అసలు యింతవరకు తను ఏ పెళ్ళి చెడగొట్టిన దాఖలాలు లేకపోయినా పని గట్టుకుని తనను పిలిచి ఈ విషయం ఎందుకు చెబుతున్నది అర్ధం కాలేదు.
"దానివలన మీకు కలిగే నష్టం ఏమిటి?"
"కీర్తి తన కూతురు కోరిన ఓ మగాడ్ని అల్లుడ్ని చేసుకుంటూ ఖర్చు లేకుండా గొప్ప పరపతిని సంపాదిస్తున్నాడు. వచ్చేసారి కుడా నేనే పోటీచేయాలనుకుంటున్నాను కాబట్టి ఇది నాకు చాలా ప్రమాదం రాయుడు!" ఎం.పి. భోజరాజు చాలా కరెక్ట్ గానే వుహిస్తున్నాడు.
"ఉన్న మార్గాలు రెండే. పెళ్ళి జరగకుండా ఆపడం, లెదూ నిన్నటి గొడవను ఆధారం చేసుకుని....." ఆగిపోయాడు భోజరాజు.
అర్ధమైపోయింది రాయుడికి. పెళ్ళయినా ఆపించాలి, లెదూ నిన్నటి గొడవను ఆధారం చేసుకుని రాఘవను లేపేయాలి. అది చాలు.
కూతుర్ని అదుపులో పెట్టలేని వీర్రాజే రాఘవను హత్య చేశాడని ప్రజల్ని నమ్మించటానికి.
వీర్రాజు పోలిసుల్ని తప్పించుకోగలడెమో కాని, ఎన్నికలనే ప్రజాతీర్పులో ఓడిపోతాడు.
అనుకున్న దేదైనా అక్షరాల జరిపించగల యిద్దరు సమర్దుల్లో ఒకడయిన భోజరాజును చూస్తూ నుదుట పట్టిన స్వేదాన్ని తుడుచుకున్నాడు రాయుడు.
"ఓ పని చేస్తే బాగుంటుంది భోజరాజుగారూ!"
"ఏమిటి?"
"రాఘవతో కిన్నెర పెళ్ళి ఆపించటం కన్నా మీ రెండో అమ్మాయి రజనికి రాఘవతో పెళ్ళి జరిపిస్తే సరి!"
భోజరాజు భ్రుకుటి ముడిపడింది.
"అలా అయితే వీర్రాజుగారు దక్కించుకోవాల్సిన కీర్తి మీరు సాధించినట్టవుతుందిగా!"
భోజరాజు ఆలోచించేడెమో.....అయన పెదవులు మృదువుగా విచ్చుకున్నాయి. "కాని అదేలాసాధ్యం రాయుడు! సరిగ్గా ఏడు రోజుల తర్వాత అంటే ఈ నెల పన్నెండో తేదీన పెళ్ళి జరిపించాలని వీర్రాజు నిర్ణయించేశాడుగా......"
"జరగదు భోజరాజుగారూ! పన్నెండో తేదీన పెళ్ళి జరగదు. జరక్కుండా నే చూస్తాను."
హామీ ఇచ్చాడు రాయుడు.
సంతృప్తిగా చూశాడు భోజరాజు.
అన్నమాట నిలబెట్టుకోవడంలో రాయుడెంత ఘనుడో భోజరాజుకు తెలుసు.
సాలోచనగా బయటికి నడిచాడు రాయుడు.
వారం రోజులు విశ్రమించొచ్చు ప్రస్తుతానికి. ఆ తర్వాత రాఘవ నా అల్లుడు కావాల్సిన అవసరం లేదు. అలా వెనక్కి జరిగిన పెళ్ళిని ఆసరాగా చేసుకుని రాఘవని లేపేస్తే ప్రజల దృష్టిలో వీర్రాజు మరింత దిగజారుతాడు.
కూతురి బలవంతంపై వారంలోగా పెళ్ళికి అంగికరించిన వీర్రాజు ఆ తర్వాత కావాలనే పెళ్ళిని వాయిదా వేసి రాఘవను హత్య చేశాడని బలంగా ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చెయ్యొచ్చు.
అసలు సిసలైన రాజకీయ దక్షతను ప్రదర్శించిన భోజరాజు రాయుడికి ఆ పని పురమాయించి వారం రోజులు విశ్రమించేవాడే కాని, పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొటానికి ఎం.పి. లంతా డిల్లీ లో అర్జెంట్ గా సమావేశం కావాలని అధిష్టాన వర్గం నుంచి ఆదేశాలు అందడంతో డిల్లీ వెళ్లిపోయాడు మరుసటిరోజే.
రాయుడు ఇచ్చిన మాట నిజంగా నిలబెట్టుకోవాలనుకున్నాడు అందుకే ఉదయమే వీర్రాజు యింటికి వచ్చాడు.
"అమ్మాయికి అంగీకారమే అని తెలిసింది రాయుడు! అందుకే అనుకున్న రోజుకు పెళ్ళి జరిపించాలని నిర్ణయించుకున్నాను....." అన్నాడు వీర్రాజు.
"ఒక మంచి పని చేయడానికి వారం దాకా ఎదురు చూడాల్సిన అగత్యము లేదు వీర్రాజుగారూ!" అన్నాడు రాయుడు నెమ్మదిగా.
"అదేమిటి.....? ఒక్కగానొక్క కూతురు.....ఎంత ఆర్భాటంగా చేయాలి. ఏర్పాట్లకు వారం రోజులు అవసరం కాదు?"
"ఇప్పటికే మీ సహృదయతని గురించి ప్రతి గ్రామంలోను ప్రజలు విడ్డురంగా చెప్పుకుంటున్నారు వీర్రాజుగారూ! మీరు తలుచుకుంటే ఏర్పాట్లు చేయటానికి వారమెందుకు? రెండు రోజులు చాలవు?"
రాయుడెందుకిలా మాట్లాడుతున్నదీ ఆయనకు అర్ధం కాలేదు.
"మీరు తీసుకున్న నిర్ణయానికి భోజరాజుగారు ఎంత అందోళన చెందుతున్నది మీకు తెలీదు వీర్రాజు గారూ! ఓ పంచాయితీ బోర్డు నెంబరు చెప్పాడు."
"ఏమిటి?"
"భోజరాజుగారు డిల్లీ వెళ్ళారు అధిష్టానవర్గం తాఖీదుపై అవిశ్వాస తీర్మానంలో అధికార పార్టీ ఏ క్షణంలో అయినా పడిపోయేట్టు వుంది.....అంటే ఎన్నికలు మనం అనుకుంటున్న గడువుకు ముందే జరిగే అవకాశముంది. కాబట్టి ....మీరు ఆలస్యం చేయకుండా రెండు రోజుల్లోనే పెళ్ళి జరిపించటం మేలు."
భోజరాజు ఆలోచనను రాయుడు బయటపెట్టలేదు. బయట పెట్టడం ఎంత ప్రమాదమో తెలుసు. కాబట్టే ఏడో రోజున పెళ్ళి జరక్కుండా చూస్తానన్న రాయుడు అంతకు ముందే జరిపించాలని వీర్రాజును యిలా ప్రోత్సహిస్తున్నాడు.
"కేంద్ర ప్రభుత్వం పడిపోయాక ఎం.పి. గా కాక మాములు భోజరాజుగా వెనక్కి తిరిగి వచ్చిన భోజరాజు, వస్తూనే యిక్కడి పరిస్థితులకు షాక్ తినాలన్నా, మీకు బ్రహ్మరధం పడుతున్న ప్రజల్ని చూసి కంగారుపడలన్నా, మీరు అలస్యంతో అమృతం లాంటి అవకాశాన్ని విషపూరితం చేసుకోకుండా పెళ్లి వెంటనే జరిపించటం నయం!"
