అందరూ గలగలా తిరిగి, గదిగదీ పరీక్షించి మేడ పైకి ఎక్కేరు. పైన రెండుగదులు మాత్రం వేశారమతే మిగతా అంతా బంగరు బయలు-శుభ్రంగా సిమ్మెంటుతో దిమ్మిన చేశారు. చుట్టూ ఎటు చూసినా తోటలు. పచ్చని చెట్లు-చల్లని గాలి.
"హాయ్! హాయ్! వస్తే హనీమూన్ కి యిలాటి చోటుకిరావాలి!" అంది ముఖమంతా ఆనందం నింపుకున్న గీత. ఆ అమ్మాయి అంతే! సుఖం వచ్చినా కష్టం వచ్చినా ఆపుకోలేదు.
"ఒసే గీతా! నీకెప్పుడూ పెండ్లిరంధే! నీ పెళ్ళయ్యాక హనీమూన్ కి యిక్కడికి పంపే ఏర్పాటు చూస్తుందిలే స్వప్న! ఏం, స్వప్నా, కాదంటావా?" అంది సౌందర్య.
నవ్వింది స్వప్న.
"ఇదో సౌందర్! ఇక పెళ్ళికబుర్ల కట్టిపెట్టండి. కమ్మగా పాటలు పాడండి, రికార్డ్ చేస్తాను." అంది విజయ.
"అమ్మో! పాటలే!" విశాలమైన కళ్ళని మరింతపెద్దవి చేస్తూ అంది గీత.
టక్కున స్నాప్ చేసింది కిరణ్.
"థాంక్స్! మంచి ఫోజిచ్చావు." అంది వినయ.
"పికేద్దామా?" వానిటీ బాగ్ నించి తీసింది షీలా.
`"ఓ యస్!"
"నాది సర్వింగ్ డిపార్టుమెంట్! మీరు పేకాడుతూ వుండండి-అందరికీ టిఫిన్ సప్లై చేయిస్తాను" క్రిందికి దిగి వెళ్ళింది వినయ. అందరూ పేకలో, కబుర్లలో పడిపోయారు. టేప్ రికార్డర్ హిందీ, ఇంగ్లీషు, సినిమా పాటల్ని పాడేస్తోంది.
ఉత్సాహం మూర్తీ భవించినట్టుగా, ఆనందలహరీ వీచికల్లా ఉన్నారంతా!
19
గేటు ముందు నుంచున్నాడు నరసింహం. అతని గుడ్డలు మాసేయి. ముఖం పీక్కుపోయింది, గడ్డం మాసింది. దిగులుగా, భయం భయంగా ఉన్నాడు.
"కోభి అందర్ నై జాసక్తా!"
గూర్ఖా అతన్ని చూస్తూనే అనేశాడు.
ముందుగా లోపలికి వెళ్ళేందుకే భయపడుతున్న అతను గూర్ఖా మాటలకి మరీ భయపడి అక్కడే ఆగేడు.
సాయంకాలం దాదాపు అయిదుగంటలు అయిఉంటుంది____వాతావరణం చల్లగా ఉంది. ఆకాశంలో మబ్బులులేవు. సూర్యుడు కూడా చల్లబడే ఉన్నాడు.
అవకాశం కోసం ఎదురు చూస్తూ నుంచున్నాడు నరసింహం ఎవరైనా రాకపోతారా, తన రాక లోపలికి తెలియబరచక పోతారా అనుకుంటూ!
రవి వచ్చేడు ఆఫీసు నుంచి....
అతన్నల్లంత దూరంలో చూడగానే "బాబూ! నీ తండ్రిలాటి వాడిని. చాలా ఆపదలో ఉన్నాను నన్ను లోపలికి కృష్ణవేణమ్మగారి వద్దకి తీసికెళ్ళు. నీకు చాలా పుణ్యం ఉంటుంది. నేవచ్చి గంటైంది. ఈ గూర్ఖా రాక్షసుడు నన్ను లోపలికి కృష్ణవేణమ్మగారి వద్దకి తీసికెళ్ళు. నీకు చాలా పుణ్యం ఉంటుంది. నేనచ్చి గంటైంది. ఈ గూర్ఖారాక్షసుడు నన్ను లోపలికి వెళ్ళనివ్వలేదు." అన్నాడు నరసింహం గబగబా!
"ఏమిటి మీ ఆపద!"
"అది తర్వాత చెపుతా! చాలా అర్జంటు!" తొందరించాడతను.
"ముందు మీరెవరో చెప్పండి"
విసుగ్గా చూసి "నాపేరు నరసింహం! చాలా!" అన్నాడు.
"ఊహలాఁ మీ పనేమిటో చెప్పండి!"
"నా భార్య ఆపదలో వుందయ్యా అంటే మీన మేషాలు లెక్కిస్తావేమిటి? నేను ఆవిడకు యీ విషయం చెప్పాలి. ఫోనులో చెపితే నమ్మదని నేనే నేరుగా వచ్చాను" బాధ, కోపం మిళితమైన స్వరంతో అన్నాడతను.
"ఆమె ఎందుకు సాయం చేస్తుంది?"
"అల్లుడ్ని కనుక!" ఠక్కున సమాధానం చెప్పేడు.
"మీరు ఆవిడ అల్లుడా?" ఆశ్చర్యంగా అడిగేడు.
"ఏం వింతగా ఉందా? అవును, ఆవిడ అల్లుడ్ని! స్వయానా ఆవిడ కన్నకూతురి మొగుడ్ని. ఇక చాలా." వింతగా చూస్తూ వుండిపోయాడు రవి.
"చాలా ఏళ్లక్రితమే మేం యీయిల్లు వదలివెళ్లేం. నన్ను ప్రేమించి పెళ్ళిచేసుకుందని నన్నూ, నా భార్యని తన్ని తరిమేసిందీవిడ. నా కూతుర్ని మాత్రం పెంచుకుంటోంది. ఇప్పుడు నా భార్యకి చాలా ప్రమాదంగా ఉంది. హార్టు ఎటాక్ వచ్చింది. పూర్ణా నర్సింగ్ హోంలో ఎడ్మిట్ చేశాను. ఇదిగో టికెట్!"
చూశాడు రవి. ఆశ్చర్యంగా 'నా వెంటరండి!' అని లోపలికి తీసికెళ్ళి అతన్ని వరండాలో వదిలేసి తిరిగి తన మానాన తన గెస్ట్ హవుస్ కి వెళ్ళిపోయాడు.
హాల్లో కూర్చుని ఏదో పని చూసుకుంటోంది కృష్ణవేణమ్మగారు. ఎదురుగా వెంకట్రామయ్య నుంచుని ఆ సంవత్సరం రావలసిన మక్తా విషయాలూ, తోటలకి వేయవలసిన ఎరువులు, పంపుసెట్లు బాగోగులు చెపుతూ ఉన్నాడు.
"అత్తగారూ."
చాలా ఏళ్ల తరువాత ఆ యింట్లో - ఆ హాల్లో అడుగు పెట్టి పిలిచాడు నరసింహం.
చప్పున తలెత్తి చూసింది ఆమె. అతన్ని చూడగానే రక్తం చివ్వున ముఖాని కెగజిమ్మింది. కళ్ళు నిప్పుల్లా ఎర్రబడ్డాయి.
"అత్తగారూ" మళ్ళీ పిలిచాడు అతను.
చివ్వున కుర్చీలోంచి లేచింది. "ఎవరు నువ్వు? ఎందుకొచ్చావ్? ఇది ఎవరియిల్లో తెలుసా? గెటవుట్ ఫస్ట్! ఎక్కడ? గూర్ఖా ఏం చేస్తున్నాడు? ఇతన్నెవరు రానిచ్చారు లోపలకి?" వాగ్భాణాలు తీవ్రంగా వదులుతోందామె.
