Previous Page Next Page 
నీ మీద మనసాయరా పేజి 28


    మొత్తానికి వెంకటరమణ భలే భార్యను కొట్టేశాడే? దేనికైనా అదృష్టం వుండాలి. ఇలాంటి మాటలు నాకు విన్పిస్తూనే వున్నాయి.
    
    కూలిపనికి వెళ్ళకుండా పుట్టింట్లో కుదిరిందిగానీ ఇక్కడ కుదిరేటట్లు లేదు. ఆయనకి రెండుపూటలా భోజనం పెట్టి నెలకు నాలుగువందలు ఇచ్చే వాళ్ళు దాంతో కుటుంబం గడుస్తుందిగానీ బట్టలూ, ఆరోగ్యాలు ఇలాంటివి కుదరవు. అందుకే పనికి వెళ్ళకుండా వుండడం కష్టం.    

    మెల్లగా పనులకు వెళ్ళడం ప్ర్రారంభించాను. మొదటిరోజే ఊరు మొదట్లో కూతోడు తగిలాడు. వాడు అన్నీ పచ్చిపచ్చిగా హాస్యంగా మాట్లాడడం వల్ల వాడికి ఆ పేరొచ్చింది. వాడికి నలభైయేళ్ళకు పైగానే వుంటాయి. నేను మిగిలిన స్త్రీలతో కలిసి కలుపు తీయడానికి వెళుతుంటే ఆపాడు.
    
    "నువ్వా వెంకటరమణ భార్యవి, ఎవరో చెప్పుకుంటుంటే అబద్దం అనుకున్నాను గానీ నిజంగానే వజ్రంలా ఉన్నావు. వాడొట్టి అర్బకుడు. నీలాంటి దాని ముద్దూ ముచ్చట వాడేం తీరుస్తాడు. నువ్వు కొంగుజారిస్తేనే వాడు బహుశా మూర్చతో పడిపోయుంటాడు" అన్నాడు.
    
    నా పక్కనున్నవాళ్ళు కూడా వాడితోపాటు నవ్వుతూ శ్రుతి కలిపారు.
    
    సాటి ఆడపిల్లను అలా వాడు అంటే మూతిమీద రెండు ఇవ్వాల్సింది పోయి నవ్వుతారా? అందుకే అటువంటి వాళ్ళ దగ్గర చీప్ అయిపోతాం మేము. అదే రైతు స్త్రీల దగ్గర వాడలా మాట్లాడగలడా? కేవలం మా దగ్గరే వాడు తన ప్రతాపం చూపిస్తాడు.
    
    "చాముండీ- మావాడ్ని భద్రం కిందా మీదా పడ్డా గుట్టుగా సంసారం చేసుకుంది"
    
    వాడి మాటలు ముందుకు అడుగులేస్తున్న నాకు విన్పిస్తూనే వున్నాయి.
    
    "ఎవడు వాడు? వాడిది నాలుకా? మురికి కాలువ తూమా?" అనడిగాను అసహ్యంతో నోట్లో వూరిన నీళ్ళను దిగమింగుకుంటూ.
    
    "వాడ్ని పట్టించుకోవద్దు వాడంతె" అంది నాకు అక్క వరసయ్యే వనజాక్షి.
    
    అలా పనులకు వెళ్ళడం వల్ల ఊళ్ళో వాళ్ళ అందరి కళ్ళూ నామీద పడ్డాయి. పగలు మేం తెచ్చిన నీళ్ళు తాగకుండా, పొరబాటున చెయ్యి తగిలితే అదేదో మహాపాపం అంటుకుంటున్నట్లు విసుక్కునే రైతులు రాత్రయితే నాకోసం చేసే వికారపు పనులు ఎంత కోపాన్ని పుట్టించేవో.
    
    నాభర్త రాఘవరెడ్డి దగ్గర ట్రాక్టర్ డ్రయివర్. ఊర్లో ఆయన ఓ మోతుబరి. మధ్యాహ్నం నా భర్త వాళ్ళింట్లో తినేస్తాడు గానీ రాత్రి నేను రాఘవరెడ్డి ఇంటికెళ్ళి భోజనం తేవాలి. దాన్నే ఇద్దరం కలిసి తినేవాళ్ళం. పొద్దుపోయిన ఓ అరగంటకు గిన్నెలు తీసుకుని రాఘవరెడ్డి ఇంటికి వెళ్ళే దాన్ని. ఊరికీ, మా వాడకీ మధ్య రెండు ఫర్లాంగులని చెప్పాను గదా! అదిగో ఆ దారి మధ్యలో కాపుకాసేవాళ్ళు మగవాళ్ళు.
    
    "చాముండీ- ఒక్కసారి.... ఒక్కసారి నువ్వు వూఁ అను చాలు ఏం కావాలంటే అది తీసుకో డబ్బు, వడ్లు, శెనక్కాయలు- ఏదయినా సరే నీ ఇష్టం"
    
    ఇలా వెంటపడేవాళ్ళు, పల్లెటూళ్ళలో ఇవన్నీ డైరెక్టుగా వుంటాయి. నంగి నంగి మాటలూ, హోటళ్ళు, సినిమాలు, లవ్ లెటర్స్ - ఇవేమీ  ఉండవు. నిముషంలో విషయం తేలిపోతుంది. అందుకే అంత డైరెక్టుగా అడిగేవాళ్ళు. ఇలా అడిగినవాళ్ళలో గుడి పూజారి నుంచి చిల్లరకొట్టు సురేంద్రరాజు వరకూ వున్నారు. ఇదంతా వివాహం అయి పెళ్ళామూ పిల్లలూ వున్నవాళ్ళ కథ ఇక పెళ్ళికాని యువకులు అప్రోచ్ వేరుగా వుండేది. ఇంత డైరెక్టుగా కాకుండా కాస్తంత ఇన్ డైరెక్ట్ గా పిలిచేవాళ్ళు.    

    "రాత్రంతా కలలో నువ్వే మనిద్దరం చెరుకు తోటలో వుంటే ఊర్లోవాళ్ళు చూసేశారట ఇద్దరం అలా పరిగెడుతూ ఓ దగ్గరపడిపోయాం నువ్వు కింద- నేను పైన- వెనక పరిగెత్తుకొస్తున్న జనం"
    
    ఇలా చెప్పేవాళ్ళు ఎంతమందిని కోపగించుకోగలను? అందుకే కొందరికి మంచి మాటల్తోనూ, ఇంకొందరికి కఠినంగానూ, మరికొంతమందిని బెదిరిస్తూ నా అయిష్టతను చెప్పాను.
    
    కానీ వినరే కూతోడైతే నన్ను చూస్తూనే విజ్రుంభించేస్తున్నాడు. వాడిది నోటిదూల.
    
    "ఏం చాముండీ! ఊర్లో ఒక్క పిల్లగాడ్నీ నువ్వు కంటినిండా నిద్రపోనివ్వడం లేదు. అడిగిన వాడికంతా వూ కొట్టేస్తే పోయేదేం వుంది. ఆఁ ఎన్నిరోజులు యిలా లాక్కురాగలవు. పరాయివాడికి కొంగు పరిస్తే పెద్ద కొంపలేం అంటుకుపోవులే"
    
    వాడు మా ఆడవాళ్ళు పనులకు పోయే టైమ్ కి వీధి మొగుదాలలో కూర్చుంటాడు. పనుల నుంచి వచ్చే టైమ్ కే అక్కడ తగలబడతాడు. అందర్నీ ఇలా అంటూ, చుట్టూ ఉన్నవాళ్ళను నవ్విస్తుంటాడు.
    
    "ఏం రాధా! మొన్ననే పెళ్ళి అయిందటగా, నీ మొగుడు సుఖపెడుతున్నాడా? లేక శ్రమ తగ్గుతుందని పక్కింటివాడికి ఒప్పజెప్పేస్తున్నాడా?" ఇలా కొత్త పెళ్ళికూతురిని జంకూ గొంకూ లేకుండా అనగలడు.
    
    ఊళ్ళో వాళ్ళు ఇలా ఎన్నన్నా తలొంచుకుని వెళ్ళడమే మా ముందు తరాలన్నీ మాకు నేర్పించింది. అందుకే వాడు ఎంత అసభ్యంగా, పచ్చిగా మాట్లాడినా పట్టించుకోకుండా నవ్వుతూ వెళ్ళేవాళ్ళం.
    
    రైతుల పరిస్థితి నాపట్ల మరింత దిగజారింది. వ్యవసాయం పనుల కోసం పొలాలకు వెళ్ళినప్పుడు ఎవరూ లేని సమయాల్లో చేయి పట్టుకోవడం, గట్టిగా కౌగలించుకోవడం, ఒక్కసారి రమ్మని ప్రాధేయపడడం, బెదిరించడం ప్రారంభించారు మగవాళ్ళు ఒక్కరా? ఇద్దరా? ఎవరో ఇద్దరు ముగ్గురు తప్పించి మిగిలినవాళ్ళంతా ఇదే విధంగా ప్రవర్తించే వాళ్ళు. వీళ్ళని ఎలా ఎదుర్కోవాలో తెలియక సతమతమయ్యేదాన్ని.
    
    అదిగో అలాంటి సమయంలో పెద్ద రెడ్డింట్లో సేద్యగత్తెగా ఉండమన్న పిలుపొచ్చింది.
    
    రోజూ కూలి వెదుక్కోవడం కన్నా సేద్యగత్తెగా వుండడమే బావుంటుందనిపించింది. పర్మినెంటుగా ఒకరిదగ్గరే పనిచేయవచ్చు. అందుకే సరేనన్నాను.
    
    పెదరెడ్డింట్లో చేరిపోయాను.
    
    రోజూ ఉదయాన్నే వెళ్ళడం, ఇంటిముందు కళ్ళాపుచల్లి ముగ్గులు పెట్టడం, ఆ తరువాత పాలు పితకడం, టిఫిన్లు అయ్యాక కూలీలను పిలుచుకొని పొలము పనులు చేయించడం, తిరిగి సాయంత్రం ఇంటి కొచ్చాక రెడ్దసానికి వంటపనిలో సాయం చేయడం, భోజనం చేసి ఇంటికి వెళ్ళడం నా దినచర్య అయిపోయింది.
    
    రెడ్డీ, రెడ్డిసానీ చాలా మంచివాళ్ళు. మర్యాదగా చూసుకునేవాళ్ళు. ఆ ఊర్లో మహారాజులు వాళ్ళే పెద్ద రెడ్డంటే ఊర్లో హడల్. ఆయన మాట జవదాటే దమ్ములెవరికీ లేవు.
    
    నేను అక్కడ సేద్యానికి కుదరడంతో నా జోలికి వచ్చేవాళ్ళు కూడా తక్కువైపోయారు. ఇది నాకు చాలా సంతోషం వేసింది. కూతోడు కూడా కామెంట్లు తగ్గించాడు. ఇదంతా రెడ్డి అంటే వున్న భయమే.
    
    రెడ్డి, రెడ్డిసాని తప్ప ఆ ఇంట్లో ఎవరూ లేరు. వాళ్ళకు ఒకే కొడుకు టౌన్ లో చదువుకుంటున్నాడు. నేను ఎప్పుడూ చూళ్ళేదు అతన్ని. నేను వెళ్ళాక అతను ఎప్పుడూ ఇంటికి రాలేదు. మా రెడ్డిసానికైతే ఎప్పుడూ కొడుకు ధ్యాసే ప్రతి నిమిషమూ అతని గురించే తలుచుకొనేది. రెడ్డి కూడా కొడుకును గాఢంగా ప్రతి నిమిషమూ అతని గురించే తలుచుకొనేది. రెడ్డి కూడా కొడుకును గాఢంగా ప్రేమించేవాడు.    

    ఆ ఆదివారం అతను ఇంటికొస్తున్నాడని రెండురోజుల ముందు నుంచే హడావుడి మొదలైంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS