మరో పదినిముషాలు గడిచాయో లేదో "సుధీర్" అంటూ పిలవడం వినిపించింది అతనికి.
ఇప్పుడు పిలుస్తోంది ప్రవీణ.
"ఏం?"
"టైమ్ ఎంతయింది? నాకు కనిపించడం లేదు. వచ్చి చూడు" అంది ఆమె ఎడమచేతిని కళ్ళముందు పెట్టుకుని అతను కదలలేదు మరోసారి పిలిచింది అతను పలకడం లేదు.
అతను ఎందుకు రావడం లేదో ఆమెకి తెలియడం లేదు. కనీసం గంటయినా గడిస్తేగాని తిరిగి అతనా టైమ్ చూడలేదన్న విషయం తెలియని ఆమె తనమీద అతనికి యిష్టంలేదని అనుకుంటూ ఎంతో నిరాశతో మెట్లు దిగి వెళ్ళిపోయింది.
మరుసటి రోజు నూర్పిళ్ళు అయిపోవడంతో మగవాళ్ళు వచ్చేశారు. అలా గండం తప్పిపోయింది ప్రవీణకు" ముగించింది చాముండి.
ఆ సంఘటన విని చిన్నగా నవ్వుతోంది సూర్యాదేవి. మరో ఐదు నిముషాలకి బ్రిడ్జి మీదకు చేరుకుంది కారు.
కారును ఓ పక్కగా పార్కు చేసి ఇద్దరూ బ్రిడ్జి చప్టా మీద కూర్చున్నారు. లోకం మీదకు వాలుతున్న మసకచీకట్లకు రంధ్రాలు చేస్తున్నట్లు వీధి దీపాలు వెలుగుతున్నాయి. రాత్రి భూతాన్ని చూసి జడుసుకుని ఇంటికి పరుగెడుతున్నట్లు వాహనాలు స్పీడ్ గా వెళుతున్నాయి. ఆకాశం సిగలో చంద్రవంక ఆభరణంలా వున్న చందమామ భూదేవికి పాపటిబిళ్ళలా అమరినట్లు తెల్లటి చారిక నీళ్ళను కదుపుతోంది.
ఆదివారం ఆరుగంటలకి తను రాకపోతే తలక్రిందులుగా తపస్సు చేస్తానన్న వసంత్ గుర్తొచ్చాడు సూర్యాదేవికి. నిజంగానే తపస్సు చేస్తాడా? తల ఇసుకలో దూర్చి కాళ్ళు పైకిలేపి తన పేరునే ఉచ్చరిస్తూ ఎంతసేపు అలా వుండగలడు? ఒకవేళ గాలి అందకపోతే ఏమయిపోతాడు. చచ్చిపోతాడా? పోతే పోనీ- తను అలాంటి బెదిరింపూలకు లొంగదు. తాను మరో వ్యక్తి కోసం ఎలా వెళ్ళగలదు? ఇంపాజిబుల్.
అదంతా అయ్యే పనికాదు. మొత్తం మీద భలే వ్యాపారం మొదలుపెట్టాడు. ఎందుకనో అతను డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. సంపాదన సంఘంలో స్టేటస్ లాంటి చెత్త విషయాలకు అతీతుడిలా బిహేవ్ చేస్తుంటాడు. అదంతా నిజమేనా? లేక నటిస్తున్నాడా? ఇంతకీ వెళ్ళడమా? మానడమా?
"ఏంటమ్మా? ఏం మాట్లాడరు?"
సూర్యాదేవి ఉలిక్కిపడి, అంతలోనే సర్దుకుని, "నేనో విషయం అడుగుతాను చెబుతావా?" అని ప్రశ్నించింది.
"అడగండమ్మా"
"నీ పెళ్ళయ్యాక ఎవరయినా నీ దగ్గరికి వచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అన్నారా?"
చాముండి అలా బిగుసుకుపోయింది. ఇలాంటి ప్రశ్న అడిగింది తన అమ్మగారేనా అన్న సందేహంతో సూర్యాదేవి ముఖంలోకి చూస్తుండి పోయింది.
"ఎందుకే అలా బొమ్మ అయిపోయావు? చెప్పడానికి యిష్టం లేకపోతే మానెయ్"
"అది కాదమ్మా నాలుగు సంవత్సరాల నుంచి మీ ఇంటి దగ్గర సేద్యగత్తెగా వున్నాను కదా- ఎప్పుడూ అడగంది ఈ పూట అడిగారే అని ఆశ్చర్యపోయానంతే"
ఇలాంటివి ఏదో ఉబుసుపోక అడగరని అర్ధంకానంత వెర్రిదేం కాదు చాముండి ఎవరు ఏ సమస్యతో సతమతమవుతుంటారో ఆ సమస్యకు సంబంధించిన విషయాలనే మాట్లాడడానికి ఇష్టపడుతుంటారు. మనసెరిగి ప్రవర్తించడమంటే అదే.
"పెళ్ళయ్యాక ప్రేమలో ఎప్పుడయినా పడ్డావా?" మళ్ళీ అడిగింది సూర్యాదేవి.
"రెక్కల కష్టం తప్ప మరే ఆస్తిపాస్తులూ లేనివాళ్ళం. ఎన్నెన్నో ఊర్లు తిరిగాం. ఏవేవో జరిగాయి. ఇప్పుడవన్నీ చెప్పాలంటే...."
"ఏమిటే అలా సిగ్గుపడిపోతావు కొత్త పెళ్ళికూతురిలా" అంది సూర్యాదేవి.
"సిగ్గులాంటి మొహమాటం, అంతే స్వయంగా మీరడిగారు కాబట్టి చెబుతున్నా" అంటూ ప్రారంభించింది చాముండి.
లోకం పసిపిల్లలా మసినెత్తుకుని ఒంటికంతా రాసుకుంటున్నట్లు చీకటిపడుతోంది.
"మాది పాపానాయుడిపేట దగ్గరున్న పల్లెటూరు. ఎనిమిదో థర౫అగథ్య వరకు చదువుకున్నాను. తొమ్మిదిలో వుండగా హాస్టల్ వార్డెన్ ఓ రోజురాత్రి తన గదిలోకి పిలిచి ఒళ్ళంతా తడవబోతే భయపడి అంత రాత్రి ఒంటరిగా ఊరికొచ్చేశాను. తొమ్మిదో తరగతికి వచ్చేటప్పటికె అదేం చిత్రమోగానీ నా అవయవాలన్నీ వయసుకు మించి పెరిగాయి. మేం వెనకబడినవాళ్ళం కాబట్టి మాలాంటి వాళ్ళల్లో అందంగా పుట్టడం కూడా శాపమేనని అర్ధంకావడం ప్రారంభించింది.
ఏదైనా అపకారం జరిగినప్పుడు మాలో మేం కుమిలిపోవడం తప్ప ఏం చేయడానికి చేతకాని వాళ్ళం. అందుకే వార్డెన్ ని ఏమనలేక చదువుకి మంగళం పాడేశాను. చదువైతే మానేశానుగానీ రోజుకో అందాలు పోతున్న అవయవాలు పెరగకుండా ఏం చేయగలను? అందుకే ఎక్కువగా బయటికి వచ్చేదాన్ని కాదు.
మానాన్న గ్యాంగ్ మేన్ కావడం వల్ల వ్యవసాయం పనులకు వెళ్ళక పోయినా ఇల్లు గడిచేది. అమ్మ మాత్రం ఎప్పుడన్నా నాటుకో, వరి నూర్పుళ్ళకో వెళ్ళేది.
నాకు ఇరవై ఏళ్ళు వచ్చాయి. ఊర్లో మగాళ్ళ చూపులు పడకుండా నన్ను కాపాడడానికి అప్పటికే మా నాన్నకు తలకు మించిన భారాన్నయ్యాను. నా ఈడు ఆడపిల్లలంతా వ్యవసాయం పనులకు వెళ్ళి రోజుకు ఇరవయ్యే ముప్పయ్యో సంపాదించేవాళ్ళు. ఊరికే ఇంట్లో పెట్టుకుని ఓ మనిషిని పోషించాలంటే మాలాంటి కులంలో సాధ్యం కాదు. ఇంట్లోని వాళ్ళంతా పనులకు వెళితేనే పస్తులు లేకుండా అంతా తినగలం.
అందుకే నా పెళ్ళి ప్రయత్నాలు మొదలయ్యాయి. తడ దగ్గరున్న ఓ పల్లెటూర్లో వెంకటరమణ అనే అతనికి నన్నిచ్చి పెళ్ళి చేయాలనీ నిశ్చయించారు. అతను ట్రాక్టర్ డ్రైవర్. ముందూ వెనకా ఎవరూ లేరు. సన్నగా, పొడవుగా చూడడానికి బాగానే వున్నాడు.
అతను పెళ్ళిచూపుల్లో నన్ను చూసి ఆశ్చర్యంతో షాక్ తినడం నేను గమనించాను. తనకు కాబోయే భార్య మరీ అంత అద్భుతంగా వుంటుందని అతని ఊహకందని విషయం.
మా పెళ్ళి జరిగిపోయింది.
అత్తవారింటికి వెళ్ళాను. మా కులంవాళ్ళ ఇళ్ళన్నీ ఊరుకి ఎగువగా కాస్త దూరంలో వున్నాయి. ఊరికీ, మావాడకి రెండు ఫర్లాంగుల దూరం వుంటుంది.
నా పర్సనాలిటీ గురించి ఊరంతా గుప్పుమంది. కూలీల్ని పిలవడానికి వచ్చే రైతులంతా విధిగా మా ఇంటివైపు చూడడం నాకు తెలుస్తూనే వుంది.
"కూలీకి చాముండి రాదంటావా? వస్తుందేమో కనుక్కో కావాలంటే అయిదు రూపాయలు ఎక్కువిస్తాను లక్ష్మి"
