Previous Page Next Page 
హద్దులున్నాయి జాగ్రత్త పేజి 28


    అతని అండర్ స్టాండింగ్ కి నాకు ముచ్చటేసింది.
    
    మమ్మల్ని చూడగానే కాసులపేరు వేసుకుని కూర్చున్న ఒకావిడ గల్లాపెట్టె మూత వేసేసి "రండి రండి...ఒకే ఒక గది మీ కోసమే అనుకుంటా ఖాళీగా వుంది" అంది.
    
    "మాకు రెండు గదులు కావాలి" అతను చెప్పాడు.
    
    ఆవిడ విచిత్రంగా చూసి "అయ్యో ఒక  గదే వుందండి. అంతగా అయితే మీరు ఆ వసారాలో మద్తః మంచం వేసుకుని పడుకోవచ్చు" అంది. అప్పటికే మేం నిలబడ్డచోట దోమలు జుయ్యిమని తిరుగుతున్నాయి. చలి వణికించేస్తోంది. వసారాలో ఒకటే మురుగువాసన.
    
    అతనేదో అనబోతుండగా బయట ఎవరో వస్తున్న సందడి వినిపించింది. నేను గభాల్న "ఆ ఒక్క రూం మాకివ్వండి" అనేశాను.
    
    అతను నావంక ఆశ్చర్యంగా చూసి, రిజిస్టర్ లో సంతకం పెట్టాడు.
    
    ఇద్దరం ఆ రూం అనబడే దానిలోకి ప్రవేశించాం. పైన పాతాకాలం సీలింగ్ ఫ్యాన్ ఉంది. డబల్ కాట్ మంచానికి దోమతెర వేసి ఉంది. ఒక మంచినీళ్ళ జగ్గూ, గ్లాసూ వున్నాయి.
    
    "నాలుగు గంటలు పుస్తకం చదువుకున్నా గడిచిపోతుంది. మీరు పడుకోండి అన్నాడు.
    
    నాకు చాలా నిద్రొస్తోంది. కానీ ఒక అపరిచిత యువకుడితో ఒకే గదిలో వుండి నిద్రపోవడం అనే విషయం భయం కలిగిస్తోంది.
    
    నేను సందేహంగా నిలబడటం చూసి అతను అడిగాడు. "ఏమైనా ఇబ్బందా?"
    
    నేను తల అడ్డంగా ఊపి "ఏం లేదు" అన్నాను.
    
    అతను నావైపు పరీక్షగా చూసి "మీకు సెక్స్ పట్ల కొన్ని నిశ్చితాభిప్రయాలున్నాయనుకుంటున్నాను. యామై కరెక్ట్?" అన్నాడు.
    
    "ఔను!" అన్నాను.
    
    "మీరు వర్జినా?" అడిగాడు.
    
    "నాకు షాకింగ్ గా అనిపించి "వాట్?" అన్నాను.
    
    "మీరింకా కన్యేనా?" తెలుగులో అడిగాడు.
    
    "హండ్రెడ్ పర్సెంట్" అన్నాను.
    
    "పెళ్ళి అయ్యేవరకూ అలాగే వుండాలన్నది మీ అభిప్రాయమా?" అడిగాడు.
    
    నేను కొద్దిగా కోపంగా "అభిప్రాయం కాదు.....నిశ్చయం" అన్నాను.
    
    "మీ నిశ్చయాన్ని నేను గౌరవిస్తాను. కానీ ఒకవేళ మీ నిశ్చయాన్ని మీరు మార్చుకుంటే మీతో సెక్స్ నాకు ఇష్టమే మొహమాటపడకండి" అన్నాడు.
    
    "అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలుసా?" అరిచినట్లు అడిగాను.
    
    "తెలుసు! వాతావరణం.....అవకాశం....మీలమతి అమ్మాయిలకి అరుదుగా వస్తాయి. వచ్చినా ఎన్నో అనుమానాలతో, ఇన్ హిబిషన్స్ తో మనసులో మాట బైటికి రానీక అవస్థపడతారు. ఇందాకే చెప్పానుగా శృంగారం జీవితానికి ముఖ్యమైన ఇంధనం అన్నది నా అభిప్రాయం. అందితే అనుభవించటం నా నిశ్చయం. అలా అని ఎవరి అభిప్రాయాల్నీ నేను కించపరచను. ఇష్టాల్ని అగౌరవపరచి వ్రతభంగం చెయ్యను. ఆలోచించుకోండి. నాలుగింటికి బస్సుంది. మూడున్నరకి మీ మనసు మారినా నన్ను లేపండి" అని స్టూల్ మీదకి కాళ్ళు జాపి కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు.
    
    నేను ఇంకా ఆ మనిషిని, ఆ మాటల్నీ జీర్ణం చేసుకోలేదు. నెమ్మదిగా మంచంమీద ఓ పక్కగా పడుకుని అతన్నే చూస్తున్నాను.
    
    అతని తీరైన ముక్కూ, నీట్ గా షేవ్ చేసిన గెడ్డం, ఎట్రాక్టివ్ గా వుండే పెదవులూ, నుదుటిమీదకి అందంగా పడుతున్న జుట్టూ, ఎంతచూసినా ఇంకా ఇంకా చూడాలనిపిస్తున్నాయి. మగవాళ్ళల్లో ఇంత అందమైన వారుంటారా అనిపించింది.
    
    నా కళ్ళు అతని ఎయిర్ బ్యాగ్ మీదున్న డెబొనేర్ మీద పడ్డాయి.
    
    శబ్దం కాకుండా జరిగి అందుకున్నాను. భయంగా అతనికేసి చూస్తూనే వున్నాను. పేజీలు  తిప్పుతోంటే నాలో నాకే తెలియని స్పందనలు కలిగాయి. ఇలా ఎవరూ కన్ ఫెస్ చెయ్యరేమో కానీ అలాంటి స్పందనలు కలగకపోతే వాళ్ళల్లో ఏదో లోపం వున్నట్లు లెక్క నాలో కలుగుతున్న ఉద్రేకాన్ని అణిచిపెట్టడానికి పుస్తకాన్ని మూసేశాను. ఎదురుగా నాలుగు అడుగుల దూరంలో అతను. ఎంతో టెంప్టింగ్ గా అనిపించింది. నోరు తెరిచి ఏమీ చెప్పనవసరంలేదు. నేను వెళ్ళి మీద చెయ్యి వేస్తే చాలు...అతను అర్ధం చేసుకుంటాడు కానీ....నాలో పుట్టిపెరిగిన ఆచార వ్యవహారాలు....కళ్ళెర్రచేస్తున్నాయి. శరీరంలో చలికన్నా భయంకరమైనదేదో వణికించివేస్తోంది.
    
    గడియారం వంక చూశాను. రెండున్నర దాటింది. ఇంకా గంటన్నరసేపు గడపాలి....ఎలా?
    
    అతను మాత్రం హాయిగా నిద్రపోతున్నాడు.
    
    ఇందాక అతను నాతో మాట్లాడిన మాటల ప్రభావం నాపైన ఎంతగా వుంటాయో అతనికి తెలీదా? నాకు ఎందుకో కోపం వచ్చింది. అతను కొద్దిగా కదిలాడు. నేను వెంటనే సర్దుకుని పడుకున్నాను.
    
    అతను లేచి నా దగ్గరకు వస్తున్నట్లు అడుగుల శబ్దం వినిపించింది. నేను వూపిరి బిగబట్టి అలాగే పడుకున్నాను. నేను వూహించినది నిజమౌతుందని అనిపించింది. అతను ముందుకి ఒంగాడు. డెనిమ్ స్ప్రే వాసన దగ్గరగా వెచ్చగా వీచింది. కళ్ళమీదో....పెదవులమీదో తడితడిగా తగిలే స్పర్శకోసం ఎదురుచూశాను. కానీ....అతను నాకు తగలకుండా పక్కనున్న డెబొనేరో మేగజైన్ ని తీసుకుని వెళ్ళిపోయాడు. నాకు ఆశాభంగం కలిగింది.
    
    అతను దాన్ని ఎయిర్ బ్యాగ్ లో పెట్టుకున్నాడు. ఆ తర్వాత షూస్ వేసుకున్నాడు! నేను కొద్దిగా కళ్ళు తెరిచి చూస్తూనే వున్నాను. తల దువ్వుకున్నాడు. ఆ తర్వాత వాచ్ చూసుకుని బయటికి నడిచాడు.
    
    వెళ్ళిపోయాడా? నాకింకా నమ్మశక్యంగా లేదు. అతను అంత ఏకాంతాన్నీ అందిన అందాన్నీ వదిలి మామూలుగా వెళ్ళిపోయాడా?
    
    తలుపు మీద ధనధనా చప్పుడయింది. గభాల్న లేచాను. లాడ్జి ఓనర్ నిలబడి వుంది. "మిమ్మల్ని నిద్ర లేపమన్నారు ఆయన" అంది.
    
    నేను లేచి చీరా, తలా సవరించుకుని సూట్ కేస్ తీసుకుని బయలుదేరాను.
    
    మద్దిపాలెం బస్ నేను వెళ్ళేసరికి రెడీగా వుంది. అతను కూర్చున్న సీటుపక్క సీటు ఖాళీగానే వుంది. ఆఫర్ చేస్తాడేమోనని చూశాను. అతను కనీసం నవ్వనైనా నవ్వలేదు. నేనే వెళ్ళి పక్కన కూర్చున్నాను.
    
    "మీరూ మద్దిపాలెమేనా?" అడిగాను.
    
    "ఊ" అన్నాడు.
    
    "నేను కూడా మా ఫ్రెండ్ నీలిమ పెళ్ళి మీఎందుకు వెళ్తున్నట్లు?" అడిగాను.
    
    "పెళ్లికే" క్లుప్తంగా చెప్పి తల తిప్పుకున్నాడు.
    
    ఎంతో దగ్గరగా వచ్చి చాలా దూరం వెళ్ళిపోయినట్లుగా అనిపించింది ఇంత పొడిపొడిగా మాట్లాడతాడేమిటి...అసంతృప్తిగా అనిపించింది.
    
    చల్లగాలికి చెవిలో పిల్లనగ్రోవి వూదుతోంది. కరుగుతున్న మేఘాల మాటున పురివిప్పిన నెమళ్ళలా వున్నాయి కొబ్బరిచెట్లు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS