మూర్తి అతనిదగ్గరకు పోయి కూర్చున్నాడు.
"రాఘవా! ఏమిటలా వున్నావు?"
"మూర్తీ! తెలిసో, తెలియకో, ప్రేమించో, ప్రేమించాననుకునో లక్ష్మితో దశాబ్దాలకొద్దీ అలవాటు పడిపోయాను. ఆమెను పోగొట్టుకున్నాక ఈ వంటరితనం దుస్సహంగా వుంది"
మూర్తి అతని ఆవేదన నర్దంచేసుకున్నాడు.
"మూర్తీ! ఆమెను బ్రతికించుకుందామని శక్తినంతా ధారపోశాను. ఆస్థంతా ఖర్చుపెట్టాను. కాని దక్కించుకోలేకపోయాను. కాని అంతకంటే దారుణం ఏమిటంటే కన్నతల్లి పోయినందుకన్నా, తమకు ఆస్థిలేకుండా పోయిందేనని నా పిల్లలు నామీద కారాలూ, మిరియాలూ నూరుతున్నారు. ఉండటానికి యిల్లులేకుండా చేశానని నన్నసహ్యించుకుంటున్నారు. ఈ బాధ మరీ భయంకరంగా వుంది మూర్తీ."
ఇది మూర్తికికూడా అంతుపట్టనిసమస్య. ఈలోకంలో ప్రేమే గొప్పదా? యుక్తాయుక్త విచక్షణాజ్ఞానం గొప్పదా? జూదంలో ఆస్తంతా పోగొట్టుకున్న వాడిమీద సానుభూతి వుండదు. ఫలితం తెలిసీ ప్రేమపేరుతో విద్యుక్త ధర్మం పేరుతో ఆస్థంతా పోగొట్టుకున్న వాడిమీద సానుభూతి వుండవచ్చునా! ఆ పరిస్థితుల్లో పిల్లలు బాధను వెళ్ళగ్రక్కటం సబబా కాదా? మానవత్వం కవచం క్రింద మూర్ఖంగా కట్టుబట్టలతో మిగిలిపోవటం ధర్మం అనిపించుకుంటుందా? అజ్ఞానం అనిపించుకుంటుందా?
"మూర్తీ! మాట్లాడవేం?"
"ఆలోచిస్తున్నాను."
"ఇప్పుడు కూడా నన్నే తప్పుపడుతున్నావా? నా మానవతా ధర్మాన్ని అంగీకరించలేకపోతున్నావా?"
"అంగీకరించానో లేదో చెప్పలేనుగానీ, నిన్ను మాత్రం సానుభూతితో అర్ధం చేసుకున్నాను రాఘవా."
రాఘవ స్నేహితుడి ముఖంలోకి చూచాడు. ఇప్పుడా కళ్ళలో కొంత తృప్తి వుంది.
* * *
మనిషి ఆశావాది. భవిష్యత్తులోని మంచిపట్ల ఎప్పటికప్పుడు నమ్మకాన్ని పెంచుకుంటూ వుంటాడు. అలాంటి మంచి ఎంతకాలం వేచిచూసినా జరగనప్పుడు మార్పుని కోరుకుంటాడు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి పాతిక సంవత్సరాలు పైగా గడిచిపోయింది. ప్రజలకు ప్రణాళికలూ, ప్రాజక్టులూ ప్రదర్శించి మెస్మరిజం చెయ్యటం తప్పిస్తే మేలు అనేది ఎలా వుంటుందో అంతా మరిచిపోయారు - ప్రభుత్వ యంత్రాంగంలో త్యాగమూర్తులూ, మానవత్వపు విలువలున్న వారూ తరిగిపోయి అవినీతి పరులూ, పదవీవ్యామోహం వున్న వారూ గూండాతత్వం వున్నవారూ ప్రబలిపోయారు. ఈ దేశంలో ఒక గవర్నమెంట్ ఆఫీసూ సజావుగా, సక్రమంగా పనిచెయ్యదు. గవర్నమెంట్ కు సంబంధించిన ఏ ఆఫీసయినా సరే- సెక్రటేరియేట్ కావచ్చు. మంత్రుల కార్యాలయాలు కావచ్చు. యిన్ కంటాక్సు డిపార్ట్ మెంట్ కావచ్చు. సేల్స్ టాక్స్ డిపార్ట్ మెంట్ కావచ్చు. తాలూకాఫీసులూ, మ్యూనిసిపల్ ఆఫీసులూ కావచ్చు. ఆఖరికి విద్యాలయాలు కూడా అవినీతి, కుళ్ళుతో పేరుకుపోయాయి. ప్రతి వ్యక్తికీ ఒక్కటే లక్ష్యం. డబ్బు సంపాదన. పెద్ద ఆఫీసరు మొదలు చిన్న గుమాస్తావరకూ అదే ఆరాటం. భారతీయులకు దేవాలయాలు అత్యంత పవిత్రస్థలాలు అక్కడకూడా ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు మొదలు, గుళ్ళో పూజారివరకూ అంతా అరాచకమే. దేముడి పట్ల భక్తి లేనివారూ ఈ దేశంలో పూజారులుగా వున్నారు. సత్ప్రవర్తన పట్ల, మనిషి శీలంమీద, నీతిమీద నమ్మకంలేని వారూ వేలాదిప్రజలకు భావయుక్తంగా భాష్యం చెప్పేమతబోధకులుగా వున్నారు.
ఇక్కడ మనిషికి కావలసిందేదీ దొరకదు. కల్తీ లేని ఆహార పదార్ధాలు యీ దేశంలో అమ్మబడవు. ఇతరుల ప్రాణాలకన్నా వీళ్ళకి లక్ష్యమున్నట్లులేదు. నకిలీ మందులకు యిది ప్రసిద్ది.
కనీసపు అవసరాలకు యిక్కడి ప్రజలు నోచుకోలేదు. కిలో పంచదార కోసం షాపువాడిచుట్టూ పదిరోజులు తిరిగి, అతను వచిందని ప్రకటించాక గంటలకు గంటలు పనులు మానుకుని క్యూలలో నిలబడాలి. ఇక్కడ కిరసనాయిలు దొరకదు. అప్పుడప్పుడూ కల్తీ నూనెకూడా దొరకదు. ఆఖరికి మంచినీళ్ళు కూడా దొరకవు.
ప్రభుత్వం అనేక పథకాలువేసి కొట్లకొద్దీ డబ్బు వెచ్చిస్తుంది. మలేరియా నిర్మూలనకోసం 'నేషనల్ మలేరియా ఎరాడికేషన్' ప్రోగ్రాం వేసి వేలకోట్లు ఖర్చుపెట్టింది. అయినా మలేరియా జనాన్ని చెండుకు తినేస్తుంది. ఇంత భయంకరంగా ప్రణాళికలు దెబ్బతిన్నా ఎవరికీ మలేరియా దోమ కుట్టినంతయ్హినా నొప్పి వెయ్యదు.
ప్రభుత్వ విధానాలు ఎలా వున్నాయంటే మోసం చెయ్యకపోతే మనిషి బ్రతకలేని స్థితికి వచ్చాడు. ఇళ్ళపన్నులు చూసుకున్నా, యిన్ కంటాక్సు విధించే పద్దతి తీసుకున్నా ఏదోవిధంగా వంచనచేయనిదే హతమారిపోవల్సిందే. ఇవన్నీ చూసి చూడనట్లుగా ఊరుకోవటం ప్రభుత్వవైఖరి అయిపోయింది.
ఈ సంప్రదాయాలన్నీ ఇలా కొనసాగిపోవల్సిందేనా? వీటినుంచి ఎప్పటికీ విముక్తిలేదా?
అనంతమూర్తి చాలా దీర్ఘంగా ఆలోచించసాగాడు.
ప్రజలు ఒకేపార్తీకి గుత్తాధికారం యిచ్చేస్తున్నారు. ఆ పార్టీపేరుతో చీపురుపుల్ల నిలబడినా అవలీలగా గెల్చిఎదురు లేకుండా చేసుకుంటోంది.
పోనీ సమర్దులైన ప్రత్యర్ధులున్నారా? ఉంటే ముందుకురారేమిటి? ప్రత్యర్ధులమన్న పేరుతో రంగంమీదికొస్తున్న వారిని చూస్తుంటే ఎవరికీ నమ్మకంకలగటంలేదు.
ఒకప్పుడు కమ్యూనిస్టులు దేశంలో మార్పు తీసుకురాగలరన్న ఆశ కలిగించారు. ప్రగతి పథంపట్ల ఉవ్విళ్ళూరే వారు చాలామంది అందులోకి వెళ్ళారు. కొంతకాలం కాంతి కిరణాలను ప్రసరింపజేసింది.
కాని చాలా స్వల్ప వ్యవధిలో అది స్థిరత్వాన్ని పోగొట్టుకుంది. అందులో అనేక రాజకీయ వైషమ్యాలు బయల్దేరి వివిధ రూపాలుగా విడిపోయింది. ఈ విడిపోయిన భాగాలు కూడా తమపట్ల నమ్మకాల్ని ప్రజల్లో కల్పించలేక పోయాయి. ఎంతసేపటికీ ఆదినుంచి కలహించుకుంటోన్న వృద్దనాయకులేగాని, మేధావంతులైన యువకులు అందులోంచి చొచ్చుకురాలేకపోయారు. అందుచేత అవన్నీ నామ మాత్రపు పార్టీలుగానే మిగిలిపోయాయి.
అనంతమూర్తి నిశితంగా పరిశీలిస్తున్నాడు...ప్రజల్లో అసంతృప్తి పెరిగింది ప్రభుత్వ విధానాల్లో నియంతృత్వ ధోరణులు ప్రవేశిస్తున్నాయి. వ్యక్తి ఆరాధన మొదలవుతోంది.
దేశంలో చాలామంది మేధావుల్ని యీ విషయాలు కలవరపరుస్తున్నాయి ఇది ప్రజాస్వామ్య దేశం కాని పరిపాలించేవారు యీ విషయమే మరిచిపోయి యిందుకు విభిన్నంగా ప్రవర్తిస్తున్నారు. స్వల్పమైన పనులు చేసి అవి ఘనకార్యాలుగా చూసుకుంటున్నారు.
అలజడి చెలరేగింది.
ఫలితంగా పరిపాలకులమీద కేసులు, కోర్టు విచారణలు...
