Previous Page Next Page 
అర్దరాత్రి ఆడపడుచులు పేజి 27


    "నాకొక సాయం చెయ్యగలరామాస్టారూ?"
    ఆయన ప్రశ్నార్ధకంగా చూశాడు.
    "నేను ఇక్కడ చిక్కుకుని పోయానని మీరు వెళ్ళి మా నాన్నగారితో చెప్పగలరా మాస్టారూ?"
    ఆయన ఉలిక్కిపడి సృజనవైపు తేరిపార చూశాడు.
    వెంటనే భయంగా అంది సృజన.
    "మీకు ఇష్టం లేకపోతే చెప్పుద్దులేండి. కానీ అహల్యతో మాత్రం నేను ఇట్లా అడిగానని చెప్పకండేం! ప్లీజ్!"
    ఆయన మాట్లాడకుండా సృజనవైపే చూస్తున్నాడు.
    నోరుజారి ఎందుకిలా అనేశానా అని గడగడలాడిపోవడం మొదలెట్టింది సృజన.
    ఏమవుతుందిఇప్పుడు?
    తనకు ఏమీ సమాధానం చెప్పకుండా ఉండిపోయిన సుబ్రహ్మణ్యాన్ని చూస్తుంటే జంకుకలిగింది సృజనకు.
    ఎదుటిమనిషి ఎలాంటివాడో పూర్తిగా తెలియకముందే తొందరపడి నోరుజారేసిందాతను? ఈయన అహల్యతోచెప్పేస్తాడా తనుమాట్లాడిన మాటలన్నీ?
    భయంతో గుండె నీరయిపోయింది సృజనకి.
    అప్పుడు వినబడింది ఆ పిలుపు! అది పిలుపా? ఏడుపా?
    నూరు అడుగుల లోతు నూతిలినుంచి వస్తున్నంత బలహీనంగా ఉంది ఆ గొంతు. ఎక్కడో విన్న గొంతే! ఎవరిదది?
    కొద్దిక్షణాల తర్వాత స్ఫురించింది సృజనకు, ఆ గొంతు ఎవరిదయిఉంటుందో! ఒక్క ఉదుటునలేచి నిలచుంది తను.
    అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవడం తనకి అలవాటులేనట్లు మెదలకుండా ఉండిపోయాడు సుబ్రహ్మణ్యం.
    గబగబ ముందుకి నడిచింది సృజన. ఆదుర్దాగా ఒక్కొక్క గదిలోకి తొంగి చూస్తూ ముందుకు సాగిపోయింది. కొంతసేపు గడిచాక అర్ధం అయింది సృజనకి. ఆ గొంతు ఒక మారు మూలగదిలోనుంచి వినబడుతోందని.
    ఆ గదికి బయటనుంచి గడియపెట్టి ఉంది.
    గడియతీసి లోపలికి అడుగుపెట్టింది సృజన.
    చిమ్మచీకటిగా ఉంది లోపల. తలుపులు బార్లా తెరిచినాకూడా గదిలోకి వెలుతురు జొరబడటంలేదు. కిటికీలు కూడా లేవుదానికి. బహుశా అది స్టోర్ రూం అయి ఉండాలి.
    తలుపు పక్కగా గోడమీద తడిమింది సృజన. లైట్ స్విచ్ తగిలింది.
    స్విచ్ నొక్కేలోపలే, రెండుచేతులు చటుక్కున ఆమె కాళ్ళని పెనవేసుకున్నాయి.
    అదిరిపడి లైట్ స్విచ్ నొక్కింది సృజన.
    ఆ వెలుతురులో కనబడింది సృజనకు---
    తనపాదాల దగ్గర పడి ఉన్న కామాక్షి!
    సృజన ఆమెని చూసి అప్పటికి రెండు నెలలపైనే అయింది.
    ఇన్నాళ్ళనుంచి ఎక్కడ ఉంది కామాక్షి? ఏమయిపోయింది?
    దడదడలాడేగుండెలతో కామాక్షివైపు చూసింది సృజన.
    చిక్కిశల్యమైపోయిందికామాక్షి. ఇదివరకు తనుచూసిన కామాక్షిలా లేదు. ఆమె తాలూకు ఎక్స్ రే ఫోటోలా ఉంది. నెలల తరబడి సూర్యరశ్మి సోకకపోవడంవల్ల పాలిపోయినట్లు అయిపోయినట్లు అయిపోయింది ఆమె వంటి రంగు.
    "కామాక్షి!" అంది వణుకుతున్న గొంతుతో.
    ఆ పిలుపు కామాక్షి చెవులకుసోకినట్లు లేదు. కళ్ళు తెరవలేదు తను. పీడకల కంటున్నట్లు కొంకర్లు పోతోంది ఆమె మొహం. సగం సగం వాక్యాలతో కలవరిస్తోంది.
    "వద్దు.....నాకు చీకటంటే....వద్దు.... వద్దు...."
    సంధి ప్రేలాపనలా ఉన్నాయి ఆమె మాటలు.
    ఆమె ఉన్న పరిస్థితి సృజనకు అర్ధం అయిపోయింది. అహల్య కామాక్షిని అతి తీవ్రంగా శిక్షించదలుచుకుని ఈ చీకటికొట్లో పెట్టి ఉంటుంది. భయంతో, ఆకలితో, డెలిరియస్ కండిషన్ లోకి వచ్చేసింది కామాక్షి. తను ఏం చెయ్యాలో, ఏం చెయ్యగలదో వెంటనే తోచలేదు సృజనకి. ఆందోళనగా కామాక్షి వైపు చూస్తూ కాసేపు ఉండిపోయి తర్వాత ఒక నిశ్చయానికి వచ్చి వడివడిగా ఇంట్లోకి వెళ్ళింది. రెండు నిమిషాల్లోనే తిరిగి వచ్చింది. ఆమె చేతిలో ఒక ప్లేటు ఉంది. దాన్లో జీడిపప్పుపాకం, మినపసున్ని ఉండలూ, అరటి పళ్ళూ, ఒక మామిడిపండూ ఉన్నాయి. రెండో చేతిలో మంచినీళ్ళ గ్లాసు ఉంది.
    కామాక్షి పక్కన కూర్చుని మినపసున్ని ఉండను తుంచి, ఆమె నోట్లో పెట్టబోయింది సృజన.
    పెదిమలు తెరవలేదు కామాక్షి. పళ్ళు గిట్టకరిచిపట్టుకుని ఉంది.
    అప్పుడు గమనించింది సృజన.
    కామాక్షి లేత పెదవులు ఎండిపోయి అసహజమైన తెలుపు రంగుకి తిరిగి ఉన్నాయి.
    పగుళ్ళతోబేటలు వేసినట్లుకనబడుతున్నాయి.
    కళ్ళు చెమర్చాయి సృజనకి.
    మంచినీళ్ళు రెండు చుక్కలు జాగ్రత్తగా కామాక్షి పెదవుల మధ్య పోసింది.
    కొద్దిక్షణాలపాటు కామాక్షిలో ఏ కదలికా లేదు.
    తర్వాత నెమ్మదిగా నాలుకతో పెదిమలు తడిచేసుకుంది తను.
    అది గమనించి, మరికొన్ని చుక్కలు నీళ్ళు ఆమె పెదిమల మధ్య పోసింది సృజన.
    అతికష్టం మీద ఒక్క గుటకవేసికొద్దిగా కదిలింది కామాక్షి.
    శల్యావశిష్టంగా ఉన్న ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని "కామాక్షి!" అంది సృజన ఆర్ద్రంగా.
    ఆ పిలుపు వినగానే తలతిప్పింది కామాక్షి.
    కానీ సృజన ఉన్నవైపు కాదు. డానికి వ్యతిరేకమైన దిశలో!
    ఆమెపడుతున్న యాతనవలన ఆమె రిప్లెక్స్ స్ సరిగ్గా పని చెయ్యడం మానేశాయి. మెదడు కీ దేహానికీ ఉండవలసిన కో ఆర్డినేషన్ తప్పిపోయింది.
    అందుకని, సృజన కంఠస్వరం ఒకవైపు నుంచి వినబడుతుంటే, ఆ దిశను సరిగ్గా అంచనావెయ్యలేక మరొకవైపు తిరిగింది కామాక్షి.
    "కామాక్షి! ఇటు!" అంది సృజన.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS