Previous Page Next Page 
బేబి!ఓ బేబి!! పేజి 26

    "అలాగా....అయితే విను. కొత్తగా పెళ్ళయిన దంపతులిద్దరూ__ అందరూ చూస్తుండగానే మార్కెట్లోనే పండుకొన్నారు. అయినా వాళ్ళనెవరూ పట్టించుకోలేదు. అంత బహిరంగంగా వాళ్ళు పండుకొన్నా ఎవరెందుకు పట్టించుకోలేదు."

    "ఛ....ఛ...మార్కెట్లో పండుకొన్నారంటే ఎవరు నమ్ముతార్రా?"

    "మరి-మార్కెట్లో పండ్లు, ఫలాలు కొనుక్కోపోతే-ఏం కొంటారు.ఇదీ జవాబు" అక్కడ్నించి తుర్రుమన్నాడు బాబీ.

    అతిధులు వెళ్ళి హాలంతా పల్చబడింది.

    "ఎందుకండీ...ఏం విశేషముందని? ఇంత గ్రాండ్ గా చేస్తున్నారు." సుగాత్రి అంది అన్యమనస్కంగానే.

    "సుగా! మనింట్లో నిజానికి ఎప్పుడూ ఏ ఫంక్షనూ జరుగదు. మనకేగనుక పిల్లలుంటే పుట్టిన్రోజులు చేసేవాళ్ళం. చదువుల్లో ఫస్టొస్తే పార్టీ లిచ్చేవాళ్ళం. ఎదిగితే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళం. వాళ్ళకు పిల్లలు పుడితే బారసాలలు చేసేవాళ్ళం. అలా బారసాలలు జరగాల్సిన ఇల్లు చెరసాలలా వుండిపోవటం ఇష్టంలేకే__మన మారేజ్ డేని ఇంత గ్రాండ్ గా చేసేది."

    అతని మాటల్లోని వేదన అర్ధమయి మరేమీ మాట్లాడలేకపోయింది సుగాత్రి. ఆకాశంలో సాయంత్రపు సంధ్య రేఖలు తిరిగి సూర్యునిలోకి వెళ్ళి పోతున్నాయి. చీకటి కాటుకను పులుముకుంటుంది. అతిధులంతా వెళ్ళాక__రాయన్న ఎర్రగులాబీ పువ్వును కోసుకొచ్చి శరత్ చేతికందించాడు చాలా విధేయంగా. దాన్ని సుగాత్రి తలలో తురిమాడు ఆమె నునుబుగ్గలు సిగ్గుల మొగ్గలేస్తుంటే-నిఖిల్ శరత్ ని, నిర్లిప్త సుగాత్రిని, ఇద్దర్నీ పట్టుకొని బాబీ-పడకగదిలోకి త్రోసేసి దభేలున తలుపుమూసి గడియపెట్టారు. నవ్వుతూ వాళ్ళు బాబీని తీసుకొని ఇంటికెళ్ళారు.

    సరిగ్గా అప్పుడే__

    ఆ రెండంతస్థుల భవంతి ముందు సర్రున వచ్చి ఆగింది ఒక పోలీస్ జీప్. అందులోంచి ఒక సబ్ ఇన్ స్పెక్టర్, మరో ఇద్దరు వ్యక్తులు దిగారు. బూట్లు టకటకలాడిస్తూ.


   
                            *    *    *    *    *


    "హలో శరత్ గారూ! ఫంక్షన్ కు రాలేకపోయాను. విష్ యూ హాపీ మారేజ్ డే" ఫోన్ లో అన్నాడు భార్గవ. తనింటి నుండి శరత్ కు ఫోన్ చేసి....

    "ఇట్సాల్ రైట్! బాబీ వచ్చాడు గదా! థాంక్స్. అన్నట్టు ఆ బెదిరింపులు ఎక్కడి వరకూ వచ్చాయి. ఎవరయినా పట్టుబడినారా" అవతల్నించి అన్నాడు శరత్.

    "డిటెక్టివ్స్ రంగంలోకి దిగారు సార్! ఇప్పుడిప్పుడే ఇన్వెస్టిగేషన్ మొదలయింది. వాటివల్ల నా మూడ్ బాగుండటంలేదు. సీరియల్ కూడా రాయలేకపోతున్నాను సార్" అన్నాడు భార్గవ టేబిల్ మీది తన భార్య ఫోటోవైపు చూస్తూ.

    "సైకలాజికల్ గా హెల్తీగా వుండండి ముందు. అద్సరే నువ్వెప్పుడు కలుస్తావ్ నన్ను."

    "ఈమధ్య పనులేం లేవుసార్! రేపు ఈవినింగ్ తప్పక కలుస్తాను" అన్నాడు వినయంగా.

    "సారీ మిస్టర్ భార్గవా! నేను ఇండస్ట్రీ పనిమీద రేపే బెంగుళూర్ వెళుతున్నాను. ఒక సెమినార్ మీటింగ్ కి. దాదాపుగా అయిదు రోజులవరకూ రాలేనేమో!"

    "ఒకే సార్! మీరు రాగానే తెల్సుకొని కలుస్తాను. ఇంతకీ మీ కోరికేమిటో చెప్పటం లేదు." కొంచెం అసహనంగా అన్నాడు భార్గవ.

    కొద్దిసేపు నిశ్శబ్దం తర్వాత అవతలి వ్యక్తి భారమయిన శ్వాసతీసిన చప్పుడు.

    "మిస్టర్ భార్గవా! ఈసారి కల్సినపుడే ఆ కోరికేమిటో తెలిపేది. కాని ఒక్కటి గుర్తుంచుకోండి. నా కోసం నా కోర్కె తీర్చమనేది. ఆ కోర్కె తీర్చిన మరుక్షణం మీకు ఇరవై లక్షల నెట్ క్యాష్ ముడుతుంది."

    క్రెడిల్ దాటి కర్ణభేరి తాకిన ఆ వాక్యం అతని గుండెల్లో చేరి బాంబు ప్రేలినట్టు ప్రేలింది. అరనిముషం వరకూ నమ్మలేకపోయాడు.

    ఇరవై లక్షలు!

    ట్వంటీ లాక్స్!!

    భార్గవ అస్పష్టంగా అనుకున్నప్పటికీ___అవతలి వ్యక్తికి అవి విన్పించాయి.

    "ఎస్....ట్వంటీ లాక్స్! నా కోర్కె తీరుస్తున్నందుకు__నేను నీకు ముట్టజెప్పే ప్రతిఫలం....ఇరవై లక్షలు."

    "అంతటి కాస్ట్ కోరిక-నేను తీర్చలేనేమో సార్!" అనుమానంగా అన్నాడు భార్గవ.

    "లేదు! మీరు తీర్చగలరన్న నమ్మకం నాకుంది. అందుకే నా నిర్ణయంలో మిమ్మల్ని ఎంచుకున్నాను. నేను బెంగుళూర్ వెళ్ళివచ్చేలోగానే మీరు ఆలోచించుకోండి. ఇరవై లక్షల కోసం కాకపోయినా నా కోసం__మీరు ఒప్పుకోక తప్పదు. ఏమంటారు మిస్టర్ భార్గవా."

    "ఒకేసార్!"

    ఫోన్ పెట్టేసిన భార్గవకు తల దిమ్మెక్కుతోంది. తన చుట్టూ ఏం జరుగుతోంది?

    ఒకవేపు మౌనికను చంపొద్దన్న హెచ్చరిక...

    మరోవైపు ఇరవై లక్షల విలువజేసే కోరిక.

    ఏమిటా కోరిక? ఇరవై లక్షల విలువతో తీర్చగల కోరికేమిటి? కోరేది ఎలాంటిదయినా కోరుతున్న వారికి ఆ డబ్బు ఓ లెక్కలోకి రాదు. అయినా ఏమిటా వింతకోరిక?

    ఇప్పటివరకూ ఏ వ్యక్తీ మరే వ్యక్తినీ కోరని కోరిక!

    ఈ సృష్టిలో ఏ భక్తుడూ మరే భగవంతుడ్నీ కోరని కోరిక!

    భార్గవ అలాగే వుండిపోయాడు ఆలోచిస్తూ చాలాసేపు.

   
                                          7


    ఆ గదిలో బెడ్ లైట్ లేత ఆకుపచ్చదనాన్ని పర్చింది డిమ్ మ్ మ్ గా.

    ఏ ఒడిస్సీ భంగిమో, ఏ ఖజురహో శిల్పమో కమనీయంగా కవ్విస్తున్నట్టు__పచ్చరంగు వెలుతురులో మరింత తెల్లగా మెరుస్తున్న నిర్లిప్త అదే మంచం మీద ప్రక్కనే నిఖిల్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS