Previous Page Next Page 
వెన్నెల వాకిళ్ళు పేజి 27

 

                                             13

    సమయం సాయంత్రం అయిదు గంటలు.

    ఊరిచివర వున్న ఆ కోవెల్లో సురేంద్ర, గిరిజ ఇద్దరూ కోనేటి మెట్లు మీద కూర్చుని వున్నారు.

    దూరంగా ఎక్కడో కోకిల కూస్తోంది.

    వాతావరణం ఆహ్లాదకరంగా వుంది. వేసవికాలం అయినప్పటికీ ఎందుకో ఆరోజు మబ్బులు పట్టి వుండటంవల్ల చల్లగాలి వీస్తోంది. గిరిజ సురేంద్రతో కబుర్లు చెపుతూ ఒక్క రాయి తీసుకుని కోనేటి నీటిలోకి విసురుతోంది.

    ఆ సమయంలో ఆ కోవెలకు ఎవరూ రారు. ఇద్దరే ఏకాంతంగా ప్రశాంతంగా కూర్చుని వున్నారు.

    గిరిజ నల్లంచు నీలిరంగు పట్టుచిరే మీద అదేరంగు జాకెట్టు వేసుకుని, తలనిండా, మల్లెపూలు పెట్టుకుని సురేంద్రకు మత్తుగొలుపుతోంది.

    సురేంద్ర తెల్ల ప్యాంటు, తెల్ల లాల్చీ వేసుకుని హుందాగా వున్నాడు.

    "అసలు నిన్ను చేసుకుంటానని నేను ఉహించలేదు గిరిజా" అన్నాడు సురేంద్ర.

    "మరి జయంతిని చేసుకోవాలనుకున్నవా?" అంది గిరిజ వెంటనే.

    "ఛ అలా అని ఎందుకనుకున్నావ్?" అన్నాడు సురేంద్ర సీరియస్ గా.

    "చేసుకుంటే నన్ను చేసుకోవాలి, లేకపోతే జయంతిని అంతేగా" అంది గిరిజ ముక్తసరిగా.

    "అంటే లోకంలో మీ ఇద్దరేనా ఆడవాళ్ళు" అన్నాడు నవ్వుతూ.

    "ఏమో, నాకయితే నీ మీద అనుమానమే" అంది బింకంగా.

    "ఏ విషయంలో" అన్నాడు సీరియస్ గా సురేంద్ర.

    "జయంతిని చేసుకోవాలనుకున్నావు.....మా నాన్నగారు అత్తయ్యను అడగటం ఆమె సరే అనటంతో నువ్వు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో సరే అన్నావు" అంది గిరిజ చిరుకోపం నటిస్తూ.

    "ఏయ్ పిచ్చిమొద్దూ! నివన్ని పిచ్చి ఆలోచనలు, నీ ఆలోచన తప్పు" అన్నాడు.

    "మరి ఒప్పేమిటో?!" అంది గిరిజ.

    "ఒప్పేమిటంటే ఈ ఒప్పులకుప్ప వొయ్యరి భామనే మనస్పూర్తిగా చేసుకోవాలనుకోవటం" అన్నాడు.

    "మరి ఆ రోజు జయంతి అన్నిసార్లు నిన్ను గుచ్చిగుచ్చి అడిగిందెందుకు? నీకు గిరిజక్కను చేసుకోవటం ఇష్టమేనా అని?" అంది గిరిజ.

    "అది పిచ్చిపిల్ల. దాని మాటలు పట్టించుకుంటావే?' అన్నాడు ఆమె భుజం పైన చేయివేసి దగ్గరకు తీసుకుంటూ.

    "అదేం పిచ్చిపిల్ల కాదు. నేనే పిచ్చిపిల్లను" అంది గిరిజ.

    "అయ్యో! నువ్వు అనవసరంగా పాపం జయంతిపైన అనుమానం పెంచుకుంటున్నావు. నాకు జయంతిపైనా అసలలాంటి ఉద్దేశమే లేదు" అన్నాడు సురేంద్ర నవ్వుతూ.

    "అలాంటి ఉద్దేశమంటే?" అంది గిరిజ.

    "అదే పెళ్ళిచేసుకోవాలని" అన్నాడు సీరియస్ గా.

    "దానికి వుండొచ్చుగా?" అంది మళ్ళి గిరిజ.

    "ఏమో! అలాగని నేననుకోను. అదే నిజమైతే జయంతి నీలాగా పిరికిది కాదు. ముఖం మీదే అడిగేస్తుంది బావా! నేనంటే నీకిష్టమేనా అని అన్నాడు సురేంద్ర.

    "అబ్బో అబ్బాయిగారు ఆవిడ గారి మనస్తత్వాన్ని బానే అర్ధం చేసుకున్నాడే" అంది రాగాలుతీస్తూ.

    "అబ్బా! గిరిజా! నువ్వనవసరంగా ఆలోచిస్తూ ఇంత మంచి సమయాన్ని వృధా చేస్తున్నావు.....మన పెళ్ళయి పదిరోజులే! అప్పుడే అనుమానాలా? ఇకముందు ఎప్పుడలాంటి ఆలోచనలు నీ మదిలో రానీయకు. పాపం జయంతి బోలా మనిషి. నువ్వే దానిని సరిగా అర్ధం చేసుకోలేదు" అన్నాడు సురేంద్ర గిరిజకు నచ్చచెపుతూ.

    "ఏమోలే బావా? అలాగయితే మంచిదేగా, నువ్వు మాత్రం ఇక ముందు దానితో చనువుగా ఉండటం నేను సహించను" అంది గిరిజ.

    "అదెలా సాధ్యం గిరిజా? ఒక ఇంట్లో వుంటున్నాం....చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి పెరిగాం" అన్నాడు సురేంద్ర.

    "అదే చిన్నప్పుడు వేరు....ఇప్పుడు వేరు, ఇకముందు అలా కలిసి మెలిసి తిరగటం, పెరగటం...మాట్లాడటం కుదరదంటున్నా" గిరిజ సీరియస్ గా చెప్పింది.

    పెళ్ళయిన తరువాత మనం వెంటనే ఆ పిల్లను వేరు చేస్తున్నట్లు, చూస్తూ మాట్లాడకుండా ఉంటే బావుండదు గిరిజా, అయినా నికేమయింది రోజు! మీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా వుంటారుకదా....?" అన్నాడు సురేంద్ర.

    "అది ఒకప్పుడు, పెళ్ళికాకమునుపు, ఇప్పుడుకాదు. నేను దానిలాగా అందర్నీ రాసుకుంటూ, పూసుకుంటు తిరగలేను. అలా వుండటం నా కిష్టం లేదు" చెప్పింది సీరియస్ గా.

    "గిరిజా...గిరిజా! నీకు పిచ్చిపట్టినట్లుంది.....సరే ఇక ఆ విషయం వదిలిపెట్టు. హాయిగా కబుర్లు చెప్పుకోవచ్చని నిన్ను ఇక్కడకు తీసుకొస్తే నా మనసంతా పాడు చేశావు" అన్నాడు సురేంద్ర.

    గిరిజ ఏమి మాట్లాడకుండా అలానే మౌనంగా కూర్చుని కోనేట్లోకి రాళ్లు విసురుతోంది.

    సురేంద్ర కూడా కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉన్నాడు.

    "అంటే పెళ్ళయిన తరువాత నువ్వు జయంతితో అంత అన్యోన్యంగా మాట్లాడటం, ఆమెతో నవ్వుతూ మాట్లాడటమంతా నటనా గిరిజా? నీ మనసులో ఇంత అనుమానాన్ని పెట్టుకుని ఎలా వుండగలుగుతున్నావ్?" అన్నాడు సురేంద్ర.

    గిరిజ ఏమి మాట్లాడలేదు.

    "బావా నేను ఇదివరకు గిరిజను కాదు, నాకు పెళ్ళయింది. నాకంటూ ఒక మొగుడున్నాడు. వాడు నాకే దక్కాలి. ఇంకెవరితో చనువుగా ఉండకూడదు. నాతోనే చనువుగా వుండాలి, నా మొగుడితో మరే ఆడదైనా చనువుగా ప్రవర్తిస్తే నేను సహించను అంతే! ఇది దృష్టిలో పెట్టుకో జయంతి మీద నాకు ప్రత్యేకించి కోపమేమి లేదు. అదంటే నాకూ ఇష్టమే. కానీ మీ ఇద్దరూ అలా చనువుగా వుండటం మాత్రం నేను సహించలేను అంది గిరిజ సీరియస్ గా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS