వినియోగములు :-
తుమ్మెద, ఏనుగుదంతము, పూవు, చిలుక, కోయిల, చాతకము, ఆకాశము, యాగము, నాళము, పుప్పొడి, మాయ, నీటితుంపర, అవ్యయపదము, ముల్లుతీయుట, గోడ, పోకముడి విప్పుట, కపటము, రంధ్రము, రక్తము వీనియందు ఈ హస్తము చెల్లును.
-: హంసపక్ష హస్త లక్షణమ్ :-
శ్లో!! సర్పశీర్షే కనిష్టాచేత్ర్పసృతాహంస పక్షకః !
భృంగీపిత్కాప్సరోజాతిః కృష్ణోవర్ణోఋషి స్తధా !
భరతో మదనోదైవం వినియోగోస్యకధ్యతే !
తా: నర్పశీర్ష హస్తమందలి చిటికేనవ్రేలును చాచిపట్టిన యెడల హంసపక్ష హస్తమగును. ఇది భృంగీశ్వరునివల్ల పుట్టినది. అప్సరస జాతి. కృష్ణవర్ణము. భరతుడు ఋషి. మన్మధుడు దైవము.
వినియోగములు :-
వీణవాయించుట, శుద్ధనాట్యము, పొలిమేర, వెన్నెల, జయము, దయ, మాటిమాటికి చెప్పుట, ఎండ, సరసము, మోహము, విద్య, స్తంభము, ఉపదేశము, సముద్రబంధము, మకరికాపత్రము, స్త్రీ, కప్పుట, మత్తుపదార్ధము, రెక్కలు, కౌగిలి, ధైర్యము, వక్షము, స్థానము, ధూపము, పులకాంకురము, దత్తపుత్రుడు వీనియందు ఈ హస్తము చెల్లును.
-: సందంశ లక్షణము :-
శ్లో!! సందంశోమిళితాంగుష్ట తర్జనీమధ్యమాగ్రకః !
సరస్వతాజనిర్గౌరకాంతి విద్యాధరాన్వయః !
ఋషిర్విశ్వావసుర్దైవం వాల్మీకిః కృచ్యముచ్యతే !!
తా: బొటనవ్రేలు, చూపుడువ్రేలు, నడిమివ్రేలు, చివరి భాగములు కలుపుచు, విడదీయుచు మాటిమాటికి పట్టిన సందంశ హస్తమగును. ఇది సరస్వతి వల్ల పుట్టినది. గౌరవర్ణము, విద్యాధర కులము, విశ్వావసుడు ఋషి. వాల్మీకి అధిదేవత, (పాఠాంతరములో చేతి అయిదువ్రేళ్ళు కలుపుచు విడదీయుచు పట్టిన చందంశ మగునని ప్రశిద్ధము.)
వినియోగములు :-
ముత్యము, పులకాంకురము, నీటిచుక్క, రుద్రాక్ష, నాట్యము, తిలహోమము, మల్లె మొగ్గ, మాత్ర, మంచిగా మాటలాడుట, జ్ఞానోపదేశము, హంసముఖము, పిల్లనగ్రోవి వాద్యము, పగడము, నిన్యారముద్రిక, పూహ, ధ్యానము, లక్ష్యము, ముద్దుబెట్టుకొనుట, నీచము, చదువుట, సంగీతము, చెవి, శిధిలము, కపటము, ధైర్యము, మేషాశ్యము, మెడ, కోమలము, వీనియందు ఈ హస్తము వినియోగించును.
-: ముకుళ హస్త లక్షణము :-
శ్లో!! అశేషకరశాఖాగ్రమేళనాన్ముకుళస్మృతః !
హనుమతోజనిర్గుహో ఋషిశ్చవర్ణ కాపిలః !
అధీశ్వర సుధాకరః కులంచసంకరం తధా !!
వ్రేళ్ళ చివరలన్నియు కలిపిపట్టిన, ముకుళహస్తము వచ్చును. ఇది హనుమంతునివల్ల పుట్టినది. దీనికి ఋషి గుహుడు. కపిలవర్ణము, చంద్రుస్వరుడు, కులము సంకీర్ణము.
వినియోగములు :-
అరవిరిమొగ్గ, జపము, భోజనము, మంచితనము, దానము, మన్మధబాణము, పంచప్రాణములు, గోళ్ళు, దీనవచనములు, పసిపిల్లలను ముద్దు బెట్టుకొనుట, గాలి, ఐదు అను సంఖ్య, దేవపూజ, ధ్యానము, గర్భము, పుట్టుట (జననము), దయారసము, పార్శ్వంగుళీస్పర్శనము స్త్రీల యొక్క చక్కలిగింత), గడ్డము, చూచుకము (స్తనాగ్రము) వీనియందు ఈముకుళ హస్తము వినియోగించబడును.
-: తామ్రచూడ హస్త లక్షణము :-
శ్లో!! కనిష్టాద్యాస్పమీకృత్యాశ్లిష్టశ్చాంగుశ్చాంగుష్టకంన్యనేత్ !
తర్జన్యగ్రేకుంచితేచ తామ్రచూడకరోబుధః !
జనిర్వేదా దృష్టిర్వజ్రీపాండువర్నో బృహస్పతిః !
అధీశోదేవజాతిశ్చవినియోగ్కోస్యకధ్యతే !!
తా: కనిష్టిక మొదలు వ్రేళ్ళన్నియు కూర్చిపట్టి వాటిమీద బొటనవ్రేలు వుంచి, చూపుడువ్రేలు చివర కొంచెమువంచిబట్టిన తామ్రచూడహస్తమగును. ఇది వేదముల నుండి పుట్టినది. ఇంద్రుడు ఋషి, పాండువర్ణము. అధిదేవత బృహస్పతి. దేవజాతి. ఇది సమ్మతము.
వినియోగములు :-
నృత్త_గీత_వాద్యములు కోడిజుట్టు, వేదత్రయము, ముల్లోకములు, శూలము, త్రికూటపర్వతము, ప్రణయము, కన్నీరు తుడుచుట, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, ఏడుపు, లెక్కపెట్టుట, ఎరుపు, నలుపు, తెలుపుయను మూడురంగులు. నిట్టూర్పు, కీర్తి, భావి_పలక వీనియందు ఈ తామ్రచూడ హస్తము వినియోగించును.
శ్లో!! ఏతేస ప్తవింశతిః పూర్వాచార్యోదితాః !
ఇతఃపరం అభినవాచార్యోదితాః కధ్యంతే !!
