దేశం మేలుకుంటోంది. నిద్రావస్థను వొదిలించుకుంటోంది.
ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీమీదే అలహాబాద్ కోర్టులో దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన కేసు మొదలయింది.
సంవత్సరాల తరబడి దేశ రాజకీయాల్లో సుస్థిరత లేక, ప్రజల్లోకి పూర్తిగా దూసుకుపోలేని జె.పి. ముందుకు వస్తున్నారు. ఈనాటికి అతని అభిప్రాయాలన్నిటికీ పరిపక్వత చేకూర్చుకుని, తన కంఠాన్ని ఎలుగెత్తి చాటుతూ ప్రజలకు యిదివరకెన్నడూ కానంత సన్నిహితుడవుతున్నాడు.
అలహాబాద్ కేసు జడ్జిమెంట్ వచ్చేసింది. ఇందిరా గాంధీ పదవినుంచి వైదొలగాలని అందులోని పాఠం.
ఆమె ప్రజాస్వామ్యాన్ని తన పలుకుబడితో, పదవీ బలంతో నేలరాచి పారేసింది. నేను సింహాసనంనుంచి దిగనని భీష్మించుకు కూర్చుంది.
జే.పి విజ్రుంభించాడు. దేశంలోని నలువైపులా తన చైతన్యవంతమైన విప్లవశంఖాన్ని పూరించాడు.
అనంతమూర్తికి యిన్నాళ్ళబట్టీ అన్వేషిస్తున్న దిలభించి నట్లయింది. ఈ దేశంలో రానున్న మార్పు అతనికి జే.పి రూపంలో కనిపించాడు. అతని కలం చిందులు త్రొక్కింది. అతని సంపాదకీయాలు, వ్యాసాలు ప్రజల్లో చైతన్యం కలిగించసాగాయి. అంతేకాదు. అతను ఉద్రేకపూరితమైన ఉపన్యాసకుడు కూడా అయినాడు. వ్యక్తి ఆరాధన గురించి, నియంతృత్వ ధోరణుల గురించి, ప్రజాస్వామ్యానికి యిక్కడ జరుగుతోన్న అన్యాయం గురించి అతను మాట్లాడుతున్న ప్పుడు శరీరం ఉడుకెత్తిపోయేది. అతనిమీద పోలీసుల దృష్టి పడింది. అతనెక్కడికి వెళ్ళినా పోలీసు దళం రహస్యంగా వెంటపడుతూ వుండేది.
ప్రజల్లో చైతన్యం బాగా పెరిగి, అది ఉద్యమరూపం ధరించే పరిస్థితి వచ్చింది. ఫలితంగా జే.పితో బాటు పెద్ద పెద్ద ప్రతి నాయకులంతా అరెస్టయినారు.
వాతావరణం ఉధృతరూపం ధరిస్తోంది. ఈ నాయకురాలి విశృంఖలత్వాన్ని ప్రజలు సహించలేక పోతున్నారు. వారిలో కొందరు అతివాద ధోరణిలోకి కూడా వెళ్ళారు. ఏమైనా దేశం అశాంతితో అట్టుడికి పోతోంది. అది న్యాయబద్దమైన అశాంతి.
కాని యీ అశాంతిని నాయకురాలిలోని పదవీ వ్యామోహత్వం నేలరాచి పారేయాలనుకుంది. ఫలితంగా పిడుగు పాటులా ఎమర్జెన్సీ విధించింది.
అక్కడ్నుంచి ఎన్నో దౌర్జన్యాలు, అరెస్టులు, హింసాకాండలు, భీభత్సం.
అనంతమూర్తిని కూడా ఒకరోజు అరెస్టుచేసి తీసుకెళ్ళి పోయారు.
* * *
అనంతమూర్తి రాజమండ్రి జైలులో వున్నాడు. అతన్తోబాటు యింకా కొంతమంది డిటెన్యూలు వున్నారు. వాళ్ళందరితోనూ అతను బాగా సన్నిహితుడయినాడు.
దౌర్జన్యపరులుగా అభియోగం మోపబడి అరెస్టయిన వారిమీద చాలా హింసాకాండ జరుగుతోంది. పోలీసులు వారిని ఊచకోత కోస్తున్నారు. కాని అనంతమూర్తి అతని సహచరుల మీద అలాంటి అత్యాచారాలేం జరగలేదు.
ఒకరితో ఒకరు మాట్లాడుకోవటానికి వీలుండేది. రైలులో ఒక కంపార్ట్ మెంట్ నుంచి యింకో కంపార్ట్ మెంట్ లోకి నడిచి వెళ్లినట్టు ఒక సెల్ లోంచి యింకో సెల్ లోకి నడిచి వెళ్ళవచ్చు.
వాళ్ళిచ్చే డబ్బుతో కొద్దిగా న్యూస్ పేపర్లు తెప్పించుకోవటానికి వీలయ్యేది. కాని పత్రికలలో ఏముంటుంది? సెన్సార్ షిప్. ఇహ వ్యక్తిభజన. దేశం మూగపోయినట్టు, ప్రజలంతా ఎమర్జన్సీ సమర్ధిస్తున్నట్లు, దీనివల్ల అవినీతి తొలగిపోయినట్లు, అందరూ అప్రమత్తతతో పనిపాటలు చేసుకుంటున్నట్లు అదేపనిగా వార్తలు.
జయిల్లో వాళ్ళే మెస్ నడుపుకునే వారు. కొందరు కాలక్షేపానికి సంస్కృతం నేర్చుకునేవారు.
కాని రాను రాను మొదట్లో వున్న పట్టుదల చాలా మందిలో సడలిపోయింది. ఇంటిధ్యాసపట్టింది. పెళ్ళా లెలా వున్నారో, పిల్లలెలా వున్నారో, వాళ్ళకు గడుస్తోందో లేదో-యీ దిగుళ్ళతో కృశించిపోయేవారు. జయిల్లో వుండలేకపోయేవారు.
కొన్ని నెలలు గడిచేసరికి మరీ జీవచ్చవాలయి పోయారు. దేశంలో అందరూ మౌనంగా ప్రభుత్వ విధానాలను ఆమోదిస్తున్నారు బందుమిత్రులు మినహాయించి మిగతావారంతా జయిళ్ళలో వున్న వాళ్ళ గురించి మరిచి పోయినట్లే కనిపిస్తోంది. మరి తామంతా జయిళ్ళలొ ఎందుకు మగ్గిపోతున్నట్లు?
ఇంతలో ప్రభుత్వం వాళ్ళకి అభ్యర్ధనమీద పెరోల్ గ్రాంటు చేయటం మొదలుపెట్టింది. అంటే వాళ్ళకి కొన్ని నియమాలు పెట్టి విడుదల చేస్తుంది. ఈ నియమావళి ప్రకారం వాళ్ళు ఆహద్దుల లోపల ఉలక్కుండా పలక్కుండా జీవించాలి.
అదే ప్రసాదమనుకుని ఒక రొకరుగా పెరోల్ మీద బయటకెళ్ళిపోతున్నారు.
ఒకరోజు జయిలు అధికారి అనంతమూర్తి దగ్గర కొచ్చాడు.
"మిమ్మల్ని పెరోల్ మీద విడుదల చెయ్యమని కోరుతూ మీ పిల్లలు అభ్యర్ధించారు."
"నేను వెళ్ళను ఇక్కడే వుంటాను!"
"ఎందుకని? యిక్కడే బాగుందా?"
"మూగ కంఠంతో, మనస్సుని చంపుకుని కోట్లకొద్దీ మసలే ఆ బయటి చెరసాలకన్నా యిదే మెరుగు!"
"కాని అందరూ వెళ్ళిపోతున్నారు."
"ఒకళ్ళని మూర్ఖంగా అనుసరించటం నా కలవాటు లేదు."
జయిలు అధికారి నవ్వాడు. "మీకు చాలా అహంకారం వున్నట్లుందే"
"నా దృష్టిలో నీతి మీ చూపులకు అహంకారంగా కనిపించవచ్చు. అది దృష్టి లోపం."
"ఓహో! యీ జయిలు జీవితం సంవత్సారాలపాటు పొడిగించబడినా-యీ నీతి పాటిస్తారా?"
"నీతి అనేది కాలంకోసం వంకలు తిరగదు."
"అలాగా? మీరు జయిల్లో వుండగా మీ భార్యకి ప్రమాదకరమైన జబ్బు చేస్తే...?"
మూర్తి అతని కళ్ళలోకి సూటిగా చూశాడు.
"అయినా కూడా."
"ఆమె బ్రతకదని డాక్టర్లు చెబితే!"
