Previous Page Next Page 
అష్టపది పేజి 27

   

    మొండితనం పోయి సాధించేది ఏమీ లేదని తెలిసిన ఆమె "సరే అంకుల్! మీరెలా చెపితే అలా!" అంది.
    
    లోకేశ్వరరావు ముఖం ఆనందంతో విప్పారింది.
    
                                       15
    
    శీతల్ లెటర్ తయారు చేసింది.
    
    శీతల్ తన తల్లికి రాసిన లెటర్ పోస్టు చేస్తానని లోకేశ్వరరావు తీసుకున్నాడు.
    
    ఆమెకి తెలుసు లోకేశ్వరరావు ఆ లెటర్ చదువుతాడని, ఆ తర్వాత పోస్ట్ చేయకుండా వేయి ముక్కలుగా చింపి చెత్తబుట్టలో పారేస్తాడనీను.
    
    తను లెటర్ రాసినా తల్లికి చేరదని తెలిసినా చాలా సహజంగా లెటర్ రాసి ఆ లెటర్ ని కవరులోపెట్టి కవరు అంటించి లోకేశ్వరరావు కిచ్చింది శీతల్.    

 

    లోకేశ్వరరావు పనిమీద బయటికి వెళుతున్నానని చెప్పి కారు థానే డ్రైవ్ చేసుకుంటూ ఆమె ఇచ్చిన కవరు తీసుకుని వెళ్ళిపోయాడు.
    
    లోకేశ్వరరావుకి బయట ఏ పనీ లేదు. అదో వంక అంతే!
    
    శీతల్ వూహించింది జరిగింది.
    
    లోకేశ్వరరావు కారు డ్రయివ్ చేసుకుంటూ కొంత దూరం వెళ్ళి రోడ్డువారగా కారుని ఆపి శీతల్ ఇచ్చిన కవరుని చింపి దానిలో వున్న లెటర్ ని బయటికి తీసి చదవడం మొదలుపెట్టాడు.    

 

    శీతల్ రాసిన లెటర్ లో ఇలా వుంది-
    
    డియర్ మమ్మీ!
    
    నీవు ఎలా ఉన్నావు. డాడీ ఎలా ఉన్నారు శీతూయేనా ఈ లెటర్ రాసింది అని ఆశ్చర్యపోతున్నావు కదూ! నేనే మమ్మీ! నిజంగా నీ శీతూని నేను ఇక్కడ కులాసాగా ఉన్నాను. లెటర్ కూడా రాశానంటే ఆలోచించు ఎంత హ్యాపీగా ఉన్నానో! నేను చాలా సంతోషంగా ఉన్నాను. నిజం.
    
    రంజిత్ విషయంలో నేను చాలా పెద్ద అబద్దం ఆడానని మీ అనుమానం. అబద్దాన్ని నిజంగాను, నిజాన్ని అబద్దంగాను తయారయి మొత్తం కథే మారిపోయింది నేను చెప్పింది మీరు పెడచెవిన పెట్టిననాడే నా జీవితం మారిపోయింది. శీతూ తెలివి తక్కువగా ఊబిలో ముంచి పోతున్నది అనుకున్న మీరు ఊబిలోంచి పైకి లాగాలనుకున్నారు అవునా?
    
    మమ్మీ! ఇది ఊబిలోంచి బైటికి లాగడం కాదు ఆధారం లేకుండా పైకి ఎగరేస్తే ఏమౌతుందో అలా అన్న మాట. ఈ విషమ పరిస్థితులలో నేను కొంత కాలం మరుగున వుండడమే మంచిది. ఎక్కడ వున్నా భయం  భయంగానే రోజులు వెళ్ళబుచ్చాలి. అంకుల్ దగ్గర వుంటే అక్కరలేదు. నాకోసం గాలించేవాళ్ళు, నన్ను ఎత్తుకు వెళ్ళేవాళ్ళు, యమభటుల్లాంటి పోలీసులు,  ఈ గోల ఏదీ లేకుండా కొన్నాళ్ళు అజ్ఞాతవాసంలో వుండిపోతాను.
    
    నా గురించి దిగులుపడకు మమ్మీ! నేను క్షేమంగా వున్న సంగతి డాడీకి చెప్పు. డాడీ వూరుకోరు. నాకోసం భూతద్దంవేసి నలుమూలలా గాలిస్తారు. డాడీపట్టుదల, కోపం నాకు బాగా తెలిసిందే. ఆయన కూతురినే కదా నేను! డాడీ పోలికలు నాకు బాగా వచ్చాయని తరచు అనేదానివి గుర్తుందా మమ్మీ! అదే పట్టుదల, అదే పంతం ఔనా!
    
    సప్తసముద్రాల అవతల మర్రిచెట్టు తొర్రలో వున్న నన్ను డాడీ కనిపెట్టలేరు. నాకోసం వృథా ప్రయాసపడొద్దని చెప్పు పరువు, మర్యాదలగురించి పాకులాడారు. ఇప్పుడేమైంది? మరోమాట అక్కడి విషయాలన్నీ అంకుల్ ద్వారా నాకు తెలుస్తున్నాయి. నీవు దిగులు పడతావనే ఈ లెటరు వ్రాస్తున్నాను. మమ్మీ నీవంటే నాకెంతో ఇష్టం. నా మీద దిగులు పడకు. నాలుగు రోజులు ఆగి నీ దగ్గరకు వస్తాను. వచ్చేముందు కొన్ని కండిషన్లు పెడతాను. దానికి నీవు, డాడీ ఎస్ అంటేనే వస్తాను. నో, అన్నారనుకోండి. మీకు దూరంగా, బహుదూరంగా విదేశాలకి వెళ్ళిపోతాను.
    
    నేను ఇంటికి తిరిగి రావాలా అక్కరలేదా?
    
    ఎస్ ఆర్ నో.

 

    మీకు మీబిడ్డ సుఖం ముఖ్యమా? కాదా?
    
    ముఖ్యమే. నాకు తెలుసు... తెలుసు... తెలుసు.
    
    మళ్ళీ నాలుగు రోజులు ఆగి లెటర్ రాస్తాను. డాడీని అడిగానని చెప్పు.
    
                                                                                                            నీ స్వీటీ
    
                                                                                                    శీతల్ రాణి (శీతూ)
    
    లోకేశ్వరరావు ఆ లెటర్ని ఒకటికి పదిసార్లు చదివాడు. లెటర్ని అటుతిప్పి, ఇటు తిప్పి చూశాడు. మాటల మధ్యలో కోడ్ కి సంబంధించిన పదాలు వున్నాయేమోనని చూశాడు.
    
    కోడ్ కి సంబంధించిన మాటలు లేవు.
    
    అనుమానించ తగ్గది లేదు.
    
    తను అనుమానించాల్సింది ఏదీ లేదు కనుక లోకేశ్వరరావు తృప్తిగా తల పంకించాడు. కొద్దిసేపు ఆలోచించి లెటర్ని కవరులో పెట్టాడు.
    
    ఆ కవరుని ఎలాగూ పోస్టులో వేయదల్చుకోలేదు కనుక వేయి ముక్కలుగా చేసి చెత్తకుండీలో పారేద్దామనుకున్నాడు. మళ్ళీ ఏదో ఆలోచన రాగా తన సీక్రెట్ అరలో భద్రపరచడానికి నిర్ణయించుకున్నాడు.
    
    లోకేశ్వరరావు అరగంటసేపు కారులో అటూ ఇటూ తిరిగి ఆ తర్వాత శీతల్ దగ్గరకు వచ్చాడు.
    
    "అంకుల్! లెటర్ పోస్టులో వేశావా?" లోకేశ్వరరావుని చూస్తూనే శీతల్ అడిగింది.
    
    "స్వయంగా నా చేతులతో నేనే వేశాను. సరేనా అని నవ్వుతూ అడిగిందానికి జవాబు ఇచ్చాడు లోకేశ్వరరావు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS