Previous Page Next Page 
హద్దులున్నాయి జాగ్రత్త పేజి 27


    "ఔను! మీ వల్లే చర్చ మొదలయింది. మాట్లాడాల్సిందే" అన్నారు కొంతమంది.
    
    నాకు అతని ముందు నోరు పెగలడంలేదు. ఇటువంటి ఫీలింగ్ ని ఖర్మకాలి 'సిగ్గు' అనరుకదా! అది నా జీవితంలో ఎవరి ముందూ ప్రదర్శించలేదు. అందుకే ధైర్యం తెచ్చుకుని.
    
    "శృంగారం ముఖ్యమే....కాదనను! కానీ ఈ బస్ లో బ్లూఫిల్మ్ వేస్తే స్త్రీలు భరించలేరు. అంత విశృంఖలత ఎన్నడూ సమాజంలో మంచిదికాదు. మనదేశంలో కొన్ని పద్ధతులున్నాయి. వాటిని కట్ట్దడులనండీ....లేదా సంప్రదాయం అనండీ...అవే మనని ఇతర దేశాలనుండి వేరుగా గుర్తింపు పొందేట్లు చేస్తున్నాయి. వాటిని మన ధర్మంగా కాపాడుకోవాలి!" అన్నాను.
    
    కొందరు ఆడవాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టారు. వెనక సీట్లోని ముసలాయన భార్య ఆయన చేతిలోంచి డెబోనెర్ లాక్కుని ముందుకి విసిరేస్తూ "మంచి మాటలు చెప్పావమ్మా ఊరికే రెచ్చిపోతున్నాడీయన!" అంది.
    
    అంతా గొల్లుమని నవ్వారు.
    
    అతను నా వంక చూస్తూ "ఇంత బాగా మాట్లాడిన ఈ మేడం పేరు తెలుసుకోవాలని మీకు లేదా?" అన్నాడు.
    
    "ఉంది....ఉంది" అన్నారందరూ.
    
    నేను ఓసారి అతని వంక తీక్షణంగా చూసి "మాధవి..." అని చెప్పాను.
    
    "ఐయామ్ ప్రదీప్...గ్లాడ్ టూ మీట్ యూ....!" అతను చెయ్యిజాపాడు.
    
    బస్ లో చాలాసార్లు మగవాళ్ళతో మీద పడుతున్నారనో, లేదా సిగరెట్టు కాలుస్తున్నారనో గొడవ పడుతుంటాం. కానీ ఆ గొడవని ఇంత అందంగా చుట్టూ వున్న వాళ్ళకి చక్కని కాలక్షేపంగా మార్చిన అతనిని చూస్తే ఆ స్నేహహస్తాన్ని తిరస్కరించాలనిపించలేదు. చెయ్యి అందించాను. చుట్టూ వున్న వాళ్ళు మరోసారి క్లాప్స్ కొట్టారు.
    
    "ఇంత మంచి టైమ్ పాస్ ని అందించినందుకు నా గిఫ్ట్ గా ఇది అందుకోవయ్యా" ఒక పెద్దాయన చేతిలోని సంత్రాపండుని అందిస్తూ అన్నాడు.
    
    "మీరు టీవీలో పనిచేస్తారా?" ఒక అమ్మాయి అడిగింది.
    
    "కాదు" అన్నాడు ప్రదీప్.
    
    "మీరు జర్నలిస్టా?" ఇంకో అమ్మాయి అడిగింది.
    
    "నో!"
    
    "పోనీ సెక్స్ స్పెషలిస్టా?" ఒక అబ్బాయి అడగగానే అమ్మాయిలు ఫక్కున నవ్వారు.
    
    "అవేమీ కాదు! జీవితం చాలా విలువైనది. ప్రతి నిమిషం వేస్ట్ అవకుండా ఆనందించాలి అని ప్లాన్ చేసుకునే అతి కొద్దిమందిలో నేనొకడ్ని!" అన్నాడతను.
    
    నా కళ్ళల్లో నాకు తెలియకుండానే మెచ్చుకోలు కనబడింది అనుకుంట. అతను రిసీవ్ చేసుకుంటున్నట్లుగా కళ్ళు ఆర్పాడు.
    
    భోజనాల కోసం ఎక్కడో బస్ ఆపారు.
    
    అందరూ దిగాకా కండక్టర్ నావైపు నవ్వుతూ చూసి "మాధవీ మేడం.....దిగండి. ఈపాటికి ఆకలేసే వుండాలి" అన్నాడు.
    
    కాసేపట్లోనే నేను చాలా పాపులర్ అయిపోయాను అనిపించింది.
    
    ప్రదీప్ కిటికీ దగ్గరకు వచ్చి "ఇందులో మీకూ భాగం వుంది" అని కమలాపండు అందించాడు.
    
    నేను అందుకున్నాక, "సగం నాది" అన్నాడు.
    
    నేను చిన్నగా నవ్వాను. అతనూ అక్కడ నిలబడే స్మోక్ చెయ్యసాగాడు. అమ్మాయిలు అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడటం నాకు కనిపిస్తోంది. అంత హేండ్ సమ్ గా డైనమిక్ గా వుండే మగవాళ్ళకి ఫాలోయింగ్ వుంటుందిగా!
    
    బస్ స్టార్టవుతుంటే అతను వచ్చి కూర్చున్నాడు.
    
    "మీ భాగం" అతనికి ఒలిచిన తొనలు అందించాను.
    
    "నాకు పండు ఒలిచి పెట్టినందుకు థాంక్స్!" అన్నాడు.
    
    ఆ మాట అతను ఎంత మామూలుగా అన్నా నాకు ఎక్కడో గుచ్చుకున్నట్లయింది.
    
    ఆ తర్వాత ఎవరం మాట్లాడలేదు. అతను వెనక్కివాలి కళ్ళు మూసుకుని పడుకున్నాడు.
    
    నాకూ నిద్రొస్తోంది. కానీ నేను నిద్రలో పక్కకి జరిగి అతని భుజం మీద వాలుతానేమో అనే భయంతో నేను కష్టపడి నిద్ర ఆపుకుంటూ కూర్చున్నాను.
    
    అర్ధరాత్రి దాటాకా నేను దిగవలసిన స్టేజ్ వచ్చింది.
    
    అప్పటికే బస్ లో ముప్పావు భాగం దిగేసారు.
    
    నేను దిగుతుంటే అతను లేచి సూట్ కేస్ పైనుండి తీసి సహాయం చేసాడు.
    
    ఆ తర్వాత అతనూ నా వెనుకే దిగుతుంటే "ఆగండి...ఆగండి....నాదో సందేహం!" అన్నాడు కండక్టర్?
    
    "ఏమిటదీ?" అడిగాడతను.
    
    "కొంపదీసి మీరిద్దరూ భార్యాభర్తలు కాదు కదా!" అన్నాడు అనుమానంగా.
    
    "భార్యాభర్తలం అయితే కొంపదియ్యడం ఏవిటయ్యా? కొంపపెట్టడం చేస్తాం కానీ.....అటువంటిదేం కాదులే" అన్నాడు ప్రదీప్.
    
    "మమ్మలందరినీ ఫూల్స్ ని చేసేసారేమో అనీ అడిగానండి. బెస్ట్ ఆఫ్ లక్!" అన్నాడతను.
    
    "థాంక్యూ" అన్నాడు ప్రదీప్.
    
    "రైట్...రైట్!" అంటూ అతను డోర్ బలంగా వెయ్యడంతోటే బస్ వెళ్ళిపోయింది.
    
    నేను సూట్ కేస్ చెయ్యి మార్చుకుంటూ ఎదురుగా వున్న షెల్టర్ లోకి నడిచి "మద్దిపాలెం వెళ్ళే బస్ ఎన్నింటికొస్తుందీ?" అన్నాను.
    
    "తెల్లవారుఝామున నాలుగింటికి వస్తుందండీ, అంతవరకూ ఈ చలిలో వుంటే గడ్డకట్టుకుపోతారు గానీండి ఆ ఎదురుగుండా వున్న పచ్చమేడలో గదులు అద్దెకిస్తారండీ.....మగాళ్ళు విడిగా వస్తే మడత మంచాలు మాత్రమే అద్దెకిస్తారండీ. అందులో వుండచ్చండి" అన్నాడు బీడీ కాలుస్తూ ఆ కిళ్ళీకొట్టు అతను.
    
    ప్రదీప్ వచ్చి "ఓ సిగరెట్ ప్యాకెట్ ఇవ్వు!" అన్నాడు.
    
    అతను అందిస్తూ "అద్దె పదిహేను రూపాయిలేనండీ టౌన్ నించి వచ్చేవాళ్ళంతా ఆ కన్నెకాపరమేశ్వరి లాడ్జిలోనే వుంటారండీ....!" అన్నాడు.
    
    మమ్మల్ని అతను కూడా భార్యాభర్తలు అనుకుంటున్నాడని నాకర్ధమైంది.
    
    "అద్దెకోసం ఆలోచించడంలేదు. ఆవిడ ఇష్టపడాలి కదా!" అన్నాడు ప్రదీప్.
    
    "ఈ చలిలో ఇక్కడుంటే తెల్లారేసరికి ఇంగ్లీషు జొరం వస్తుందండీ" అన్నాడతను.
    
    నేను వెంటనే "ఇంగ్లీషు జ్వరాలా?" అన్నాను.
    
    "ఆయ్! మావూరి డాక్టర్ గారు అదేదో ఇంగ్లీషు పేరే చెప్పారండి. నుమోనియానో ఏదో!" అన్నాడతను.
    
    ప్రదీప్ నా వంక చూసి "మనం భారతీయులం. ఇంపోర్టెడ్ జ్వరాలు ఎందుకులెండి. అంతకన్నా మడత మంచాల్లో తెలుగు నల్లులే బెటర్ అన్నాడు.
    
    "కానీ..." అని అర్దోక్తిలో ఆపేశాను.
    
    "రెండు రూమ్స్ తీసుకుందాం" వెంటనే చెప్పాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS