాత మీ యిష్టం" అని రెండు గంటల్లో పాట పూర్తిచేసి, "వస్తానమ్మాయ్!" - అని చెప్పి వెళ్ళిపోయారు.
మధ్యమధ్యలో, "పాట బాగా వచ్చిందా? మరో టేక్ చేద్దామా?" అని ఆమె నన్నడిగితే, "మీ ఇష్టం మీరెలాగంటే అలాగే" - అనేదాన్ని.
ఆమెకు గర్వమని అన్నవాళ్ళను ఏం చెయ్యాలా - అన్నంత ఆగ్రహం వచ్చింది నాకు.
పాట అందరికీ బాగా నచ్చింది.
భానుమతిగారు శ్రీశ్రీగార్ని చూసి, "పాట బాగా వచ్చిందండీ కవిగారూ!" - అన్నారు.
శ్రీశ్రీగారిని భానుమతిగారు పేరడిగితే, 'సాహసవీరుడు - అని చెప్పాన"ని శ్రీశ్రీగారు కూడా 'పాడవోయి భారతీయుడా' అనే తమ మొదటి పాటల పుస్తకంలోనో లేక శ్రీశ్రీ షష్టిపూర్తి వాల్యూమ్స్ లోనే ఫలానాదాంట్లో రాశానని చెప్పలేను గానీ రాయడం మాత్రం రాశారు.
భానుమతిగారి పాటతో పిక్చర్ ప్రారంభం చేశాం.
రెండవ రోజు ఆర్టిస్టులతో ప్రోగ్రాం. సాయంత్రం నాలుగు గంటలకి ఆఫీసులో కలుసుకుందామనుకుని ఇళ్ళకు బయలుదేరాం.
* * *
ఆఫీసుకి మేం చేరుకునేసరికి ప్రొడ్యూసర్లు ఇద్దరూ మా కోసం ఎదురు చూస్తున్నారు.
శ్రీశ్రీగారిని చోదోఅగానే "రండి రండి శ్రీశ్రీగారూ! అందరూ పాట చాలా బాగుందని, లిప్ బాగా కుదిరిందని అన్నారండి. అంతేకాదు - సరోజా మేడం ని అందరూ చాలా మెచ్చుకుంటున్నారు సార్! భానుమతిగారు కూడా ఈమె గురించి అడిగారు" అని పిళ్ళైగారన్నారు.
ఆ రోజుల్లో డబ్బింగ్ లో హేమాహేమీలనుకునేవాళ్ళందర్నీ లిస్ట్ లో వేశారు. ఒక్కో క్యారెక్టర్ కి ఎంత ఇవ్వాలన్నది కూడా లిస్ట్ తో పాటూ వేసేసుకున్నాం. ఉదయం పదిగంటలకి ఆఫీసుకి ఆర్టిస్టులంతా వచ్చేలా ఏర్పాటు చేశారు.
మిగిలిన పాటలు కూడా పూర్తి చేసి రికార్డింగ్, తర్వాత డబ్బింగ్ ప్ర్రారంభించాలని నిర్ణయించుకున్నాం.
ఇంతలోగా ఫోన్ వచ్చింది. పిళ్ళైగారు మాట్లాడి వచ్చి, "భానుమతిగారు వారంలోగా తన పోర్షన్ డైలాగ్స్, మిగిలిన పాటలు పూర్తి చేసుకోమని చెప్తున్నారు. తర్వాత - ఆమెకు తీరిక వుండదట. 'మీ పిక్చర్ నావల్ల ఆలస్యం అవడం నాకిష్టం లేద'న్నారని చెప్పారు.
"మనకంతకన్నా ఏంకావాలి సార్! మనం పోర్షన్లతో సహా రడీయేగా ఆ మాటే మీరు కూడా ఆమెకు చెప్పేయండి" - అన్నాను.
