Previous Page Next Page 
సౌజన్యసాహితి పేజి 27

    
    
     "అవన్నీ ఆలోచిస్తూ కుర్చూంటే - పదిరోజుల్లో పది పేపర్లు కూడా దిద్దలేరు! మీరిలా పార్సిల్ కోచిలా స్లోగా దిద్దితే - అటు క్యాంప్ ఆఫీసరు - ఇటు గ్రూపు ఆఫీసరు 'ఛీఫ్' ని వూరుకోరు! ఎవరి తొందరలో వారు ఎవరి పని వారు, తొందరగా ముగించుకొని ఎలాగో బయట పడాలని తాపత్రయ పడుతుంటారు. వీళ్లిచ్చే 'పేపరుకు - రూపాయి, ' పద్దతికి, యింతకంటే బాగా దిద్దితే గిట్టదు." అంది, గంగాబాయి ముసిముసినవ్వులు నవ్వుతూ.
     ఇంతలో రామ్మూర్తి తాలూకు పేపర్లు దిద్దటంముగించి సవాళ్లు 'తుఫాను బాధితునికి చందా!' అన్నట్టు రామ్మూర్తికి పేపర్లు అప్పగించారు.
     ఆ పేపర్లు చూశాక రామ్మూర్తికి గాంగాబాయి చెప్పింది నిజమేననిపించింది! ఒకటి రెండు పేపర్లు తప్ప అందరికీ ముప్పయి ఆరే వచ్చాయి.
     ముప్పయి ఆయిదు వస్తే  పాసయినట్లే? మరి ఒక మార్కు ఎక్కువే వేశారు - అందరూ!వీళ్లకంటే గంగాబాయే, కాస్త లిబరల్! 'ఈ పద్దతిన పేపర్లు దిద్దటానికి, 'ఎమ్మే' చదవాలా! మూసలోంచి తీసినట్టు అందరికీ ముప్పయి ఆరు మార్కులు వేస్తుంటే ఇంకా అందులో 'జడ్జిమెంటు' ఏముంది? ఏమీ చదవనివాడు - ఏమీ రాయనివాడు - బాగా చదివినవాడు - బాగా వ్రాసిన వాడు - గాడిదలూ గుఱ్ఱాలూ - ఏకమవుతున్నాయ్?' అనుకున్నాడు బాధగా రామ్మూర్తి.
     కాని అదోప్రవాహం! తను మడిగట్టుకుని కూర్చొని చేతకానివాడనిపించుకోవడంకంటె - చేయగలిగింది ఏంలేదు! ప్రవాహానికి ఎదురీది గెలవటం సాధ్యమా!
     ఇంతలో ఛీఫ్ రెండు నంబర్లున్న ఒక చిన్న కాగితమిచ్చి 'మీ పేపర్లలో నేనిచ్చిన ఈ రెండు నంబర్లుకాస్త స్పెషల్ గా చూసి, పులప్ చేయండి!' అన్నాడు, రామ్మూర్తితో! "ఇదేమిటీ!రీనంబరింగ్ వుందికదా!ఈ నెంబర్లు నా కట్టలోనే వచ్చిన ఆన్సరు షీట్లలో వున్నట్టు యీయనకు ముందే తెలుసా!" అనుకున్న రామ్మూర్తి, మెల్లిగా  వెళ్లి తన సందేహాన్ని ఛీఫ్ చెవిలో వూదాడు!
     రామ్మూర్తి మాటలకు ఛీఫ్ కంగారు పడలేదు. అమాయకుడా అన్నట్టు చిరునవ్వొకటి నవ్వి 'పైన రీనంబరున్నా- లోపల యడిషనల్ షీట్సుమీద రెడ్డింకుతో అసలు రిజిష్టరు నెంబర్లు వేయమని  స్టూడెంట్సుకి నేనేచెప్పి పరీక్ష హాల్లోనే వేయించాను! మన అసిస్టెంటు క్యాంపు ఆఫీసరు ఆయనకి యింటరెస్టెడ్ కేసులు రెండు చూడమన్నాడు, 'నా యింటరెస్టెడు క్యాండెట్సు వున్న పేపర్లు నాకు యలాటు అయ్యేట్టు నేను చూడమన్నాను! దట్సాల్!' అన్నాడు అసలు రహస్యం బయట పెడుతూ!
    రామ్మూర్తికి మతిపోయినట్లయ్యింది!
     ఏం చేయటానికి తోచక "నా పేపర్లు అన్నీ దిద్ది, మన ఎగ్జామినర్సు అందరికీ  - తలా - ముప్పయిఆరు వేసేశాడు సార్! గంగాబాయి మాత్రం - నలబై నాలుగువేశారు!" అన్నాడు రామ్మూర్తి.
     "అయితే మరీ మంచిది! ప్రతి ప్రశ్నకి రెండు చొప్పున అదనంగా మార్కులు వేసేయండి నే చెప్పిన పేర్లకి. ఆపైన అవసరమైతే, నాలుగు మార్కులు నా రీవేల్యు యేషనులో నేను సర్దుతాను!' అన్నాడు ఛీఫ్ - గీతా రహస్యం - విడమరచి చెప్పినంత తేలిగ్గా!
     "వీళ్ళ యింటరెస్ట్ డ్ క్యాండేట్స్ కి - ఫస్టుక్లాసు, డిష్టింగ్ షన్ మార్కులిస్తే - మరి నిజంగా అరవై రావలసిన వాళ్ళకు అన్యాయం జరిగినట్టేగా!" అనుకున్నాడు రామ్మూర్తి.
     కాని ఏం చేయగలడు!అంతే! చివరకి తనూ ప్రవాహానికి వాటంగా పోవటానికే నిర్ణయించుకున్నాడు. మూడో రోజు అందరికంటే ముందే వేల్యుయేషన్ ముగించాడు.
     అందరూ ఆశ్చర్యంగా చూశారు! ఛీఫ్ అభినందించాడు. కాని రామ్మూర్తి మనసులో ఏదో మూల గిల్టిగా అనిపించింది! 'ఎదురుగా 'లతా టాకీస్ - ఎ. సి. లో 'ఎంటర్ ది డ్రాగన్' వుంది వెళదామా!' - అడుగు తున్నాడు అప్పుడే ఆరోజు 'కోటా' పూర్తి చేసిన ఒక మగ ఎగ్జామినర్ మరో ఆడ ఎగ్జామినర్ని.
    'ఇలా దిద్దితే - పరీక్ష పేపర్లు దిద్దటమంత తేలిక పని మరోటి వుండదు!" అనుకున్నాడు రామ్మూర్తి!
    ఇక ఆబ్యాచ్ ఆఫ్ ఎగ్జామినర్సులో రామ్మూర్తి అందరికంటె ఎక్కువ పేపర్లుదిద్ది ఎక్కువ రెమ్యునరేషను సంపాదించి అందరూ ఈర్ష్య పడేట్టు చేసుకున్నాడు.
     ఆరోజు సాయంత్రమే షాపింగ్ ముగించుకొని 'అలెగ్జాండరు, ప్రపంచ విజేతగా ప్రపంచాన్ని జయించినంత ఆనందాన్ని పొంది - గోల్కొండ ఎక్స్ ప్రెస్ లో గుంటూరుకు తిరుగు ప్రయాణమయ్యాడు.
     గోల్కొండ ఎక్స్ ప్రెస్ విజయవాడ చేరేటప్పటికి రాత్రి ఎనిమిదైంది. స్టేషన్ లోని బుక్ స్టాల్స్ దగ్గర పెద్ద కోలాహలంగా వుంది. జనం ఎగబడి నైట్ ఎడిసన్ న్యూస్ పేపర్లు కొంటున్నారు.
     రామ్మూర్తి ట్రెయిను దిగి 'ఏమిటి విశేషం?" అన్నాడు ఒక కుఱ్ఱవాణ్ణి ఆపి.
     అతను పరుగెత్తుతనే 'ఇవ్వాళ ఎస్. ఎస్. సి.' రిజల్ట్సు వచ్చాయిసార్'  అన్నాడు ఆగకుండానే'
    "ఏమిటీ! ఇవ్వాళ ఎస్. ఎస్. సి రిజల్ట్సు వచ్చాయా? అయితే మా అబ్బాయి రవికి స్టేట్ లెవెల్ లో ఏ రాంక్ వచ్చిందో చూడాలి?" అనే కుతూహలంతో పేపరు గబగబా చూశాడు.
     ఆశ్చర్యం! స్టేట్ లెవెల్ రాంక్స్ లో రవి నెంబరు లేదు!!!??? రామ్మూర్తి కాళ్లక్రింద భూమి క్రుంగిపోతున్నట్టు, గాలి స్తంభించినట్టు , కళ్ళు తిరుగుతున్నట్టు - వెన్నులోంచి ఏదో నొప్పి ఒక్కసారి పుట్టుకొచ్చినట్టు - మనిషి ఒక్కసారి విచలితుడయ్యాడు!
    రామ్మూర్తికి తన కళ్లముందు నిజం నమ్మబుద్ది కాలేదు!....... నమ్మలేక  - మళ్లీ మళ్లీ చూశాడు!
    'ఇదేమిటి స్టేట్ లెవెల్ రాంక్ లో నెంబరు లేకపోతే పోనీ, ఫస్టుక్లాస్ లో కూడా నెంబరు లేదు!మైగాడ్ - సెకండ్ క్లాస్ లోనూ లేదు!వాట్ ఇదేమిటి!? ఇదెక్కడి పాపం! రవి? ...మా ... రవి? స్టేట్ లెవెల్ రాంక్ రావలసిన వాడికి ...ధ...ర్డ్... క్లా.... సా....!!! ధర్డ్ క్లాస్..... ధర్డ్ క్లాస్.... ధర్డ్ క్లాస్...... ఇది కలా... నిజమా.... రవి కే ధర్డ్ క్లాస్ వస్తే.... ఈ పరీక్షలకి ... .యీ పరీక్షా విధానానికి అర్దంలేదు. నా పిల్లవాడెంత తెలివి గలవాడో ఒక టీచరుగా... నాకు తెలుసు! ఒకసారి పేపర్లు దిద్ది రిజల్ట్సు యనౌన్స్ చేశాక. ఇకి ఆ విద్యార్దికి అన్యాయం జరిగితే... ఆ పేపర్లు దిద్దేవాళ్లు ఎంత అజాగ్రత్తగా, బాధ్యతా రహితంగా దిద్దినా ఆ విద్యార్ది భవిష్య్తతు!' అనుకుంటూ ఎంతో నీరసం ఆవహించగా, బాధగా నిస్తేజంతో వచ్చి కుప్పలా కూలబడ్డాడు, రైలు పెట్టెలో.
    బండి గుంటూరుకు ఎప్పు డొచ్చిందో రామ్మూర్తికే తెలియదు!రైలు పెట్టెలు వూడ్చేవాళ్లువచ్చి 'బాబూ! గుంటూరొచ్చింది! బండి యిక్కడే వుండిపోద్దిగా! దిగండి!" అంటూ చెప్పేవరకు రామ్మూర్తి మళ్లీ ఈ లోకంలోకి రాలేక పోయాడు
     రిక్షా పట్టాబిపురం రైలు గేటు దాటుతుంటగా - రైలు పట్టాలమీద కుఱ్రవాడి శవం చుట్టూ చేరిన జనం మాటలు ఇలా వినిపించాయి.
     "లెక్టరర్, రామ్మూర్తిగారబ్బాయట! ఫస్టుక్లాస్ వస్తుందని అందరికీ చెప్పాట్ట!తీరా......!!ధర్డ్ క్లాస్ వచ్చేప్పటికి... తండ్రి ఏమంటాడోనన్న భయంతో యిలా రైలు కిందపడ్డాట్ట! ఆ తల్లిని చూడండి... పాపం! ... గుండెలు పగిలేట్టు ఏలా ఏడుస్తుందో!"
    ఈ మాటలు వింటూనే రామ్మూర్తి మొదలు నరికిన చెట్టులా కూలిపోయాడు. అక్కడి జనం గుంపుగా రామ్మూర్తి రిక్షాచుట్టూ మూగసాగారు!

                                           *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS