"ఒక్కర్తినేగా...అన్ని నాకెందుకు, ఇస్తాన్లే..." సిన్సియర్ గా అంది ప్రనూష.
"నీ యిష్టం..."
"అన్నట్టు మరి యింటి అద్దె సంగతీ...?"
"ఫిఫ్టీ....ఫిఫ్టీ....కరెంటు బిల్లు. మిగతా అన్నీ సగం, సగం ఓ రోజు పంపు నీళ్ళు నేను పడితే, మరోరోజు నువ్వు ఓ రోజు పాల ప్యాకెట్ ఉదయమే లేచి నువ్వు తీసుకుంటే, మరో రోజు నేను....ఎవరి కుంపటి వారిది....మీ అమ్మా నాన్న వచ్చినా, మా బామ్మ వచ్చినా, మంచాలు ఒకటి చేద్దాం. మొగుడూ పెళ్ళామ్సుగా నటిద్దాం.
ఈలోగా వాళ్ళని మెంటల్ గా ప్రిపేర్ చేద్దాం....నీదే తప్పు అని మా బామ్మ నాదే తప్పు అని మీ అమ్మా నాన్నలు అనుకోవాలి.... అప్పుడు మ్యూచివల్ డైవర్స్ కు అప్లయ్ చేద్దాం. ఆ తర్వాత నీ దారి నీది, నా దారి నాది. హాయిగా అల్ట్రా మోడ్రన్ హైటెక్ అమ్మాయిని చేస్కుంటా...ఇది జంటిల్మెన్ అగ్రిమెంట్." అన్నాడు శ్రీచరణ్.
వింటున్న ప్రనూషకు అనిపించింది.
లోకంలో ఏ భార్యాభర్తలు తమలా ఇలా మాట్లాడుకోరేమో, అందులోనూ పెళ్ళయిన రెండోరోజే. "నిజానికి తాము చేస్తున్న పని మంచిదేనా?" అనుకుంది ఆడదానిగా ఒక్కక్షణం.
మనసులో బాధ చెప్పుకోలేని బాధ వివాహ బంధాన్ని ఎంత తేలిగ్గా తీసుకుంది తను. అది కూడా ఓ బిజినెస్ లాగా అగ్రిమెంటా మొగాడు అతను, ఎలాగైనా బ్రతికేస్తాడు. కానీ తను.....ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్ళు...
అతను గమనించకూడదని తుడుచేసుకుంది. అయినా అతని కంటపడనే పడింది.
"ఏవిటీ ఏడుస్తున్నావా....? తమరి వల్లనేగా ఇదంతా వచ్చింది..."
"నేనేం చేసాను" మర్చిపోతున్న కోపం రెట్టింపయి తిరిగివచ్చింది ప్రనూషలో.
"నాలో పెళ్ళికి తగుదునమ్మా అని వప్పుకున్నావు. పెళ్ళి చూపుల్లో నీతో అలా మాట్లాడితే చేసుకోవని అలా బిహేవ్ చేసాను, అయినా సిగ్గు లేకుండా చేసుకున్నావు."
"మాటలు మర్యాదగా రానివ్వండి. ఆ పనే మీరెందుకు చెయ్యలేకపోయారూ..." రోషంగా అంది తనని సిగ్గులేనిదాన్ని అని అన్నాడని.
'మా బామ్మ రాకాసి ఒప్పుకోరదు కనుక నెపం నీ మీద పెడదామని ప్లాన్ వేశాను. తమరివల్ల నా పాచిక పారలేదు. లేకపోతే ఈపాటికి ఏ మోడ్రన్ గర్ల్ నో, నా భార్యని చేసుకునేదాన్ని.... నీ వల్ల నేనెంత నష్టపోయానో....ప్చ్..."
"నీ వల్ల నేనూ నష్టపోయాను చిన్నప్పటినుండి (ప్రేమించి మాత్రమే పెళ్ళి చేసుకోవాలనుకునే నాకు, నువ్వు భర్తగా వచ్చావు మా తల్లిదండ్రుల పుణ్యమా అని నేనెన్ని చెప్పినా వినిపించుకుని ఏడిస్తేగా వాళ్ళు. సాంప్రదాయం, చట్టుబండలో అంటూ నీకు కట్టబెట్టారు బోలెడు కట్నం తగలేసి.... హాయిగా ప్రేమించి, ఏ సల్మాన్ ఖాన్ లాంటి వాన్నో చేసుకుందామనుకున్నావా ఆశల్నీ అడియాశలు చేసావ్..."
"ఓ.కే....తల్లీ......ఓ....కె....ఏదిఏమైనా ఇద్దరి పెద్దల వలన బలయ్యింది మనం. అందుకే కదా వాళ్ళ తిక్క కుదిర్చి మనం హాయిగా ఎవరి దారిన వాళ్ళు వెళదాం. ఎగ్రిమెంట్ కి రెడీనా?" అన్నాడు శ్రీచరణ్.
ఇంతవరకూ వచ్చాక కాదనే ప్రసక్తి లేదు అనుకున్న ప్రనూష' నేను ఓ...కే...ఈ అగ్రిమెంట్ కి అంది.
సంవత్సరం వరకూ ఒకే ఇంట్లో, ఒకే సంబంధంతో వుండేట్టూ, విడివిడిగా జీవించాలి. ఈ సంవత్సరం లోపు తను ఓ మంచి వ్యక్తిని వెతుక్కుని ప్రేమించాలి. సంవత్సరం పూర్తవ్వగానే, ఇతనికి విడాకులిచ్చేసి హాయిగా ప్రేమించిన వ్యక్తిని పెళ్ళి చేసుకుని..... ఆ ఊహ ఆమెకు గమ్మత్తుగా అనిపించినా, ఏ మూలో కలుక్కుమనిపించింది.
అది సాంప్రదాయం తాలూకు ఉలికిపాటు.
ఓ వైట్ పేపర్ మీద మన కండిషన్స్ అన్నీ రాసుకుందాం....దాన్ని రెండు కాపీలుగా రాసుకుని, ఒకటి నీ దగ్గర, మరోటి నా దగ్గర వుంచుకుందాం. ఇద్దరం సంతకాలు చేయాలి.
ఇంటి అద్దె, ఖర్చులు మన ప్రవర్తన.....అన్నీ రాసుకోవాలి....నేను ఏ అమ్మాయితో తిరిగినా, నువ్వు న్యూసెన్స్ క్రియేట్ చేయకూడదు. భార్యగా వణక్కూడదు" శ్రీచరణ్ అన్నాడు.
"దట్స్ గుడ్ థాట్ నేనూ ఏ అబ్బాయితో వెళ్ళినా మొగుడి టైపు ఆరాలు తీయకూడదు" అంది శ్రీచరణ్ తో వళ్ళుమండిన ప్రనూష.
"ఓ.కె.డన్." అన్నాడు శ్రీచరణ్.
"డబుల్ డన్." అంది తాపీగా ప్రనూష.
వెంటనే రెండు వైట్ పేపర్స్ తీసుకున్నారు.
ఇద్దరి మధ్యా జరిగిన ఆ అగ్రిమెంట్ కు అక్షర రూపం యిచ్చారు. ప్రనూష అగ్రిమెంటు ని రాసి, కింద తన సంతకం చేసి, ఆ కాగితాన్ని శ్రీచరణ్ కు ఇచ్చింది.
శ్రీచరణ్ తను రాసి, సంతకం చేసి అగ్రిమెంట్ ని ప్రనూషకు ఇచ్చాడు. గడువు తేదీ జనవరి 21.
భార్యాభర్తల బంధం తెగిపోవడానికి సాంప్రదాయాన్ని అవహేళన చేయడానికి వాళ్ళు పెట్టుకున్న ముహూర్తం అది.
ప్రేమకు పెళ్ళిని వేరు వేరుగా చూడ్డంవల్ల జరిగిన అనర్ధం అది.
దానికిద్దరూ ఏమి నష్టపోయారనేది వేరే విషయం.
మర్నాడే పడగ్గదిలోని రెండు సింగిల్ కాట్స్ రెండు బెడ్రూమ్స్ లోకి చేరిపోయాయి. రెండు కిచెన్లు.
