Previous Page Next Page 
మమత పేజి 27

తిరుపతమ్మ అన్నిటా పెత్తనం చేస్తూ రోజూ మాత్రం తులసమ్మ పటానికి నమస్కారం పెడుతోంది.
లీల ఆ ఆశ్రమంలో పూల మొక్కలకి నీళ్ళు పోస్తోంది. దేవుడికి మాలలు కడుతుంది. ఎవరే సహాయం కావాలంటే అది చేస్తుంది. గుప్పెడన్నం తింటూ, సాధుజీవిలా లీల భక్తితత్త్వంలో పరవశిస్తోంది. అన్నీ భగవంతుని లీలలే... అనుకుంటుంది తనలో తను నవ్వుకుంటూ.
చంద్రయ్య భార్యకి మాత్రం- లీలపై విపరీతమైన జాలి! పండగలకి చీరలు కొనిపెట్టి తనతోపాటు బజారుకి తీసుకెళ్ళి, తోచినపుడు గీతోపదేశ సారాంశం లీలచేత చెప్పించుకుని అదీ ఇదీ పెడుతూ ఎంతో ఆప్యాయంగా చూస్తుంది. తులసమ్మే తన కోసం ఈమెను పంపిందని అనుకుంటూ కాలం గడుపుతోంది లీల.   
                                   *    *    *
రాజీవ్ తలుపు తట్టాడు..... ఎవరూ తీయలేదు.
కిటికీలోంచి తొంగి చూసాడు. చిన్నపిల్ల ఎవరో ఆ పెద్ద హాలు నేలమీదకి వంగి తుడుస్తోంది. బోడిగుండు, పొట్టిగౌను- రాజీవ్ అలానే చూస్తున్నాడు.... కళ్ళు తిరుగుతున్నట్టనిపించాయి.
ఇంట్లో అయ్య, అమ్మ నిద్రపోతున్నారు....
చెన్నమ్మ తలుపు తీసింది. ఎదురుగా రాజీవ్..! బోడిగుండు పిల్ల వెనక్కి తిరిగి తుడుస్తోంది.
చెన్నమ్మ ముఖం విప్పారించింది. తను చూస్తున్నది ఈయన కోసమే, దేవుడే పంపాడు- అనుకుంటూ, బయట వీధి చివరిదాకా గబగబా తీసికెళ్ళింది రాజీవ్ ని.
ఊపిరి బిగపట్టి విన్నాడు... కళ్ళు నిప్పుల్లా భగభగ మండిపోతున్నాయి.
"చెన్నమ్మా... నువ్వు నా తల్లిలాంటి దానివే!" అన్నాడు చేతులు పట్టుకుని.
"ఇప్పుడు ఇక రావద్దు. ఊరెళ్ళిపోండి నా మీద నమ్మకముంచండి!" అంది నెమ్మదిగా చెన్నమ్మ, గబగబా ఇంటి వైపు నడుస్తూ.
రాజీవ్ అక్కడ ఆగిన ఆటోలో కూచున్నాడు. తిన్నగా స్టేషన్ కెళ్ళాడు.
రాజీవ్ గుండె విలవిల్లాడి పోయింది. బోడిగుండు పిల్ల మమతేనా.... నా మమతేనా....నా తల్లి, నా బంగారు తల్లేనా..?
-రాజీవ్ ఆవేశం కట్టలు తెంచుకుంది. కానీ, ఆవేశంకన్నా ఆలోచన అవసరం!! కళ్ళు మూసుకుని రైలుపెట్టెలో పడుకున్న రాజీవ్ ఆనాటి వరద, బీభత్సం కళ్ళల్లో మెదిలాయి. ఒక్కసారి శరీరమంతా వణికిపోయింది.
లీలకి ఆరోజు మళ్ళీ ఆ ఇంటికెళ్ళాలనిపించింది. కాళ్ళీడ్చుకుంటూ వచ్చి గుమ్మం వెనుక దాగి నుంచుంది. లోపలకెళ్ళి ఏమడుగుతుందీ? ఎవరు నమ్ముతారూ..!!
లోపలకి తొంగి చూస్తోంది లీల...
బజారునించి వచ్చిన సుమతి- "ఏమిటీ... దిమ్గాతనానికా- ఫో! ఎవరికోసం చూస్తున్నావ్?" అంది ఒక్క తోపు తోసి.
"నా పిల్ల!" అంది లీల.
అస్పష్టంగా వున్నా సుమతికి వినిపించింది - "ఏమిటీ, పిల్ల? పిచ్చిది.... ఒరేయ్ రంగడూ- ఇటు రా!" కేకపెట్టింది సుమతి.
లోపల బట్టలుతుకుతున్న రంగడు రావటం, రాయి లీలపై విసరటం ఒకేసారి జరిగాయి. కణతనుంచి రక్తం కారుతోంది.
"నా పిల్లని నాకియ్యి, దాచుకున్నావా, అమ్ముకున్నావా... ఇయ్యి!" లీల పిచ్చి పట్టినట్లుగా కేకలు పెడుతూ ఆ ఇంటి గుమ్మం ముందు పడిపోయింది.
"ఏమిటిరా... ఈ గోల!" అంది చిరాగ్గా సుమతి.
"బిచ్చగాళ్ళందరికీ ఇదో వేషం - ముందు పిల్ల అంది, ఇప్పుడు మూర్చ అంటుంది. తర్వాత అడుక్కోవటం!" రంగడు లోపలికి పరిగెత్తి కర్ర తెచ్చాడు. వీపుమీద ఒక్కటేశాడు. కాళ్ళమీద పడ్డాయి దెబ్బలు..! లీల పెద్దగా ఏడుస్తూ ఆ చీకట్లో ఎటో వెళ్ళిపోయింది.
"పీడ వదిలింది" అంది సుమతి.
"ఈమెని నేను ఆ ఆశ్రమం దగ్గర కూడా చూసా..! ఇదోరకం అడుక్కోటం!!" అన్నాడు రంగడు బట్టకు ఆరేస్తూ.
ఆటోలో దిగిన రాజీవ్ తో ... "ఎవరో పిచ్చిది....పిల్లనియ్యాలట! ఎక్కడ చచ్చిందో ఆ పిల్ల- రంగన్నాడు లెండి.... అదోరకం అడుక్కోటమనీ!" అంది భర్త చేతిలోని సూట్ కేసు అందుకుని లోపలి నడుస్తూ సుమతి. రాజీవ్ తల ఊపి, "పిల్ల కావాలందా..?" అన్నాడు పెద్దగా నవ్వి.
"ఏమిటా నవ్వు? మీకూ పిచ్చి పుట్టిందా..?" అంది సుమతి.
"అవును" అంటూ గదిలోకెళ్ళి మంచంపై పడుకుని దిండులో తలదాచుకున్నాడు
ఆ సాయంత్రం సుమతి జడనిండా మల్లెపూలు పెట్టుకుంది. చాలా చక్కని ఆకుపచ్చ రంగు క్రేప్ చీర కట్టుకుంది...పచ్చని దుద్దులు పెట్టుకుంది.
"మీ నాన్నని నిద్ర లేపరా, అయినా అంత అలసటేమిటీ?" అంది కొడుకు శశికాంత్ తో.
"లే డాడీ... ఇవాళ మనమంతా డిన్నరు కెడదామనుకోలేదూ? నా ఫ్రెండు దివ్య బర్త్ డే కాదూ - మరచిపోయారా... నాలుగురోజుల నుంచి నేను, మమ్మీ ప్లాన్ చేస్తున్నాం తెలుసా..! ఆ బర్త్ డేలో మమ్మీ కూడా రెండు గజల్స్ పాడుతోంది. నేను తంబోలా ఆడుతున్నా"
"ఏమిటీ, చెవికోసిన మేకలా ఒకటే అరుపు! -నేను రాను. నువ్వూ, మీ మమ్మీ వెళ్ళండి!" దుప్పటి నిండుగా కప్పుకు పడుకున్నాడు రాజీవ్.
సుమతికి ఒళ్ళు మండిపోయింది-
"పోన్లే, రాకపోతే పార్టీ ఆగిపోదు- అయినా... పెళ్ళాంతో వెళ్ళాలంటే ముఖం చెల్లద్దూ" అంది.
అంతే- రాజీవ్ ఠక్కున లేచాడు. సుమతి చెంప పగిలేలా కొట్టాడు.
శశికాంత్ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.
"ఏమిటీ... నీ నోరు? నాకెందుకు ముఖం చెల్లదూ, నిన్ను అగ్నిసాక్షిగా పెళ్ళి చేసుకున్నా- ఆదర్శంగా బతుకుతున్నా- ఇప్పుడు చెప్పు, నాకు ముఖం ఎందుకు చెల్లదు? నేనేం తప్పు చేశానూ? చెప్పు..."
మళ్ళీ వీపుమీద పడింది దెబ్బ!
"ఏం తప్పు చేశానని నన్ను సాధిస్తున్నావ్?" అరిచాడు.
సుమతి అవాక్కయిపోయింది. తొందరపడి నోరు జారింది. నిజంగానే ఏం తప్పు చేశాడూ? తన కోసం, కేవలం తన మాటని కాదనలేక ఆ పసిగుడ్డును ఎక్కడో వదిలేసి గుండె గాయపర్చుకున్నాడు.
తనకోసం అతని ఆదర్శాలన్నీ వదిలేసుకున్నాడు. తన కోసం, పిల్లలకోసం తన మనసు చంపుకున్నాడు - నిజంగా ఏం తప్పు చేశాడూ! సుమతి కళ్ళ వెంట నీళ్ళు జలజలా రాలాయి! ఎప్పటికి తన మనసులో అనుమానం తొలగిపోతుందీ! తను భర్తని ఎప్పటికి మనస్ఫూర్తిగా ప్రేమించగలదూ! తన ఆలోచనే తప్పేమో! అనాధ పిల్లని పెంచుతానంటే ఈనాటికీ తనుచేస్తున్న అల్లరి, గొడవ! ఛీ... తనకే అవమానంగా వుంది. మరో ఇల్లాలయితే భర్త మనసుని అర్ధంచేసుకుని, ఆ పసిగుడ్డుని పెంచదా? ఇది గొప్ప సంస్కారం కాదా?
తన భర్త మనసు ఇన్నేళ్ళుగా గాయపరుస్తున్నా... తను లోకం దృష్టిలో ఎంతో మంచిదా! నిజంగా మంచి పనిచేసి ఓ అనాధకి గుప్పెడు అన్నం, కాస్త చోటు చూపించే భర్త తనకి చెడ్డవాడా? సుమతి తలెత్తలేదు... మోకాళ్ళమీద తలాన్చి అలానే కూచుంది.
"ఆ పిల్ల నా కూతురా? నా అక్రమ సంబంధ ఫలితమా? సుమతీ... భర్తని అర్ధం చేసుకొని నీలాటి భార్యలు ఏ శత్రువుకి కూడా వద్దు. లోకంలో పుణ్యం- పాపం లేవా? దయాదాక్షిణ్యాలులేవా? న్యాయాన్యాయాలు లేవా?-నీలాటి దానికేం తెలుస్తాయి ఇవన్నీ! నువ్వసలు ఆడదానివా, తల్లివా?
-ఆనాడు పసిగుడ్డుకి గుక్కెడు పాలిచ్చి ప్రాణం నిలబెట్టమని బతిమాలితే ఆ పిల్ల చస్తే నాకేమన్న నువ్వు ఒక తల్లివా? - ఇన్ని ఏళ్ళలో ఆ పిల్ల బతికుందో, చచ్చిందో అనే ఆలోచనే లేదు నీకు! - రవి చెల్లెలు చెప్పిందట ఏదో ఆరోజు- అంతేనా- ఛీ... ఈ ఇల్లు వదిలి ఈ క్షణమే వెళ్ళిపోతా- నువ్వు హాయిగా బతుకు- అపార్ధాలు, నిందలు లేని శాశ్వత లోకానికెళ్ళిపోతా - నా శవం చూసి ఆనందిద్దువుగాని!" రాజీవ్ కోపం కట్టలు తెంచుకుంది.... తలుపు వేసి బయటకెళ్ళిపోయాడు...సుమతి విలవిల్లాడిపోయింది.
తన తప్పును క్షమించమని అడిగే సమయమే లేకపోయింది. ఇన్నేళ్ళుగా తనకి నిజంగా తన అహం తప్ప!! ఆ అనాధ పిల్ల అనాధ కాదా! ఎందుకీ అనుమానాలు? అపోహలూ? ఛీ... తన చక్కని సంస్కారాన్ని థానే చేజేతులా నాశనం చేసుకుంది.
ఇంట్లోంచి కోపంగా వెళ్ళిన రాజీవ్ పార్కులోకెళ్ళి కూర్చున్నాడు... మనసు వికలమైపోయింది.
జానకి ఇంట్లో చూసిన దృశ్యం గుండెని ముక్కలు చేస్తోంది.
ఏ శంకరన్ కానీ, సతీష్ కానీ ఆ పిల్లని ఏం చేసినా చెయ్యగలరు. ఆ మాధవరావే మరో యింటికి పనిపిల్లగా పంపేయగలడు. మరో ఇంటికే కాదు- వ్యభిచార వృత్తిలో కూడా దింపేయగలడు. దిక్కులేని ఆడపిల్ల అందరికీ అంత లోకువా? అయినా... దీనికి దిక్కులేదా- తనే దిక్కు!! రాజీవ్ ఆ బల్లమీదనుంచి లేచాడు.
అక్కడ ఓ ఆడది అటూ ఇటు తిరుగుతోంది. తనలో తనే మాట్లాడుకుంటోంది....
ఓ జంట దగ్గరకెళ్ళింది- "నా పిల్లని ఎవరికీ అమ్మేశారూ?" అంది... ఆ జంట కంగారుగా లేచి అక్కడ నుంచి పరిగెత్తారు.
"పిచ్చిది, పిచ్చిది...." అరిచారు. అక్కడున్న పిల్లలెవరో రాళ్ళేసి కొడుతున్నారు.
"నా పిల్లని అమ్ముకున్నవాళ్ళు చచ్చిపోతారు, అంతే..!!" అక్కడున్న మట్టి తీసి విసురుతోంది. దూరంగా బల్లమీద కూర్చున్న రాజీవ్ అటే చూస్తున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS