కాసేపు తను కృష్ణలా చిందులు వేస్తె పిలూ రాధలా గంతులేసిందిట.
ఎంత బాగుంది. ఎంత బాగుంది అనుకున్నాడు. అలాగైనా ఆ పిలూ మేడమ్ ని పట్టుకోవాలి.
నిన్న ఎక్కడైతే కనిపించిందో ఇవ్వాళా అక్కడే నిలబడాలి.
అతనికి ఎక్కడో చదివిన వాక్యం గుర్తొచ్చింది.
'ఎక్కడైతే పోగొట్టుకున్నావో అక్కడే వెతుక్కోవాలన్నా' వాక్యం అది.
* * *
పిట్టగోడ అవతలవైపు నుంచి విజిల్ వినిపించింది.
సత్తిపండు వచ్చాడన్న విషయం అర్ధమైంది శ్రీచంద్రకు. టిఫిన్ తినేసి నీళ్ళు తాగి తనూ విజిల్ వేసాడు వస్తున్న ఆగమన్నట్లు.
ఓసారి తన మొహాన్ని అద్దంలో చూసుకుని బయటకు వస్తుండగా బామ్మ డ్రెస్సింగ్ మిర్రర్ ముందు నిలబడి షోగ్గా తయారవ్వడం కనిపించింది.
"ఏంటి బామ్మా ఏం చేస్తున్నావే?" అడిగాడు బిత్తరపోయి శ్రీచంద్ర.
"లిప్ స్టిక్ పుసుకుంటున్నా కనబడ్డంలా?" అంది తాపీగా లిప్ స్టిక్ పెదాలకు రాసుకుంటూ.
ధబ్ మని వెనక్కి విరుచుకుపడబోయి తమాయించుకుని "అయినా ఇప్పుడీ వయసులో పెదాలకు లిప్ స్తిక్కేందుకే" మొత్తుకున్నాడు శ్రీచంద్ర.
"ఇంగ్లీషు పిక్చర్ ఒహటి సేవన్ హెవన్ దియెటర్ లో మార్నింగ్ షో అడుతోందట. కటింగ్ లు కూడా వేస్తున్నారట. కాస్త గ్లామర్ గా వెళ్తే తప్పేంటి? నీకూ మీ తాతయ్య బుద్దులే వచ్చాయి. నేను అందంగా కనిపిస్తే మీ తాతయ్యంతే కళ్ళల్లో నిప్పులు పోసుకునేవాడు. ఎక్కడ ఏ జగదేకవీరుడు వచ్చి నన్ను ఎగరేసుకుపోతాడోనని పెద్ద ఉపోద్ఘతమే మొదలుపెట్టింది బామ్మ.
"చీ...చీ....నాకు బుద్దిలేదే. నిన్ను కదిలించాను చూడు అది......అది నా బుద్ది తక్కువ" అంటూ రెండు చేతులతో తన చెంపలు తనే వాయించుకుని వెంటనే ఓ డౌట్ వచ్చి "ఈ లిప్ స్టిక్ నికేక్కడిదే" అడిగాడు శ్రీచంద్ర అనుమానంగా.
"మీ నాన్న చొక్కా జేబులోంచి కొట్టేశాను" అంది మరింత తాపీగా.
ఈసారి నిజంగానే వెనక్కి విరుచుకుపడ్డాడు.
"అమ్మ నా రొమాంటిక్ నాన్నా. నీకి వయసులో లిప్ స్టిక్ కావాలా ?" అనుకున్నాడు శ్రీచంద్ర.
* * *
"ఏంటి గురూ! ఇవాళ వన్....టూ....త్రీ....అని పరుగెత్తకుండా డీలాగా హీనంగా , ఎండాకాలంగా నడుచుకుంటూ వచ్చావు. ఎందుకంటావ్?" అమాయకమైన ప్రశ్నొకటి వదిలాడు శ్రీచంద్ర వైపు చూస్తూ.
శ్రీచంద్ర సత్తిపండు వైపు చరచరా చూస్తూ "ఇప్పుడది అంత ఇంపార్టెంట్ అంటావా? అయినా నేను ఇంట్లో నుంచి నడుచుకుంటూ వస్తే అన్నీ పదాలతో నన్ను అడగాలా పోట్టిలాగు వెధవా?" కసురుకున్నాడు.
"ఏదో కన్ ఫర్మేషన్ కోసం అడిగా గురూ" అంటూ ఇంకేదో మాట్లాడబోయి ఒక్కసారిగా "గురూ" అని అరిచేశాడు.
వీపు మీద చరుచుకుని కోపంగా సత్తిపండు వైపు చూసి "ఏమిట్రా! జడుసుకుని చచ్చేలా కొంపలు మునిగిపోతున్నట్టు అరిచావు" అన్నాడు శ్రీచంద్ర.
"ఓసారి అటువైపు లుక్కేసుకో. నువ్వూ అరుస్తావు" అన్నాడు సత్తిపండు.
సత్తిపండు చూపించిన వైపు చూసి సత్తిపండు కన్నా నాలుగైదు డేసిబుల్స్ సౌండ్ పెంచి అరిచేశాడు.
సత్తిపండు వీపు చరచుకున్నాడు.
ఎదురుగా గరుడాచలం మాములుగా వేసుకునే పంచె, లాల్చీ కాకుండా పులచొక్కా, ప్యాంటు చేసుకున్నాడు. అది టక్ చేశాడు. కళ్ళకు పెద్ద గాగుల్స్ పెట్టుకున్నాడు. స్టయిల్ గా నడుస్తూ వస్తున్నాడు.
"గురూ! మన నన్నేనా? సారి సారి ....నేను చూస్తున్నది మీ నాన్ననేనా! బాబాయ్ నేనా?" కళ్ళద్దాలు సరిచేసుకుని చూసి మరి అడిగాడు.
"ఏమోరా! నాకూ అయోమయంగా వుంది" అన్నాడు. అప్పటికే గరుడాచలం వీళ్ళని చూసుకుంటూ ఒక్క బూతు మాట కూడా మాట్లాడకుండా వీళ్ళని దాటి అటో పిలిచి అందులో కూచుని "పోనీ" అన్నాడు.
"అదేంటి గురూ! ఎప్పుడూ ఎవడో ఒకడ్ని తిట్టి అవసరమైతే తిట్టినవాడినే లిప్ట్ అడిగి వెళ్ళే బాబాయ్ ఏంటి ఇలా పులరంగడిలా తయారై ఆటోలో వెళ్తున్నాడు? తెల్లదొరసాని పిన్ని దగ్గరకు కాదుకదా?" నిన్న కనిపించిన ఆంగ్లో ఇండియన్ లేడిని దృష్టిలో పెట్టుకుని అన్నాడు.
ఆకాశంలోకి చూస్తున్నాడు శ్రీచంద్ర. తండ్రి గెటప్ చూసి షాకయ్యాడు.
అప్పుడే మరో షాక్ తగిలేలా మళ్ళీ అరిచాడు సత్తిపండు.
"మళ్ళీ ఏమైందిరా? అలా అరిచి చచ్చావు గుండాగిచచ్చేలా" అన్నాడు శ్రీచంద్ర.
ఆకాశంలోకి చూస్తున్న తలని సత్తిపండు వైపు తిప్పి.
"మరో షాక్ గురూ. మీ బామ్మ చూడు. ఎన్ని వన్నెలు చిన్నెలతో వయ్యారాలు పోతూ వస్తుందో" చెప్పాడు సత్తిపండు.
బామ్మ కళ్లకు స్టయిల్ గ్లాసెస్ పెట్టుకుని బయటకు వస్తోంది. చేతిలో హ్యాండ్ బ్యాగ్, పెదాలకు బాగా దట్టించినట్టు లిప్ స్టిక్.
"బామ్మా....." గట్టిగా అరిచి జుట్టుపిక్కున్నాడు శ్రీచంద్ర.
* * *
యమధర్మరాజు ఉలిక్కిపడ్డాడు.
ఎవరో అరిచినట్లు వినిపించింది.
తలవంచి కిందకి భూలోకం వైపు దృష్టిని సారించాడు. ఆకాశం వంక చూస్తూ జుట్టు పిక్కుంటూ "బామ్మా" అని అరిచిన శ్రీచంద్ర కనిపించాడు.
యమధర్మరాజు కళ్ళు చిత్రంగా మెరిసాయి.
"చిత్రగుప్తా!' పిలిచాడు ఓ కేకేసి యమధర్మరాజు.
ఘంటంతో పాపుల చిట్టా రాస్తున్నా చిత్రగుప్తుడు ఉలిక్కిపడి వీపు చరుచుకుంటూ...."ధూ.....ధూ" అనుకుని ఈ ముసలి యమధర్మరాజుకు చాదస్తము, ఆవేశము అధికమగుచున్నది. నా ప్రాణములు ఈతని పిలుపునకే ఝడుసుకుని ఎగిరిపోవునెమో? అనుకుని.
"చిత్తం వస్తున్నా ప్రభూ!" అన్నాడు లేస్తూ.
"చిత్రగుప్రా! మనం తక్షణం భూలోకమునకేగవలె" అన్నాడు.
"తమరేగుడు ప్రభూ ముసలిముండావాడిని నేనెందులకు" అన్నాడు.
"చిత్రగుప్తా!"
"చిత్తం ఝడుసుకుంటిని ప్రభూ!"
"చిత్రగుప్తా! ఈసారి గొంతు తగ్గించి శాంతంగా అన్నాడు.
"బ్రతికిపోతిని ప్రభూ" అన్నాడు చిత్రగుప్తుడు.
"అదిసరే ఆ మానవుడి ప్రాణములు హరించవలె. అదియును అతనికతనే మరణించవలెనని నిశ్చయించుకుని మృత్యువును ఆహ్వానించునటుల చేయవలె" అన్నాడు.
"ప్రభూ! ఇటువంటి ఆలోచనలు చేయడం.....తంపుల మారి నారదులవారే సమర్ధులు" అన్నాడు చిత్రగుప్తుడు తను ఆ సంకటస్థితి నుంచి తప్పించుకోవాలని.
తధాస్తు దేవతలు తధాస్తు అన్నారు.
