Previous Page Next Page 
నరుడా ఏమి నీ కోరిక పేజి 28

 

    యమధర్మరాజు నారదుని పిలిచి సహాయమడిగాడు.


    సరేనన్నాడు నారదుడు.

 

                                                     * * *


    "గురూ!" గట్టిగా అరిచాడు సత్తిపండు.


    "చంపుతా......ఇలా నువ్వు అరిచి ఏదో ఓ రోజు నీ అరుపుతో నన్ను చంపేసేలా వున్నావు" అన్నాడు కోపంగా చెయ్యెత్తి.


    "అది కాదు గురూ. రాత్రి నువ్వేమైనా ఉరేసుకునే కార్యక్రమం పెట్టుకున్నావా?"


    ఒక్క నిమిషం అలాగే నిలబడి కోపంగా చూసి ప్యాంటుకు వున్న బెల్ట్ విప్పదిశాడు.


    "ఏంటి గురూ! ఆ బెల్టుతో కొడతావా ఏమిటి? భయంగా అడిగాడు సత్తిపండు.


    "కాదు పోతరాజుకు మల్లె కొట్టుకుంటాన్రా, లేకపోతే నువ్వేంట్రా నన్నిలా చంపుతావు?"


    "అది కాదు గురూ. నీ మెడ చుట్టూ నల్లగా వుంది " ఉలిక్కిపడ్డాడు.


    "నిజమా?" అన్నాడు కళ్ళు వెడల్పు చేసి.


    "అవును గురూ. నా పోట్టిలాగు మీదొట్టు" రాత్రి తన మెడకు ఏదో తగిలినట్టు అనిపించిన విషయం గుర్తొచ్చి వణికిపోయాడు శ్రీచంద్ర.


    శ్రీచంద్ర దిర్ఘాలోచనలో పడ్డాడు.


    తన మెడ మీద కమిలిపోయి వుంది. ఇందాక సెలూన్ కి వెళ్ళినప్పుడు పరీక్షగా చూసుకున్నాడు. తన మెడ చుట్టూ ఉచ్చు బిగిసుకున్నట్లు వుంది కమిలిపోయిన భాగం.


    రాత్రి తనకు నిద్రలో ఉలికిపాటు కలగడం, తర్వాత తనకే కలా రాకపోవడం....ఇదంతా అయోమయంగా వుంది.


    "గురూ! ఏంది ఆలోచిస్తున్నావు. ముందు పుడ్డు సంగతి చూద్దాం అన్నట్లుగానే వెరయిటి ఆలోచన వచ్చింది చెప్పమంటావా?"


    మళ్ళీ చురచుర చూసి "ఒరే పోట్టిలాగు" అంటూ అరుస్తావా? ఓన్లి నీ రియాక్షన్ చెప్పు చాలు" అన్నాడు సత్తిపండు.


    "అబ్బబ్బ.....నికెప్పుడు వెధవ పుడ్డు గోలే. సర్లే ఏదో ఒకటి ఆలోచిద్దాం నాకైతే ఏమి తోచడం లేదు" అన్నాడు శ్రీచంద్ర.


    "నా కోటితోస్తోంది చెప్పమంటావా గురూ."


    "చెప్పి చావు" విసుగ్గా అన్నాడు.


    "చెప్పాక సీరియస్సవద్దు"


    "అవ్వను"


    "చేయేత్తద్దు"


    "ఎత్తను"


    "సీరియస్ గా లుక్కివ్వద్దు"


    "ఇవ్వనులేరా"


    "అదిగో అలా చిరాకు పడొద్దు."


    "అబ్బబ్బ సరే ....సరే....సరే...."


    "ప్రామిస్!"


    "ప్రామిస్!"


    "అమ్మతోడు, సరస్వత్తోడు."


    అప్పటిదాకా లేని సహనాన్ని మొహానికి అతికేసుకుని భరిస్తున్న శ్రీచంద్ర ఇక భరించలేక సత్తిపండు నెత్తిమీద ఒక్కటేశాడు.


    "గురూ....నన్నెవరో దొంగదెబ్బ తీశాడు" అన్నాడు నెత్తిమీద చెయ్యేసి సత్తిపండు.


    శ్రీచంద్రకు పిచ్చెక్కిపోయింది.


    కోపంతో సత్తిపండు చొక్కా గుండీలు ఫట్ ఫట్ మని తెంపేసాడు.


    "గురూ.....ఎవరో నా చొక్కా గుండీలు దోచుకుపోతున్నారు" అరిచాడు సత్తిపండు.


    "పోట్టిలాగు పండు" అంటూ కోపంగా కేకేసి లాగులో వున్న కళ్ళజోడు సత్తిపండుకు తగిలించాడు.


    "అదేంటి గురూ! నీ మొహం పెనంలో మాడిపోయిన పెసరట్టులా ఉంది" అడిగాడు కళ్ళజోడు సవరించుకుంటూ సత్తిపండు.


    ఇక మాట్లాడే ఓపిక నశించి టాంక్ బండ్ ముందున్న సిమెంట్ బెంచి మీద కూలబడ్డాడు శ్రీచంద్ర.


    
                                                        * * *


    సోఫాలో కూచుని తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్నాడు త్రిలోకం.


    అతనికి మధ్య విచిత్రమైన ఉహాలు రావడం లేదు. ఎలాంటి ఉహ తనకు సూటవుతుందోనని ఆలోచిస్తున్నాడు.


    సరిగ్గా అప్పుడే అతని నాసికాపుటాలకి కిరోసిన్ వాసన సోకింది.


    "అదేంటి చెప్మా. గ్యాస్ వుందిగా? కిరోసిన్ తో తన భార్యకు ఏం పని పడిందబ్బా" అనుకుంటూ ఆలోచిస్తూ వుండిపోయాడు జరగబోయే డామేజిని ఉహించకుండానే!

 

                                                               * * *


    వంట గదిలో వున్న కిరోసిన్ టిన్ తీసి పెద్ద బేసిన్ లో ఓంపింది. బేసిన్ లో సగం వరకూ వచ్చిందా కిరోసిన్.


    ఓ అగ్గిపెట్టి, హారతి కర్పూరం ఓ ప్లేటులో పెట్టుకుంది. తర్వాత బేసిన్ రెండు చేతులతో జాగ్రత్తగా పట్టుకుని సోఫా దగ్గరికి తెచ్చి పెట్టింది.


    మళ్ళీ వెనక్కి వెళ్లి హారతి కర్పూరం, అగ్గిపెట్టె తెచ్చింది.


    త్రిలోకానికి అలసటగా వుంది.


    "ఏవండి! అలసటగా వుందా?" అడిగింది సోఫా మీద పెట్టుకున్న అతని పాదాల వంక ఆశగా చూస్తూ.


    "అవునే భువనా! అవును గానీ ఈ వేళగానీ వేళ పూజగది వదిలివచ్చావు. ఏంటి విశేషం?" అడిగాడు కళ్ళు తెరవకుండానే.


    "అదేమిటండి అంత మాట అనేసారు? నేనెవర్ని......పతివ్రతని. ఈ జన్మలో నా దేవుడెవరు? మీరే. అలాంటి మిమ్మల్ని వదిలి నేను పూజ గదిలో ఎలా వుంటాను?"


    "హూ......ఈ ఆలోచన జ్ఞానం ఇరవయ్యేళ్ళ క్రింద వచ్చి వుంటే సమీర తర్వాత కనీసం ఇద్దరు ముగ్గురూ పిల్లలైనా వుండేవాళ్ళు" మనసులో అనుకున్నాడు త్రిలోకం.


    "ఏవండి! గత మూడు వారాలుగా మీ పాదపూజ నిర్విఘ్నంగా జరుగుతోంది కదా" అంది భువన సంతోషంగా.


    "అవునవును .....ఓ వారం వేడి నీళ్ళతో నా పాదాలను పచ్చిపుళ్ళు చేశావు. మరోసారి ఫినాయిల్ కంపుతో కదిగేశావు. ఇంకోసారి పాదాభిషేకం అని. పాలతో కడిగి, అవే పాలతో నాకు కాఫీ పెట్టిచ్చి జీవితంలో కాఫీ తాగకుండా చేశావు. నువ్వు గొప్ప పతివ్రతవే......ఈ రోజుల్లోని పతివ్రతల మొగుళ్ళు ఈ రోజుల్లో వుండి వుంటే నీ పాతివ్రత్యాన్ని భరించలేక కుళ్ళుకుపోయేవారు" అక్కసుగా అన్నాడు త్రిలోకం.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS