Previous Page Next Page 
పగలే వెన్నెల పేజి 27


    

    అదీగాక భార్యను చూడాలంటే ఆదోలా వుంది. బయట ఎంత అత్మవిశ్వాసంతో వుంటాడో ఇంటికెళ్ళగానే అంత అత్మవిశ్వాసం  తగ్గిపోతుంది.


    "ఏమయ్యా ! ముసలయ్యా! అని కాంచనమాల అంటుంటే వార్థక్యం పెద్దపులిలా మీదకుదూకి పెరుక్కుతినేస్తుంటుంది. అందుకే ఈ మధ్య ఇంటికి వెళ్ళాలంటే పెద్దగా ఇష్టముండడంలేదు.


    అందులోనూ ఈ మధ్య మానసికంగా వున్న అలజడి శారీరకంగా కూడా కనిపిస్తోంది. కాంచనను చూస్తూనే ఒళ్ళంతా చెమట్లు పట్టేస్తున్నాయి. గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఏదో భయం శరీరాన్ని ముడుచుకుపోయేలా చేస్తోంది. ఇది ఎందుకో తెలియడం లేదు.


    ట్రాక్టర్ రిపేర్ లో మెకానిక్, దాసూ తలమునకలై వున్నారు. సినిమాహాల్ లోంచి పాటలు అతి తక్కువ స్ధాయిలో విన్పిస్తున్నాయి.


    ఆరోజు ఆదాయం ఎంతో లెక్కవేయడం ప్రారంభించాడు. గోపాల్రావు. మొత్తం రెండువేలు దాకా వున్నాయి.


    తను ఇంత సంపాదిస్తున్నా పెళ్ళాం దగ్గర గౌరవం వుండడంలేదు. పైపెచ్చు గడ్డిపోచకంటే హీనంగా తీసిపారేస్తుంది. గౌరవం అన్నది మొదట్నుంచి లేదు. పోని ప్రేమ, అభిమానం లాంటివి చాలా తక్కువగా వ్యక్తపరుస్తుంది. మరీ దబాయించి అడిగితే లేదనే చెప్పాలి. ఇక శృంగారం కథ చెప్పనక్కర్లేదు. పెళ్ళయిన ఇన్నేళ్ళల్లో అమెగా ఆ కోరికను వ్యక్తపరచలేదు.. మొదట్లో అయితే పక్కకి చేరగానే కాస్తంత నవ్వు ముఖంతో వుండిది. రామరామ ఆ నవ్వు మాయమైంది. ఏదో మొక్కుబడి తీరుస్తున్నట్టు కనిపించేది. దాంతో శృంగారం కూడా ఏదో శరీరం తిమ్మిరి తీరడానికి తప్ప మనసుకు తాకే ప్రక్రియ కాకుండా పోయింది.


    ఇక తనను అప్పుడప్పుడూ "ముసలయ్యా" అని పిలవడం చూస్తుంటే పంచప్రాణాలూ గిలగిల కొట్టుకున్నట్టు వుంటాయి. తను అమెను ఏమీ అనలేని స్ధితి. అంత చిన్న అమ్మాయిని పెళ్ళిచేసుకుని తప్పుచేశానేమోనన్న గీల్టీఫీలింగ్ వుండడంవల్లే అలా అంటున్నా అమెను దండించలేకపోతున్నానని తెలుసు.


    అతను తిరిగి డబ్బును జేబులో వేసుకున్నాడు.


    సాయంకాలం మాయమై చీకట్లు వాలాయి. సినిమా హాల్ లోంచి ఏవో మాటలు , ఆ మాటల్ని అనుసరిస్తున్న సంగీతం విన్పిస్తున్నాయి. సెంటర్ కొచ్చిన జనం తిరిగి ఇళ్ళకు వెళ్ళిపోవడానికి బస్టాప్ లలో చేరుతున్నారు. వైన్ షాప్ మరింత బిజిగా తయారైంది.


    మెకానిక్ చేతుల్ని వేస్ట్ తో తుడుచుకుంటూ గోపాల్రావు దగ్గరికి వచ్చాడు.


    "అన్నా! టీకి పంపించు" అని అసిస్టెంట్ ను అరిచాడు. వాడు రాగానే గోపాల్రావు డబ్బులిచ్చాడు.


    "ఏమిటి ప్రాబ్లమ్?" అప్పటికి ఏమైనా తెలిసిందేమోనని అడిగాడు.


    "లేదన్నా- అదే చూస్తున్నాను"    


    మరెలా?రేపు ఉదయానికల్లా బండి రెడీ అయిపోవాల. లేకపోతే పనికాస్తా అగిపోతుంది" అన్నాడు.


    "రేపు ఉదయానికి ట్రాక్టర్ ని బాగుచేయించే పూచి నాది. నువ్వు నిబ్బరంగా వుండు."మెకానిక్ అభయమిచ్చాడు.


    "అదేదో త్వరగా కానివ్వు. మీరయితే పనిలో వున్నారు. నాకు బోర్ కొడుతోంది" అన్నాడు గోపాల్రావు.


    అది నిజమే! అక్కడికి వచ్చిన దగ్గర్నుంచి ఏమీ తోచడంలేదు


    "చెక్ పోస్ట్ దగ్గిరికి వచ్చి ఏమీ తోచడంలేదన్న వాణ్ని ఈ మండలంలో నిన్నొక్కణ్నే చూశానన్నా" అన్నాడతను.


    గోపాల్రావు మాట్లాడకపోయేసరికి తనే మాటల్ని పొడిగించాడు. మెకానిక్. "కాలక్షేపానికి ఎన్ని లేవిక్కడ? బీరు తెప్పించుకుని తాగు. కాలం అదే పరిగెడతాది."


    "అన్నకి పెద్ద అలవాటు లేదు. మనలాగా కాదు" డ్రైవర్ దాసు తన యజమాని విషయం పూర్తిగా తెలుసు కాబట్టి చెప్పాడు.


    "పెద్ద అలవాటు లేదు. అంతేకదా- నా మాట విని బోరు తెప్పించు. అదే చేతుల్తో మాకు ఒక హాఫ్ తెప్పించు. ఇప్పుడు పుచ్చుకోలేం లే. నీ ట్రాక్టర్ బాగుచేశాకే దుకాణం తెరుస్తాం- సరేనా?".


    గోపాల్రావుకి కూడా ఎందుకనోగాని ఆరోజు తాగాలనిపించింది. ఈ ఆలోచనల వత్తిడినంచి రిలీఫ్ వస్తుందనిపించింది. అంతేకాకుండా అలోచనాధోరణి కూడా మారుతుందనిపించింది.


    "అలానే- మీ  అసిస్టెంట్ దగ్గర తెప్పించు. నాకు మాత్రం బీర్. విస్కి, బ్రాంది లాంటివి ముట్టను". అన్నాడు హుషారుగా. అప్పుడే తన ఆలోచనాసరళి మారినట్లనిపించింది. రెండొందలు తీసిచ్చాడు.


    అంతలో కుర్రాడు టీలు తెచ్చాడు.


    "ముందు టీ తాగు- తర్వాత విషయం చెప్తా" అన్నాడు మెకానిక్ కుర్రాడితో.


    వాడు టీ తాగాక" మాకు విషం తెచ్చిపెట్టు" అన్నాడు.


    గోపాల్రావు ఉలిక్కిపడ్డాడు.


    "నువ్వేం కంగారుపడకన్నా! మేం బ్రాందీ, విస్కీలని అలానే పిలుస్తాం సరదాకి" అని కుర్రాడితో ఏమేం తేవాలో చెప్పాడు.


    కుర్రాడు వెళ్ళి మొత్తం సరంజామా అంతా తెచ్చి పెట్టాడు. అ తరువాత గోపాల్రావు ముందు ఓ స్టూల్ వేశాడు. దానీమీద మిక్చర్ పొట్లం విప్పిపరిచాడు.


    మరోపక్క మిర్చిబజ్జీ తెచ్చిపెట్టాడు. పొడవు డిస్సోజల్ గ్లాస్ లో బురుగురాకుండా బోరు పోశాడు.


    "నిదానంగా లాగించన్నా! మేం దీని కథేదో చూసేస్తాం" అన్నాడు మెకానిక్.


    అంతేకాకుండా కుర్రాళ్ళని పిలిచి "మాకు తెచ్చిన బ్రాంది సీసాను కూడా అదిగో మా కళ్ళముందుంచు చూస్తుంటే ఉత్సాహం వస్తుంది......" అన్నాడు.


    నవ్వుతున్న గోపాల్రావుతో "తాగటానికి కాదులే అన్నా! చూస్తుంటే చాలు చేసేపని కష్టం తెలియదు" అన్నాడు.


    గోపాల్రావు గ్లాస్ అందుకున్నాడు. మనసులో ఏదో కొత్త ఫీలింగ్. ఆ వాతావణం, సాయంకాలం , చల్లటిగాలి, బీరువాసనా, జనాన్నంతా గమనిస్తూ సిప్ చేయడం చాలా బావుంది. నిజమే- ఆలోచనాసరళి కూడా మారింది. ఇప్పుడు తనను "ముసలయ్య" అని పిలిచే కాంచనమాల కనపడడంలేదు. మల్లెపూలను కొప్పనుంచి జారవిడిచి అద్దాల బీరువాలోంచి అప్పుడే తీసిన గద్వాల్ చీరలో వున్న ఆడపిల్లల పైకిపోతోంది. ద్యాసంతా. వాళ్ళతో సినిమాహాల్లోకి వెళ్ళమంటోంది మనసు.


    మొదటి గ్లాసయిపోయింది. రెండోది నిదానంగా తనే పోసుకున్నాడు. ఇప్పుడు మరింత ఉత్సాహంగా తయారయ్యాడు. ఎప్పుడూ తనను బాధపెట్టే సమస్యలు, ఇప్పుడు తనను భయపెట్టడంలేదు. పైపెచ్చు అవన్నీ చిన్న సమస్యల్లా కనిపిస్తున్నాయి. ఏదో తెలియని ధైర్యం మనసులో దూరింది. ధైర్యం వుండడం ఇంత బాగుంటుందా అని మనసులో అనుకున్నాడు.


    అతనికి ఠక్కున డ్రైవర్ దాసూ భార్య ఉమ గుర్తుకొచ్చింది. అమె సమక్షంలో కాక అమెను గురించి ఆలోచించడం అదే మొదటిసారి. అమె గుర్తుకురావడంతోనే్ హుషారొచ్చినట్టు అతను కనిపెట్టాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS