Previous Page Next Page 
చదువు పేజి 26

   

     సీతమ్మగారు చిన్న నేతిగరిటతో ప్రారంభించింది. అదివరకల్లే రోజూ కూరలు కొనడానికి వీల్లేదు. కొన్నప్పుడైనా ఖరీదైన కూరలుకొనటం ఎంతమాత్రం వీల్లేదు. కూరలబదులు పచ్చళ్ళూ, వొడియాలూ, అప్పడాలూ, వొరుగులూ ఏర్పాటు చేసుకోవాలి. తనకిక చీరెలఖర్చూ అదీ లేదుగదా. పిల్లవాడికి జత లాగులూ, చొక్కాలూ ఉంటేచాలు, చాకలిఖర్చు  లేదు. అంట్లదాన్ని మాన్పించేసింది. అంతకన్నా ఇంకేంచెయ్యాలో ఆవిడకు తెలియదు. ఎవరన్నా బంధువులింటికి  వస్తారేమోనని ఆవిడకు చాలా భయంగా ఉండేది. తీరా బంధువులు వచ్చినతరువాత  వాళ్ళకు ఉన్నదాన్లో పెట్టక తప్పుతుందా? అద్దె రెండు రూపాయలు ఎక్కువ వస్తున్నదంటే దానికి తగ్గట్టు సుందరం చదువుఖర్చు ఉండనే ఉన్నదాయే. ఇంకా ఆడపిల్ల ఎదిగొస్తున్నది. ఖర్చు పెరుగుతుందిగాని తగ్గదు.

    సీతమ్మగారికి కలిగిన దారిద్ర్యభయం  అంతా దారిద్ర్యంవల్లనే ఏర్పడిందనటానికి వీల్లేదు. కాలిమీద కాలేసుకుని కడుపులోచల్ల కదలకుండా భూములమీద వచ్చేదానితో ఒకస్థాయిలో జీవితాన్ని వెళ్ళబుచ్చటానికి అలవాటుపడ్డ తరగతియొక్క మనస్తత్వంనుంచి ఆవిడకీ భయం దాపరించింది. ఆవిడకాస్త శాంతంగా ఆలోచించినట్టయితే తన భర్త సంపాదించినదానికి ఇంచుమించు సమానంగా ఆయన ఖర్చుచేశాడనీ, ఆయన చావువల్ల తనమీద కుటుంబం ఈదేభారం ఏర్పడినప్పటికీ, ప్రస్తుతానికి తమ అవసరాలకు లోటేమీలేదనీ ఆవిడ ఊహించగలగి ఉండేదే. అయినా ఆవిడకు దారిద్ర్యం సమీపంలో ఉన్నదన్నభావం పోలేదు. అది ప్రత్యక్ష్యంగా అట్టే కనిపించటంలేదు. కనుకనూ, తాత్కాలికంగా దారిద్ర్యాన్ని దూరంగా ఉంచేటందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకుంది. కనకనూ, ఆవిడ తన ఆత్మ సంతృప్తికోసం దూరాన ఉన్న దారిద్ర్యాని చూసి తల్లడిల్లసాగింది. పోయినకొద్దీ సుందరం చదువుఖర్చు పెరుగుతుంది. సంసారం రాబడి పెరగదు. ఇంకో ఎనిమిది తొమ్మిదేళ్ళలోపల పిల్ల పెళ్ళికెదుగుతుంది.
 
    మనిషి తన అంతరాత్మను సంతృప్తి పరుచుకోవడానికి నిరాశావాదం అవలభించదలచిన దానికి ఆధారాలు దొరక్క పోవు. సీతమ్మ గారి విచారానికి సుందరం కొంత సాయపడ్డాడు. క్లాసులో ఇతర పిల్లలనుచూసి వాడు ఎటువంటి అనవసర ఖర్చులలో తలదూరుస్తాడో అని ఆవిడకు ఒక పెద్ద బెంగపడిపోయింది. సుందరం  ఎప్పుడన్నా, "అమ్మా, నాకు అది కావాలి" అని అడిగితే సీతమ్మగారి గుండెల్లో రాయిపడేది. అయితే ప్రతిసారీ సుందరం నమ్మేట్టట్టుగా చెప్పేవాడు.

    ఒకసారి వాడు కాపీపుస్తకాలు కొనుక్కోవాలన్నాడు. మరోసారి బ్రౌన్ పేపరుతో డ్రాయింగు పుస్తకం కుట్టు కోవాలన్నాడు. చాక్ పీసులు  కొనుక్కోవాలన్నాడు. ఇదంతా తప్పనిసరి ఖర్చో, తప్పేఖర్చో ఆవిడకు తెలిసేదికాదు. చూస్తుండగానే వాడిచదువు ఎట్లా తన తలకు మించిపోయిందో  తలచుకుంటే ఆవిడకు ఆశ్చర్యంవేసేది. ఆవిడకు అనుమానం కలిగినప్పుడల్లా కృష్ణమూర్తిని అడిగేది. ఇట్లా చెయ్యటంవల్ల తన కొడుక్కు అసంతృప్తి కలుగుతున్నదనికూడా ఆవిడకు తట్టేదికాదు.

    "అబ్బాయి, మనం బీదవాళ్ళం. కృష్ణమూర్తికి వాళ్ళ వాళ్ళు కొనిపెట్టేవన్నీ నేను నీకు కొనలేను. తప్పే ఖర్చుయితే నా చేత చేయించకు, నీకు పుణ్యం ఉంటుంది" అని కొడుక్కు నచ్చజెప్పుదామని ఎన్నోసార్లు సీతమ్మ గారి నోటిచివరిదాకా వచ్చింది. కాని ఆపని చెయ్యటం ఆవిడకు సాధ్యంకాలేదు. అట్లా అంటే తనకూ వాడికీ ఉన్న సంబంధం చెడి పోతుందనీ, వాడు నొచ్చుకుంటాడనీ  ఆవిడ భయపడింది. వాడు అదివరకే నొచ్చుకుంటున్నాడని ఆవిడ ఊహించలేదు. తను ఖర్చు తగ్గించటానికి చేసే ప్రతి చిన్న ప్రయత్నమూ వాడర్డం చేసుకుంటూనే ఉన్నాడని ఆవిడ కలలోకూడా భావించలేదు.

    కాని చిన్నపిల్లలకు ఇటువంటి విషయాలు చెప్పినదాని కన్నా దాస్తేనే బాగా అర్ధమవుతాయి. సుందరం కొనుక్కు తినటానికి కానీ ఇమ్మని ఎన్నడూ తల్లిని అడిగేవాడుకాడు.
 
    అయినా  సుందరానికి బీదరికమనేది సరిగా తలకెక్కలేదు. తోటి విధ్యార్డుల్లో తనకన్న  మరీ బీదవాళ్ళూ, తనకన్న మరీ భాగ్యవంతులూ కానివాళ్ళందరూ తనతో సమానులనే అనుకునేవాడు. వాళ్ళలో ఎవరన్నా బీదవాళ్ళని తెలిసినా, వాళ్ళు పూరికొంపల్లో ఉండటం చూసినా జాలిపడేవాడు. ఎవరి తండ్రిగాని పోయినాడన్నా అదేవిధంగా  జాలిపడేవాడు__తనకు అటువంటి విపత్తు కలగనట్టే.
   
                                                             *    *    *    *
   
    సరిగా డిసెంబరు పరీక్షలమధ్య సుందరానికి జ్వరం వచ్చింది. లెక్కల పరీక్షలో నూటికి నూరుమార్కులు తెచ్చుకుని ఇంటికి పరమానందంగా వచ్చినవాడు, ఇంకా పొద్దుగూకకమునుపే, "అమ్మా, నాకు చలేస్తున్నది. నిద్దరొస్తున్నది" అంటూ పడకవేశాడు. కాస్సేపటికి సీతమ్మగారువచ్చి ఒంటిమీద చెయ్యి వేసేసరికి కాలిపోతున్నది.

    సీతమ్మగారు వెంటనే వాడి చేత కస్తూరిమాత్ర మింగించి  లంఖణం పెట్టింది.

    ఆవిడ దగ్గర రకరకాల మందులూ, మందు దినుసులూ ఉంటాయి. జ్వరానికీ, పడిశానికీ, అజీర్ణానికీ, గజ్జికీ, దగ్గుకూ, మలబద్దకానికీ, ఏం చికిత్సలు చెయ్యాలో ఆవిడకు తెలుసు. గృహవైద్యం  ఆవిడ తల్లి దగ్గరనుంచి సంపాదించింది. కురంజీవం, కురాసానివాం, పిప్పళ్ళూ, అక్కలకర్రా, వామూ, శొంఠి, దుంపరాష్టకం, వస కొమ్మూలూ, మైలతుత్తం, మొదలైన దినుసులన్నీ ఆవిడ చిన్న చిన్న కాగితం పొట్టాలుకట్టి  వంటింట్లో ఏనాడో దాచిఉంచింది. ఇవిగాక, తేనే, కస్తూరిమాత్రలూ, ఆముదం, సునాముఖ ఆకూ, సైంధవలవణం మొదలైనవి కూడా ఉంచింది.

    ఇటీవల ఆవిడ తిండిదగ్గర పొదుపు  ప్రారంభించినప్పటి నుంచీ ఇంట్లో ఎవరికీ సంపూర్ణమైన ఆరోగ్యంలేదు. చంటిదానికి చీటికీ, మాటికీ  బురబురలాడుతూ  జలుబూ దగ్గూనూ. సుందరానికి  విడవకుండా మలబద్ధకం, కడుపునొప్పి, సీతమ్మగారికి కీళ్ళు లాగటం, నీరసం, అన్నం సరిగా సయించకపోవటం. పొద్దునే లేవగానే ఆవిడ మొదటివిధి పిల్లకు జీలకర్రరసం పొంగించి పొయ్యటమూ, కరేపాకూ, మిరియాలూ, ఉప్పునూరి  మాత్రలుచుట్టి సుందరంచేత మింగించటమూనూ.

    తాను చేసేవైద్యం సరిగా పనిచేస్తున్నదా లేదా అని ఆవిడ పరిశోధనలు ప్రారంభించలేదు. చిన్నచిన్నరోగాలు వస్తుండేవి. ఆవిడ మందులు వేస్తుండేది, అవి పోతూఉండేవి. రోగాలు వాటంతట అవే  పోతున్నాయో, మందులు పనిచేస్త్రున్నయో ఆవిడకు తెలీదు. కాని ఆ మందులు అపాయకరమైనవి  కాక పోవటంవల్లా, ఆ రోగాలు తీవ్రమైనవి కానందువల్లా సీతమ్మగారి వైద్యం కొమ్ములుతిరిగిన డాక్టర్లుచేసే  వైద్యంకన్న చాలా నిరపాయంగా పరిణమించింది. ఈ రోగాలు రావటం మానలేదంటే అవి ఆవిడా వైద్యంవల్ల వచ్చినవికావు. దారిద్ర్యాన్ని దూరంగా ఉంచటానికి_దారిద్ర్యాన్ని దూరంగా ఉంచుతున్నాననే భ్రమతో_ ఆవిడ అవలంబించిన మార్గాలఫలితంగా వచ్చినవి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS